Dil‌ Raju : ప్రతి సినిమా ఒక ఛాలెంజ్‌

ABN , First Publish Date - 2023-04-09T00:41:44+05:30 IST

తెలుగు సినిమా నిర్మాతగా 20 ఏళ్లు విజయవంతంగా కొనసాగటం అంత సులభం కాదు. అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన ఈ మైలురాయిని దిల్‌ రాజు తాజాగా దాటారు.

Dil‌ Raju : ప్రతి సినిమా ఒక ఛాలెంజ్‌
Sunday Celebrity

తెలుగు సినిమా నిర్మాతగా 20 ఏళ్లు విజయవంతంగా

కొనసాగటం అంత సులభం కాదు.

అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన

ఈ మైలురాయిని దిల్‌ రాజు తాజాగా దాటారు.

ఈ నేపథ్యంలో తన ప్రస్థానం గురించి ‘నవ్య’కు ప్రత్యేక

ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలలోకి వెళ్తే...

నిర్మాతగా రెండు దశాబ్దాల సినీ ప్రస్థానం.. ఎలా అనిపిస్తోంది?

చాలా మంచి జర్నీ. విజయాలు, అపజయాలు.. ఆటుపోట్లు.. కష్టనష్టాలు.. అన్నీ చూసేశా. ఒక విజయవంతమైన నిర్మాతగా 20 ఏళ్లు కొనసాగటమే ఒక విజయంగా నేను భావిస్తా. ‘పరుగు’ సినిమా సమయంలో చిరంజీవి గారు నన్ను చక్రపాణి-నాగిరెడ్డి, రామానాయుడులతో పోల్చారు. ఇప్పటికీ నేను దాన్ని ఒక పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తా. కథ వినటం దగ్గర నుంచి థియేటర్‌లో సినిమా విడుదలయ్యే దాకా మొత్తం ప్రక్రియలన్నింటిలోనూ మమేకమయ్యే నిర్మాతలు తక్కువ. వారిలో నేను ఒకడినని చెప్పుకోవటం గర్వంగా అనిపిస్తోంది. ‘‘ఇరవై ఏళ్ల కిందట ‘దిల్‌’ సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందు నా మానసిక పరిస్థితి ఎలా ఉంది?’’ అని నిన్న రాత్రే ఆలోచించా! అప్పటి నుంచి ఇప్పటి దాకా... గ్రేట్‌ జర్నీ అనే చెప్పాలి.

ఒక వ్యక్తిగా దిల్‌ రాజులో మార్పు వచ్చిందా?

క్రియేటివ్‌గా ఎలాంటి మార్పూ లేదు. ఇప్పటికీ ప్రతి సినిమా నాకు కొత్తగానే ఉంటుంది. ఎక్సైటింగ్‌గా ఉంటుంది. అలా లేకపోతే సినిమానే తీయలేం. అయితే అప్పటికీ.. ఇప్పటికీ తేడా ఒకటే. అప్పుడు అందరికన్నా ముందు ఉదయం ఆరున్నరకు లొకేషన్‌లో ఉండేవాణ్ణి. ఇప్పుడు తొమ్మిది అవుతోంది. పని ఒత్తిడి పెరగటం.. మీటింగ్స్‌.. కుటుంబంతో సమయం.. సెలబ్రిటీ అవటంవల్ల తప్పనిసరిగా అటెండ్‌ అవ్వాల్సిన ఫోన్‌ కాల్స్‌.. ఇవే కారణం. అంతకన్నా నాలో పెద్ద మార్పు లేదు.

ఈ జర్నీలో అనేకమంది మిత్రులు, కొందరు శత్రువులు... ఇవన్నీ ఎందుకని అనిపించలేదా?

