ఎత్తయిన యుద్ధ క్షేత్రంలో మహిళా కెప్టెన్
ABN , First Publish Date - 2023-01-18T23:01:08+05:30 IST
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం ‘సియాచిన్ గ్లేసియర్’. ఎముకలు గడ్డ కట్టించే అలాంటి ప్రదేశంలో భారత సైౖన్యం, ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్‌లో కెప్టెన్‌గా మొట్టమొదటిసారిగా ఓ మహిళా అధికారి శివ్ చౌహాన్ ఎంపికై చరిత్ర సృష్టించింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం ‘సియాచిన్ గ్లేసియర్’. ఎముకలు గడ్డ కట్టించే అలాంటి ప్రదేశంలో భారత సైౖన్యం, ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్‌లో కెప్టెన్‌గా మొట్టమొదటిసారిగా ఓ మహిళా అధికారి శివ్ చౌహాన్ ఎంపికై చరిత్ర సృష్టించింది. ఆ స్థాయికి చేరుకునే క్రమంలో సాగిన ఆవిడ జీవిత ప్రయాణమిది.
రాజస్థాన్‌కు చెందిన చౌహాన్, బెంగాల్ శాపర్‌గా, గ్లేసియర్‌లో విభిన్న పోరాట ప్రావీణ్యాలకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగానికి అధిపతి. భూమి మీదున్న అన్ని యుద్ధక్షేత్రాలన్నింటికంటే సియాచిన్ గ్లేసియర్ అత్యంత ఎత్తులో ఉంటుంది. ఇక్కడి తాపమానాలు మైనస్ 50 డిగ్రీల సెల్షియ్‌సకు చేరుకుంటూ ఉంటాయి. 1984లో ఇదే ప్రాంతంలో భారతదేశం, సియాచిన్‌లు తలపడ్డాయి. ఆపరేషన్ మేఘదూత్ ద్వారా భారత్ ఆ ఎత్తైన ప్రదేశం మీద ఆధిపత్యం సాధించగలిగింది. ప్రస్తుతం చౌహాన్ సముద్ర మట్టానికి 15 వేల 800 అడుగుల ఎత్తులో ఉన్న కుమార్ పోస్టులో విఽధులు నిర్వహిస్తోంది. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ సైతం చౌహాన్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేయడం విశేషం. చౌహాన్ నియామకాన్ని రక్షణ మంత్రి ఒక ప్రోత్సాహక చర్యగా అభివర్ణించడంతో పాటు, చౌహాన్‌కు ఆయన అభినందనలు తెలియచేశారు.
బాల్యంలోనే బీజాలు...
సియాచిన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదగడానికి చౌహాన్ దృఢమైన వ్యక్తిత్వం, పట్టుదల, నిబద్ధతలే కారణం. 11 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన చౌహాన్ బాధ్యతలను తల్లి స్వీకరించింది. బాల్యం నుంచే సైన్యంలో చేరాలనే దృఢమైన పట్టుదల కలిగిన చౌహాన్ రాజస్థాన్ రాజధాని ఉదయ్‌పూర్‌లో బడి చదువు పూర్తి చేసింది. అక్కడి ఎన్‌జెఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. తర్వాత 2021లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి, ఆనర్స్‌లో డిగ్రీ పొందింది. అలా ఇంజనీరింగ్ రెజిమెంట్‌లో స్థానం దక్కించుకుంది. కార్ప్స్‌లో... బాంబే శాపర్స్, బెంగాల్ శాపర్స్, మద్రాస్ శాపర్స్ అనే మూడు విభాగాలుంటాయి. చౌహాన్ బెంగాల్ శాపర్స్ అనే బెంగాల్ ఇంజనీరింగ్ గ్రూపుకు బాధ్యత వహిస్తోంది. సియాచిన్‌లో కెప్టెన్ నియామకానికి ముందు చౌహాన్, బలమైన చలి గాలులు, ఫ్రాస్ట్‌బైట్‌లకు వీలుండే ప్రమాదకరమైన శియాచిన్‌లో సమర్థంగా విధులు నిర్వహించడంలో, కఠినమైన శిక్షణ పొందడం విశేషం.