Mahi.V.Raghava: సంకెళ్లు వేస్తానంటే...ఓటీటీలెందుకు?

ABN , First Publish Date - 2023-06-18T04:26:51+05:30 IST

అసలు ఇది వెబ్‌ సిరీసేనా? అన్ని బూతులేంటి?ఇంత హింస, అంత రక్తపాతం అవసరమా?మహి.వి.రాఘవకు ఏమైంది?- ఓటీటీలో ‘సైతాన్‌’ చూసిన వెంటనే మొదలైన ప్రశ్నలు ఇవి.

Mahi.V.Raghava: సంకెళ్లు వేస్తానంటే...ఓటీటీలెందుకు?

అసలు ఇది వెబ్‌ సిరీసేనా? అన్ని బూతులేంటి?ఇంత హింస, అంత రక్తపాతం అవసరమా?మహి.వి.రాఘవకు ఏమైంది?- ఓటీటీలో ‘సైతాన్‌’ చూసిన వెంటనే మొదలైన ప్రశ్నలు ఇవి. ఈమధ్య కాలంలో ఓ వెబ్‌ సిరీస్‌ గురించి ప్రేక్షకులు గానీ, విశ్లేషకులు గానీ ఇంతగా మాట్లాడుకోలేదేమో..? ఇన్ని విమర్శలు చేయలేదేమో..? ‘పాఠశాల’, ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’లాంటి మంచి చిత్రాల్ని అందించిన ఓ దర్శకుడి నుంచి ఇంత హింసాత్మక కథ బయటకు రావడంతో జనం ఆశ్చర్యపోవడంలో వింతేం లేదు. అందుకే మహి.వి.రాఘవపై విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని ఆయన సమాధానం ఇచ్చుకొనే ప్రయత్నమూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడ్ని ‘నవ్య’ పలకరించింది. ఓటీటీల వైఖరి గురించి, అక్కడున్న సృజనాత్మక స్వేచ్ఛ గురించీ, ఓటీటీల సెన్సార్‌ గురించీ.. ఆయన ఏం చెప్పారంటే..?

రచయితగా చెప్పాలంటే ఓటీటీలోనే స్వేచ్ఛ ఎక్కువ. సినిమా అనేది ఎంతసేపూ హీరో పాయింట్‌ ఆఫ్‌ వ్యూలోనే చెప్పాలి. హీరోల్నీ, వాళ్ల అభిమానుల్ని సంతృప్తి పరచాలి. లాంగ్‌ ఫార్మెట్‌లోకి వచ్చేటప్పుడు ప్రతీ పాత్ర కూ ఓ ఆర్క్‌, జర్నీ కల్పించే అవకాశం రచయితకు దక్కుతుంది.

‘సైతాన్‌’పై ఇన్ని విమర్శలు వస్తాయని ముందే

ఊహించారా?

ఇంతకు ముందు ‘సేవ్‌ ద టైగర్స్‌’ చేశా. ఆ సిరీస్‌ బాగుందన్నారు. దానికంటే నాలుగు రెట్ల వ్యూస్‌ అతి తక్కువ కాలంలోనే ‘సైతాన్‌’కి వచ్చాయి. ఎవరూ చూడకపోతే.. అన్ని వ్యూస్‌ ఎలా వస్తాయి..? కథ కథేనండీ. నేనో కథ చెప్పాలనుకొన్నా. చెప్పేశా. ఇక వాడిన భాష, చూపించిన హింస అంటారా? మనంఇలాంటి సమాజంలోనే బతుకున్నాం కదా. నేను ఏ విషయాన్నీ గ్లోరిఫై చేయదలచుకోలేదు. విమర్శలూ, ప్రతిస్పందనలూ మామూలే. మంచి సినిమా, చెడ్డ సినిమా... మంచి ఫిల్మ్‌ మేకర్‌, చెడ్డ ఫిల్మ్‌మేకర్‌ అంటూ ఎవరూ ఉండరు. సందర్భాన్ని బట్టి, సమాజ పరిస్థితుల్ని బట్టి కొన్ని కథలు చెప్పాలి. ‘శంకరాభరణం’లో పాటలు రాసిన వేటూరి ‘ఆరేసుకోబోయి పారేసుకొన్నా’ అనే మాస్‌ పాట రాయాల్సివచ్చింది. ఆయన ప్రతిభని ఆ ఒక్క పాటతోనే తూచలేం కదా? దేవుడు సినిమాలు తీసినంత మాత్రాన మంచోడినా? దెయ్యం కథలు చెబితే చెడ్డోనినా? ‘సైతాన్‌’ కథ వెనుక ఓ ఆలోచన ఉంది. ప్రతి నేరస్థుడూ ఒక బాధితుడే. అతను అలా మారడంలో సమాజానికీ ఓ బాధ్యత ఉంది. అదే చెప్పాను.

