Share News

Buddhist : అందుకే బౌద్ధుడినయ్యా..

ABN , Publish Date - Dec 29 , 2023 | 06:44 AM

ఆధ్యాత్మికత, భక్తి అనేవి రెండు భిన్నమైన విషయాలు. భక్తి వ్యక్తిగతమైనది. ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగత భక్తితో పాటు సమాజం గురించి కూడా ఆలోచించటం. ఇతరులతో ఒక ప్రయోజనాత్మకమైన

Buddhist : అందుకే బౌద్ధుడినయ్యా..

ఆధ్యాత్మికత, భక్తి అనేవి రెండు భిన్నమైన విషయాలు. భక్తి వ్యక్తిగతమైనది. ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగత భక్తితో పాటు సమాజం గురించి కూడా ఆలోచించటం. ఇతరులతో ఒక ప్రయోజనాత్మకమైన మార్గంలో అనుసంధానం కావడం. మన సంస్కృతిలో ఇది చాలా తక్కువ. కారణమేమిటంటే... మన హిందూ ధర్మం ప్రధానంగా వ్యక్తిగతమైన మోక్షం..ముక్తి ఆధారంగా నిర్మితమైన మతం. మనకు సామాజికమైన విషయాల్లో పట్టింపు తక్కువ. అబ్రహామిక్‌ మతాలైన ఇస్లాం, క్రైస్తవం, జూడోయిజం లాంటి వాటిలో సామాజిక ప్రయోజనం కూడా చాలా ముఖ్యం. అయితే మనదేశంలో ‘తేరవాద బౌద్ధం’, ‘మహాయాన బౌద్ధం’ ఎక్కువ ప్రాబల్యంలో ఉన్న కాలంలో సామాజిక ప్రయోజనానికే ప్రాముఖ్యత ఇచ్చేవారు.

ఇక నా ఉద్దేశంలో ఆలయాలకు, ప్రార్థనామందిరాలకూ వెళ్ళేవారంతా నిజమైన ఆధ్యాత్మికపరులని అనుకోనక్కరలేదు. ఈనాడు ప్రపంచంలో 80 శాతం మంది ప్రజలు ఏదైనా మతాన్ని అనుసరించడానికి కారణం వాళ్ళు అందులో పుట్టడమేనని బౌద్ధ గురువు దలైలామా చెప్పారు. మిగిలిన వారిలో 10 శాతం మంది ‘మతం అంటే ఏమిటి? దాని అసలైన అర్థం ఏమిటి?’ అనేవి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారనీ, చివరి 10 శాతం మంది మాత్రమే అసలైన ఆధ్యాత్మిక వ్యక్తులనీ ఆయన సూత్రీకరించారు.

ఆత్మహత్యా సదృశం...

‘‘ఎప్పుడైతే బౌద్ధాన్ని వదిలేశామో... ఒక దేశంగా అప్పుడే మనం ఆత్మహత్య చేసుకున్నాం’’ అన్నారు మహాకవి గురజాడ. అది నిజం. క్రైస్తవం విషయానికి వస్తే... చర్చి అంటే మతపరమైనది మాత్రమే కాదు, సామాజికమైన జీవనంలో కూడా దాని ప్రమేయం ఉంటుంది. అలాగే ఇస్లాంలో కూడా అందరూ ఒక చోటికి చేరడం, సందర్భాన్ని బట్టి దానధర్మాలు చేయడం లాంటివి ఉంటాయి. మిగిలిన సమాజం పట్ల మీ బాధ్యతని ఇవన్నీ వెల్లడిస్తాయి. కానీ మనమతంలో అలా ఉండదు. అంతేకాదు... ఏ తప్పు చేసినా, హుండీలో డబ్బు వేసేస్తే పాప విమోచనం అవుతుందని కొందరు అనుకుంటారు. దీనివల్ల కొంత దైవభీతి వస్తుందనే మాట నిజమే. అయితే- ‘‘ఇలాంటి తప్పులు ఇక చేయకూడదు. ఈ రోజుతో ఇవన్నీ నేను ఆపేస్తున్నాను. రేపటి నుంచి మరింత ఉత్తమమైన మనిషిగా మారుతాను’’ అని ఆలోచించేవారు అతి తక్కువ మంది. ఒకప్పుడు మతపరమైన విషయాల్ని ప్రశ్నించే తత్త్వం, తర్కించే పద్ధతి ఉండేవి. ఇప్పుడు ప్రశ్నిస్తే దాడి చేసే పరిస్థితులు ఉన్నాయి. మన పూర్వ సంస్కృతిలో ఇలాంటిది లేదు. ఉదాహరణకు బుద్ధుడు ‘‘నేను చెప్పినదాన్ని కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు మీ జీవితానుభవాల ద్వారా తెలుసుకోవాలి’’ అని బోధించాడు. దానికి అందమైన ప్రమాణాన్ని కూడా చూపించాడు. ‘‘ఒక స్వర్ణకారుడు బంగారాన్ని గీటురాయి మీద ఎలా పరీక్షిస్తాడో... అదే విధంగా నేను చెప్పిన దాన్ని మీ సొంత జీవితానుభవాల ద్వారా పరీక్షించండి. అది మీకు ఉపయుక్తంగా ఉంటుందనుకుంటే ఆమోదించండి. లేదా తిరస్కరించండి’’ అని చెప్పాడు.

