Share News

Tammareddy Bharadwaja : చిరంజీవిని దాసరి వద్దన్నారు

ABN , First Publish Date - 2023-12-09T23:38:00+05:30 IST

అనుకోకుండా నేను సినీ పరిశ్రమలోకి వచ్చాను. నా తొలి చిత్రం ‘కోతలరాయుడు’. చిరంజీవి గారికి హీరోగా అదే మొదటి సినిమా. అంతేకాదు... ఆయన మొదటి వంద రోజుల చిత్రం

 Tammareddy Bharadwaja : చిరంజీవిని దాసరి వద్దన్నారు

అనుకోకుండా నేను సినీ పరిశ్రమలోకి వచ్చాను. నా తొలి చిత్రం ‘కోతలరాయుడు’. చిరంజీవి గారికి హీరోగా అదే మొదటి సినిమా. అంతేకాదు... ఆయన మొదటి వంద రోజుల చిత్రం కూడా అదే. రెండోది కూడా చిరంజీవి గారితోనే... ‘మొగుడు కావాలి’ తీశాను. ఆయనకు అది మొదటి సిల్వర్‌ జూబ్లీ చిత్రమైంది. ఆ రెండిటికీ నేను నిర్మాతను. తరువాత ‘మరో కురుక్షేత్రం’ చేద్దామనుకున్నా... చిరంజీవి హీరోగా. అప్పట్లో దాసరి నారాయణరావు గారితో నాకు మంచి సాన్నిహిత్యం ఉండేది. రేలంగి నరసింహారావును దర్శకుడిని చేయాలని ఆయన అనుకొంటున్నారు. ఇలా సినిమా తీస్తున్నానంటే ‘భరద్వాజ... రేలంగికి అవకాశం ఇవ్వు’ అన్నారు. ‘సరే సార్‌. కథ మీరే ఇవ్వండి’ అన్నాను. ఇస్తానన్నారు. కథకు సంబంధించి మేం కొంత చేశాం. దాసరి గారు కొంత చేస్తానన్నారు.

ఒక రోజు రేలంగి నరసింహారావు, రచయిత తోటకూర రఘు కలిసి కథ చెబుదామని దాసరి గారి దగ్గరకు వెళ్లారు. అప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నారు. మనం కథ ఇస్తే, దాన్ని సరి చేసి, సంభాషణలు రాసి ఇచ్చేవారు ఆయన. అయితే వీళ్లు తీసుకువెళ్లింది చూసి ‘బాలేదు. ఇది వద్దు’ అన్నారు ఆయన. నాకు కోపం వచ్చింది. ఎందుకు వద్దన్నారో అడుగుదామని దాసరి దగ్గరకు వెళ్లా. ఆయన అప్పుడు ఎన్టీఆర్‌ ‘విశ్వరూపం’ షూటింగ్‌లో ఉన్నారు. గంటసేపు నిలుచున్నాను. నన్ను చూశారో చూడలేదో తెలియదు కానీ... నాతో అయితే మాట్లాడలేదు. ఒకపక్క నాకు ఫ్లయిట్‌కు సమయం దాటిపోతోంది. దాంతో... ‘సినిమా ఆపడంలేదని మాత్రం మీరు ఆయనకు చెప్పండి’ అని రేలంగి నరసింహారావు గారికి చెప్పేసి నేను వచ్చేశాను. అక్కడి నుంచి కృష్ణంరాజు గారి దగ్గరకు వెళ్లి, గెస్ట్‌ ఆర్టి్‌స్టగా తండ్రి పాత్ర వేయమని అడిగాను. చిరంజీవి గారు, కృష్ణంరాజు గారు... ఇద్దరూ ఓకే అన్నారు.

