Samudrala Jayanthi : డబ్బుల కోసం రాయనన్నారు
ABN , First Publish Date - 2023-04-15T23:46:14+05:30 IST
శోభ చేకూర్చిన రచయితలలో సముద్రాల రామానుజాచార్య ఒకరు. తన తండ్రి సముద్రాల రాఘవాచార్య మార్గంలో నడిచి దశాబ్దాల పాటు తెలుగు పాటల తోటలో అనేక ఆణిముత్యాలు పూయించిన సముద్రాల జూనియర్
తెలుగు మాటకు పదును పెట్టి, తెలుగు పాటకు శోభ చేకూర్చిన రచయితలలో సముద్రాల రామానుజాచార్య ఒకరు. తన తండ్రి సముద్రాల రాఘవాచార్య మార్గంలో నడిచి దశాబ్దాల పాటు తెలుగు పాటల తోటలో అనేక ఆణిముత్యాలు పూయించిన సముద్రాల జూనియర్ శతజయంతి సందర్భంగా అమెరికాలో స్థిరపడిన ఆయన కుమార్తె సముద్రాల శుభశ్రీని ‘నవ్య’ పలకరించింది. ఆమె చెప్పిన విశేషాలు ...
‘‘నాన్న- ఈ పదం వినగానే ఒక పెద్ద కోట గుర్తుకొస్తుంది. మమ్మల్ని చెయ్యి పట్టుకొని సురక్షితంగా ముందుకు నడిపించే ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు. ఆయన నాకు స్నేహితుడే కాదు, మార్గదర్శి కూడా. ఆయన దగ్గర నుంచి నేను ఎన్నో విషయాలు- ప్రత్యక్షంగా, పరోక్షంగా నేర్చుకున్నా. ఇవన్నీ చెప్పే ముందు మా కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తాను. మా తాతగారు సముద్రాల రాఘవాచార్యుల గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి తరం తెలుగు సినిమా రచయితల్లో ఆయనది ఒక సుస్ధిర స్థానం. తాతగారు ఉన్నంత వరకూ మాది ఉమ్మడి కుటుంబం. తాతగారికి నలుగురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు. నాన్న పెద్ద అబ్బాయి. నాన్నకు ఆరుగురు పిల్లలు. అందరిలో నేనే చిన్నదాన్ని. ఉమ్మడి కుటుంబం కావటంతో ఇళ్లంతా కళకళలాడుతూ ఉండేది. ఇంట్లో మొత్తం 21 మంది పిల్లలం ఉండేవాళ్లం. తాతయ్య అంటే అందరికీ భయం. ఆయన ఎవ్వరినీ తిట్టరు,. కొట్టరు. కానీ ఒక అరుపు అరిస్తే అందరూ సర్దుకొనేవారు. నాకూ తాత అంటే భయముండేది కానీ, అందరికన్నా చిన్నదాన్ని కావటంతో మొండితనం చేసేదాన్ని. ఇంట్లో ఉంటే అల్లరి చేస్తానని- తాతగారు- తనతో పాటు నన్ను కూడా స్టూడియోకి తీసుకువెళ్లేవారు. అక్కడ అందరూ నన్ను ఎత్తుకొని తిప్పుతూ ఉండేవారు. భానుమతి అత్త, జమునత్త, అంజలీ అత్త, వారి భర్త ఆదినారాయణరావుగారు- ఇలా అనేక మంది మధ్య తిరుగుతూ ఉండేదాన్ని. ఆ సమయంలో ఆదినారాయణరావుగారు ‘సతీసక్కుబాయి’ సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో ఒక పాటలో వాళ్లకు చిన్ని కృష్ణుడు కావాల్సి వచ్చాడు. నేను ఆ సమయంలో షూటింగ్ స్పాట్‌లో ఉన్నా- దాంతో నాకు కృష్ణుడి వేషం వేసి పాట తీశారు. అదే నా సినిమా అరంగేట్రం. ఇప్పుడు నాన్నగారు సినిమాల్లోకి రావటానికి వెనకున్న కథ కూడా చెబుతాను.
