Dry fruits with chicken : చికెన్‌తో డ్రైఫ్రూట్స్ దోస్తీ
ABN , First Publish Date - 2023-03-10T23:36:55+05:30 IST
చికెన్‌తో మాత్రమే ఆహారం తయారు చేసుకోవటం సాధారణం. అయితే చికెన్‌కు మరింత కొత్త ఫ్లేవర్ రావాలంటే మాత్రం ఓ సారి ఈ డ్రైఫ్రూట్స్‌తో కలిపి వండుకోవాలి. బాదం చికెన్ కర్రీ,
చికెన్‌తో మాత్రమే ఆహారం తయారు చేసుకోవటం సాధారణం. అయితే చికెన్‌కు మరింత కొత్త ఫ్లేవర్ రావాలంటే మాత్రం ఓ సారి ఈ డ్రైఫ్రూట్స్‌తో కలిపి వండుకోవాలి. బాదం చికెన్ కర్రీ, జీడిపప్పు పెప్పర్ చికెన్ ఫ్రై, జీడిపప్పు చికెన్ పకోడా, పీనట్ బటర్ చికెన్ కర్రీలను ఈ వీకెండ్‌లో ట్రై చేయండిలా..
బాదం చికెన్ కర్రీ
కావాల్సిన పదార్థాలు
చికెన్- పావు కిలో, బాదం పేస్ట్- నాలుగు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి), తరిగిన పచ్చిమిరపకాయలు- 2, కారం- తగినంత, అల్లం, వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్, నూనె- 3టేబుల్ స్పూన్లు, పసుపు- చిటికెడు, మిరియాలపొడి- టీస్పూన్, ఉప్పు- తగినంత, జీలకర్ర పొడి- టీస్పూన్, గరం మసాలా- టీస్పూన్, కొత్తిమీర- టేబుల్‌స్పూన్, ధనియాల పొడి- టీస్పూన్
తయారీ విధానం
ప్యాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు వేయాలి, పచ్చిమిర్చి ముక్కలు వేసి గరిటెతో కదుపుతూ దోరగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత చికెన్ వేయాలి. ముక్కలను రెండు నిముషాలు బాగా కదిపాక ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వరుసగా వేసుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలుపుతుండాలి. చికెన్ కాస్త మగ్గిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడివేసి కలపాలి. రెండు నిముషాలు కదిపాక గరం మసాలా వేయాలి. ముక్కలకు పట్టేల్లు కలపాలి. ప్యాన్‌కు మూతపెట్టి పది నిముషాల పాటు కుక్ చేయాలి. ఆ తర్వాత బాదంపేస్ట్ వేసి మిశ్రమంలో కలపాలి. చికెన్‌కు బాదం పేస్ట్ పట్టుకుంటుంది. సరిపడ నీళ్లు వేసుకుని కారాన్ని జత చేయాలి. ప్యాన్ మూత పెట్టి మూడు నిముషాల పాటు కుక్ చేయాలి. మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలపాలి. చివరగా మిగిలిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. బాదం చికెన్ కర్రీని చపాతి, పూరీ లేదా అన్నంతో కలిపి తినొచ్చు.

జీడిపప్పు, పెప్పర్ చికెన్ ఫ్రై
కావాల్సిన పదార్థాలు
చికెన్- అరకేజీ, జీడిపప్పు- పావు కప్పు, మిరియాలు- టేబుల్ స్పూన్, నూనె- పావు కప్పు, ఉల్లిపాయలు-2 (సన్నగా తరగాలి), అల్లం, వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్, పసుపు- పావు టీస్పూన్, గరం మసాలా- టీస్పూన్, ధనియాల పొడి- టీస్పూన్, జీలకర్ర పొడి- టీస్పూన్, కారంపొడి- టీస్పూన్, ఉప్పు- తగినంత, కొత్తిమీర- టీస్పూన్,
తయారీ విధానం
జీడిపప్పు, మిరియాలను మిక్సీ జార్‌లో తీసుకుని అందులోకి పేస్ట్‌కు తగినన్ని నీళ్లు పోయాలి. మిక్సీ పట్టిన తర్వాత ఆ పేస్ట్‌ను బౌల్‌లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్‌లో నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి. రంగు మారేంత వరకూ వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి గరిటెతో కదపాలి. ఆ తర్వాత చికెన్ వేసి పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. జీలకర్రపొడి, కారంపొడి, తగినంత ఉప్పు వేసి ముక్కలను పట్టేట్లు కలపాలి. ప్యాన్ మూత పెట్టి చికెన్ ఉడికేంత వరకూ కుక్ చేయాలి. ఆ తర్వాత బౌల్‌లో పక్కన ఉంచుకున్న జీడిపప్పు, మిరియాల పేస్ట్ వేసి ముక్కలను బాగా పట్టేట్లు కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి కలపాలి. మూతపెట్టి కొద్దిసేపు కుక్ చేస్తే జీడిపప్పు, మిరియాల చికెన్ ఫ్రై రెడీ.