భాష విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొంటే మంచిదేమో..?

భాష అనేది ఓ కమ్యునికేషన్‌. మనలా... హుందాగా మాట్లాడేవాడు పీకలు కోస్తాడని చెబితే... కనెక్ట్‌ అవ్వరు. బూతులు ఎవరు మాట్లాడాడు? ‘బాలి’ అనే పాత్రధరాఇ. వాడి భాష అది. వాడు అలానే మాట్లాడతాడు. ప్రపంచంలో ఆ భాష ఎవరూ మాట్లాడడం లేదా? కేవలం ఆ పాత్రని, అతను వచ్చిన పరిస్థితుల్ని, చేస్తున్న పనుల్ని బట్టి.. తన భాషనీ బేరీజు వేసుకోవాలి.

ఓటీటీ సిరీస్‌లో బూతులు, సెక్స్‌, హింస.. మీతోనే మొదలవ్వలేదు. మీతోనే ఆగిపోవడం లేదు. అలాంటప్పుడు మిమ్మల్నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారంటారు..?

నేనింత వరకూ చేసిన సినిమాల్లో ఒక్క సెన్సార్‌ కట్టేలేదు. ఒక పదం అటూ ఇటూ రాయలేదు. రోజూ పప్పన్నం తినేవాడు సడన్‌గా మటన్‌ బిరియానీ తింటుంటే ఆశ్చర్యపోతాం. బుద్దిమంతుడెప్పుడైనా తిరగబడితే షాక్‌ అవుతాం. ఇదీ అంతే. నేను చెప్పాలనుకొన్న రకరకాల కథల్లో ఇదొకటి. ఒక నెల ముందు ‘సేవ్‌ ద టైగర్స్‌’లో ఒక రకమైన కథ చెప్పా. ‘సైతాన్‌’లో మరో కథ చూపించా. త్వరలో ‘సిద్దా లోకం ఎలా ఉంది?’ అనే సినిమా తీస్తున్నా. ఇప్పటి వరకూ నేను తీసిన సినిమాలకూ, వెబ్‌ సిరీ్‌సలకూ సంబంధం లేని కథ అది. ‘సేవ్‌ ద టైగర్స్‌’ నచ్చిన వాళ్లకు ‘సైతాన్‌’ రుచించకపోవచ్చు. కానీ ‘సైతాన్‌’ కథకంటూ ఓ సెపరేట్‌ ఆడియన్స్‌ ఉన్నారు. వాళ్ల కోసమే ఆ సిరీస్‌.

ఓటీటీలకు సెన్సార్‌ ఉండాలంటారా?

ప్రత్యేకంగా సెన్సార్‌ అంటూ లేకపపోవచ్చు. కానీ రెగ్యులేషన్స్‌ మాత్రంఉన్నాయండీ. వాటికీ స్వీయ నియంత్రణ ఉంది. టీవీ, ఓటీటీ, సినిమా అనేవి మూడూ మూడు వేర్వేరు ఫార్మెట్లు. ఓటీటీ ఎందుకు కనిపెట్టారు? సినిమాల్లోనూ, టీవీలోనూ చెప్పలేని కథలు చెప్పడానికి. ఇక్కడ కూడా సంకెళ్లు వేస్తానంటే ఇక ఓటీటీలెందకు? అందరూ కలిసి హాయిగా టీవీలు చూసుకోవచ్చు కదా..?

