JN1 : జెఎన్1తో జర భద్రం
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:17 AM
కొవిడ్ విషయంలో మన ధోరణి మారింది. చికిత్స మీద పట్టు చిక్కింది కాబట్టి కొవిడ్ సోకితే సోకిందిలే అనే నిర్లక్ష్య ధోరణి సర్వత్రా పెరిగిపోయింది. కానీ ఇమ్యూనిటీని ఛేదించే తత్వాన్ని
కొవిడ్ విషయంలో మన ధోరణి మారింది. చికిత్స మీద పట్టు చిక్కింది కాబట్టి కొవిడ్ సోకితే సోకిందిలే అనే నిర్లక్ష్య ధోరణి సర్వత్రా పెరిగిపోయింది. కానీ ఇమ్యూనిటీని ఛేదించే తత్వాన్ని కలిగి ఉన్న జెఎన్1 వేరియెంట్ పరంగా ఏమరుపాటు ఏమాత్రం పనికిరాదంటున్నారు వైద్యులు.
గొంతు నొప్పి, దగ్గు, జలుబు లాంటి గత డెల్టా వేరియెంట్ లక్షణాలు తాజా కొవిడ్ వేవ్‌లో కనిపించకపోవచ్చు. నేరుగా లంగ్ ఇన్‌ఫెక్షన్, కీళ్ల నొప్పులు, జ్వరం లాంటి సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలతో కొవిడ్ బయల్పడవచ్చు. అయితే మధుమేహం, అధిక రక్తపోటు, ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులను కలిగి ఉండే కొ మార్బిడ్ కోవకు చెందిన వాళ్లకు తాజా కొవిడ్ ఇన్‌ఫెక్షన్ ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎటువంటి రుగ్మతలు లేని ఆరోగ్యవంతమైన వ్యక్తుల ద్వారా తాజా కొవిడ్ త్వరితంగా వ్యాప్తి చెందుతూ, తక్కువ సమయంలో ఎక్కువ మందికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తాజా వైర్‌సకు బహిర్గతమైనప్పుడు, ఇన్‌ఫెక్షన్ తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, ప్రయాణాలను పరిమితం చేసుకోవడం, జనసమ్మర్థ ప్రదేశాలకు వెళ్లకపోవడం లాంటి జాగ్రత్తలన్నీ పాటించడం మొదలు పెట్టాలి.
ఇమ్యూన్ ఇవేజన్
రోగనిరోధక వ్యవస్థను లొంగదీసుకుని ఇన్‌ఫెక్షన్ సోకేలా చేయడంతో పాటు, ఇన్‌ఫెక్షన్‌తో శరీరంలోని మిగతా అవయవాలను దెబ్బతీసే శక్తి కూడా ఈ వేరియెంట్‌కు ఉంది. కాబట్టి సోకిన తర్వాత చికిత్సను ఆశ్రయించడానికి బదులుగా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా మనం మన ద్వారా బయటి వ్యక్తులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం. కానీ మన ఇంట్లో కుటుంబసభ్యుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. దాంతో బటయకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యేవాళ్లకు ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తూ ఉంటుంది. ఇలాంటి హై ట్రాన్స్‌మిసబిలిటీ వల్ల ఇన్‌ఫెక్షన్ త్వరితంగా ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. దాంతో రిస్క్ ఉన్న వాళ్లకు కొవిడ్ ముప్పు పెరుగుతోంది. తాజా వేరియెంట్‌తో ఈ ప్రమాదం ఎక్కువ.
మూడు రోజులు మించకుండా...