లేదు. అస్సలు లేదు. ఆ ఆలోచనే ఎప్పుడూ రాలేదు. చాలామంది కలిస్తేనే ఒక సినిమా. ఒక నిర్మాతగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత నాపై ఉంది. కొన్నిసార్లు ప్రేమతో, కొన్నిసార్లు కోపంతో... ఈ జర్నీలో కొందరు శత్రువులు అవుతారు. విజయాన్ని తట్టుకోలేనివారు కూడా ఉంటారు. అలాగే కాలంతో మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ‘‘మొదట్లో రాజు మంచోడే! మనకు సమయం ఇచ్చాడు. అడిగినవన్నీ చేశాడు. ఇప్పుడు చేయటంలేదు’’ అనుకొనేవాళ్లూ ఉంటారు. అర్థం చేసుకుంటే సంబంధాలు కొనసాగుతాయి. లేకపోతే మధ్యలోనే తెగిపోతాయి. ఇదంతా ఒక జర్నీ అనుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించదు. నా వరకూ ప్రతి సినిమా ఒక ఛాలెంజ్‌! నా 50 సినిమాల్లో అనేక సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించటానికి ప్రయత్నించా. ఒకటి రెండు చోట్ల గ్యాప్స్‌ ఉండిపోయి ఉంటాయి.

మీలో మార్పు వచ్చిందా? మీతోపాటు మొదటి నుంచి జర్నీ చేస్తున్నవారు ఎప్పుడైనా అలా భావించారా?

నాలో మార్పు వచ్చింది. నాలోనే కాదు.. అందరిలోనూ వస్తుంది. మొదటి నుంచి నాతో పాటు జర్నీ చేస్తున్న శిరీష్‌, లక్ష్మణ్‌లకు నా విజన్‌ తెలుసు. నా ఆలోచనలను మొదటి నుంచి వారు నమ్మేవారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఫెయిల్యూర్స్‌ ఉంటాయి. అందరి అభిప్రాయాలు వింటా. నిర్ణయం మాత్రం నేనే తీసుకొంటా. ఎందుకంటే... సినీ రంగంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొంటే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. మంచో చెడో... ఒక పని చేసినప్పుడు అపజయం ఎదురైతే ఇతరులను నిందించను. సినిమా ఆడకపోతే డైరక్టర్‌ని తప్పుపట్టను.

‘వారసుడు’ మీరు అనుకున్నట్లు ఆడకపోయినప్పుడు ఎలా అనిపించింది?

మిక్స్‌డ్‌ రివ్యూలు ఉండచ్చు. కానీ కమర్షియల్‌గా బాగా ఆడింది. నేను ప్రతి సినిమాను రివ్యూ చేసుకుంటా. ‘వారసుడు’ విషయానికి వస్తే... ‘వారిస్‌’ తమిళ సినిమా. పెద్ద హిట్‌. కలెక్షన్ల పరంగా విజయ్‌ సినిమాలు లెక్క తీస్తే మొదటి ఐదింటిలో ఉంటుంది. ఇక ‘వారసుడు’...

ఆ సినిమాకు తెలుగు డబ్బింగ్‌. తెలుగు మీడియా ‘వారసుడు’ గురించి మాట్లాడింది. కానీ మేము తీసింది తమిళ సినిమా. అక్కడి ప్రేక్షకులకు నచ్చింది.

సినిమా అంటే రకరకాల ఆకర్షణలు ఉంటాయి.

సినిమాల్లో నటించమని మిమ్మల్ని ఎవరూ అడగలేదా?

డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడే బయట నుంచి సినిమాలో ఎలాంటి ఆకర్షణలు ఉంటాయో తెలుసుకున్నా. అప్పుడు నా లక్ష్యం ఒక్కటే.. డిస్ట్రిబ్యూటర్‌గా విజయం సాధించటం. ఆ తర్వాత ప్రొడక్షన్‌లోకి వచ్చా. అప్పుడు కూడా ఒక లక్ష్యం. ప్రొడ్యూసర్‌గా విజయం సాధించడం. నా దృష్టంతా దానిపైనే ఉంటుంది. కొందరు... ‘ఒక్క సీన్‌లో కనిపించవచ్చు కదా..’ అని అడుగుతూ ఉంటారు. ఒప్పుకోను. హీరోగా చేయమని అడిగేవారూ ఉంటారు. నన్ను పొగిడేవారికి నా దగ్గర ఎంట్రీ కూడా ఉండదు.

