’Glenn, Vinni ‘ love story : క్రికెట్ అభిమానులకు... ‘విని’ పెట్టిన మెత్తని వాత
ABN , First Publish Date - 2023-11-21T23:09:58+05:30 IST
అపజయంతో ఉక్రోషం, ఆవేశం, అవమానాలకు లోనవడం సహజమే! అలాగని విజేతలతో పాటు, వాళ్ల కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియాల్లో దుమ్మెత్తిపోయడం ఎంత వరకూ సమంజసం? 2023 క్రికెట్ ..

అపజయంతో ఉక్రోషం, ఆవేశం, అవమానాలకు లోనవడం సహజమే! అలాగని విజేతలతో పాటు, వాళ్ల కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియాల్లో దుమ్మెత్తిపోయడం ఎంత వరకూ సమంజసం? 2023 క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ భార్య, భారతీయ మూలాలున్న విని రామన్, భారతీయ క్రికెట్ అభిమానుల నుంచి హేట్ మెసేజీలు తప్పలేదు. వాటికి ఆవిడ ఇచ్చిన సమాధానంతో పాటు, గ్లెన్, వినిల ప్రేమ కథ గురించి కూడా తెలుసుకుందాం!
ప్రొఫెషనల్ క్రికెట్ ప్రపంచంలో క్రీడాకారుల పర్‌ఫార్మెన్స్, వాళ్ల విజయాల మీదే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంటుంది. కానీ ఆ క్రికెటర్ల క్రీడా జీవితంలో ప్రేమ కథలూ, అందమైన అనుబంధాలూ దాగి ఉంటాయి. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, చెన్నైకి చెందిన విని రామన్‌లు సరిహద్దులనూ, సంస్కృతులనూ అధిగమించి తమ ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించారు.
తొలి పరిచయం
గ్లెన్ మ్యాక్స్‌వెల్, విని రామన్‌ల ప్రేమ కథ 2013లో ఒక మెల్‌బోర్న్ స్టార్స్ ఈవెంట్‌లో ఒకర్నొకరు కలవడంతో మొదలైంది. 2017 ఆగష్టులో విని తన ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యాక్స్‌తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేయడంతో వాళ్ల ప్రేమ కథ గురించిన ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత తరచూ మ్యాక్స్‌వెల్‌తో ఫొటోలను షేర్ చేస్తూ, అతన్ని తన ఫ్రెండ్‌గా చెప్పుకుంటూ వచ్చింది విని. కానీ వాళ్లిద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం నడుస్తోందని అభిమానులందరూ గ్రహించేశారు. దానికి తోడు ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్ ఫంక్షన్‌కు ఇద్దరూ జంటగా హాజరై వాళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని బహిరంగంగా చాటుకున్నారు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ మొట్టమొదటిసారిగా వాళ్ల ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, వాళ్ల ప్రేమ కథను అభిమానులతో పంచుకున్నాడు. ఆ తర్వాత వాళిద్దరి ప్యారిస్ ట్రిప్, సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఫొటోలతో వాళ్లిద్దరి మధ్య ఉన్న గాఢమైన అనుబంధం ప్రపంచం మొత్తానికీ తెలిసింది. 2022లో రెండోసారి ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ ఫంక్షన్‌కు జంటగా హాజరైన తర్వాత, తమ ఎంగేజ్‌మెంట్ గురించి మ్యాక్స్‌వెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు.
వినూత్నమైన ప్రపోజల్
ప్రేమించిన వ్యక్తికి ప్రపోజ్ చేసే సందర్భం ఎంతో హృద్యంగా, ప్రత్యేకంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ప్రేమించిన వ్యక్తి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ఆ ప్రపోజల్‌ను ప్లాన్ చేసుకుంటారు. కానీ మ్యాక్స్‌వెల్ వినికి ప్రపోజ్ చేసిన విధానం ఇందుకు పూర్తి భిన్నం. అతను ఒక పబ్లిక్ పార్కులో అందరూ చూస్తుండగా మోకాళ్ల మీద కూర్చుని వినిని ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత 2022 మార్చిలో ఇద్దరూ పెళ్లితో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. అయితే మార్చి 22న క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఈ జంట, విని పుట్టిన తమిళనాడులోని చెన్నైలో మార్చి 27న తమిళ సంప్రదాయంలో రెండోసారి పెళ్లి చేసుకోవడం విశేషం. వీళ్లిద్దరూ ఈ మధ్యే తల్లితండ్రులయ్యారు. పుట్టిన మగ బిడ్డకు లోగన్ మ్యావెరిక్ మ్యాక్స్‌వెల్ అనే పేరు పెట్టుకున్నారు.
మెత్తని వాత
భారత్‌ను ఓడించి, 2023 క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ భార్య విని రామన్‌కూ హేట్ మెసేజ్‌లు తప్పలేదు. ఆ మెసేజ్‌లన్నిటికీ కలిపి ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా బదులిచ్చింది. ‘‘నేను భారతీయురాలినే అయినా, పుట్టి పెరిగిన దేశాన్నీ, మరీ ముఖ్యంగా భర్త, నా బిడ్డకు తండ్రి అయిన వ్యక్తి ఆడుతున్న టీమ్‌ను నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. టేక్ ఎ చిల్ పిల్’’ అని మెత్తగా వాత పెట్టింది విని.
విని విశేషాలు
తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన విని రామన్, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోనే పుట్టి పెరిగింది. ఆవిడ తల్లితండ్రులు వెంకట్, విజయలక్ష్మి రామన్‌లు ఆస్ర్టేలియాలో స్థిరపడ్డారు. వినికి మధు అనే చెల్లెలు కూడా ఉంది. భారతీయ మూలాలను గర్వకారణంగా భావించే విని, ఇప్పటికీ హిందూ సంప్రదాయాలను ఆచరిస్తూ ఉంటుంది. పండుగలు, వేడుకలనూ జరుపుకుంటూ ఉంటుంది. ఆవిడ ఇంగ్లీషు ఎంత ధారాళంగా మాట్లాడుతుందో, తమిళం కూడా అంతే ఽధారాళంగా మాట్లాడగలుగుతుంది. మెడికల్ సైన్సెస్ పూర్తి చేసిన విని, ప్రస్తుతం ఒక ప్రముఖ ఆస్పత్రిలో ఫార్మసి్‌స్టగా పని చేస్తోంది. ఆరోగ్యం పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండే ఆవిడ, యోగా సాధన చేయడంతో పాటు, తన ఫిట్‌నెస్ రొటీన్‌కు సంబంధించిన వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. విని, మ్యాక్స్‌వెల్ అర్థాంగి మాత్రమే కాదు, అతని అభిమాని కూడా! క్రికెట్‌ను అనుసరిస్తూ, భర్త పాల్గొనే ప్రతి మ్యాచ్‌కూ హాజరవుతూ, అతన్నీ మొత్తం బృందాన్నీ ఉత్తేజపరుస్తూ ఉంటుంది. అతనితో పాటు స్టేడియంకు చేరుకుని, ప్రత్యక్షంగా ఆటను వీక్షిస్తూ ఉంటుంది. విని రామన్‌కు సోషల్ మీడియాలో భారీ ఫోలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడకు రెండున్నర లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విట్టర్‌లో 50 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆవిడ ఫ్యాషన్ సెన్స్‌కు కూడా వేల మంది అభిమానులున్నారు.