Heroines Shopping Mantra : ముద్దుగుమ్మల షాపింగ్‌ మంత్ర

ABN , First Publish Date - 2023-09-17T05:22:21+05:30 IST

‘బై వన్‌ గెట్‌ వన్‌’ ‘50 శాతం డిస్కౌంట్‌’ ఇలాంటి ఆఫర్లు చూడగానే అవసరం ఉన్నా లేకున్నా కొనేయడం మధ్యతరగతి వాళ్లకు అలవాటే. కొంతమంది ఏం కొనాలన్నా బడ్జెట్లు వేసుకొంటారు. కథానాయికలకు ఇవేం అవసరం లేదు. ఎందుకంటే ఒక్కో సినిమాకి కోట్ల రూపాయల్లో పారితోషికం

Heroines Shopping Mantra : ముద్దుగుమ్మల  షాపింగ్‌ మంత్ర

‘బై వన్‌ గెట్‌ వన్‌’ ‘50 శాతం డిస్కౌంట్‌’ ఇలాంటి ఆఫర్లు చూడగానే అవసరం ఉన్నా లేకున్నా కొనేయడం మధ్యతరగతి వాళ్లకు అలవాటే. కొంతమంది ఏం కొనాలన్నా బడ్జెట్లు వేసుకొంటారు. కథానాయికలకు ఇవేం అవసరం లేదు. ఎందుకంటే ఒక్కో సినిమాకి కోట్ల రూపాయల్లో పారితోషికం తీసుకొంటుంటారు. వాళ్లకు డిస్కౌంట్లు, రిబేట్లతో పనేముంది? కంటికి నచ్చితే కొనేయడమే. మరి.. షాపింగ్‌ విషయంలో కథానాయికల ఆలోచన ఎలా ఉంటుంది? వాళ్లు షాపింగ్‌కి వెళ్తే ఏం కొంటారు? వాళ్లకూ బడ్జెట్లు ఉంటాయా? తమన్నా, కీర్తి సురేశ్‌, రష్మిక, శ్రీలీల, శ్రుతిహాసన్‌, జాన్వీ కపూర్‌.. వీళ్ల షాపింగ్‌ మంత్ర ఏమిటి?

బడ్జెట్‌ దాటకూడదు!

‘‘నేను షాపింగ్‌కి వెళ్తే పెద్దగా హడావుడి ఉండదు. ఏం కొనాలి? ఏది వద్దు? అనే విషయాలపై నాకు ముందే అవగాహన ఉంటుంది. టాప్‌, జీన్స్‌ కొనాలనుకొంటే, ఆ సెగ్మెంట్‌లోనే అడుగుపెడతాను. మిగిలినవాటిని పట్టించుకోను. ఓ గంటలోనే నా దండయాత్ర ముగిసిపోతుంది. ఎందుకంటే క్రౌడ్‌లో ఉండడం నటీనటులకు చాలా ఇబ్బంది. అందుకే వీలైనంత త్వరగా ముగిస్తా. షాపింగ్‌ కూడా ఓ బడ్జెట్‌ ఉంటుంది. దాన్ని దాటకూడదు. ఒక్కోసారి బ్రాండెడ్‌ వస్తువులపై కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సివస్తుంది. అలాంటప్పుడు మొహమాటపడకూడదు. ఎందుకంటే నాణ్యతని బట్టే వస్తువు ధర ఉంటుంది’’.

- తమన్నా

సమ్‌థింగ్‌ స్పెషల్‌

‘‘అమ్మాయిలకు షాపింగ్‌ అంటే చాలా పిచ్చి అనుకొంటారు. కానీ నాలాంటి వాళ్ల కూడా ఉంటారు. నాకు షాపింగ్‌ అంటే బోర్‌. గంటలు గంటలు తిరిగి తిరిగి ఏం కొంటారో నాకు అర్థం కాదు. ఫారెన్‌లో షూటింగ్‌కి వెళ్లినప్పుడు మఽఽధ్యలో బ్రేక్‌ ఇస్తే.. షాపింగ్‌కి వెళ్తాను. నేను కొనేవాటిలో గాగుల్స్‌ ఎక్కువ. పైగా దాని గురించి ఎక్కువ రిసెర్చ్‌ చేయడం కూడా ఏం ఉండదు. కంటికి నచ్చితే కొంటాను. అంతకు మించి తర్జనభర్జనలు ఏం పడను. కొన్ని యాంటిక్‌ పీసెస్‌ ఉంటాయి. అవి అరుదుగా దొరికే వస్తువులు. అలాంటివి కొంటుంటా. అయినా ఇప్పుడు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడం ఎక్కువైపోయింది. అక్కడ కూడా అవసరానికి మించి కొనడం, ఏమాత్రం ఉపయోగం లేకపోయిననా ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం ఇష్టం ఉండదు’’.

- కీర్తి సురేశ్‌

బోర్‌ కొట్టినప్పుడల్లా..

