Winter Diet : చలి కాలం చలాకీ ఆహారం
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:24 AM
ఏడాదంతా చురుగ్గా, చలాకీగా గడిపేసి, చివరి నెలలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి రుగ్మతలతో దిగాలు పడిపోతే ఏం బాగుంటుంది? ఏడాది మొదట్లో ఉన్న అదే హుషారు, చురుకుదనం ఏడాది చివర్లో కూడా కొనసాగాలంటే కొన్ని ఆహార
ఏడాదంతా చురుగ్గా, చలాకీగా గడిపేసి, చివరి నెలలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి రుగ్మతలతో దిగాలు పడిపోతే ఏం బాగుంటుంది? ఏడాది మొదట్లో ఉన్న అదే హుషారు, చురుకుదనం ఏడాది చివర్లో కూడా కొనసాగాలంటే కొన్ని ఆహార నియమాలు పాటించాలి. కాలానుగుణమైన వింటర్ డైట్‌ను అనుసరించాలి.
చలికాలంలో వేధించే శ్వాసకోస సమస్యల నుంచి శరీరాన్ని రక్షించుకోవాలంటే ఆహారాన్నే ఆయుధంగా వాడుకోవాలి. మరీ ముఖ్యంగా వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడం కోసం విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. సాధారణంగా ఈ కాలంలో కొద్దిగా పుల్లగా ఉండే పండ్లను అందరూ దూరం పెడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇలాంటి పండ్లనే చలి కాలంలో ఎక్కువగా తీసుకోవాలి. బత్తాయి, కమలా, నారింజ, దానిమ్మ పండ్లను తరచూ తింటూ ఉండాలి. అలాగే టమాటా, గుమ్మడి సూప్స్ తీసుకోవాలి. ఈ కాలంలో మెటబాలిజం, జీర్ణశక్తి నెమ్మదిస్తుంది. కాబట్టి వింటర్ డైట్‌లో సుగంధ ద్రవ్యాల వాడకాన్ని పెంచాలి.
స్పైసె్‌సతో చురుగ్గా...
మిరియాలు, దాల్చినచెక్క, పసుపు, అల్లం లాంటి సుగంధద్రవ్యాల వాడకాన్ని ఈ కాలంలో పెంచాలి. మిరియాలతో రసం కాచుకోవాలి. టీలో దాల్చిన చెక్క, అల్లం, మిరియాల పొడి వేసుకోవాలి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చలి కాలంలో వేధించే దగ్గు, జలుబులు దరి చేరకుండా ఉంటాయి. ఒకవేళ అవి సోకినా త్వరగా తగ్గిపోతాయి. ఇది ఫ్లూ సీజన్. పైగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి కొవిడ్ కాలంలో ఎంత అప్రమత్తంగా ఉన్నామో, ఎన్ని జాగ్రత్తలు పాటించామో, పోషకాహారాన్ని ఎలా ఎంచుకున్నామో, అవే అలవాట్లను ఇప్పుడు కూడా కొనసాగించాలి. ఈ కాలంలో గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. అలాగే నీటితో వ్యాప్తి చెందే ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా ఉండడం కోసం తాగే నీళ్లను వెంట ఉంచుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. అలాగే బయటి ఆహారానికి బదులుగా ఇంటి ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్రొటీన్ పుష్కలంగా....