మొదట్లో ఇంజనీర్‌గా...
నాన్నగారికి యుక్తవయస్సు వచ్చేసరికే తాతగారు పెద్ద రైటర్. ఇండస్ట్రీలో ఉన్నవారందరూ ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు. నాన్నగారికి డిగ్రీ అయిపోయిన తర్వాత సౌండ్ ఇంజనీర్‌గా చేరారు. నాన్న బాగా చదువుకున్నారు. పురాణాలు, ఇతిహాసాలు, ఇతర గ్రంథాలపై గట్టి పట్టు ఉండేది. తాతగారితో పాటు సిట్టింగ్‌లలో కూర్చునేవారు కాబట్టి నాన్నకు కూడా రచనలపై ఆసక్తి వచ్చిందేమో తెలియదు. మనకు ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటేనే కళలు అబ్బుతాయి. తాతగారు గొప్ప రచయిత. నాన్నకు ఆ వారసత్వం వచ్చింది. కానీ మా ఎవ్వరికీ ఆ వారసత్వం రాలేదు. అయితే నాకు రకరకాల పుస్తకాలు చదవటమనేది నాన్న దగ్గర నుంచి వచ్చిన అలవాటే! ఇక్కడ నాన్న గురించి కొన్ని సంగతులు చెప్పాలి. నాన్న అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలనూ చాలా నిశితంగా చదివేవారు. వాటి నుంచి అనేక విషయాలు నేర్చుకొనేవారు. ఆయన ప్రభావంతో నాకు 16 ఏళ్లు వచ్చిన దగ్గర నుంచి పుస్తకాలు చదవటం మొదలుపెట్టా. దీని వల్ల నాన్నతో మాట్లాడటానికి నాకు కొన్ని టాపిక్స్ దొరికేవి. కొన్ని విషయాలలో ఆయనతో వాదించేదాన్ని. నాన్న ‘కురుక్షేత్రం’ సినిమాకు రాశారు. అందులో పాత్రల చిత్రీకరణ కోసం అనేక మంది రచయితలు రాసిన భారతాలు చదువుతూ ఉండేవారు. వాటిలో కొన్ని నేను చదివేదాన్ని. ద్రౌపది, కుంతి... ఇలా రకరకాల పాత్రల గురించి మేమిద్దరం మాట్లాడుకొనేవాళ్లం. కొన్ని సార్లు- ‘‘ఆడపిల్లలు అలా ఆలోచించరు, వాళ్ల ఆలోచనలు వేరేగా ఉంటాయి...’ అని మహిళా పాత్రల గురించి నా అభిప్రాయాలు చెప్పేదాన్ని. నాన్న గొప్పతనమేమిటంటే- ఆయన నా అభిప్రాయాలను కూడా గౌరవించేవారు. నేను కాలేజీకి వచ్చిన తర్వాత డిబేట్స్‌లో పాల్గొనేదాన్ని. ఆ డిబేట్స్‌లో టాపిక్స్ ముందుగానే ఇచ్చేవారు. ఏం మాట్లాడాలనే విషయాన్ని మేమిద్దరం చర్చించుకొనేవాళ్లం. ఆయన ఎంత బిజీగా ఉన్నా- నాకు పాయింట్స్ రాసి ఇచ్చేవారు. అలా నాకు ఆయనతో చాలా చనువు ఏర్పడింది. నాన్న పిల్లలకు నచ్చజెప్పే పద్ధతి కూడా చాలా సున్నితంగా ఉండేది. ఒకసారి నేను బంగాళదుంపల కూర చేశా. ఆ కూర చేయటం మొదటిసారి. దాన్లో నూనె కొంచెం ఎక్కువ అయింది.- ‘‘ఇంత నూనె పోశావు. తింటే రోగాలొచ్చి చస్తారు’’ అని అమ్మ కోప్పడడంతో నాన్న కల్పించుకొని - ‘‘ఉప్పు, కారం సరిపోయిందమ్మా! ఆయిల్ కొద్దిగా ఎక్కువయింది.. వచ్చే సారి తగ్గించుకో’’ అన్నారు. నాన్న అంత సున్నితంగా చెప్పేవారు. ఇది నాకు కూడా అలవాటు అయింది. నా పిల్లలతో నేను కూడా అలాగే ఉంటా. వాళ్లకు అన్నీ వివరించి చెబుతా. దీని వల్ల ఎటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడదు.
