మనోవికాసానికి తీగబచ్చలి

ABN , First Publish Date - 2023-06-03T00:00:20+05:30 IST

నేను తీగబచ్చలిని. రెండురకాలుగా పెరుగుతాను. ఆరు రుచులూ నాలో ఉన్నాయి. నేను ఉండగా ఇంక మీకు ఇతర కూరగాయలతో పనేమిటీ?ఖ అని అడిగి, అన్నంలో తినేటప్పుడు బచ్చలాకు కూర కమ్మగా

మనోవికాసానికి తీగబచ్చలి

ద్విధాహం షడ్రసోపేతా కిమన్యైర్వ్యంజనాదికైః!

తండులైరాలన వ్యాజైర్హసత్యేషా హిపోయికా!!

నేను తీగబచ్చలిని. రెండురకాలుగా పెరుగుతాను. ఆరు రుచులూ నాలో ఉన్నాయి. నేను ఉండగా ఇంక మీకు ఇతర కూరగాయలతో పనేమిటీ?ఖ అని అడిగి, అన్నంలో తినేటప్పుడు బచ్చలాకు కూర కమ్మగా నవ్విందట! హిందీలో ‘బచావు’ అంటే రక్షించటం. తెలుగులో కూడా ‘బచాయించటం’ అంటే రక్షించటం అనే ప్రయోగం ఉంది. ‘బచాయించేది బచ్చలి’ అనే అర్థాన్ని దీనికి చెప్పుకొంటే బచ్చలి గుణాలు మనకి తేలికగా అర్థమౌతాయి.

జానపద గేయాల్లో ‘లక్ష్మణదేవర నవ్వు’లాగా పాక శాస్త్రంలో ‘బచ్చలమ్మ నవ్వు’ ప్రసిద్ధి. బచ్చలి ఎందుకు నవ్వింది? అన్ని పోషకాలూ ఉన్న కూరని పెరట్లో పెట్టుకుని విదేశీ వంటకాల కోసం, విదేశీ ముద్ర ఉన్న పండ్లు, కాయల కోసం వెంపర్లాడే వాళ్లని చూసి నవ్వింది. నవ్వటమే కాదు, మనకేం కావాలో మనకే తెలియని అఙ్ఞానాన్ని చూసి ఎగతాళి చేసింది కూడా!

బచ్చలికూరని ఇండియన్‌ స్పినాచ్‌ (బేసెల్లా ఆల్బా) అంటారు. మలబార్‌ స్పినాచ్‌, సిలోన్‌ స్పినాచ్‌ అని కూడా పిలుస్తారు. తీగబచ్చలి (బేసెల్లా ఆల్బా– పాలబచ్చలి, అల్లుబచ్చలి), ఎర్ర అల్లుబచ్చలి (బేసెల్లా రుబ్రా– రాచబచ్చలి) అని రెండు రకాలున్నాయి. మట్టుబచ్చలి లేదా కాడబచ్చలి (బేసెల్లా లుసిడా) అని మూడో రకం కూడా ఉందంటారు. కాడ బచ్చలిని సంస్కృతంలో ‘ఉపోతకీ’ అని, తీగ బచ్చలిని ‘వల్యుపోతకీ’ అని పిలుస్తారు. హిందీ మాట్లాడేవారు ‘పోయీ’ అంటారు.

పోషకాల నిధి...

నలుడు ‘పాక దర్పణం’ నాటికన్నా, క్షేమ శర్మ ‘క్షేమకుతూహలం’ రాసేనాటికి... ఆ ఐదారు వందల ఏళ్ల కాలంలో బచ్చలి గురించి అవగాహన ఆనాటి శాస్త్రవేత్తల్లో చాలా పెరిగింది. ఆధునిక విఙ్ఞానం అభివృద్ధి చెందాక మరిన్ని కొత్త సంగతులు తెలిశాయి. విటమిన్‌ ఎ, బి, సి, ఇనుము, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, బచ్చలిలో దండిగా ఉన్నాయి. లేత కాడల్లో ‘ఎ’ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఎర్రని కాడలున్న బచ్చలిలో అదనంగా బీటాకెరటిన్‌ ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకూ బచ్చలిని కాడతోనే వండుకోవాలి. ఒకవేళ ఆకుల్లో చిరుగులుండి, కాడ వరకూ బాగానే ఉంటే ఆకు పారేసి, కాడని తీసుకోండి.

