kitchen Care : వంటిల్లు శుభ్రం ఇలా...
ABN , Publish Date - Dec 17 , 2023 | 06:21 AM
వంటిల్లు శుభ్రంగా ఉంటే- ఇంట్లో వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంది మహిళలు రోజులో ఎక్కువ భాగం వంటింట్లోనే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. దీని వల్ల వంటింటిని
వంటిల్లు శుభ్రంగా ఉంటే- ఇంట్లో వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంది మహిళలు రోజులో ఎక్కువ భాగం వంటింట్లోనే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. దీని వల్ల వంటింటిని తరచూ శుభ్రం చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఇలా ఎక్కువ శ్రమ పడకుండా- వంటింటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం..
చిన్న పనులే కానీ..
వంటింట్లో పనులన్నింటినీ జాగ్రత్తగా విభజించుకోవాలి. చాలా సార్లు కుక్కర్ ఉడుకుతున్నప్పుడో.. వేపుడు వేగుతున్నప్పుడో కొద్ది సమయం చిక్కుతుంది. అలాంటప్పుడు గిన్నెలు సర్దడమో.. కిటికీ తుడవటమో చేస్తే- కొన్ని పనులు పూర్తవుతాయి.
సింక్ శుభ్రంగా..
కొందరు గిన్నెలను శుభ్రంగా కడగటంపై చూపించిన శ్రద్ధ సింక్‌పై చూపించరు. ప్రతి రోజు సింక్‌ను శుభ్రపరిస్తే- వాసన రాకుండా ఉంటుంది.
వెంటనే తుడిచేయండి..
వంట వండుతున్నసమయంలో కొన్ని సార్లు ఫ్లోర్ మీద నీళ్లు లేదా పాల వంటి ద్రవాలు పడుతూ ఉంటాయి. అలాంటి వాటిని వెంటనే గుడ్డతో తుడిచి శుభ్రం చేయాలి. లేకపోతే వంటిల్లు మొత్తం చెమ్మగా అయిపోతుంది.
ఒకే సారి కుదరదు..
చాలా మంది వంటిల్లును ఒకే సారి శుభ్రం చేద్దామనుకుంటారు. కానీ చాలా సందర్భాలలో ఇది సాధ్యపడదు. అందువల్ల స్టవ్‌ను ఒక సారి.. మైక్రోఓవెన్‌ను ఒక సారి.. ఇలా ఒకో సారి ఒకో పరికరాన్ని తుడుచుకోవటం మంచిది.
అన్ని ఒక చోట వద్దు..
వంటింట్లో కొన్ని ప్రదేశాల్లో వండిన ఆహారం పెడతాం. ఇంకో ప్రదేశంలో సామాన్లు ఉంచుతాం.. వీటన్నింటినీ శుభ్రపరచటానికి వేర్వేరు గుడ్డలను వాడాలి. గట్టును తుడిచిన గుడ్డలతో ఫ్రిజ్‌ను తుడిస్తే- గట్టు మీద ఉన్న మలినాలు ఫ్రిజ్‌కు అంటుకుం టాయి.
ప్రతి భోజనం తర్వాత..
భోజనం అయిపోయిన వెంటనే ఖాళీ గిన్నెలను డిష్‌వాషర్‌లో లేదా సింక్‌లో ఉంచాలి. వంటింట్లో మిగిలిన ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. అదే విధంగా రాత్రి నిద్రపోయేముందు వంటింటిని శుభ్రం చేసి పడుక్కొవాలి. దీని వల్ల ఉదయాన్నే లేచిన వెంటనే వంటిల్లు శుభ్రంగా ఉంటుంది.