Teacher Uma Gandhi : పిల్లల స్థాయికి వెళ్లి పాఠాలు చెప్పాలి
ABN , First Publish Date - 2023-08-29T23:37:31+05:30 IST
మొక్కుబడిగా పాఠం చెప్పి వెళ్లిపోవడం ఒక్కటే తన బాధ్యత అనుకోలేదు. ఆటపాటలతో చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి కలిగించి... వారిలో మనోవికాసానికి బాటలు వేయడం
మొక్కుబడిగా పాఠం చెప్పి వెళ్లిపోవడం ఒక్కటే తన బాధ్యత అనుకోలేదు. ఆటపాటలతో చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి కలిగించి... వారిలో మనోవికాసానికి బాటలు వేయడం కూడా తన వృత్తిలో భాగం చేసుకున్నారు మురహరరావు ఉమాగాంధీ. విశాఖపట్నం శివాజీపాలెం ప్రాథమిక పాఠశాలలో సెకండరీగ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న ఉమాగాంధీ సేవలను గుర్తించిన కేంద్రం...
ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా
ఆమె తన ఈ సుదీర్ఘ ప్రయాణం గురించి ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు...
‘‘నాది మా నాన్న రామకేశవరావు వారసత్వమే. ఆయన కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేశారు. ఇది ఆయన స్ఫూర్తితో ఎంచుకున్న మార్గమే. విశాఖ జిల్లా భీమిలి మాది. అమ్మ భువనేశ్వరి గృహిణి. ముగ్గురు సంతానంలో నేను పెద్దదాన్ని. తమ్ముళ్లు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగానే స్థిరపడ్డారు. నాన్న ఉద్యోగ రీత్యా గరివిడిలో పనిచేయడంతో అక్కడే నా విద్యాభ్యాసం సాగింది. నాన్న పనిచేసిన కోడూరు ప్రభుత్వ పాఠశాలలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నా. పదో తరగతి వరకు గరివిడిలోని శ్రీరామ్ విద్యాపీఠ్, ఇంటర్, డిగ్రీ ఎస్‌డీఎస్ కాలేజీలో పూర్తిచేశా. ఇంటర్‌లో బైపీసీ చేశా. డిగ్రీలో జూవాలజీ లేకపోవడంతో బీఏ తీసుకోవాల్సి వచ్చింది.
నాడే నిర్ణయించుకున్నా...
నాన్న పాఠాలు చెప్పే విధానం, టీచర్‌గా గ్రామ ప్రజలు ఆయనకు ఇచ్చే గౌరవం చూసి టీచర్ వృత్తిలోకి వెళ్లాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నా. నాన్న కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, వారితో మమేకమవుతూ పాఠాలు చెప్పేవారు. ఈ విధానం అప్పట్లో నన్ను బాగా ఆకర్షించింది. మంచి టీచర్‌గా పేరు తెచ్చుకోవాలంటే విద్యార్థుల మనసు గెలుచుకోవాలని అర్థమైంది.
మొదటి పాఠశాల నుంచే...
టీచర్ కావాలన్న సంకల్పంతో డిగ్రీ తరువాత బీఈడీలో చేరా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జీటీపీ కళాశాలలో బీఈడీ పూర్తిచేశాను. 1998 డీఎస్సీలో ప్రైమరీ స్కూల్ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. మొదటి పోస్టింగ్ విజయనగరం పట్టణ పరిధిలోని కొత్త మజ్జిపేట పాఠశాలలో. ఆ పాఠశాల అప్పుడే ప్రారంభం కావడంతో బిల్డింగ్ కూడా లేదు. పూరిపాకలోనే పాఠాలు చెప్పాల్సివచ్చింది. చుట్టుపక్కల దారుణమైన పరిస్థితులు ఉండేవి. పాములు, పురుగులు వంటివి వస్తే వాటితో పిల్లలు ఆడుతూ ఉండేవారు. ఇవన్నీ చూసి భయమేసింది. పిల్లలను తరగతి గదిలోకి వచ్చి కూర్చోవాలని చెప్పినా పట్టించుకునేవారు కాదు. ఆ చిన్నారుల తల్లులు వచ్చి వారి బాధను చెప్పుకునేవారు. దాంతో ఎలాగైనా సరే... పిల్లలను తరగతి గదిలో కూర్చోబెట్టాలనుకున్నా. అందుకు నాన్న అనుసరించిన విధానాన్ని ఎంచుకున్నా. పిల్లలు చేసే అల్లరి, చిలిపి చేష్టలను పరిశీలిస్తూ, వాటినే పాటలుగా మార్చి వారి ముందు పాడేదాన్ని. వారు చేసిన పనులే పాట రూపంలో పాడడంతో వారిలో ఆసక్తి పెరిగి, తరగతి గదిలోకి వచ్చి కూర్చుని వినేవారు. మెల్లగా పాఠాలను కూడా పాటలుగానే మార్చి చెప్పేదాన్ని. అంతే ఆసక్తితో వినేవారు. ఈ విధానం మొదటి పాఠశాలలో అత్యంత ఇబ్బందికరమైన వాతావరణంలో విజయవంతం కావడంతో ఎక్కడకు వెళ్లినా ఇదే విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నా. ఆ తరువాత విజయనగరం పట్టణంలోని లార్డ్ కిచెనరీ యూపీ స్కూల్, రేసపువానిపాలెం పాఠశాలలో పనిచేశా. ప్రస్తుతం శివాజీపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో 12 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా.
