Good Posture : శరీరాకృతి ఇలా..
ABN , First Publish Date - 2023-10-10T23:40:23+05:30 IST
కంప్యూటర్, సెల్ ఫోన్లను వాడే క్రమంలో మనం అనుసరించే శరీర భంగిమలు క్రమం తప్పితే, పోశ్చర్ సమస్యలు కూడా తప్పవు.
కంప్యూటర్, సెల్ ఫోన్లను వాడే క్రమంలో మనం అనుసరించే శరీర భంగిమలు క్రమం తప్పితే, పోశ్చర్ సమస్యలు కూడా తప్పవు. ఇలా జరగకుండా ఉండాలంటే....
కంప్యూటర్ ముందు: కుర్చీలో వెనక్కి వాలి, మెడను విలాసంగా వెనక్కి వాల్చేసి, ముంజేతితో మౌస్ కదుపుతూ మానిటర్ వైపు చూస్తూ ఎక్కువ సమయం గడుపుతాం! ప్రతి కార్యాలయంలో కనిపించే దృశ్యమే ఇది. కానీ మన శరీరం ఇలాంటి భంగిమలో గంటలతరబడి ఉండిపోయేటందుకు ఉద్దేశించినది కాదు. కాబట్టే మెడ, భుజాలు, వెన్ను నొప్పులు మొదలవుతున్నాయి.
మెడ కోణం తప్పితే: సాధారణంగా తల నాలుగున్నర నుంచి ఐదు కిలోల బరువుంటుంది. భుజాల మీద సక్రమంగా బ్యాలెన్స్ చేయగలిగితే బరువు సమంగా పరుచుకుని, ఎలాంటి సమస్య తలెత్తదు. తల ఏ కొంచెం ముందుకు, వెనక్కి వంగినా వెన్ను మీద 30 కిలోల భారం పడుతుంది. అవసరానికి మించి వెన్ను మీద పడే ఈ భారం వల్ల వెన్ను సమస్యలు మొదలవుతాయి. మానిటర్ వైపు మెడను చాపి, లేదా మెడను వెనక్కి వాల్చి, పక్కకు వంచి పని చేసేవారు ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి.
వేళ్లతో కష్టాలు: ట్యాబ్, స్మార్ట్‌ఫోన్ వాడేటప్పుడు టైప్ చేయడం కోసం వేళ్లను ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇలా ఎక్కువ సమయం గడిపితే వేళ్ల మధ్య మృదులాస్థి, కీళ్లు వాపులకు లోనవుతాయి. వేళ్లు, మణికట్టు కదిలించడంలో ఇబ్బంది, చప్పుళ్లు మొదలవుతాయి. కేవలం బొటనవేలితోనే టైప్ చేసేవాళ్లకు కూడా ఆ వేలిపై ఒత్తిడి తప్పదు. ఇలా జరగకుండా ఉండాలంటే అదే పనిగా గంటలతరబడి టైప్ చేయడం మానుకోవాలి. స్వల్ప విరామం ఇస్తూ కొనసాగించాలి.
ముందుకు వంగి: సెల్‌ఫోన్ వాడేటప్పుడు ఎక్కువగా భుజాలు ముడిచి, మెడను ముందుకు వంచేస్తాం. ఈ భంగిమలో వెన్ను నిటారుగా లేకుండా క్రమం తప్పుతుంది. నాడీ వ్యవస్థను పరిరక్షిస్తూ, ముఖ్యమైన కొన్ని జీవక్రియలను నియమబద్ధంగా జరిపించే వెన్ను ఒత్తిడికి లోనైతే ఎన్ని ఎన్నో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.
శరీర భంగిమ: అవయవాల్లో ఏ ఒక్క దాని భంగిమ క్రమం తప్పినా ఆ ప్రభావం మొత్తం శరీరం మీద పడుతుంది. కండరాలు, ఎముకలు, ఎముకల మధ్య ఉండే మృదులాస్థి, టెండాన్లు, నరాలు...ఇలా దాదాపుగా అన్ని అవయవాలూ ఒత్తిడికి లోనవుతాయి. కాబట్టి ఎలాంటి సాంకేతిక పరికరాలు వాడుతున్నా శరీర భంగిమ మీద దృష్టి పెట్టాలి.