Family : గురజాడ గీతమే నాకు ఆదర్శం
ABN , First Publish Date - 2023-10-02T02:53:35+05:30 IST
విదేశాంగ శాఖ తరుపున ఇతర దేశాల రాయబార కార్యాలయాల్లో నియమితులైన వారిని తొలుత మూడవ కార్యదర్శి (లాంగ్వేజ్ ట్రైనీ)గా నియమిస్తారు.
‘‘ఏ దేశంలో పని చేసినా భారతదేశ ఔన్యత్యాన్ని ఇనుమడించేలా విధి నిర్వహణ చేస్తాను’’ అంటున్నారు పూసపాటి సాహిత్య. సుప్రసిద్ధ కథకుడైన పూసపాటి కృష్ణంరాజు మనుమరాలైన ఆమె 2022లో సివిల్స్‌లో 24వ ర్యాంక్ సాధించి, ఫారిన్ సర్వీ్‌సను ఎంపిక చేసుకున్నారు. శిక్షణ అనంతరం జర్మనీలోని బెర్లిన్ రాయబార కార్యాలయంలో థర్డ్ సెక్రెటరీగా... వచ్చే నెలలో విధుల్లో చేరబోతున్నారు. విశాఖపట్నం సమీపంలోని ఎండాడలో ఉంటున్న తల్లితండ్రుల వద్దకు వచ్చిన సాహిత్య తన శిక్షణ, చేపట్టబోయే విధుల గురించి ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘కిందటి ఏడాది సివిల్స్‌లో విజయం సాధించిన 450 మందిలో 36 మందిమి ఐఎ్‌ఫఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీ్‌స)ను ఎంచుకున్నాం. మా బృందంలో 14 మంది అమ్మాయిలం ఉన్నాం. మా మూడునెలల శిక్షణ గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఫిజికల్ ఏక్టివిటీలో భాగంగా వారం రోజుల పాటు రోజూ గంట సేపు యోగా, డ్యాన్స్ కమ్ ఎక్సర్‌సైజ్ చేసేవాళ్లం. ఒక్కో వారం ఒక్కో రకం ఎక్సర్‌సైజ్‌లు ఉండేవి. వీటితో మా అందరి మధ్యా సాన్నిహిత్యం ఎంతగానో పెరిగింది. ఉదయం తొమ్మిది గంటలకు అకడమిక్ క్లాసులు ప్రారంభమై, సాయంత్రం వరకూ కొనసాగేవి. ఈ తరగతుల్లో అనేక అంశాలు బోధించేవారు. నాయకత్వ శిక్షణ ఇందులో ప్రధానమైనది. సివిల్స్ అధికారులు తమ నాయకత్వ నైపుణ్యాలతో ప్రజా శ్రేయస్సుకు ఎలా దోహదపడవచ్చో చెప్పేవారు. కంప్యూటర్ కోర్సు కూడా ఉండేది. అలాగే న్యాయ నిర్వహణ, ఆర్థిక స్థితిగతులు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లాంటి వాటి మీద పూర్తి అవగాహనకు ఈ శిక్షణ ఉపయోగపడింది. ఈ తరగతులను సర్వీ్‌సలో ఉన్న సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, మేధావులు నిర్వహించేవారు. వివిధ ఆపరేషన్స్‌లో పని చేసిన వారు హాజరై, తమ అనుభవాలను తెలియజేసేవారు. వీరప్పన్ కేసును పరిష్కరించిన ఐపిఎస్ అధికారి విజయకుమార్ వివరించిన అనుభవాలు ఎంతో అవగాహన కలిగించాయి.
జర్నల్ రైటింగ్‌తో...