మీకు కిక్‌ ఇచ్చేది ఏమిటి?

సినిమా విజయం. మొదట్లో ‘దిల్‌.. ఆర్య.. కొత్త బంగారు లోకం’ దాకా ప్రతి సినిమా ఎనర్జీ ఇచ్చేది. అందరూ కొత్త డైరక్టర్లే. వారితో కలిసి పని చేస్తుంటే కిక్‌ వచ్చేది. కథ, స్ర్కిప్ట్‌, పాటలు, సంగీతం... ఇలా అన్నింటిలోనూ వారితో కలిసి పని చేసేవాణ్ణి. నేను డైరక్టర్‌తో సమానం. ఆ తర్వాత డ్రైవ్‌ మార్చి పెద్ద స్టార్స్‌తో తీయటం మొదలుపెట్టా. 2015లో మళ్లీ పాత పద్ధతికి వచ్చి... కథ నుంచి మేకింగ్‌ దాకా అన్నింటిలోనూ ఇన్వాల్వ్‌ అయ్యా. 2017లో నావి ఆరు సినిమాలు హిట్‌ అయ్యాయి. అదే సంవత్సరం దురదృష్టం నన్ను వెంటాడింది. నా భార్య చనిపోయింది. ఆ విషాదాన్ని కూడా అధిగమించగలిగానంటే... ఆ ఏడాది నాకు వచ్చిన విజయాలే ఒక కారణం. ఇప్పటి దాకా ఏ ప్రొడక్షన్‌ హౌస్‌కూ ఒకే ఏడాది ఆరు వరస విజయాలు లేవు. మళ్లీ ఆ తర్వాత కొన్ని విజయాలు.. అపజయాలు.. వీటన్నింటిలోనూ నాకు కిక్‌ ఇచ్చేది సినిమా విజయమే!

ఈ ఇరవై ఏళ్ల ప్రస్థానంలో మీపై ప్రభావం చూపించిన సినిమా ఏమిటి?

‘బొమ్మరిల్లు’. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన నా ఆలోచనలపై ప్రభావం చూపించింది. ఆ తర్వాత నుంచే నేను ఫ్యామిలీ కంటెంట్‌ను పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నా. ‘బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’... ఈ మధ్య వచ్చిన ‘బలగం’... వీటన్నింటిలోనూ ఫ్యామిలీ కంటెంట్‌ ప్రధానంగా ఉంటుంది.

మరచిపోలేనివారు...

కాస్ట్యూమ్‌ కృష్ణ గారు.. నా మొదటి సక్సెస్‌ ‘పెళ్లి పందిరి’కి కారణం వారే! వారు మరణించటం చాలా బాధాకరం. ఇక మహేందర్‌రెడ్డిగారు నేను సినిమా రంగంలోకి రావటానికి కారణం. శిరిష్‌, లక్ష్మణ్‌లు మొదటి నుంచి నాతోనే ఉన్నారు. గిరి దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నా. వీరందరితో పాటు నా కుటుంబ సభ్యులందరూ నా విజయాలకు తోడ్పడినవారే. వీరందరి వల్లే నేను ‘దిల్‌ రాజు’నయ్యా!

మా అబ్బాయితో...