జీడిపప్పు చికెన్ పకోడా
కావాల్సిన పదార్థాలు
చికెన్- అరకేజీ(బోన్‌లెస్), జీడిపప్పు- అరకప్పు, పచ్చిమిర్చి-4, వెల్లుల్లి రెబ్బలు-8, ధనియాలపొడి- టీస్పూన్, వేయించిన జీలకర్రపొడి- టీస్పూన్, గరం మసాలా- అరటీస్పూన్, కారం- టేబుల్ స్పూన్, పసుపు- చిటికెడు, అల్లం ముక్క- నిమ్మకాయంత, కసూరి మేతి- టీస్పూన్, నిమ్మకాయ-1, ఉప్పు- రుచికి తగినంత, కరివేపాకు- 10 ఆకులు, కార్న్‌ఫ్లోర్- 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర- అరటీస్పూన్, మైదా- టేబుల్ స్పూన్, నూనె- డీప్ ఫ్రైకి సరిపడ
తయారీ విధానం
మిక్సీ జార్‌లో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ధనియాలపొడి, వేయించిన జీలకర్రపొడి, గరం మసాలా, కారం, పసుపు, అల్లం ముక్క, కసూరి మేతి వేసి మెత్తగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. పకోడాకు సరిపడ సైజులో చికెన్‌ను కట్ చేసి బౌల్‌లో వేసుకోవాలి. అందులోకి మిక్సీపట్టిన పేస్ట్ వేయాలి. నిమ్మకాయ రసాన్ని పిండి, కరివేపాకు వేసి పేస్ట్‌ను ముక్కలకు పట్టేట్లు బాగా కలపాలి. ఈ ముక్కలను రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఉదయాన్నే చికెన్ మిశ్రమాన్ని తీసి అందులోకి కార్న్‌ఫ్లోర్, కొత్తిమీర, మైదా వేసి బాగా కలపాలి. ఇందులో అరకప్పు జీడిపప్పు వేసి కలపాలి. చికెన్‌తో పాటు జీడిపప్పు ముక్కలు అంటేట్లు ఉంచి డీప్ ఫ్రై చేయాలి. ఈ జీడిపప్పు చికెన్ పకోడా రుచికరంగా ఉంటుంది. స్నాక్స్‌లా తినాలి.

పీనట్ బటర్ చికెన్ కర్రీ
కావాల్సిన పదార్థాలు
చికెన్ బ్రెస్ట్- 400 గ్రాములు, నూనె- 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడ, నల్ల మిరియాల పొడి- టీ టీస్పూన్, ఉల్లిపాయలు- 2 (సన్నగా తరగాలి), వెల్లుల్లి పేస్ట్- టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్- అర టీస్పూన్, టమోటా- 1 (సన్నగా తరగాలి), కారంపొడి- రుచికి తగినంత పీనట్ బటర్- 4 టేబుల్ స్పూన్లు, కొబ్బరిపాలు- అరకప్పు, మంచినీళ్లు- తగినన్ని, సోయాసాస్ - అరటీస్పూన్, తాటి బెల్లం- 2 టీస్పూన్లు, స్ర్పింగ్ ఆనియన్లు- 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి, సరిపడ ఉప్పు, కొద్దిగా నల్లమిరియాల పొడి వేసి చికెన్‌ను గరిటెతో కదుపుతూ బాగా వేయించాలి. దీన్ని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్‌లోకి మరో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయలు వేయాలి. రంగు మారిన తర్వాత వెల్లుల్లిపేస్ట్, అల్లం పేస్ట్ వేసి రెండు నిముషాల పాటు మిశ్రమాన్ని కదిపాక టమోటా ముక్కలు వేసి కలపాలి. గుజ్జులా వచ్చేవరకూ కొద్దిసేపు గరిటెతో కలుపుతుండాలి. కారంపొడి, మిగిలిన నల్లమిరియాల పొడి వేసి కలిపాక పీనట్ బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు గరిటెతో అదిపడుతూ కలపాలి. తగినన్ని నీళ్లు పోసుకుని రెండు నిముషాల తర్వాత వేయించిన చికెన్ ముక్కలను వేసుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలుపుతూ సోయాసాస్ వేసి కలపాలి. ఆ తర్వాత తాటి బెల్లం, స్ర్పింగ్ ఆనియన్ల ముక్కలు వేసి బాగా కలపాలి. దీన్ని స్ర్పింగ్ ఆనియన్లు లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ పీనట్ బటర్ చికెన్ కర్రీ చపాతిలో లేదా అన్నంతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.