Dharmapadam : ఉన్మత్తుడు కాదు...మేధావి

ABN , First Publish Date - 2023-09-22T03:39:09+05:30 IST

జైన తీర్థంకరుడైన మహావీరుని ప్రథమ శిష్యుడు మక్ఖలి గోసాలుడు. అతడంటే మహావీరుడికి ఎంతో ఆదరం. కానీ కొంతకాలం తరువాత మహావీరుడితో అభిప్రాయ భేదాలు ఏర్పడడంతో... గోసాలుడు జైన మార్గాన్ని వ...

Dharmapadam : ఉన్మత్తుడు కాదు...మేధావి

జైన తీర్థంకరుడైన మహావీరుని ప్రథమ శిష్యుడు మక్ఖలి గోసాలుడు. అతడంటే మహావీరుడికి ఎంతో ఆదరం. కానీ కొంతకాలం తరువాత మహావీరుడితో అభిప్రాయ భేదాలు ఏర్పడడంతో... గోసాలుడు జైన మార్గాన్ని వదిలి, అజీవక మార్గాన్ని అవలంబించాడు. వారి మధ్య భేదాభిప్రాయాలు ఉదయించడానికి కారణం ఆసక్తికరంగా ఉంటుంది.

ఒకసారి వారిద్దరూ కలిసి వెళుతున్నప్పుడు దారిలో ఒక నువ్వుల మొక్క కనిపించింది. మహావీరుడు ఈ‘‘ నువ్వుల మొక్కకు నువ్వుల కాయ కాస్తుంద’’న్నాడు. అలా జరగదని గోసాలుడు పందెం కాశాడు. ఆ తరువాత తాను ఓడిపోతాననే భయంతో, తన పందేన్ని నెగ్గించుకోవాలనే తాపత్రయంతో... ఆ నువ్వుల మొక్కను గోసాలుడు సమూలంగా పెరికి పారేశాడు. కానీ విధివశాత్తూ వర్షం పడి, ఆ మొక్క మళ్ళీ మొలకెత్తింది, పెరిగింది. దానికి ఒక ఫలం కాసింది.

ఈ సంఘటన తరువాత గోసాలుడి మనసులో తీవ్రమైన ఆలోచన మొదలయింది. చివరికి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆనాటి నుంచి అతడు అన్నిటికీ భవిష్యత్తు ముందే నిర్ణయించి ఉంటుందనీ, మానవ ప్రయత్నం వ్యర్థమనీ, విధి బలీయమైనదనీ నమ్మడం ప్రారంభించాడు. మహావీరుడు మాత్రం ఈ సిద్ధాంతంతో ఏకీభవించలేకపోయాడు. చివరకు గోసాలుడికి మహావీరుడితో విరోధం పెరిగింది. అతడు ఒక కొత్త అజీవ సంప్రదాయాన్ని ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఈ సంప్రదాయం చాలా ప్రముఖమైనది. కానీ తరువాతి కాలంలో అంతరించింది. ఇంకా ఎన్నో సంప్రదాయాలు, సిద్ధాంతాలు కాలగర్భంలో కలసిపోయాయి. జైన, బౌద్ధ మతాలే మనుగడ సాగించాయి.

మక్ఖలి గోసాలుని సిద్ధాంతం బుద్ధుని కాలంలో చాలా వ్యాప్తి చెంది ఉండేది. అతడికి వినయసంపన్నులైన ఆరుగురు శిష్యులు ఉండేవారు. వారు జ్ఞానుడు, కలందుడు, కర్ణికారుడు, అచ్ఛిదుడు, అగ్నివేశ్యాయనుడు, గోమాయుపుత్ర అర్జునుడు. నిజానికి వీరందరూ మహావీరుడి శిష్యులే. కానీ కాలక్రమేణా వీరు శీల సంపదను కోల్పోయి, పతితులైన కారణంగా గోసాల సంఘంలో కలసిపోయారనే వదంతి ఉంది. ఈ విధంగా గోసాలుడు మిగిలిన జైన విరోధులందరినీ తన సంఘంలో కలుపుకొని జినుడిగా ప్రఖ్యాతి చెందాడనేది వారి కథనం. కానీ నా దృష్టిలో మక్ఖలి గోసాలుడు ఒక గొప్ప మేధావి.

ఆ కాలంలో శ్రావస్తి నగరంలో నివసించే హాలాహల అనే అవివాహిత యువతికి అజీవక సంప్రదాయ చరిత్రలో ప్రముఖ పాత్ర ఉంది. హాలాహల అతి సౌందర్యవతే కాదు, అప్పట్లో బాగా ధనవంతురాలు కూడా. ఎంత ధనవంతురాలో అంత బుద్ధిమంతురాలు. ఆమె అజీవక సిద్ధాంత ప్రచారానికి ఎంతో ధనాన్ని ఖర్చు చేసేది. గోసాలుడు బహుశా ఆమె ఇంట్లోనే నివసించేవాడనే ఊహ కూడా ఉంది.

గోసాలుడి వివరాలు బౌద్ధ, జైన సాహిత్యాలు రెండిటిలోనూ కనిపిస్తాయి. జైన సాహిత్యం ప్రకారం.. మక్ఖలి గోసాలుడు మొదట్లో పార్శ్వనాథ, మహావీరుల అనుయాయి. వివాదం తలెత్తిన కారణంగా అతడు మరొక సంఘాన్ని స్థాపించాడు. ఈ విధంగా జైన సాహిత్యంలో గోసాలుడు ఈర్షాళువుగా, నీచ స్వభావం కలిగినవాడుగా, ధర్మాంధునిగా చిత్రీకరించారు. మహావీరుడి హత్యకు కూడా అతను ఒకసారి పూనుకున్నాడనీ, బ్రాహ్మణుల దేవతా విగ్రహంపై మూత్రం కూడా చల్లాడనీ వారు రాశారు. ఈ విధంగా జైన సాహిత్యంలో గోసాలుణ్ణి ఉన్నత్తుడిగా వర్ణించారు. కానీ బౌద్ధసాహిత్యానుసారం అతడు బుద్ధుని కాలంలో ప్రముఖమైన, ప్రసిద్ధమైన తీర్థంకరుడని తెలుస్తోంది.

ప్రొఫెసర్‌ చౌడూరి ఉపేంద్ర రావు

Updated Date - 2023-09-22T03:39:09+05:30 IST