Chicken snacks : చిటికెలో చికెన్‌ స్నాక్స్‌

ABN , First Publish Date - 2023-05-12T23:20:56+05:30 IST

ఎంతైనా చెప్పండి..! చికెన్‌తో చేసిన ఆహారం రుచే వేరు. ముఖ్యంగా సాయంత్రం పూట ఆడుతూ పాడుతూ తక్కువ సమయంలో చేసుకునే కొన్ని చికెన్‌ ..

Chicken snacks : చిటికెలో చికెన్‌ స్నాక్స్‌

ఎంతైనా చెప్పండి..! చికెన్‌తో చేసిన ఆహారం రుచే వేరు. ముఖ్యంగా సాయంత్రం పూట ఆడుతూ పాడుతూ తక్కువ సమయంలో చేసుకునే కొన్ని చికెన్‌ వంటలున్నాయి. అవే.. చికెన్‌ చీజ్‌ బాల్స్‌, పాప్‌ కార్న్‌ చికెన్‌, బటర్‌ ఫ్లై చికెన్‌, చికెన్‌ శాండ్‌విచ్‌. వీటిని సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలే కాదు పెద్దలూ ఈ స్నాక్స్‌ను ఎంచక్కా లాగించొచ్చు. ఈ చికెన్‌ స్నాక్స్‌ తయారీ తెల్సుకుందామా..

బటర్‌ ఫ్లై చికెన్‌

కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్‌ చికెన్‌ క్యూబ్స్‌– 250 గ్రాములు(చిన్న పీస్‌లు ఉండాలి), వెల్లుల్లి పేస్ట్‌– అర టీస్పూన్‌, ఉప్పు– అరటీస్పూన్‌, కారం పొడి– అరటీస్పూన్‌, నల్ల మిరియాల పొడి– పావు టీస్పూన్‌, కశ్మీరీ రెడ్‌ చిల్లీ పొడి– టీస్పూన్‌, నిమ్మరసం– అరటీస్పూన్‌, సోయాసాస్‌– అర టీస్పూన్‌, ఫుడ్‌ కలర్‌– చిటికెడు, పెరుగు– టేబుల్‌ స్పూన్‌, కార్న్‌ ఫ్లోర్‌– 3 టేబుల్‌ స్పూన్లు, బంగాళా దుంపలు– 2 (మీడియం)

తయారీ విధానం: ఒక బౌల్‌లో చికెన్‌ క్యూబ్స్‌ వేశాక.. అందులో వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు కారం పొడి, నల్ల మిరియాల పొడి, కశ్మీరి రెడ్‌ చిల్లీ పొడి, నిమ్మరసం, సోయా సాస్‌, ఫుడ్‌ కలర్‌, పెరుగు వేసిన తర్వాత చేత్తో బాగా మిక్స్‌ చేసి ఇరవై నిముషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత టేబుల్‌ స్పూన్‌ కార్న్‌ఫ్లోర్‌ వేసి మిశ్రమంలో కలపాలి. దీని వల్ల చికెన్‌ క్రిస్పీగా ఉంటుంది.

ఇంకో బౌల్‌లో అరకప్పు నీళ్లు తీసుకుని అందులో మిగిలిన రెండు టేబుల్‌ స్పూన్లు వేసి స్పూన్‌తో కలపాలి. బంగాళదుంపలను చిప్ప్‌కోసం కట్‌ చేసినట్లు స్లైస్‌లను చేసుకోవాలి. ఒక్కో స్లైస్‌ను కార్న్‌ఫ్లోర్‌ నీళ్లలో డిప్‌ చేసిన తర్వాత ఆ స్లైస్‌లో చికెన్‌ ముక్కను ఉంచి చుట్టినట్లు చేసి రెండింటినీ కలిపి టూత్‌ పిక్‌తో గుచ్చాలి. ఇలా అన్ని చికెన్‌ ముక్కలను బంగాళ దుంప స్లైస్‌ మధ్యలో ఉంచి టూత్‌పిక్‌తో గుచ్చుకోవాలి. ప్యాన్‌లో నూనె వేసి ఈ బటర్‌ఫ్లై చికెన్‌ను మీడియం ఫ్లేమ్‌లో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. గరిటెతో మెల్లగా కదుపుతూ అన్ని వైపులా కాల్చుకోవాలి. బంగాళదుంప రంగు మారిన తర్వాత బయటకు తీయాలి. బటర్‌ఫ్లై చికెన్‌ రెడీ.