ఆలయాలకు గౌరవం...

ఇప్పుడు మన సంప్రదాయికమైన మతాన్ని ‘హిందూయిజం’ అంటున్నాం. కానీ దీనిలో ఎన్నో కలిసి ఉన్నాయి. భిన్నమైన సంస్కృతుల నుంచి అనేక అంశాలను స్వీకరించి, ఒక చోట గుదిగుచ్చిన మతం. ఈ నేపథ్యంలో సమాజంతో మనం మమేకం కావాలనేది మనం ఆలోచించాలి. మన ఆలయాల్లో పూజాదికాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఆగ్నేయాసియాలోని బౌద్ధ సంస్థలను పరిశీలిస్తే... ప్రతి బౌద్ధారామం ఒక పాఠశాలను, ఆసుపత్రిని నిర్వహిస్తుంది. మొత్తం కమ్యూనిటీకి సేవలు అందిస్తుంది. క్రెస్తవ మత సంస్థలు కూడా విద్య, ఆరోగ్యం లాంటి అంశాల్లో పని చేస్తాయి. సమాజంతో మతం మమేకం కాకపోతే... అది అప్రస్తుతం అవుతుంది. ఈ విషయాన్ని గమనించే ‘రామకృష్ణ మిషన్‌’ను స్వామి వివేకానంద ప్రారంభించారు. ఆ తరువాత కంచి మఠం వారు కూడా ఇలాంటి సేవలు చేపట్టారు. టీటీడీ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి ఆలయం ఇదే విధంగా చేయాలి. వృద్ధాశ్రమాలను, అనాథాశ్రమాలను ప్రారంభించవచ్చు. ఆధారంలేని మహిళలకు సాయం చేయవచ్చు. ఆలయాలకు వస్తున్న ఆదాయంలో కొంత భాగాన్ని సమాజం కోసం ఉపయోగించాలి. పూజాదికాలు, సిబ్బంది జీతభత్యాల ఖర్చుకు ఒక పరిమితి ఏర్పరచాలి. మిగిలిన మొత్తాన్ని ప్రజల ప్రయోజనం కోసం ఖర్చు చేయాలి. అప్పుడే ఆలయాలపై గౌరవం పెరుగుతుంది.

