Cool Barley Dishes : చల్లదనాన్నిచ్చే బార్లీ వంటలు!

ABN , First Publish Date - 2023-06-03T00:10:43+05:30 IST

ఎండాకాలం బార్లీ నీళ్లు, బార్లీ పానియాలు తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బార్లీ గింజలతో కిచిడీ, లడ్డూలు, ఖీర్‌, వడలు చేసుకుని తింటే రుచితో పాటు

Cool Barley Dishes : చల్లదనాన్నిచ్చే బార్లీ వంటలు!
Cool Barley Dishes

ఎండాకాలం బార్లీ నీళ్లు, బార్లీ పానియాలు తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బార్లీ గింజలతో కిచిడీ, లడ్డూలు, ఖీర్‌, వడలు చేసుకుని తింటే రుచితో పాటు ఈ సమ్మర్‌లో కాస్త ఉపశమనం కూడా పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ వీకెండ్‌లో బార్లీ వంటలు వండుకోండిలా...

బార్లీ ఖీర్‌

కావాల్సిన పదార్థాలు

బార్లీ గింజలు– కప్పు, పాలు– 2 కప్పులు, సన్నగా తరిగిన ఖర్జూరం ముక్కలు– రెండు టేబుల్‌ స్పూన్లు, బాదం– పది (సన్నగా కట్‌ చేయాలి), జీడిపప్పు– పదిహేను, ఎండు ద్రాక్ష– 10, యాలకులు– 4, తేనె– టీస్పూన్‌

తయారీ విధానం

రాత్రంతా బార్లీ గింజలను నానబెట్టుకోవాలి. ఎప్పుడు ఖీర్‌ చేసుకోవాలన్నా అంతకంటే ముందు కనీసం ఏడు గంటల పాటు బార్లీ గింజలను నానబెట్టుకుని ఉంచుకోవాలి. పిండిలా అవుతుంటే సరిగ్గా బార్లీ నానినట్లు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్‌లో పాలు పోసి సిమ్‌లో వేడి చేయాలి. బాగా మరిగిన తర్వాత బార్లీని వేయాలి. మధ్యలో గరిటెతో కదుపుతూ ఉడికించుకోవాలి. పాలు చిక్కబడుతుంటాయి. తరిగిన ఖర్జూరం ముక్కలను వేసి కలపాలి. ఆ తర్వాత బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్షలను వేయాలి. ఆ తర్వాత యాలకులు వేసి కొద్ది సేపు ఉడికించాలి. మధ్యలో గరిటెతో కదుపుతూ ఉండాలి. బార్లీ బాగా ఉడికితే సరి.. ఖీర్‌ అయినట్లే. ఈ ఖీర్‌లో తేనె వేయాలి. చివరగా బౌల్‌లో వేసుకుని అందులో బాదం, పిస్తా ముక్కలతో గార్నిష్‌ చేసుకుని తినాలి.

LADDUS.jpg

బార్లీ లడ్డూలు

కావాల్సిన పదార్థాలు

బార్లీ– 1 కప్పు, పల్లీలు– 1 కప్పు, అవిసె గింజలు– 1 కప్పు, నెయ్యి–2 స్పూన్లు, బాదం– 10, జీడిపప్పు– 10, తురిమిన బెల్లం– 1 కప్పు, యాలకుల పొడి– కొద్దిగా

తయారీ విధానం

ప్యాన్‌లో బార్లీ గింజలను వేసి మాడిపోకుండా లోఫ్లేమ్‌లో ఉంచి కదుపుతూ గోల్డెన్‌కలర్‌లోకి మారేంత వరకూ వేయించాలి. వీటిని బౌల్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలను, అవిసె గింజలను వేరువేరుగా రంగుమారేంత వరకూ వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇపుడు ప్యాన్‌లో నెయ్యి వేసి బాదం, జీడిపప్పులను వేయించుకోవాలి. ఆ తర్వాత పల్లీల పొట్టు తీసేయాలి. జార్‌లో వేయించిన బార్లీ గింజలు, పల్లీలు, అవిసె గింజలను వేరువేరుగా మిక్సీ పట్టాలి. ఈ మూడు పిండిలను బాగా కలపాలి. ఈ మిశ్రమంతో పాటు బెల్లం కూడా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఇందులోకి వేయించిన బాదం, జీడపప్పులను నెయ్యితో సహా వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత లడ్లూలు చేసుకోవాలి. లడ్డులు సరిగా రాకుంటే ఆ మిశ్రమంలో కొద్దిగా కాచిన నెయ్యి వేసి చేసుకోవచ్చు. ఈ లడ్డు రుచిగా ఉంటాయి.

BARLEY-KICHIDI.jpg

బార్లీ కిచిడీ

కావాల్సిన పదార్థాలు

బార్లీ గింజలు– 1 కప్పు, ఉల్లిపాయ–1 (సన్నగా తరగాలి), జీలకర్ర– 1 టీస్పూన్‌, పచ్చిమిరపకాయలు–2 (చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి), క్యారెట్లు–2 (మీడియంసైజ్‌ ఉండాలి. చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి), తరిగిన బీన్స్‌– పావు కప్పు, క్యాప్సికం ముక్కలు– పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌– టీస్పూన్‌, స్వీట్‌ కార్న్‌– పావు కప్పు, ఉప్పు– తగినంత, కొత్తిమీర– కొద్దిగా, నెయ్యి– మూడు టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు– 10 ఆకులు

తయారీ విధానం

బార్లీ గింజలను ముందురోజు రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి. నీటిని తీసేసి గింజలను బౌల్‌లో ఉంచుకోవాలి. వంట చేసే ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు మరో ప్యాన్‌ తీసుకుని అందులో నెయ్యి వేసి కొద్దిగా వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కరివేపాకు, బీన్స్‌, స్వీట్‌కార్న్‌, క్యాప్సికం ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత వేడినీళ్లు వేయాలి. ఇందులోకి ఉప్పు వేసిన తర్వాత గరిటెతో కాసేపు తిప్పిన తర్వాత బార్లీ గింజలను వేసి ప్యాన్‌పై మూత ఉంచి కుక్‌ చేయాలి. ఇంకా బార్లీ గింజలు ఉడకకుంటే చెక్‌ చేసుకుంటూ గరిటెతో కదుపుతూ ఉడకబెట్టాలి. ఈ కిచిడీని కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2023-06-03T00:10:43+05:30 IST