అక్టోబర్‌ 2న ప్రారంభించి జనవరి 26న విడుదల చేయాలనేది నా ప్రణాళిక. దానికి సంబంధించి వర్క్‌ చేసుకొంటున్నా. ఒక రోజు న్యూస్‌పేపర్‌ ఫ్రంట్‌ పేజీలో యాడ్‌ వచ్చింది... ‘‘దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ‘మరో కురుక్షేత్రం’ పాట రికార్డింగ్‌ జరుగుతుంది’’ అని. వెంటనే రేలంగి నరసింహారావు గారికి ఫోన్‌ చేసి... ‘నా సినిమాకు మీరే దర్శకుడు. మనమే చేద్దాం’ అన్నాను. ‘లేదు సార్‌. గురువు గారు వద్దన్నాక నేను చేయడం మర్యాద కాదు. నేను చేయను’ అన్నారు ఆయన. సరేనన్నాను. ఆ తరువాత అది పెద్ద గొడవ అయిపోయింది. నేనేవో స్టేట్‌మెంట్లు, దానికి ఆయన ప్రతి స్టేట్‌మెంట్లతో పరిశ్రమలో వాతావరణం వేడెక్కింది. ఒకరోజు జయకృష్ణ గారు, క్రాంతి గారు మద్రాసు నుంచి నాకు ఫోన్‌ చేశారు. ‘ఈ సినిమాలో చిరంజీవి వద్దు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీరు సినిమా అయినా ఆపేయండి. లేదంటే వేరే నటుడిని పెట్టి చేసుకోండి’ అన్నారు. వాళ్లిద్దరూ నాకు మంచి స్నేహితులు. పరిశ్రమకు వచ్చినప్పుడు వాళ్లు ఎంతో సాయం చేశారు. ఇద్దరూ నాకు కావల్సినవాళ్లు చెప్పారు కాబట్టి... వేరేవాళ్లతో చేసుకొందామని అనుకున్నాను. అలాగే శారద గారికి కూడా చేయద్దని వీళ్లు చెప్పారట. ‘లేదు... వాళ్లు అడ్వాన్స్‌ ఇచ్చి, డేట్స్‌ తీసుకున్నారు. అక్కడ చేస్తాను. ఇక్కడ చేయను’ అన్నారామె.

హోరాహోరీ పోరాటంలాగా సినిమా మొదలుపెట్టాం. సగం సినిమా అయింది. ఒకరోజు డిస్ర్టిబ్యూటర్లు కేశవరావు గారు, హరికృష్ణ గారు నా దగ్గరకు వచ్చారు. పరిశ్రమలో నేను, దాసరి గారు కొట్టుకోవడం బాగోలేదని నచ్చజెప్పడానికి. అప్పుడు సారథి స్టూడియో్‌సలో షూటింగ్‌లో ఉన్నాను. ‘ఎప్పుడూ కలిసి ఉండే మీరిద్దరూ ఇలా గొడవపడడం సరికాదు. దాసరి గారు కూడా బాధపడుతున్నారు. మనం వెళ్లి మాట్లాడదాం రండి’ అన్నారు. నాడు ‘సినీ హెరాల్డ్‌’ అని వచ్చేది. అందులో మా గొడవకు సంబంధించి రోజూ ఆర్టికల్స్‌ పడుతుండేవి. కేశవరావు గారు, హరికృష్ణ గారు చెప్పాక దాసరి గారి దగ్గరకు వెళ్లా. ‘అబ్బాయ్‌... నిన్ను సొంత తమ్ముడిలా ఎంత బాగా చూసుకున్నాను! మరి నువ్వు ఎందుకిలా చేశావు’ అన్నారు. ‘మీరే కదా రేలంగి నరసింహారావును దర్శకుడిగా పెట్టమన్నారు. నేనూ సరేనన్నా. కానీ మీరు వేరే డైరెక్టర్‌తో సినిమా మొదలుపెట్టారు. నాకు చెప్పి చేసుకొని ఉంటే బాగుండేది కదా. కనీసం రేలంగి గారిని దర్శకుడిగా పెట్టుకొనివున్నా బాగుండేది. ఎందుకంటే ఆయన్ను కాదని సినిమా చేసేవాణ్ణి కాదు’ అన్నాను. ‘సరే అయిందేదో అయిపోయింది. ఇక మీదట నువ్వు స్టేట్‌మెంట్స్‌ ఏమీ ఇవ్వద్దు’ అన్నారు. ‘సరే’ అన్నాను. ఆయన తన సినిమా ఆపేశారు. ఆ తరువాత నుంచి నేను, దాసరి గారు చివరివరకూ ఒకటిగానే ఉన్నాం. పరిశ్రమకు సంబంధించి ఏ పని అయినా సరే నాకు చెప్పకుండా చేసేవారు కాదు. అయితే ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే మాదాల రంగారావు మా ఇంటికి భోజనానికి వచ్చారు. అప్పుడు ఆయన బిజీ ఆర్టిస్టు.