CHICKEN_CHEESE_BALLS.gif

చికెన్‌ చీజ్‌ బాల్స్‌

కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్‌ చికెన్‌– అరకేజీ, వెలుల్లిపాయ రెబ్బలు–5, పచ్చిమిర్చి– 4 (సన్నగా తరగాలి), ఉప్పు– తగినంత, మిరియాల పొడి– అర టీస్పూన్‌, తరిగిన కొత్తిమీర– 2 టేబుల్‌ స్పూన్లు, గేదె పాల జున్ను– 2 టేబుల్‌ స్పూన్లు, కోడిగుడ్లు–2, మైదా– నాలుగు టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం: మొదట బోన్‌లెన్‌ చికెన్‌ను మంచినీటితో కడగాలి. ఒక ప్యాన్‌లో తీసుకుని అందులో చికెన్‌తో పాటు వెల్లుల్లిపాయ రెబ్బలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసిన తర్వాత రెండు నిముషాల పాటు మిశ్రమాన్ని కలపాలి. ప్యాన్‌మూత మూసి ఏడెనిమిది నిముషాల పాటు హైఫ్లేమ్‌లో ఉంచి మాడిపోకుండా కుక్‌ చేయాలి. బోన్‌లెస్‌ చికెన్‌ కాబట్టి త్వరగా ఉడుకుంది. ఆ తర్వాత ఆ చికెన్‌ను జార్‌లో వేసి మిక్సీపట్టాలి. ఆ చికెన్‌ పేస్ట్‌ను ఒక బౌల్‌లో ఉంచాలి. ఆ చికెన్‌ పేస్ట్‌లో కొత్తిమీర వేసి కలపాలి. ఆ చికెన్‌ పేస్ట్‌ను ఉండలా చేసేప్పుడు మధ్యలో చీజ్‌ను కొద్దిగా ఉంచి ఉండలా చుట్టాలి. అలా వచ్చినన్ని ఉండలు చేసుకోవాలి.

ముందుగా డీప్‌ ఫ్రైకి తగినంత నూనెను ప్యాన్‌లో వేసుకుని స్టవ్‌ ఆన్‌ చేయాలి. కోడిగుడ్లను పగలగొట్టి సొనల్ని ఒకబౌల్‌లో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పచ్చసొన మిక్స్‌ అయ్యేట్లు ఒక స్పూన్‌తో కలపాలి. చికెన్‌ బాల్స్‌ను కోడిగుడ్ల సొనలో ముంచి తీసిన తర్వాత మైదాపిండిలోనూ కదపాలి. ఇలా అన్ని చికెన్‌బాల్స్‌ను చేసుకుని పక్కన ఉంచుకోవాలి. బంగారు రంగు వచ్చేంత వరకూ డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వీటిని టమోటా కెచప్‌తో కలిపి తింటే బావుంటాయి.

SPICY-CHICKEN-SANDWICH.gif

చికెన్‌ శాండ్‌ విచ్‌

కావాల్సిన పదార్థాలు: చికెన్‌ బ్రెస్ట్‌– 200 గ్రాములు ( సన్నటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), నిమ్మరసం– టీస్పూన్‌, ఉప్పు– పావు టీస్పూన్‌, మిరియాల పొడి– అర టీస్పూన్‌, నూనె– 2 టేబుల్‌ స్పూన్లు, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు– టీస్పూన్‌, కారంపొడి– పావు టీస్పూన్‌, చిల్లీ ఫ్లేక్స్‌– అరటీస్పూన్‌, థాయ్‌ చిల్లీసాస్‌– టేబుల్‌ స్పూన్‌, సోయాసాస్‌– టీస్పూన్‌, మాయోనైస్‌– టేబుల్‌ స్పూన్‌, బ్రెడ్‌– ఒక ప్యాక్‌ , ఉల్లిపాయ– 1