‘మధురామధురా పాకె భేదినీ శ్లేష్మవర్ధనీ/ వృష్యా స్నిగ్ధా చ శీతా చ మదఘ్నీ చాప్యుపోదికా’ అంటూ చరక సంహిత బచ్చలి ఆకుల గుణాలను వివరించింది. రుచికరంగానూ తియ్యగానూ ఉండే దీని ఆకులు మూత్రపిండాల్లో రాళ్లను పగలగొట్టే ఔషధం అన్నాడు చరకుడు. పాలకూర తినకూడదని వైద్యులు చెప్పిన రోగులు నిర్భయంగా బచ్చలికూర తినవచ్చు. ఇది వాపుని తగ్గిస్తుంది. పురుషుల్లో జీవకణాల్ని పెంచి సంతాన యోగ్యతనిస్తుందని ‘సుశ్రుత సంహిత’ వివరించింది. అతిగా మద్యపానంవల్ల కలిగే లక్షణాలకు విరుగుడుగా పనిచేస్తుందని ‘అష్టాంగ హృదయం’ పేర్కొంది.

బలవర్ధక ఆహార ద్రవ్యం...

బచ్చలి అనగానే చలవ చేసే ఆకుకూర, పోషకాలు ఎక్కువగా ఉన్న కూర అని గుర్తుకు రావాలి. చిక్కి పోతున్నవారికి శరీరం బలంగా దృఢంగా అయ్యేలా చేసే బలవర్థక ఆహార ద్రవ్యం ఇది.

• రక్త దోషాలను పోగొట్టి శుద్ధి చేస్తుంది. ధాతువుల్ని, లైంగిక శక్తిని పెరిగేలా చేస్తుంది. ఎముక పుష్టి కలిగిస్తుంది.

• ముఖ్యంగా మెనోపాజ్‌ వచ్చిన స్త్రీలకు బచ్చలి మంచి ఉమశమనం కలిగిస్తుంది.

• క్షేమశర్మ ఇది మనోవికాసాన్ని కలిగిస్తుందని అదనంగా ఒక గొప్ప వైద్య రహస్యం చెప్పాడు. మెనోపాజ్‌ సమయంలో కలిగే మానసిక ఒత్తిళ్లకు ఇది మంచి నివారకం.

• అతి వేడివల్ల కలిగే నోటిపూత, అరికాళ్ల మంటల్లాంటి లక్షణాలు తగ్గుతాయి. రక్తస్రావాన్ని ఆపుతుంది. అరికాళ్ల పగుళ్లను తగ్గిస్తుంది.

• వృద్ధాప్యాన్ని నివారించే ఆహార ఔషధాల్లో బచ్చలి ప్రముఖమైంది. కఫాన్ని పెంచుతుంది. కాబట్టి స్థూలకాయం ఉన్నవారు పరిమితంగా తినటమే మంచిది. మైగ్రేన్‌ తలనొప్పి తగ్గించే గుణం కూడా దీనికుంది. ముఖ్యంగా ఇది నిద్ర పట్టించే ఔషధం.

ఎలాగైనా వండుకోవచ్చు...

వటపత్రవద్దళపత్రికా పరితప్తతైలప్రతాపితా!

నవహింగు వాస సువాసితాపరిభోక్తృచిత్తవికాసికా!!

బచ్చలాకులు మర్రి ఆకుల్లా హృదయ ఆకారంలో ఉంటాయి. ఈ ఆకుల్ని కాడతో సహా కడిగి పొడిబట్టతో శుభ్రం చేసి, సన్నగా తరగాలి. ఇంగువ తాలింపు పెట్టిన నూనెలో వేసి మూతపెట్టి కొద్దిసేపు సన్నసెగన మగ్గనిస్తే, బచ్చలాకులు మగ్గిపోతాయి. దీంట్లో కావల్సిన సుగంధ ద్రవ్యాలు కలిపి కూరగానో లేక ఉడికించిన పప్పు కలిపి కలగూర పప్పుగానో, పచ్చడిగానో చేసుకోవచ్చు. చింతపండు కలిపి పులుసుకూర, ఆవపెట్టిన కూర, పప్పు, పచ్చడి... ఇలా ఇతర ఆకుకూరలతో వండేవన్నీ బచ్చలికూరతోనూ వండుకోవచ్చు! బాగా మగ్గిన బచ్చలాకు ముక్కల్ని పెరుగులో కలిపి, ఉప్పు, పచ్చిమిరప ముక్కలు వగైరా చేర్చి, తాలింపు పెట్టి, కొత్తిమీరతో అలంకరించిన పెరుగుపచ్చడి గొప్ప ఔషధం. వేసవిలో ఉదయం అల్పాహారంగా తినటానికి అనుకూలంగా ఉంటుంది.

ఉడికించిన కందముక్కల్ని అలాగే, నూనెలో మగ్గబెట్టిన బచ్చలాకుల్ని కలిపి కంద బచ్చలికూర చేసుకుని, చల్లారాక పావు చెంచాడు ఆవపిండి కలిపి రెండు మూడు గంటలు ఊరిన తర్వాత తింటే చాలా కమ్మగా ఉంటుంది.

Updated Date - 2023-06-03T00:00:20+05:30 IST