సహనశీలత తగ్గుతోంది

మీరు ఏ మతాన్నైనా అనుసరించండి. కానీ నైతిక విలువలు అన్ని మతాలకూ ఒకేలా వర్తిస్తాయి. అన్ని మతాలకూ తమతమ నైతిక సూత్రాలు ఉన్నాయి. వాటిని పాటించడంతో పాటు ఆలయాలు, ఇతర మత సంస్థల సామాజిక బాధ్యత ఏమిటనేది మనం ఆలోచించాలి. మతానికి మరీ ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదు. మీకు నచ్చింది మీ ఇంట్లో చేసుకోవచ్చు. మీరు చేసేది ఇతరులకు హాని కలిగించకుండా ఉంటే చాలు. అదే విధంగా సమాజ ప్రగతికీ, మానవ సంబంధాలకు ప్రతికూలంగా ఉండే వాటిని వదులుకోవాలి. ఎంతోమందికి సరైన తిండి లేని మన దేశంలో యాగాల్లాంటి వాటికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి తంతులు మనకు చాలా నష్టం కలిగిస్తున్నాయి. ఇక ఆధ్యాత్మిక గ్రంథాలను పూజామందిరాల్లో పూజించడం వల్ల ఉపయోగం లేదు. వాటిలో ఏముందో తెలుసుకోవాలి. అభ్యంతరకరమైన విషయాలు ఉంటే తొలగించాలి. సమాజంలో వచ్చిన మార్పులను బట్టి, కాలానుగుణంగా మార్పులు చేసుకుంటేనే మతం మనుగడ సాగిస్తుంది లేకపోతే మన సంస్కృతి మీద మనకే తిరస్కారం పెరుగుతుంది. ప్రస్తుత యువతరానికి అదే సమస్య ఎదురవుతోంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న పిల్లలకు మన పురాణ కథల్లో కొన్ని అసంబద్ధతలు కనిపిస్తూ ఉంటాయి. ‘‘మతం వేరు. సంస్కృతి వేరు. అవి ఆ రోజుల్లోని ప్రజల విశ్వాసాలు. ఇది మన సంస్కృతి. దాన్ని అంతవరకే తీసుకోవాలి’’ అని చెప్పాలి. మనం సంస్కృతికి ఒక్కసారిగా దూరం కాలేం. సంస్కృతిని అర్థం చేసుకోవాలి. కానీ దాన్నే పట్టుకొని వేలాడకూడదు. గొప్పతనం అంతా పురాణాల్లోనే ఉందనుకున్నంత కాలం మనం ముందుకు సాగలేం. వాటిని విమర్శనాత్మకంగా చదవాలి, వాటి గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి.. ‘‘ఈ గ్రంథాన్ని దేవుడు చెప్పాడు, ఇది దేవుని మాట’’ అని ఎప్పుడైతే అనుకుంటామో... ఇక దాన్ని మార్చలేం.

(సి. ఆంజనేయరెడ్డి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీ హోదాలో పదవీ విరమణ చేశారు. సికింద్రాబాద్‌లో ‘ఆనంద బుద్ధవిహార’ను స్థాపించి బౌద్ధ ధర్మ ప్రచారం సాగిస్తున్నారు.)

నైతికతకు ప్రాధాన్యత పెరగాలి

నేను చాలా కాలం ఏ మతాన్నీ అనుసరించలేదు. ఆ తర్వాత బౌద్ధంలోకి వచ్చాను. రెండు మూడు వేల ఏళ్ళకి పైబడిన సంస్కృతి ఉన్న మనం ఇంకా ఒక అసంఘటిత సమాజంగా ఎందుకు మిగిలిపోయాం? అనే విషయాన్ని ఆలోచించినప్పుడు- మతమే దీనికి కారణమనిపిస్తుంది. ఈ సమాజ పురోగతికి ఏకైక పరిష్కారం బౌద్ధం మాత్రమేననీ, సమాజాన్ని సంఘటితం చేసేది అదేననీ నా భావన. అందుకే నేను బౌద్ధాన్ని స్వీకరించాను. రెండో విషయం ఏమిటంటే హిందూమతంలో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ నైతిక స్పృహ రావడానికి కూడా బౌద్ధం అవసరం. మనం లెక్క లేనన్ని అబద్ధాలు చెబుతాం. ‘‘ఎవరైనా ఫోన్‌ చేస్తే... నేను లేనని చెప్పు’’ అని పిల్లలకు పెద్దలు బోధిస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకు అబద్ధాలు చెప్పడం అలవాటు చేస్తారు. దీనివల్ల అబద్ధం చెప్పకూడదనే ఆలోచన ఎవరికీ రాదు. అసత్యం ఆడరాదని బడిలో పాఠం నేర్చుకొని వస్తే... ఇంట్లో దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. మూడో విషయం మనకు వాస్తు, జ్యోతిషం, మంచి రోజులు చెడ్డ రోజులు ఇలాంటి కొన్ని అసంబద్ధమైన విశ్వాసాలు ఉన్నాయి. ఇలాంటి మూఢ నమ్మకాలు ఉన్నంతకాలం సమాజం ముందుకుపోదు. ఇలాంటివాటిని బౌద్ధం మొదటి నుంచీ తిరస్కరించింది. వాటిని వదలగొట్టుకోవాలంటే బౌద్ధం ఒక్కటే శరణ్యం.

సంభాషణ: కృష్ణ శర్మ

Updated Date - Dec 29 , 2023 | 06:44 AM