ఫారిన్ సర్వీ్‌సకు ఎంపికైనవారికి ప్రతిరోజూ వారి అనుభవాలను, అనుభూతులను డైరీ మాదిరిగా రాసే ‘జర్నల్ రైటింగ్’ అనే విఽధానం కూడా ఎంతో ఉపయోగపడింది. మమ్మల్ని బృందాలుగా విభజించారు. ప్రతి బృందానికీ ఒక ట్యూటర్ ఉండేవారు. వారికి మేము రాసినవి అందజేసే వాళ్లం. అలాగే దేశానికి ఎంతో సేవ చేస్తున్న అనేక సంస్థలను సందర్శించే సమయంలో కలిగిన అవగాహన మన దేశం మీద ప్రేమను రెట్టింపు చేసింది. న్యూక్లియర్ కేంద్రాన్ని చూసినప్పుడు, సబ్ మెరైన్‌లో అధికారికంగా పర్యటించినప్పుడు గొప్ప అనుభూతి కలిగింది
అందుకే జర్మన్ భాష ఎంచుకున్నా...
ఇతర దేశాల వారితో ఎలా ప్రవర్తించాలి? అక్కడి నిబంధనలు, కోడ్ ఆఫ్ కాండక్ట్ లాంటివి తెలియజేసేవారు. ఇక చైనీన్, రష్యన్, అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, హిబ్రూ, పర్షియన్, జపనీస్ తదితర విదేశీ భాషల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలి. రాయబార కార్యాలయాల్లో పనిచేసేవారికి ఇది తప్పనిసరి. దీని కోసం ట్యూటర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. నేను జర్మన్ భాష నేర్చుకోవడానికి సంసిద్ధత తెలియజేశాను. ఇతర భాషలకన్నా సులభంగా వస్తుందని తెలియడమే దీనికి కారణం.
మొదటి పోస్టింగ్ మూడో కార్యదర్శిగా...
విదేశాంగ శాఖ తరుపున ఇతర దేశాల రాయబార కార్యాలయాల్లో నియమితులైన వారిని తొలుత మూడవ కార్యదర్శి (లాంగ్వేజ్ ట్రైనీ)గా నియమిస్తారు. సీనియర్లు మొదటి కార్యదర్శిగా, ఆ తరువాతి స్థాయి సీనియారిటీ ఉన్నవారు రెండవ కార్యదర్శిగా ఉంటారు. నేను ఆరు నెలల పాటు జర్మన్ భాష నేర్చుకోబోతున్నాను. అందుకోసం ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇతర దేశాలలో నియమితులైన నాలాంటి వారికి ఆ దేశంలో ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. రక్షణకు సంబంధించిన ఏర్పాట్లు మన దేశానికి చెందిన వారే అక్కడ చూస్తారు. ఉచిత నివాస వసతి ఉంటుంది. ప్రధానంగా పాస్‌పోర్టులు హ్యాండిల్ చెయ్యడం లాంటి విధులను ప్రారంభంలో చేయవలసి ఉంటుంది. దీని కోసం ‘మిషన్ అటాచ్‌మెంట్’ అనే కార్యక్రమాన్ని ముందుగా అందరితో చేయిస్తారు. అంటే ఐఎ్‌ఫఎ్‌సకు ఎంపికైనవారు తమకు కేటాయించిన దేశం వెళ్లే ముందు... ఏదో ఒక దేశానికి ‘మిషన్ అటాచ్‌మెంట్’ పేరిట వెళ్ళి... అక్కడి రాయబార కార్యాలయం పని తీరును పరిశీలించాలి. ఈ విధంగా నేను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబి, దుబాయి ప్రాంతాలకు వెళ్లి అక్కడి రాయబార కార్యాలయాలను పరిశీలించాను. ఆ అనుభవం జర్మనీలో ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చాలా దేశాల రాజధాని నగరాల్లో రాయబార కార్యాలయాలు, వేరే ప్రాంతంలో హైకమిషన్ కార్యాలయాలు... ఇలా రెండేసి ఉంటాయి. ఇవి రెండూ ఒకదానికొకటి అను సంధానం అయి ఉంటాయి. ‘టెస్ట్ అటాచ్‌మెంట్’ అనే మరో కార్యక్రమం ద్వారా మన విదేశాంగ మంత్రిత్వ శాఖ పని తీరును పరిశీలించే అవకాశం కల్పించారు. ఇది కూడా విదేశాలలో పని చేసే సమయంలో ఎంతో ఉపయుక్తం. నేను ఢిల్లీ రాయబార కార్యాలయంలోని సౌత్‌బ్లాక్‌లో కొంతకాలం పరిశీలన చేశాను.