పిల్లలు ఇష్టపడేలా చెప్పాలి...
పిల్లలు పాఠాలను ఇష్టపడేలా చెప్పాలి. ఆట, పాటలతో చెబితే వినేందుకు ఆసక్తి చూపిస్తారు. వాళ్ల స్థాయికి టీచర్ దిగిపోవాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు. పాఠాలతోపాటు జాతీయ పండగలు, జాతీయోద్యమంలో కీలక ఘట్టాల గురించి కూడా వారికి పాటలుగానే చెబుతాను. అప్పుడే చిన్నారులు వేగంగా అర్థం చేసుకుంటారు. పాఠాలకు అనుగుణంగా పాత్రలు రూపొందించి చెబుతుంటాను. పాఠాలను పాటల రూపంలో, కథలుగా చెప్పడాన్ని పిల్లలు ఇష్టపడుతుంటారు. పాటలు రూపొందించడానికి ప్రత్యేకంగా సమయమంటూ తీసుకోను. అప్పటికప్పుడు చిన్నారులు చేసే పనులను చూసి పాటలుగా పాడుతుంటా. అలాగే యోగా, ధ్యానంలో చిన్నారులకు శిక్షణ ఇప్పించాలి. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు. వారి మెదడు చురుగ్గా పని చేస్తుంది.
పాటల పుస్తకాలు...
ఇప్పటివరకు కొన్ని వందల పాటలు రాశాను. ‘పాలపుంత’ పేరుతో మొదటి బాలగేయ పుస్తకాన్ని తీసుకువచ్చా. ఇందులో 60 వరకు పాటలు ఉంటాయి. పిల్లల ప్రతి యాక్టివిటీని పాట రూపంలో మలిచి ఇందులో నిక్షిప్తం చేశా. పిల్లలు నాతో ఎంతగా మమేకం అవుతారంటే... ఒక్కరోజు స్కూల్‌కు వెళ్లపోయినా ఎందుకు రాలేదని అడుగుతుంటారు. ‘పాలపుంత’తోపాటు ‘పదనిసలు, రాధామాధవీయం, రాగమాల’ పుస్తకాలు రాశాను. ఇందులో సాహిత్యం, ఆధ్యాత్మికం, యువతకు సంబంధించిన విషయాలను విశదీకరించా.

సత్కారాలు.. అవార్డులు...
విద్యా బోధనలో నేను అనుసరిస్తున్న వినూత్న పద్ధతులు, తద్వారా వస్తున్న సత్ఫలితాలను గుర్తించి నాకు పలు సంస్థలు అవార్డులు ఇచ్చాయి. 2010లో నాగార్జున యూనివర్సిటీలో ‘పట్నాయకుని మోహన’ కవిత్వంపై ఎంఫిల్ చేసి గోల్డ్ మెడల్ అందుకున్నా. అలాగే, శీలా సుభద్రదేవి ‘కవిత్వం- పరిశీలన’ అంశంపై చేసిన పరిశోధనకుగాను 2016లో డాక్టరేట్ తీసుకున్నా. 2015లో ఏయూలో ఎంఈడీ పూర్తిచేశాను. ఇప్పటివరకు 12 పరిశోధన పత్రాలు సమర్పించాను. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఐఎ్‌సబీఎన్ నంబర్‌తో మూడు పుస్తకాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశాను. అలాగే, స్టేట్ రీసోర్స్ పర్సన్‌గా మూడు కీలక ప్రోగ్రామ్స్‌కు పనిచేశాను. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నా. 2014లో జిల్లా స్థాయిలో, 2019లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు తీసుకున్నా. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పర్యావరణ పరిరక్షణ, గిరి ప్రదక్షిణ సందర్భంగా పర్యావరణహితంగా చేసుకుందామంటూ ప్రజల్లో చైతన్యం కలిగించేలా పాడిన పాటలకుగాను జీవీఎంసీ గత ఏడాది ‘స్వచ్ఛ పురస్కార్’తో సత్కరించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నాకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును ప్రకటించడం సంతోషంగా ఉంది. వచ్చే నెల ఐదున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోనున్నాను. ఇన్నేళ్ల నా ఉపాధ్యాయ జీవితంలో నేను చేసిన అలుపెరుగని కృషికి దక్కిన ఫలితం ఇదని భావిస్తున్నాను. ఈ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది. ఇందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు, సహోద్యోగులకు కృతజ్ఞతలు.’’
ఇదీ కుటుంబం...
తగరపువలస ప్రాంతానికి చెందిన పక్కి మురళీ రమే్‌షతో 1995లో
నా వివాహం జరిగింది. మా అబ్బాయి సాయి అభిషేక్ ఐసీఐసీఐలో మేనేజర్‌గా చేస్తున్నాడు. కోడలు ప్రగతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అమ్మాయి సాయి అనుజ్ఞ.
సీఏ చేస్తూనే డెలాయిట్‌లో పని చేస్తోంది. అల్లుడు యోగి. యాపిల్‌లో హార్డ్‌వేర్ ఇంజనీర్.
బూటు శ్రీనివాసరావు, విశాఖపట్నం
ఫొటోలు: వై.రామకృష్ణ