మా అబ్బాయితో చాలా ఎంజాయ్‌ చేస్తున్నా. వాడికి తొమ్మిది నెలలు. చాలా యాక్టివ్‌. నా మనవడికి ఆరేళ్లు. ప్రతి రోజూ వీరిద్దరితో కొంతసేపు గడుపుతా. ఇదో కొత్త జీవితం. ‘‘అక్కడికి వెళ్తే తాతలాగా... ఇక్కడికి వస్తే తండ్రిలాగా ఉండాలి.. ఎలా మేనేజ్‌ చేస్తున్నారు?’’ అని నా భార్య అడుగుతూ ఉంటుంది. ‘‘నాకు ఈజీనే. ఇది కూడా సినిమాలాగ. వ్యక్తిగత జీవితంలాగానే. అక్కడికి వెళ్తే... ఇక్కడిది స్విచాఫ్‌ చేస్తున్నా. ఇక్కడికి వస్తే అక్కడిది స్విచ్ఛాప్‌ చేస్తా..’’ అని సరదాగా చెబుతూ ఉంటా!

రాజకీయాలలోకి...

నాకు రాజకీయాలు పడవు. వాటిలో నేను ఫిట్‌ అవ్వను. ఒకవైపు నా వ్యక్తిగత జీవితం... మరో వైపు నా వృత్తి... ఈ రెండింటిలో బిజీగా ఉన్నా. అయితే అన్ని పార్టీలలోనూ చర్చ నడుస్తోంది. అందరూ మాట్లాడుతున్నారు. కానీ నాలోనే ఒక ప్రశ్న ఉంది. దానికి సమాధానం కోసం అన్వేషిస్తున్నా. అందువల్ల కచ్చితంగా సమాధానం చెప్పలేను.

ఐదేళ్ల ఛాలెంజ్‌...

ఇరవై ఏళ్ల జర్నీ ఉత్సవాలను కేవలం ఇంటర్నల్‌గానే చేసుకుంటున్నాం. నాకు నేను మరో ఐదేళ్లు ఛాలెంజ్‌ పెట్టుకున్నా. 25 ఏళ్ల ఉత్సవాలు చాలా ఘనంగా చేసుకొంటాం.

తుది నిర్ణయం నాదే...

ఆడియన్స్‌కు ఏం కావాలనుకుంటున్నారో గమనిస్తూ ఉంటా. కానీ తుది నిర్ణయం మాత్రం నాదే! ఉదాహరణకు ‘బలగం’ తీసుకుందాం. అది మంచి సినిమా అని నాకు తెలుసు. అయితే ప్రేక్షకుడిని థియేటర్‌ దగ్గరకు తీసుకురావాలంటే ముందుగా వారికి దానిలో ఉన్న కంటెంట్‌ తెలియాలి. అది వారిలో ఆసక్తి రేకెత్తించాలి. లేకపోతే ఎంత పబ్లిసిటీ చేసిన వృధా అవుతుంది. ‘బలగం’ చిత్రానికి ఎటువంటి టీవీ యాడ్స్‌ లేవు. నిజామాబాద్‌, మహబూబాబాద్‌లో 15 రోజుల ముందే ప్రివ్యూలు వేశాం. ప్రేక్షకుల దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాం. అవసరమైన మార్పులు చేశాం. మొదటి రోజు 30 వేలు, రెండో రోజు 40 వేలు, మూడో రోజు 70 వేలు చూశారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను ఒక నిర్ణయం తీసుకొనే ముందు నా టీమ్‌లో ఉన్నవారందరితోనూ మాట్లాడతాను. అందరి అభిప్రాయాలు తీసుకుంటాను.

ఇతర భాషల్లో...

ప్రస్తుతం హిందీలో షాహిద్‌ కపూర్‌తో ఒక సినిమా ప్రారంభం కానుంది. తమిళంలో కూడా చేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి... హర్షిత్‌, హన్షితలకు కూడా నేను స్పేస్‌ క్రియేట్‌ చేయాలి కదా! వారు కూడా ప్రొడక్షన్‌లోనే ఉన్నారు. వారికి... నాకు సంవాదాలు జరుగుతూనే ఉంటాయి.

చిరంజీవితో అతి త్వరలో...

చిరంజీవి గారితో సినిమా తీయటం నా కల. దాని కోసం నిరీక్షిస్తున్నా. అతి త్వరలోనే ఆయన పిలుస్తారని అనుకుంటున్నా.

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2023-04-09T00:41:44+05:30 IST