Share News

Interview with Director Shauryav : నానితో గొడవల్లేవు

ABN , First Publish Date - 2023-12-03T01:27:49+05:30 IST

కొత్త దర్శకులకు, కొత్త ఆలోచనలకూ చిత్రసీమ ఎప్పుడూ వెల్‌కమ్‌ చెబుతూనే ఉంటుంది. ముఖ్యంగా యంగ్‌ హీరోలు కొత్త వారితో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. వాళ్లలో నాని ఒకరు. నాని పది సినిమాలు చేస్తే అందులో

Interview with Director Shauryav : నానితో గొడవల్లేవు

కొత్త దర్శకులకు, కొత్త ఆలోచనలకూ చిత్రసీమ ఎప్పుడూ వెల్‌కమ్‌ చెబుతూనే ఉంటుంది. ముఖ్యంగా యంగ్‌ హీరోలు కొత్త వారితో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. వాళ్లలో నాని ఒకరు. నాని పది సినిమాలు చేస్తే అందులో ఆరు కొత్త దర్శకులతోనే. అలా.. నాని చేతుల మీదుగా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు శౌర్యవ్‌. తన తొలి చిత్రం ‘హాయ్‌.. నాన్న’ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ యంగ్‌ టాలెంట్‌తో ‘నవ్య’ జరిపిన ముచ్చట్లు!

పరిశ్రమ అంతా హింస, రక్తపాతం, సెక్స్‌ అంటూ పరుగులు పెడుతోంది. మీరేమో ఓ క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకొన్నట్టు కనిపిస్తున్నారు. ఎందుకలా?

మీరన్నది నిజమే. ఓటీటీలు పెరిగిన తరవాత దానికి తగ్గట్టుగానే హింస పెరిగింది. అలాంటి కంటెంట్‌ ఎక్కువగా వస్తోంది. ఎమోషనల్‌గా మొద్దుబారిపోతున్నామేమో అనిపిస్తోంది. అందుకే బలమైన ఎమోషన్లు చెప్పడానికి ఇదే సరైన సమయం అనుకొన్నా. నాక్కూడా యాక్షన్‌ సినిమాలంటే ఇష్టమే. కాకపోతే ఓ కొత్త దర్శకుడ్ని నమ్మి పెద్ద స్కేల్‌ ఉన్న సినిమాలు ఇవ్వరు. ప్రేమ కథ అయితే త్వరగా అవకాశం వస్తుంది. అందుకే ఈ కథ రాసుకొన్నా. ఆ ప్రేమ కథ కూడా రెగ్యులర్‌గా ఉండకూడదనిపించింది. ఆ ప్రయాణంలో ‘హాయ్‌.. నాన్న’ ఆలోచన వచ్చింది. ఈ కథలో హింస, బూతు, అశ్లీలం ఎక్కడా కనిపించవు. ఓ క్లీన్‌ మూవీని అందించాం.

నాని కోసమే ఈ కథ రాసుకొన్నారా?

అదేం లేదండీ. ఓ కథని ఎవరూ ఎప్పుడూ హీరోని దృష్టిలో పెట్టుకొని రాయరు. కథ రాస్తున్న ప్రయాణంలో ఈ కథ ఎవరికైతే బాగుంటుందన్న ఆలోచన వస్తుంది. ‘హాయ్‌ నాన్న’ విషయంలోనూ అదే జరిగింది. ఈ కథ నాని దగ్గరకు వెళ్లడమే ఓ మ్యాజిక్‌. నిజానికి నా తొలి సినిమా కోసం ఓ కథ రెడీ చేశాను. దానికి అడ్వాన్స్‌ కూడా తీసేసుకొన్నాను. అదే సమయంలో నా దగ్గర మరో కథ ఉందని నిర్మాతలకు తెలియడంతో.. వాళ్ల ద్వారా నానిని అప్రోచ్‌ అయ్యాను. అలా ఈ ప్రాజెక్ట్‌ సెట్‌ అయ్యింది.

సినిమా సెట్‌లో మీకూ.. నానీకి మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయని వార్తలొచ్చాయి. నిజమేనా?

ఆ మాట నేను ఇప్పుడే వింటున్నా. నాని చాలా సపోర్ట్‌ చేశారు. మా మధ్య అభిప్రాయ బేధాలొచ్చే ఛాన్సే లేదు. సెట్లో నేనేం తీస్తున్నానో నాకో విజన్‌ ఉంది. నానికి నాపై నమ్మకం ఉంది. ఇక గొడవలు ఎందుకు వస్తాయి. ఇదో ఫీల్‌ గుడ్‌ మూవీ. సినిమా కూడా అంతే ప్రశాంతంగా జరిగిపోయింది.

ఇంతకీ మీ నేపథ్యం ఏమిటి? ఎవరి దగ్గర పని చేశారు?

