గుండె ధైర్యానికి... వైకల్యం లేదు!
ABN , First Publish Date - 2023-03-02T01:08:15+05:30 IST
పోలియో అంగవైకల్యాన్ని తెచ్చిపెట్టింది శరీరానికే కానీ గుండె ధైర్యానికి కాదు అంటోంది పారా సైక్లింగ్ ఛాంపియన్ గీతా ఎస్ రావు. సంకల్పం, పట్టుదల ఉంటే..
పోలియో అంగవైకల్యాన్ని తెచ్చిపెట్టింది శరీరానికే కానీ గుండె ధైర్యానికి కాదు అంటోంది పారా సైక్లింగ్ ఛాంపియన్ గీతా ఎస్ రావు. సంకల్పం, పట్టుదల ఉంటే, సాధ్యం కానిది ఏదీ లేదంటున్న గీత, తాజాగా శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకూ సాగే భారతదేశపు ఐకానిక్ సైకిల్ రేసులో పాల్గొంటోంది. ఆ 3,700 కిలోమీటర్ల సైకిల్ రేసు గురించి, తన సైక్లింగ్ ప్రస్థానం గురించీ అహ్మదాబాద్‌కు చెందిన గీతా నవ్యకు ఇలా వివరించింది.
మూడేళ్ల వయసులో జ్వరం వస్తే అమ్మానాన్నా నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి ఇంజెక్షన్ ఇప్పించారు. ఇంటికొచ్చిన కొన్ని గంటల తర్వాత నేను పడక మీద నుంచి లేవలేకపోయాను. శరీరం నాకు సహకరించడం మానేసింది. అప్పటికే పోలియో ఇన్‌ఫెక్షన్ నా శరీరం మొత్తానికీ వ్యాపించిందనే విషయం ఆలస్యంగా తెలిసొచ్చింది. భవిష్యత్తులో నేనిక పూర్వంలా నడవలేననీ, మంచానికే పరిమితం కావలసి వస్తుందనీ వైద్యులు చెప్పడంతో, అమ్మానాన్నా ఎంతో తల్లడిల్లిపోయారు. సాధారణ పిల్లలతో పోలిస్తే నా మానసిక, శారీరక ఎదుగుదల వేగం మందగించింది. అయినా నా చదువు ఆగిపోవడం ఇష్టంలేక అమ్మానాన్నా స్కూల్లో చేర్పించి, నన్ను చేతులతో మోసుకుని తీసుకువెళ్లేవాళ్లు. ఎనిమిదో తరగతిలో ఉండగా అమ్మానాన్నా నన్ను బడికి మోసుకురావడం చూసిన ఒకావిడ, అలాంటి కూతురు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని అన్నది. అది విన్న నాకు అమ్మానాన్నలకు నేనొక అనవసరపు భారమేమోననే భావన కలిగింది. దాంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసి, విఫలమయ్యాను. అయితే అలా ప్రాణాలు తీసుకునేబదులు, ఇతరుల మీద ఆధారపడకుండా స్వశక్తితో జీవించాలనే నిర్ణయానికి వచ్చాను. అప్పటి నుంచి ఫిజియోథెరపీ, ఇతరత్రా వ్యాయామాలను దైనందిన జీవితంలో భాగం చేసుకున్నాను. ఎడమ కాలును మాత్రం నియంత్రణలోకి తెచ్చుకోలేకపోయినా, చివరకు చేతి కర్రల సహాయంతో నా అంతట నేను నిలబడే స్థితికి చేరుకోగలిగాను.
ఎన్నో సాహసాలు...