ఈ కాలంలో ప్రొటీన్ ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇమ్యూనిటీ పెరగడానికి ప్రొటీన్ ఆహారం తోడ్పడుతుంది. దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ల బారిన పడినవాళ్లు త్వరగా కోలుకుని బలం పుంజుకోడానికి కూడా ప్రొటీన్ ఆహారం సహాయపడుతుంది. అలాగే ఈ కాలంలో పిల్లల చేత తప్పనిసరిగా రోజుకొక ఉడకబెట్టిన గుడ్డును తినిపించాలి. అలాగే ఉదయం, రాత్రి పాలు తాగించాలి. రాత్రి పడుకునే ముందు పాలల్లో పసుపు, దాల్చిన చెక్క పొడి, కుంకుమ పువ్వు కలిపి పిల్లల చేత తాగించాలి. అందరూ మాంసాహారం తినొచ్చు. అయితే హోటళ్లలో దొరికే మాంసాహార వంటకాలకు బదులుగా ఇంట్లో వండినవే తినాలి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకునేవాళ్లకు ఆయా హోటళ్లలో పాటించే పరిశుభ్రతా ప్రమాణాల గురించి తెలిసే వీలుండదు. ఆయా హోటళ్లకు స్వయంగా వెళ్లి ఉండరు. కాబట్టి ఎలాంటి వాతావరణంలో, ఎలాంటి దినుసులతో ఆ పదార్థాలను వండారో తెలిసే వీలుండదు. కాబట్టి ఈ కాలంలో బయటి పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే ఈ కాలంలో చల్లగా ఉండే సలాడ్స్ తినలేం. కాబట్టి మొలకలను కొద్దిసేపు వేయించుకుని, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుని తినాలి. దీన్ని ఈవినింగ్ స్నాక్‌గా తినొచ్చు. గర్భిణులు, పిల్లలు, పెద్దలకు ఈ స్నాక్ ఎంతో ఆరోగ్యకరం.
ప్రొటెక్టివ్ ఫుడ్స్ కీలకం
మైదాతో తయారయ్యే బ్రెడ్, కేక్స్, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్స్, పేస్ట్రీస్ లాంటి వాటిని మరీ ముఖ్యంగా పిల్లలకు తినిపించకుండా ఉంటేనే మంచిది. మందులు వాడినా, వాడకపోయినా ఒకసారి జలుబు సోకితే వారం రోజుల వేధిస్తుంది. ఎదిగే పిల్లలు ఇలాంటి ఇన్‌ఫెక్షన్లకు గురైతే త్వరగా బరువు తగ్గిపోయి, బలహీనపడిపోతారు. ఎదుగుదల కూడా మందగించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఉండే ఆహారపదార్థాలను పిల్లలకు దూరంగా ఉంచాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు పండే కాలం ఇది. కాబట్టి ప్రతి రోజూ వంటలో ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. అలాగే మిక్స్‌డ్ వెజిటబుల్ వంటకాలు వండుకోవాలి. వెజిటబుల్ పలావ్, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, సూప్స్ తయారు చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌లో మైక్రో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి ఉదయం లేదా సాయంత్రం గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండాలి.
మరీ ముఖ్యంగా మధుమేహుల చక్కెరలు స్థిరంగా ఉండడం కోసం బాదం, పిస్తా, వాల్‌నట్స్ ఉపయోగపడతాయి.
డైట్ రూల్స్ ఇలా...
వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఈ కాలంలో అంతగా దాహం వేయదు. అయినా ప్రతి రెండు గంటలకూ ఒక గ్లాసు నీళ్లు తాగుతూ ఉండాలి. లేదంటే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమదం ఉంటుంది. అలాగే చలి కాలం జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కాబట్టి ఆకలి తగ్గుతుంది. అలాగని ఉదయం అల్పాహారం మానకూడదు. వీలైనంత త్వరగా బ్రేక్‌ఫాస్ట్ తినేయాలి. అలాగే బ్రేక్‌ఫా్‌స్టలో రాగులు, సజ్జలు, మిల్లెట్స్ ఉండేలా చూసుకోవాలి. మిల్లెట్ పోరిడ్జ్, దోశ, ఉప్మాలు తినవచ్చు. ఉడకబెట్టిన గుడ్డు, లంచ్‌లో బ్రౌన్ రైస్, కూరగాయ వంటలు తినాలి. ఈ కాలంలో పెరుగు పూర్తిగా మానవలసిన అవసరం లేదు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పెరుగు కాకుండా తాజా పెరుగును వేడి అన్నంతో కలిపి తింటే ఆయాసం లాంటి ఇబ్బందులు తలెత్తవు. పెరుగుకు బదులుగా మజ్జిగ కూడా తీసుకోవచ్చు. వీటిని ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తీసుకోవచ్చు. సాయంత్రం వేళల్లో వేడిగా ఉండే సూప్స్ తాగుతూ ఉండాలి. రాత్రి డిన్నర్‌లో జొన్న రొట్టె ఆరోగ్యకరం. అలాగే నిద్రకు ముందు ఒక కప్పు పాలు తీసుకోవాలి.