ఎన్టీఆర్‌తో పాటుగా..
నాన్నగారు, తాతగారు ఇండస్ట్రీలో చాలా కాలం కలసి పనిచేశారు. మాది ఉమ్మడి కుటుంబం అని చెప్పాను కదా... ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. అందువల్ల నాన్నగారు ఉదయం నాలుగు గంటలకు లేచి రాసుకొనేవారు. ఉదయాన్నే మేము స్కూళ్లకు వెళ్తాం కాబట్టి ఆ సమయంలోనూ రాసుకొనేవారు. అంతేకాకుండా నాన్నగారికీ, తాతగారికి ఒక రూమ్ ఉండేది. అందులో చాపలు వేసుకొని కూర్చుని రాసుకొనేవారు. ఆ రూమ్‌కే అందరూ వచ్చేవారు. నేను అక్కడే ఎన్టీఆర్, ఏఎన్నార్, భానుమతి, జమున, శారద లాంటి నటీనటులందరినీ చూశా. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాన్నను సలహాదారుగా తీసుకున్నారు. నాన్న అంతకు ముందే రాయటం తగ్గించేశారు. సింగీతం శ్రీనివాసరావు, బి. ఎ. సుబ్బారావు వంటి కొద్ది మంది నిర్మాతలకు మాత్రమే రాసేవారు. ‘‘నాకు నచ్చినవి మాత్రమే నేను రాస్తా. డబ్బుల కోసం రాయను. డబ్బుల కోసం రాసేవాళ్లు వేరే ఉన్నారు. కావాలంటే వాళ్ల చేత రాయించుకోవచ్చు. ఏడాదికి ఒకటి రెండు రాసినా నాకు చాలు’’ అనేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక జ్ఞాపకాలు. నాన్నకి శత జయంతి అనే విషయమే గుర్తుకురావటం లేదు. ప్రస్తుతం నాన్నతో పాటు పనిచేసినవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కొత్త తరం నటీనటులకు, నిర్మాతలకు, దర్శకులకు- నాన్న గురించి ఎంత తెలుసో నాకు తెలియదు. కానీ తెలుగు ప్రజలు మాత్రం ఆయనను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. ఆయన రాసిన పాటలను ఇప్పటికీ ఆదరిస్తున్నారు. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా గర్వంగా ఉంటుంది. గతంలో తాతగారి విగ్రహం పెట్టాం. ఆయన పేరిట కొన్ని కార్యక్రమాలు చేశాం. అదే విధంగా నాన్నగారి పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. నాన్నగారి జ్ఞాపకార్థం ఒక స్కాలర్‌షిప్ ఏర్పాటు చేసి దాన్ని తెలుగు చదువుకుంటున్న ఉత్తమ విద్యార్థులకు ఇవ్వాలనే ఆలోచన ఉంది. దీనివల్ల వారికి ప్రోత్సాహం ఉంటుంది అదే విధంగా నాన్నగారి పేరు భవిష్యత్ తరాల వారికి తెలుస్తుంది.’’