మాది వైజాగ్‌. నాన్న రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నారు. నేను ఎంబీబీఎస్‌ చదివాను. అయితే.. నా ఆశలు, ఆలోచనలూ ఎక్కువగా సినిమాల చుట్టే తిరిగేవి. అందుకే ఇటువైపు వచ్చేశా. ‘జాగ్వార్‌’ అనే చిత్రానికి సహాయకడిగా పనిచేశా. ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’ సినిమాలోనూ నా కంట్రిబ్యూషన్‌ ఉంది. విజయేంద్ర ప్రసాద్‌ గారి దగ్గర కూడా వర్క్‌ చేశా.

దర్శకుల్లో ఎవరంటే ఇష్టం? ఎవరి ప్రభావం మీమీద ఉంది?

రాజమౌళి గారంటే చాలా ఇష్టం. ఎమోషన్స్‌ని ఆయన బాగా పండిస్తారు. ఆయన ప్రభావం నామీద ఎంత ఉందో నాకు తెలీదు. బహుశా.. ‘హాయ్‌ నాన్న’ సినిమా చూశాక అర్థమవుతుందనుకొంటా.

‘హాయ్‌ నాన్న’ ప్రమోషన్‌లో భాగంగా పబ్లిక్‌ ఈవెంట్‌లో విజయ్‌, రష్మికల ఫొటోని ప్రదర్శించారు. ఆ విషయంలో చాలా ట్రోల్స్‌ వచ్చాయి కదా?

ఆ ఈవెంట్‌కి నేను వెళ్లలేదు. ఆ తరవాత ఆ వీడియో నేను కూడా చూశాను. అది ఎవరి ఐడియానో నాకు తెలీదు కానీ, ఇలాంటి సున్నితమైన విషయాల్ని టచ్‌ చేయకుండా ఉండడమే మంచిదన్నది నా ఫీలింగ్‌.

‘హాయ్‌ నాన్న’ ట్రైలర్‌ చూస్తుంటే ‘సంతోషం’, ‘కుచ్‌ కుచ్‌ హోతాహై’ ఛాయలు కనిపిస్తున్నాయి. ఆ కథలకూ, దీనికీ సమైనా సంబంధం ఉందా?

సింగిల్‌ పేరెంట్‌ కథలు అనగానే ఆ రెండు సినిమాలూ గుర్తుకు రావడం చాలా సహజం. అయితే... నా కథలో అలాంటి ఛాయలేం లేవు. ఇది పూర్తిగా ఫిక్షనల్‌ స్టోరీ. కాకపోతే నా జీవితం, సమాజంలో పరిశీలించిన అంశాలు కూడా ఈ కథలో పొందుపరిచాను. కథలో ఏం చెప్పాలనుకొన్నామో అది ట్రైలర్‌లోనే చూపించేశాం. ప్రేక్షకులు ఓపెన్‌ మైండ్‌తో సినిమాకి రావాలన్నది మా ఉద్దేశం. అయితే ట్రైలర్‌లో చెప్పనవి, చూపించనివి ఇంకొన్ని ఉన్నాయి. అవి థియేటర్లో చూస్తేనే సర్‌ప్రైజ్‌ అవుతారు.

ఓ కొత్త దర్శకుడికి చాలా రకాలైన ప్రాక్టికల్‌ సమస్యలు ఎదురవుతుంటాయి? మీరూ అలాంటివి ఎదుర్కొన్నారా?

ఒక్క విషయంలోనూ నాకు అసంతృప్తి లేదు. నాకేం కావాలో అన్నీ సమకూర్చారు. ఇలాంటి నిర్మాణ సంస్థ నాకు అండగా ఉండడం, నాని లాంటి హీరో దొరకడం నా అదృష్టం. కథ రాసుకొన్నప్పుడు హీరోగా నానిని అనుకోలేదు కానీ, హీరోయిన్‌ పాత్రకు మృణాల్‌ అయితేనే బాగుంటుందని అనిపించింది. నా ఆలోచనల్ని నిర్మాతలు అర్థం చేసుకొన్నారు. నాని సపోర్ట్‌ చేశాడు. కాబట్టే.. మృణాల్‌ని తీసుకోగలిగాం. ఇలా చాలా విషయాల్లో సహకారం దొరికింది.

భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటి?

ఇంకా ఏం అనుకోలేదు. కథలైతే సిద్ధంగా ఉన్నాయి. అయితే ఎలాంటి కథతో సినిమా చేయాలి అనేది మాత్రం ‘హాయ్‌ నాన్న’ రిజల్ట్‌ తో ముడిపడి ఉంది. నా బలం ఎమోషన్‌. ఏ కథ చెప్పినా ఆ ఎమోషన్‌ మిస్‌ అవ్వకుండా చూసుకొంటా. ఫ అన్వర్‌

Updated Date - 2023-12-03T01:28:00+05:30 IST