తయారీ విధానం: చికెన్‌ ముక్కలను బౌల్‌లో వేయాలి. అందులో నిమ్మరసం, ఉప్పు, పావు టీస్పూన్‌ మిరియాల పొడి వేసిన తర్వాత మిశ్రమాన్ని కలిపి పది నిముషాలు అలానే ఉంచాలి. ప్యాన్‌లో నూనె వేసి వెల్లుల్లి ముక్కలు వేసి స్పూన్‌తో కదపాలి. ఆ తర్వా చికెన్‌ ముక్కల్ని వేయాలి. రంగు మారేంత వరకూ చికెన్‌ను గరిటెతో కదుపుతూ ఉండాలి. చికెన్‌ వేగిన తర్వాత కారంపొడి, చిల్లీఫ్లేక్స్‌, మిగిలిన మిరియాల పొడి వేసి ఐదు నిముషాల పాటు వేయించాలి. ఆ తర్వాత థాయ్‌ చిల్లీ సాస్‌, సోయాసాస్‌ వేసి మిశ్రమంలో కలిసేట్లు గరిటెతో రెండు నిముషాలు కదిపాక స్టవ్‌ ఆఫ్‌ చేసి ప్యాన్‌ను పక్కన ఉంచాలి.

రెండు బ్రెడ్‌ స్లైస్‌లకు లోపలి వైపు మయోనైస్‌ పేస్ట్‌ పూయాలి. ఆ పేస్ట్‌ పూసిన స్లైస్‌పై చికెన్‌ ముక్కలను సర్ది, ఉల్లిపాయ స్లైస్‌ ఉంచి.. దాన్ని చీజ్‌ స్లైస్‌తో కప్పిదాని మీద మయోనైస్‌ పూసిన వైపు బ్రెడ్‌ స్లైస్‌తో క్లోజ్‌ చేయాలి. బ్రెడ్‌ స్లైస్‌ బైట వైపు ప్రాంతంలో వెన్న పూసి ప్యాన్‌మీద రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని అలానే కాల్చుకోవాలి. ఈ శాండ్‌ విచ్‌లు భలే ఉంటాయి.

POPCORN-CHICKEN-RECIPE.gif

పాప్‌కార్న్‌ చికెన్‌

కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్‌ చికెన్‌– 400 గ్రాములు, మజ్జిగ– పావు కప్పు, ఉప్పు– టీస్పూన్‌, కారంపొడి– 1 టీస్పూన్‌, జీలకర్ర పొడి– 1 టీస్పూన్‌, వెల్లుల్లి పేస్ట్‌– 1 టీస్పూన్‌, నల్ల మిరియాలు పొడి– అర టీస్పూన్‌, ఉల్లిపాయల పేస్ట్‌– 1 టీస్పూన్‌, నూనె– డీప్‌ ఫ్రైకి సరిపడినంత, మైదాపిండి– కప్పు

తయారీ విధానం: బౌల్‌లో కడిగిన చికెన్‌ వేశాక అందులో మజ్జిగ, ఉప్పు, కారం పొడి, జీలకర్ర పొడి, ఉల్లిపాయల పేస్ట్‌, వెల్లుల్లి పేస్ట్‌, నల్ల మిరియాల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్‌ చేయాలి. దీనికి ప్యాకింగ్‌ కవర్‌ వేసి నలభై నిముషాల పాటు మారినేట్‌ చేయాలి. ఒక ప్లేట్‌లో మైదా పిండి వేసి చికెన్‌ ముక్కలు వేసి పిండి బాగా కలిసేట్లు చేయాలి. వీటిని నీళ్లలో తడిపి మరోసారి ఆ మైదాపిండిలో వేసి చేత్తో ముక్కలను కలపాలి. చికెన్‌ ముక్కలను పిండి బాగా పట్టుకుంటుంది. ఈ చికెన్‌ ముక్కలను జాలీ గరిటెతో తీసుకుని కదిపితే పిండి కిందకు పడిపోయి చికెన్‌ ముక్కలు మిగులుతాయి. వీటిని డీప్‌ఫ్రై చేసుకుంటే సరి.. చికెన్‌ పాప్‌కార్న్‌ రెడీ. వీటిని కేఎఫ్‌సీ చికెన్‌ పాప్‌కార్న్‌ అని కూడా అంటారు. వీటిని టమోటా కెచప్‌తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

నవ్య ‘స్మార్ట్‌ పేజీ’ లో ఆసక్తికర కథనాల కోసం.. ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. లేదా ఈ కింది యూఆర్‌ఎల్‌ https://qr.page/g/5ffLryuTHr5 లో చదవండి.


Updated Date - 2023-05-12T23:20:56+05:30 IST