చేతి కర్రలు, వీల్ ఛైర్, హ్యాండిక్యా్‌పడ్ బూట్లు.. ఇలా దివ్యాంగుల సాధనాలన్నీ నా మనోధైర్యాన్ని మరింత పెంచాయి. అలా నెమ్మదిగా ట్రెక్కింగ్, బంజీ జంపింగ్, పారా గ్లైడింగ్, అలా్ట్ర డిస్టెన్స్ సైక్లింగ్, స్కై సైక్లింగ్, సీ స్విమ్మింగ్, మారథాన్లు, ట్రయథాన్లలో నడవడం లాంటి ఎన్నో సాహసాలకు పూనుకున్నాను. నిజానికి పిల్లలందరికీ సైకిల్ తొక్కాలనే ఆశ చాలా చిన్న వయసులోనే మొదలవుతుంది. కానీ ఆ వయసులో నేను మంచానికే పరిమితమైపోయాను. సైకిల్ తొక్కడం మాట అటు ఉంచితే, నా అంతట నేను పైకి లేచి నా పనులను చేసుకోగలిగే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఇంట్లో కుటుంబసభ్యులు నాకెప్పుడూ తోడుగా ఉండవలసి వచ్చేది. ఒంటరిగా రోడ్డు దాటే ప్రయత్నం చేస్తూ, ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా నా జీవితంలో సైక్లింగ్ చాలా ఆలస్యంగా 39వ ఏట మొదలైంది.
సైక్లింగ్ మొదలైందిలా...
మొదట్లో సోలో సైకిల్ రేసుల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. 2016లో అహ్మదాబాద్‌లో సైక్లాథాన్ ఈవెంటు ప్రారంభమైనప్పుడు దాన్లో పాల్గొనాలని నేను నిర్ణయించుకున్నాను. అప్పుడప్పుడే సైకిల్ తొక్కడం, బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్న నేను కేవలం 200 మీటర్లు కూడా కుదురుగా సైకిల్ తొక్కలేకపోయేదాన్ని. అలాంటిది ఏకంగా 14 కిలోమీటర్ల రేసులో పాల్గొన్నాను. తర్వాత దూరాలను పెంచుకుంటూ ఎలాగైనా 200 కిలోమీటర్ల సైకిల్ రేసులో పాల్గొని తీరాలని బలంగా నిశ్చయించుకున్నాను. అలా 100, 200, 300, 500, 700 కిలోమీటర్ల సైకిల్ రేసుల్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకోగలిగాను. సైక్లింగ్ మీద పట్టు సాధించి, ఎన్నో విజయాలను చవిచూసిన తర్వాత, నా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ప్రస్తుతం నేను ఎంతసేపైనా అలుపు లేకుండా సైకిల్ తొక్కగలను. నా జీవితం మొత్తాన్నీ సైకిల్ తొక్కుతూ గడిపేయగలను.
కొండలు, లోయల గుండా సాగుతూ...
నేనిప్పటివరకూ ప్రత్యేకించి డిఫ్రెంట్లీ ఏబుల్డ్ కేటగిరీల్లో (దివ్యాంగుల విభాగాలు) పాల్గొనలేదు. నేనిప్పటివరకూ పాల్గొన్నవన్నీ ఓపెన్ కేటగిరీలే! అలాగే నేను ఎలివేషన్‌పరంగా, సాంకేతికతల పరంగా క్లిష్టమైన ఈవెంట్లనే ఎంచుకుంటూ ఉంటాను. తాజా ఏషియన్ అలా్ట్ర సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ మార్చి1 నుంచి శ్రీనగర్‌లో మొదలైంది. అక్కడి నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ నేను సైక్లింగ్ చేయవలసి ఉంటుంది. ఈ 3700 కిలోమీటర్ల సైక్లింగ్ రేస్‌ను నేను 14 రోజుల్లో ముగించగలననే భావిస్తున్నాను. కేవలం ఒక్క కాలితో ఈ సైకిల్ రేస్‌లో పాల్గొని, ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదల నాలో ఉంది. ఇదొక ఎలివేటెడ్ రేస్. ఈ రేసు 12 రాష్ట్రాల్లోని కొండలు, లోయల గుండా సాగుతుంది. ఈ రేసులో పాల్గొనే సైక్లిస్టులందరూ సాధారమైన వాళ్లే. ఈ రేసులో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 25 దేశాల పాల్గొంటున్నాయి. భారతదేశం తరఫున పాల్గొంటున్న దివ్యాంగ మహిళను నేనొక్కదాన్నే!
మనసుంటే మార్గం ఉంటుంది. నా దివ్యాంగ స్నేహితులు కొందరు తక్కువ ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండడం నేను గమనించాను. కానీ ఆకాశమే హద్దుగా భావించాలి. జీవితంతో సర్దుకుపోవడం మానుకుని, దాంతో పోరాడాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని మనం నమ్మాలి.
గోగుమళ్ల కవిత