సముద్రాల జూనియర్ హిట్స్
అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం
(బ్రతుకు తెరువు)
ఈనాటి ఆ హాయీ... కల కాదోయి నిజమోయి
(జయసింహ)
ధరణికి గిరి భారమా... గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా... కనిపెంచే తల్లికి పిల్ల భారమా
(మంచి మనసుకు మంచి రోజులు)
అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా
(పాండురంగ మహాత్మ్యం)
ఈ మూగ చూపేలా బావా... మాటాడగ నేరమా
ఓహో మాటాడదే బొమ్మా... నీ దరినే చేరి మాటాడనా
(గాలి మేడలు)
ప్రతి జనవరి ఫస్ట్‌కు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇళ్లకు వెళ్లేవాళ్లం. ఆ ఏడాది ఎలా ఉంటుందో జాతకం చూసి చెప్పేవారు. ఎన్టీఆర్ ఒక రూపాయి నోటు మీద - ‘‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని రాసి ఇచ్చేవారు. ఏఎన్నార్ ఐదు రూపాయల నోటు మీద రాసి ఇచ్చేవారు. ఇది వాళ్లు నాన్నకు ఇచ్చే గురుదక్షిణ అనుకొనేవాళ్లం.
ఘంటశాలను మేము ‘బాబాయ్’ అని పిలిచేవాళ్లం. ఆయన చెన్నై వచ్చిన తర్వాత మూడేళ్ల పాటు మా ఇంట్లోనే ఉన్నారు. సావిత్రి పిన్ని రేమిడిచర్లలోనే ఉండేది. నాన్న, మా బాబాయ్, ఘంటశాల బాబాయ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఘంటశాల బాబాయ్, మా బాబాయ్- మడి కట్టుకొని ఇంట్లో వంట చేసేవారు. నాన్న కూర్చుని పద్యాలు పాడుతూ ఉండేవారు. ఆ దృశ్యం నాకు ఇంకా గుర్తుంది. ఇక ఘంటశాల బాబాయ్ తనకు వచ్చిన సంపాదనంతా తాతకి ఇచ్చేవారు. ఆ రోజుల్లో ఆయనకు పాట పాడితే పది రూపాయలు ఇచ్చేవారు. అదంతా తీసుకొచ్చి తాతకి ఇచ్చేవారు. తాత ఆయనకు రోజుకు ఒక రూపాయి ఇచ్చేవారు. ప్రతి రోజు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత - ఆ రూపాయికి లెక్క అడిగేవారు. ఇలా రెండేళ్ల పాటు ఆయన సంపాదించినదంతా పోగుచేసి, సావిత్రి పిన్నికి ఇచ్చి చెన్నైలో కాపురం పెట్టించారు. ‘‘నా బాధ్యత పూర్తయిపోయింది. ఇక నీదే బాధ్యత’’ అని బాబాయ్‌ని పిన్నికి అప్పజెప్పారు.
వేదాంతం రాఘవయ్యగారికి గుండెపోటు రావటంతో ఒక సినిమాలో కొన్ని సీన్లు తాత డైరక్ట్ చేశారు. ఏఎన్నార్‌కు తాతగారంటే చాలా ఇష్టం. ‘నాన్నగారు, గురువుగారు’ అని పిలిచేవారు. ఆ సినిమాలో ఆశ్చర్యం, బాధ రెండు కలిపి నటించాల్సిన సీన్ ఒకటి ఉంది. ఎన్ని టేకులు అయినా ఏఎన్నార్‌లో భావాలు పలకటం లేదు. దీంతో తాత ఆయనను ఒక్క చెంప దెబ్బ కొట్టారట. ఏఎన్నార్‌కు ఏం జరుగుతోందో తెలిసే లోపులో క్లోజ్‌పలో షాట్‌ను ఓకే చేశారట. తాతగారు కొట్టారేమిటనే ఆశ్చర్యం, కొట్టారనే బాధ రెండు కలిపి వచ్చేసరికి ఆ సన్నివేశం బాగా పండింది. ఏఎన్నార్ చివరి రోజుల్లో ఒక సారి నేను వాళ్లింటికి వెళ్లా. ఆయన నాకు ‘విప్రనారాయణ’ సినిమాలో పద్యాలు వినిపించారు. ‘‘అప్పటివి ఎలా గుర్తున్నాయండీ’’ అంటే- ‘‘గురువుగారు ఎప్పుడూ కాంప్రమైజ్ అయ్యేవారు కాదు.. దాంతో బాగా హోం వర్క్ చేసేవాళ్లం. అందుకే నోటికి వచ్చేశాయి’’ అన్నారు.
