సినిమానే నా బలం

ABN , First Publish Date - 2023-10-08T03:43:07+05:30 IST

‘‘ఇటీవలే నేను నటించిన ‘ఫక్రే 3’ విడుదలై విజయం సాధించింది. మంచి వసూళ్లు వచ్చాయి. ‘ఫక్రే’ సిరీస్‌లు నాకు కెరీర్‌ పరంగా కలిసొచ్చాయి.

సినిమానే నా బలం

మోడలింగ్‌ నుంచి వెండితెరకు వచ్చింది. నటిగా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌

వాసేపూర్‌’తో సత్తా చాటుకున్నది. ఆమే.. రిచా చద్దా.

ఈ పంజాబీ పడుచు కెరీర్‌తో పాటు వ్యక్తిగత విశేషాలు ఇవే..

‘‘ఇటీవలే నేను నటించిన ‘ఫక్రే 3’ విడుదలై విజయం సాధించింది. మంచి వసూళ్లు వచ్చాయి. ‘ఫక్రే’ సిరీస్‌లు నాకు కెరీర్‌ పరంగా కలిసొచ్చాయి. అంతేనా పర్సనల్‌ లైఫ్‌లోనూ ఈ సినిమాను మర్చిపోలేను. ఎందుకంటే.. ‘ఫక్రే’ సమయంలో నా సహనటుడు అలీ ఫజల్‌తో పరిచయం అయింది. ఆ తర్వాత స్నేహం, ప్రేమ. ఇంట్లో వాళ్ల సపోర్టుతో అలీతో వివాహం జరిగింది. అలా ఈ ‘ఫక్రే’ చిత్రం నాకు జీవితభాగస్వామిని ఇచ్చింది. అందుకే ఈ సినిమా సిరీస్‌ నాకెంతో ప్రత్యేకం.

అలా సినిమాల్లోకి..

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టి పెరిగా. నాన్న పంజాబీ, అమ్మ బిహారీ. మేం ఐదు మంది బిడ్డలం. నలుగురు అబ్బాయిలు ఉన్నారు. నేను ఒక్కతే అమ్మాయిని. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ విద్యాలయలో చదివా. ‘సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజ్‌’ లో చదువుకున్నా. మోడలింగ్‌ అంటే ఇష్టపడ్డా. మా పేరెంట్స్‌ కాదనలేదు. వాళ్లకు ఆ బ్రాడ్‌థింకింగ్‌ ఉంది. ముఖ్యంగా మా అమ్మ గురించి చెప్పాలి. తన పేరు కుసుమ లత చద్ధా. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ఓ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. ‘రీడింగ్‌ గాంధీ’, ‘ది మాస్టర్‌ కమ్యూనికేటర్‌’ అనే రెండు పుస్తకాలు గాంధీజీ గురించి రాశారు. ఆమె గాంధీ ఫాలోవర్‌. ‘ఇస్లామిక్‌ ఫండమెంటలిజమ్‌ పాకిస్తాన్‌ అండ్‌ ది ముస్లిమ్‌ వరల్డ్‌’ అనే పుస్తకానికి పనిచేశారు. అమ్మ భావాల వల్లనేమో.. రచన రంగం వైపు ఆకర్షితురాలయ్యా. 2006 లో ‘రూటెడ్‌ ఇన్‌ హోప్‌’ అనే డాక్యుమెంటరీని రాసి దర్శకత్వం వహించా. అది కేవలం ఇరవై నిముషాల నిడివి ఉంటుంది. ఇంట్లో ఎలాంటి అభ్యంతరం లేకపోవటంతో 2008లో ‘ఓయ్‌ లక్కీ.. లక్కీ ఓయ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగెట్టా.

మర్చిపోలేని విజయమది..

‘దేవ్‌ డి’ చిత్రంలో ప్రధాన పాత్రకు ఎంపికయ్యా. అయితే కొన్ని కారణాల వల్ల నన్ను తీసేశారు. ఆ తర్వాత 2012లోనే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌’ లో నగ్మా ఖటూన్‌ పాత్రలో నటించా. రెండు భాగాల్లోనూ నా పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. నటిగా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నా. నా జీవితంలో మర్చిపోలేని చిత్రమది. అద్భుతమైన విజయమది.

అదంతా రచయితల వల్లే..

‘తమంచే’, ‘మసాన్‌’, ‘సర్జిబిత్‌’, ‘జియా ఔర్‌ జియా’, ‘సెక్షన్‌ 375’, ‘పంగా’ లాంటి మంచి కథల్లో నటించా. నటిగా ఎంతో ఆనందాన్నిచ్చిన సినిమాలు చేశా. ఇదంతా రచయితల వల్లనే. మంచి పాత్రలు సృష్టించారు. ప్రస్తుతం ‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’, ‘లాహోర్‌ కాన్ఫిడెన్షియల్‌’ లాంటి చిత్రాల్లో నటించాక.. ఇంకా బలమైన మహిళా ప్రాధాన్య పాత్రలు వస్తున్నాయి. పెళ్లయ్యాక మంచి చిత్రాలొస్తున్నాయి. నటన కొనసాగించమని మా ఆయన అంటారు. ఇకపోతే డ్యాన్స్‌ అంటే ఇష్టం. కథక్‌ చిన్నప్పుడు నేర్చుకున్నా కొన్నాళ్లు. ఇపుడు మళ్లీ నేర్చుకోవటం కొనసాగిస్తున్నా. డ్యాన్స్‌ చేస్తే ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉంటా. కాన్ఫిడెంట్‌గా ఉంటాను. మీకో విషయం తెలుసా? ఎవరెంత అసూయపడినా.. ఏమీ పట్టించుకోను. నా పని చేసుకుపోతా. పని ఉంటేనే మనం ఉన్నట్లు. పనే దైవం. దగ్గరికి వచ్చి మరీ.. కొన్ని మంచి ప్రాజెక్టులు పోయాయి. వాటి గురించి ఆలోచించలేదు. వచ్చిన పాత్రలను వదులుకోలేదు. సినిమానే నా జీవితం, ఎనర్జీ కూడా. చిన్నప్పటినుంచీ బి.ఆర్‌. అంబేద్కర్‌ గారంటే ఇష్టం. ఆయనే నాకు నచ్చిన ఐకాన్‌’’

Updated Date - 2023-10-08T03:43:21+05:30 IST