కొవిడ్ పరీక్షల్లో సైతం ఈ వైరస్ బయల్పడకపోవచ్చు. పరీక్ష ఫలితం నెగటివ్ రావచ్చు. అయినా లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. బలహీనత, ఆకలి తగ్గిపోవడం లాంటి ప్రాథమిక లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఇన్‌ఫెక్షన్ బయల్పడిన వెంటనే అజిత్రోమైసిన్ లాంటి మందులు వాడుకోవడం మొదలు పెట్టకుండా, తనంతట తానుగా శరీరం తనను తాను మరమ్మతు చేసుకునే సమయాన్ని ఇవ్వాలి. ఆరోగ్యవంతులకు ఎటువంటి మందులతో పని లేకుండానే న్యూట్రిషన్, హైడ్రేషన్‌తోనే ఇన్‌ఫెక్షన్ తగ్గిపోవచ్చు కూడా! అయితే ఆలోగా ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ కొమార్బిడ్ కోవకు చెందినవాళ్లైతే మూడు రోజులకు మించి ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.
ఆలస్యం చేయకుండా, అప్రమత్తంగా...
గాలి పీల్చుకున్న ప్రతిసారీ కేవలం కొవిడ్ వైరస్ ఒక్కటే ఊపిరితిత్తుల్లోకి చొరబడుతుంది అనుకుంటే పొరపాటు. ఈ చలి కాలంలో వాతావరణంలో ఎడినో, రైనో, డెంగ్యూ, ఇన్‌ఫ్లూయెంజా లాంటి ఎన్నో రకాల వైర్‌సలు వ్యాపించి ఉంటాయి. ఇవన్నీ శ్వాసకోశ వ్యవస్థ ద్వారానే శరీరంలోకి చొరబడుతూ ఉంటాయి. అప్పుడు జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాల ద్వారా శరీరం ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఆ లక్షణాలు ఏ ఇన్‌ఫెక్షన్‌తో మొదలైనవో మనంతట మనం తెలుసుకోలేం కాబట్టి, కొవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆర్‌టిపిసిఆర్‌కు బదులుగా యాంటీజెన్ టెస్ట్ పరీక్షతో కొవిడ్‌ను నిర్ధారించుకోవచ్చు. పరీక్ష ఫలితంతో సంబంధం లేకుండా వైద్య చికిత్సను ఆశ్రయించాలి. అలాగే కొవిడ్ నియమాలన్నింటినీ కచ్చితంగా పాటించాలి. తాజా వేరియెంట్‌కు సపోర్టివ్ ట్రీట్మెంట్ మినహా సూటి చికిత్స లేదు కాబట్టి ఇన్‌ఫెక్షన్ సోకకుండా చూసుకోవడంతో పాటు సోకితే వెంటనే వైద్యులను కలవాలి.
మ్యుటే షన్ అందుకే!
వైరస్ నిరంతరం మ్యుటేట్ అవుతూ కొత్త రూపం దాలుస్తూ ఉంటుంది. ఇన్‌ఫెక్షన్‌తో పోరాడి, దానికి వ్యతిరేకంగా శరీరం ఇమ్యూనిటీని వృద్ధి చేసుకోవడమే ఇందుకు కారణం. రోగనిరోధక వ్యవస్థ బలపడేకొద్దీ, ఆ ఇమ్యూనిటీని ఛేదించే కొత్త రూపాన్ని వైరస్ సంతరించుకుంటూ ఉంటుంది. అలా మ్యుటేట్ అయిన కొత్త వైరస్ ఇమ్యూనిటీతో పోరాడి, శరీరంలోకి చొరబడి ఇన్‌ఫెక్షన్‌ను కలిగించగలుగుతుంది. ఇలాంటి కొత్త స్ట్రెయిన్ ఎక్కువగా ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే శక్తినీ, త్వరితంగా వ్యాపించే తత్వాన్నీ కలిగి ఉంటుంది. అలాగే తాజా కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌తో కాంప్లికేషన్లు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యాక్సిన్లు వేసుకుని ఉన్నా, మూడు రోజులకు మించి జ్వరం, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు వేధిస్తే వైద్యులను సంప్రతించడం అవసరం.
డాక్టర్ రాహుల్ అగర్వాల్
సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్,
కేర్ హాస్పిటల్స్,
హైటెక్ సిటీ, హైదరాబాద్