మేము కొడంబాకంలో ఉండేవాళ్లం. సింగీతం శ్రీనివాసరావుగారు మా పక్కింట్లో ఉండేవారు. విశ్వం అంకుల్ (కె.విశ్వనాఽథ్)ఇల్లు పది నిమిషాల దూరంలో ఉండేది. ఇలా సినిమా వాళ్లందరూ ఒక కుటుంబంగా ఉండేవారు. అన్ని ప్రివ్యూలకు మమ్యల్ని పిలిచేవారు. మేము వెళ్లేవాళ్లం. ఆ సమయంలో- విశ్వం అంకుల్, శారదక్క, శ్రీవాణి అక్క, భానుమతి అక్క, జమునక్క, విజ్జక్క (విజయనిర్మల)- ఇలా వరసలతోనే పిలిచేవాళ్లం. దసరా వచ్చిందంటే భలే సందడిగా ఉండేది. పెద్ద ఆర్టిస్టుంలదరూ బొమ్మల కొలువులు పెట్టేవారు. ఒకరిని మంచి మరొకరు పెట్టాలనే పోటీ ఉండేది. భానుమతిగారికి ఒక పెద్ద హాలు ఉండేది. దాంట్లో కొన్ని వందల బొమ్మలతో ఆమె బొమ్మల కొలువు పెట్టేది.
నాన్నగారు యాక్టివ్‌గా ఉన్న రోజుల్లో రచయితలకు చాలా గౌరవం ఉండేది. రాగం, సన్నివేశం చెప్పేవారు అంతే! పాట రాసిన తర్వాత స్వరపరిచేవారు. ఒక్క పదం కూడా మార్చేవారు కాదు. మార్చటానికి వీళ్లు కూడా ఒప్పుకొనేవారు కాదు. సినిమా అనేది అనేక మంది సమష్ఠిగా కృషి చేయాల్సిన కళ. ఎవరి పరిధుల్లో వాళ్లు ఉండేవారు.
తాతగారిది, నాన్నగారిది ఒక అద్భుతమైన రిలేషన్‌షిప్. వారిద్దరూ స్నేహితుల్లా ఉండేవారు. ఒకరితో ఒకరికి ఎలాంటి పోటీ ఉండేది కాదు. మొదట్లో కొన్ని సార్లు సినిమాల్లో ‘సముద్రాల’ అని మాత్రమే వేసేవారు. తాతగారు రాసారో, నాన్నగారు రాసారో తెలిసేది కాదు. నాన్నగారు కూడా ఏమి బాధపడేవారు కారు. ఆ తర్వాత ‘సముద్రాల సీనియర్’, ‘సముద్రాల జూనియర్’ అని వేయటం మొదలుపెట్టారు.
ఎన్టీఆర్ కుటుంబం మాకు బాగా తెలుసు. వాళ్లింటికి మేము వెళ్లేవాళ్లం. వాళ్లు మా ఇంటికి వచ్చేవారు. వారి పిల్లలకు నాన్న అంటే ప్రత్యేకాభిమానం ఉండేది. హరి (హరికృష్ణ)కి కార్లంటే చాలా ఇష్టం ఉండేది. ఒక సారి తను చవర్లెట్ కారు కొన్నాడు. ఆ కారును తీసుకొచ్చి నాన్నకు చూపించాడు. హరి చాలా వేగంగా కార్లు నడిపేవాడు. దాంతో నాన్నకు ఆయన కారు ఎక్కాలంటే భయంగా ఉండేది. ఒకసారి హరి వచ్చి- ‘‘మనం డ్రైవ్‌కు వెళ్దాం. కారు ఎంత బావుందో మీరు చూడొచ్చు’’ అన్నాడు. నాన్నకేమో భయం. నాన్న ఏదో సరి ్దచెప్పి పంపించేశారు
సివిఎల్‌ఎన్ ప్రసాద్