ఓటీటీలు వచ్చాక ఆడియన్‌ మైండ్‌ సెట్‌ మారిందా?

బాగా మారింది. ఫిల్మ్‌ మేకర్‌గా నా పరిస్థితి ఊహించండి. ‘మిర్జాపూర్‌’ ‘నార్కోస్‌’, ‘మనీ హీస్ట్‌’లాంటి వెబ్‌ సిరీ్‌సలను మనవాళ్లు తెలుగు డబ్బింగ్‌లో చూసేశారు. మనకంటే వాళ్లవి పెద్ద బడ్టెట్లు. భారీ స్థాయిలో ఆ కథల్ని చెప్పగలిగారు. తెలుగులో దానికంటే తక్కువ స్థాయిలో చూపిస్తే ఎందుకు చూడాలి? ఎవరి కోసం చూడాలి? ఆడియన్స్‌ మైండ్‌లో ‘మనీ హీస్ట్‌’లాంటి కథలు తిరుగుతుంటే.. నేను ఏ స్థాయిలో కథలు చెప్పాలి? కథలు చెప్పేవారికి ‘ఓటీటీ’ చాలా పెద్ద ఛాలెంజ్‌ విసిరింది.

‘మీర్జాపూర్‌’ లాంటి సిరీస్‌ మీకెలాటి ప్రేరణ కలిగించింది?

ఆ కథకూ ‘సైతాన్‌’కూ సంబంధమే లేదు. ఏదో ఎవరో ఎక్కడో తీశారని మనం వాతలు పెట్టుకొంటే కుదరదు. ఓ సంవత్సరం పేపర్లు ముందు పెట్టుకొని చూడండి. నేను చెప్పిన ఏ క్రైమ్‌ అయినా సమాజంలో జరగలేదా? మన చుట్టూ జరుగుతున్న విషయాలే చూపించాను కదా..? నేను కేవలం అద్దం మాత్రమే. కథ రూపంలో ఓ సమస్యని చెబుతున్నా. అంతే.

సినిమా - ఓటీటీ.. ఈ రెండింటిలో ఎక్కడ ఎక్కువ స్వేచ్ఛ లభిస్తోంది?

రచయితగా చెప్పాలంటే ఓటీటీలోనే స్వేచ్ఛ ఎక్కువ. సినిమా అనేది ఎంతసేపూ హీరో పాయింట్‌ ఆఫ్‌ వ్యూలోనే చెప్పాలి. హీరోల్నీ, వాళ్ల అభిమానుల్ని సంతృప్తి పరచాలి. లాంగ్‌ ఫార్మెట్‌లోకి వచ్చేటప్పుడు ప్రతీ పాత్ర కూ ఓ ఆర్క్‌, జర్నీ కల్పించే అవకాశం రచయితకు దక్కుతుంది. నేను చెప్పిన కథ ప్రపంచం మొత్తం చూడొచ్చు.

కమర్షియల్‌గానూ ఓటీటీ లాభసాటిగా ఉంది. సినిమాలు తీసిన ప్రతీసారీ నా డబ్బులు పోగొట్టుకొన్నాను. ఓటీటీ అలా కాదు. మొదలు పెట్టిన రోజే ఎంత పెట్టాలి? ఎంత వస్తుంది? అనే క్లారిటీ ఉంటుంది. రిస్కు మొత్తం ఎవరో ఒకరు తీసుకొంటాడు. రచయిత క్రియేటీవ్‌గా ఆలోచిస్తే చాలు.

-అన్వర్‌

Updated Date - 2023-06-18T04:26:51+05:30 IST