‘‘నాకు బోర్‌ కొట్టినప్పుడల్లా షాపింగ్‌ చేస్తుంటా. ‘నీ రెమ్యునరేషన్‌ అంతా షాపింగ్‌కే సరిపోతుంది’ అని నాన్న తిడుతుంటారు. స్టైలింగ్‌, ప్యాషన్‌పై ఎక్కువ ఖర్చు చేస్తా. కాస్మొటిక్స్‌ గూడ్స్‌ కొన్ని విదేశాల నుంచి వస్తుంటాయి. ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తున్నప్పుడు ఏం నచ్చినా వెంటనే ఆర్డర్‌ పెడుతుంటాను. అయితే ఈ అలవాటు మంచిది కాదు. కాస్త కంట్రోల్‌లో ఉంచాలి. కానీ కొన్న ప్రతీ వస్తువుని భద్రంగా, ప్రేమగా చూసుకోవడం నాకు అలవాటు. కొంతమంది ధర ఎంత ఎక్కువైతే అంత నాణ్యమైనవి అనుకొంటారు. నేను మాత్రం అందుకు విరుద్ధం. బ్రాండ్‌ పేరు చూసి పడిపోను. వస్తువు నాణ్యత, ధర రెండూ చూస్తా’’.

- జాన్వీ కపూర్‌

అన్నీ అమ్మతోనే

‘‘ఇప్పుడంటే హీరోయిన్‌ అయిపోయాను. డబ్బులు సంపాదిస్తున్నాను. కానీ నిన్నా మొన్నటివరకూ అమ్మ ఇచ్చిన డబ్బులతోనే నా షాపింగ్‌. ప్రతీ పైసా ఆచి తూచి ఖర్చు పెట్టేదాన్ని. ఇప్పటికీ ఆ పద్ధతి మారలేదు. నేనింకా తల్లి చాటు బిడ్డనే. నాకు ఏం కావాలన్నా అమ్మే చూసుకొంటుంది. నెల ఖర్చులకు అమ్మ దగ్గర డబ్బులు తీసుకొంటుంటా. నాకు అదే ఆనందం. షాపింగ్‌కి వెళ్లాలన్నా అమ్మ తోడు ఉండాల్సిందే. నాకు ఏం కావాలో నాకంటే తనకే బాగా తెలుసు. ఇప్పుడు సినిమా షూటింగుల నిమిత్తం విదేశాలకు వెళ్తున్నా. అందుకే అమ్మకు ఏం కావాలో నేను కొని తీసుకెళ్తున్నా. ఆర్నమెంట్స్‌పై నాకు పెద్దగా ఆసక్తి లేదు. కాస్ట్యూమ్స్‌, నా స్టైలింగ్‌ అన్నీ సినిమావాళ్లు చూసుకొంటారు. నేనైతే ఎక్కువగా హ్యాండ్‌ బ్యాగ్స్‌ కొంటుంటా’’.

- శ్రీలీల

ప్రతీ పైసా లెక్కే!

‘‘నేను స్టార్‌ హీరో ఇంటి నుంచి వచ్చాను. నా చుట్టూ సౌకర్యాలే. కానీ డబ్బు విలువ నాకు బాగా తెలుసు. నా దృష్టిలో ప్రతీ పైసా లెక్కే. అనవసరమైన వస్తువులపై ఖర్చు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. మా నాన్న కూడా తరచూ అదే చెబుతుంటారు. షాపింగ్‌కి వెళ్తే.. మనసు అదుపు తప్పుతుంటుంది. అవసరం లేని వస్తువులూ కొనేయాలని చూస్తుంటాం. కానీ అలాంటప్పుడే ఆలోచన అవసరం. గాడ్జెట్స్‌పై నేనెక్కువ ఖర్చు పెట్టను. ఎందుకంటే.. ప్రతీ యేడాది కొత్త మోడల్‌ అందుబాటులోకి వస్తుంది. దాంతో పాత మోడల్‌ ధర మారిపోతుంటుంది. ఫోన్లు కూడా తరచూ మార్చను. నా దుస్తులకు సంబంధించి ప్రత్యేకంగా డిజైనర్‌ ఉంది. కాబట్టి నాకు ఎలాంటి దుస్తులు నప్పుతాయో తనే చూసుకొంటుంది. షాపింగ్‌కి వెళ్తే.. నాకంటే మా ఇంట్లోవాళ్లకు ఏం కావాలో అది కొంటుంటాను’’.

- శ్రుతిహాసన్‌

పంచడంతోనే సరి!

‘‘నాకు బహుమానాలు తీసుకోవడం కంటే ఇవ్వడమే బాగా ఇష్టం. నా టీమ్‌కి ఎప్పుడూ ఏదో ఒకటి ఇవ్వడంలో నాకు ఆనందం ఉంటుంది. షాపింగ్‌కి వెళ్లినా వాళ్లే గుర్తొస్తారు. నా చేతులతో కొని ఇవ్వడంతో ఆ తృప్తి ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడల్లా నేను షాపింగ్‌ చేస్తా.నేనైతే హ్యాండ్‌ బ్యాక్స్‌, కాస్మొటెక్స్‌పై ఎక్కువ ఖర్చు పెడతాను. ఎందుకంటే ఇవన్నీ నాకు చాలా అవసరం. ఇంట్లో ఎన్ని హ్యాండ్‌ బ్యాగ్స్‌ ఉన్నాయో లెక్కే లేదు. నా చెప్పుల జతల కోసం ఓ ఇల్లే కట్టొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే ఈ పిచ్చి వదులుతోంది. షాపింగ్‌కి వెళ్తే.. కాస్త ఆలోచించి కొంటున్నా’’.

- రష్మిక

Updated Date - 2023-09-17T05:22:21+05:30 IST