జీ 20 ఎంతో అనుభవాన్ని ఇచ్చింది
భారత్‌లో జరిగిన జీ-20 సదస్సుకు అన్ని దేశాల నుంచి ఎంతోమంది దేశాధినేతలు వచ్చారు. ఇతర దేశాల వారికి లైజన్ అధికారులుగా, ప్రొటోకాల్ అధికారులుగా, అలాగే ట్రాన్స్‌పోర్ట్ డెలిగేట్స్ విభాగం లాంటి వాటిలో ఐఎ్‌ఫఎ్‌సను ఎంపిక చేసుకున్నవారికి అవకాశం కల్పించారు. ఆయా దేశాధినేతల కదలికలను, హావభావాలను దగ్గరగా చూసే అవకాశం మాకు కలిగింది. మాకు వివిధ దేశాలలో పోస్టింగ్స్ వచ్చిన సమయంలోనే జరిగిన ఈ సదస్సు అందించిన అనుభవం భవిష్యత్తులో మా కర్తవ్య నిర్వహణకు ప్రేరణగా నిలుస్తుంది.
అది అందరికీ స్ఫూర్తిదాయకం...
మా తాతయ్య పూసపాటి కృష్ణంరాజు మంచి కఽథకుడు. మన సాహిత్యం నాకు ఎంతో ఇష్టం. ‘దేశాన్ని ప్రేమించాలి. ప్రపంచాన్ని ప్రేమించాలి. సమస్త మానవాళిని ప్రేమించాలి’ అనే వసుధైక భావన నాకు నచ్చుతుంది. గురజాడ రాసిన ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’ గీతం నాకు ఆదర్శం. విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నవారందరికీ స్ఫూర్తిదాయకం.’’
పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ,
భీమునిపట్నం రూరల్.గ్రామాల సందర్శనతో...
శిక్షణ పొందినవారిని ఆరుగురు చొప్పున ఒక బృందంగా ఏర్పాటు చేసి, వివిధ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలకు ‘విలేజ్ విజిట్’ పేరిట తీసుకువెళ్తారు. అక్కడి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి వీలు కల్పిస్తారు. దక్షిణాది వారిని ఉత్తరాది రాష్ట్రాలకు, ఉత్తరాదివారిని దక్షిణాది రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటారు. నేను హరియానా రాష్ర్ట్రంలోని రోహ్‌తక్ జిల్లాకు వెళ్ళి, అక్కడి పరిస్థితులను గమనించాను ఇలా మా బృందాలలోని సభ్యులందరం ఆయా రాష్ర్టాలలో అభివృద్ధి, ప్రజల జీవనశైలి, పరిపాలన, యువత ఆలోచనా సరళి, స్వయంసహాయక సంఘాల పనితీరు లాంటివి పరిశీలించాం. పలు అంశాలను రికార్డ్ చేసి, ప్రభుత్వానికి అందించాం.
తక్కువ నీరు, తక్కువ తిండితో...
తక్కువ తిండి, తక్కువ నీరు ఉంటే మనిషి ఏ విధంగా జీవిస్తాడని ప్రత్యక్షంగా తెలుసుకోవడం కూడా మా శిక్షణలో ప్రధానాశం. హిమాలయ ప్రాంతంలోని సాంక్రి జిల్లా కేధార్‌కంఠ శిఖరాన్ని ఎక్కిన సందర్భం నాకు ఎన్నో పాఠాలను నేర్పింది. గ్రూపుగా శిఖరారోహణ చేస్తున్నప్పుడు... అందరి మధ్యా సమన్వయం ఎలా ఉండాలి? తక్కువ ఆహారంతో రోజులు ఎలా గడపాలన్న విషయాలు తెలుసుకున్నాం. అలాగే గుజరాత్‌లోని కేవడియా ప్రాంతంలో అతి పెద్దదైన సర్దార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించడం కూడా మంచి అనుభవం.