మా ఇద్దరికీ మంచి స్నేహం. దాసరి గారు చిరంజీవిని వద్దన్నాక రంగారావును అడిగాను. ‘రంగా... సినిమా చేస్తావా’ అంటే... ‘సరే బాబాయ్‌’ అన్నారు. వెంటనే డేట్స్‌ తీసుకుని ‘మరో కురుక్షేత్రం’ షూటింగ్‌ మొదలుపెట్టాం. వాస్తవంగా ‘మేరే అప్‌నే’ని తెలుగులో తీద్దామనుకున్నాం. కానీ ఎప్పుడైతే మాదాల రంగారావు ఎంట్రీ ఇచ్చారో... అప్పుడు ఆయనకు తగ్గట్టుగా చేద్దామనుకున్నాం. నాడు ఆయన ఎర్ర జెండా సినిమాలు బాగా ఆడుతున్నాయి కూడా. అయితే మనకు కొన్ని పిచ్చిలు ఉంటాయి కదా! అలా కమ్యూనిస్టు పార్టీ మీదున్న పిచ్చితో కథ మార్చేశాం. ‘పార్టీలు ముక్కలైపోయాయి. వీళ్లంతా కలిసుంటే బాగుంటుంది. ఎర్ర జెండా చిత్రాలు బాగా అడుతున్నాయి కనుక దాన్ని క్యాష్‌ చేసుకోవాలని కాకుండా... వాళ్లకు నీతి చెప్పే ప్రయత్నం చేశాం. మూడు పార్టీలూ కలవడం, కుర్రాళ్లు కొట్టుకోవడం... ఇవన్నీ పెట్టాం. చివరకు అది ఎటూ కాకుండా అయిపోయింది. కలిసి ఉండమనడం పార్టీవాళ్లకు నచ్చలేదు. విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెడితే అన్ని పార్టీలవాళ్లూ మమ్మల్ని తిట్టారు. అలా అనుకున్నది అనుకున్నట్టు కాకుండా మరోలా చేయడంవల్ల... ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి కానీ... సినిమా ఆడలేదు.

కమ్యూనిస్టు పార్టీలను కలుపుదామన్న నా ప్రయత్నం బెడిసికొట్టింది. అయితే దాసరితో నా స్నేహబంధం మాత్రం ఆయన కాలం చేసేవరకు చాలా బాగుంది. తరువాత రేలంగి నరసింహారావుతో నేను ‘ఇద్దరు కిలాడీలు’ తీశాననుకోండి. అది వేరే కథ. ఆ రోజుల్లో దాసరి నారాయణరావు గారు టాప్‌లో ఉన్నారు. ఆయనతో పోలిస్తే నేను చాలా చిన్న నిర్మాతను. ఆయనకూ... నాకూ పేచీ అంటే పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా ఉండేది. మొత్తానికి హోరాహోరీ పోరాటం చేసినా... చివరకు కలిసిపోయాం. ఆయన ఆఖరి క్షణాల వరకూ కలిసే ఉన్నాం.

తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత

Updated Date - 2023-12-09T23:38:10+05:30 IST