ఎన్టీఆర్‌పై కత్తితో దాడి చేసిన జగ్గారావు
ABN , First Publish Date - 2023-05-28T04:40:15+05:30 IST
ఎన్టీఆర్, దర్శకుడు బి.విఠలాచార్యలది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. తన చిత్రాలతో ఎన్టీఆర్‌ను మాస్‌కి మరింత దగ్గర చేశారు ఈ జానపద బ్రహ్మ. వీరిద్దరి కలయికలో వచ్చిన జానపద చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’
ఎన్టీఆర్, దర్శకుడు బి.విఠలాచార్యలది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. తన చిత్రాలతో ఎన్టీఆర్‌ను మాస్‌కి మరింత దగ్గర చేశారు ఈ జానపద బ్రహ్మ. వీరిద్దరి కలయికలో వచ్చిన జానపద చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’ లో రాజశ్రీ, కె.ఆర్.విజయ హీరోయిన్లుగా నటించారు ఆ రోజుల్లో ఎన్టీఆర్‌కు నమ్మిన బంటులా జగ్గారావు ఎప్పుడూ వెంటే ఉండేవారు. తన సినిమాల్లో ఏదో ఒక వేషం జగ్గారావుకు ఇప్పించేవారు ఎన్టీఆర్. అలా ‘లక్ష్మీకటాక్షం’ చిత్రంలో కూడా రాజశ్రీ మేనమామగా చిన్న సైజు విలన్ పాత్ర పోషించే అవకాశం కల్పించారు ఈ సినిమాలో ఎన్టీఆర్, రాజశ్రీ బొప్పాయి తోటలో డాన్స్ చేస్తూ పాట పాడుతుంటారు. అది చూసి సహించలేక కత్తితో ఎన్టీఆర్ మీదకు దాడి చేస్తారు జగ్గారావు. ఇందుకోసం పదునైన కత్తి సిద్దం చేశారు. వాహినీ స్టూడియోలో వేసిన సెట్‌లో ఆ రోజు షూటింగ్ జరుగుతోంది. అప్పటికి సాయంత్రం ఐదున్నర కావడంతో షూటింగ్ త్వరగా ముగించుకుని ఇంటికి వెళ్లే మూడ్‌లో ఉన్నారు ఎన్టీఆర్. కత్తితో జగ్గారావు దాడి చేయగానే ఆయన తప్పించుకుని ఇవతలకు వస్తారు. అప్పుడు ఆ కత్తి దెబ్బకి బొప్పాయి చెట్టు తెగి కింద పడుతుంది.
ఇదీ షాట్. దర్శకుడు విఠలాచార్య వివరించగానే రిహార్సల్ చేయకుండా డైరెక్ట్ టేక్ చేద్దామని రామారావు అన్నారు. సరేనన్నారు విఠలాచార్య. కానీ జగ్గారావు గుండెల్లో దడ మొదలైంది. అసలే ఫైట్ సీన్. పైగా చేతిలో పదునైన కత్తి . అందుకే కనీసం ఒకసారన్నా రిహార్సల్ చేస్తే బాగుంటుదని జగ్గారావుకు అనిపించింది. కానీ ఎన్టీఆర్ డైరెక్ట్ టేక్ చేద్దామనేసరికి వద్దు అని చెప్పే ధైర్యం ఆయనకి ఎక్కడుంటుంది? అందుకే దేవుడి మీద భారం వేసి షాట్‌లో పాల్గొన్నారు జగ్గారావు. కెమెరా ఆన్ అయింది. కత్తితో ఎన్టీఆర్ మీదకు దాడి చేశారు జగ్గారావు. కానీ చేతులు వణుకుతుండడంతో ఆ కత్తి దెబ్బ ఎన్టీఆర్ తలకి తగలబోయింది. అది గ్రహించి చేతిని అడ్డు పెట్టారు ఎన్టీఆర్. కత్తి పదునుకు ఆయన చెయ్యి తెగింది. రక్తం కారుతున్న చేతిని అలాగే గట్టిగా పట్టుకుని ఇవతలకు వచ్చారు ఎన్టీఆర్.