మూడు పూటల్లో...
బ్రేక్‌ఫాస్ట్: సాధారణంగా ఎక్కువ మంది నూడుల్స్, పాస్టా, బ్రెడ్ లాంటి వాటిని బ్రేక్‌ఫా్‌స్టగా తింటూ ఉంటారు. ఇలాంటి ప్రాసె్‌సడ్ ఫుడ్స్‌ను ఈ కాలంలో పూర్తిగా మానేయాలి. మిల్లెట్స్, హోల్ గ్రెయిన్స్ ఆధారిత పదార్థాలు తినాలి. అల్పాహారాల్లో ఓట్స్, గోధుమ రవ్వ లేదా జొన్న రవ్వ ఉప్మాలు, మల్టీ గ్రెయిన్ రొట్టెలు లేదా దోశలు, రాగి ఇడ్లీ లాంటివి తినాలి. వీటితో పాటు రోజుకొక ఉడకబెట్టిన గుడ్డు తప్పనిసరిగా తీసుకోవాలి. గుడ్డు తిననివాళ్లు మొలకలు తినాలి. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఉదయం కాకుండా బ్రేక్‌ఫా్‌స్టకూ లంచ్‌కూ మధ్య బ్రంచ్‌గా పండ్లను తినాలి.
లంచ్: కూరగాయలు, బ్రౌన్‌రై్‌సతో కూడిన లంచ్ ఆరోగ్యకరం. మాంసాహారులు చికెన్, ఫిష్, మటన్ తినొచ్చు. అయితే ఇవన్నీ చక్కగా ఉడికి ఉండాలి.
ఈవినింగ్ స్నాక్: జింజర్ టీ, డ్రైఫ్రూట్ చిక్కీ, లడ్డు తినాలి. నువ్వులు, వేరుసెనగ లడ్డు తినొచ్చు. ఉడకబెట్టిన సెనగలు, బొబ్బర్లు, స్వీట్ కార్న్ కూడా తినొచ్చు.
డిన్నర్: వీలైనంత తక్కువగా, ఎర్లీగా తినాలి. డిన్నర్‌లో జొన్న రొట్టె, గోధుమ రొట్టె తినొచ్చు. అలాగే పడుకునే ముందు ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగాలి.
క్రిస్మస్ సంబరాల్లో ఇలా...
ఈ సందర్భాల్లో ఎక్కువగా కేక్స్, చాక్లెట్స్ తింటూ ఉంటారు. అయితే వాటి స్థానంలో డ్రైఫ్రూట్స్‌తో తయారుచేసిన చిక్కీలు, లడ్లు, తాండ్ర లాంటి వాటిని తినాలి. కేక్స్, పేస్ట్రీలను పరిమితంగా తినాలి. డ్రైఫ్రూట్స్‌తో తయారుచేసే ప్లమ్ కేక్స్‌కు, డార్క్ చాక్లెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
మంటల్లో కాల్చిన మాంసం వద్దు
చలి కాలంలో కబాబ్స్, డీప్ ఫ్రైల మీదకు మనసు మళ్లుతూ ఉంటుంది. కానీ మంటల్లో, లేదా నిప్పుల మీద నేరుగా కాల్చిన కబాబ్స్, నూనెలో వేయించిన డీప్ ఫ్రైడ్ మాంసాహారాల్లో ప్రొటీన్ నష్టం జరుగుతుంది. కేన్సర్ కారక కార్సినోజెనిక్ కారకాలు కూడా పెరుగుతాయి. కాబట్టి వీటిని ఎంతో అరుదుగా తినాలి. నిజానికి మాంసాహార వంటకాలను తక్కువ మసాలాలతో, సరళమైన పద్ధతుల్లో, పాత్రల్లోనే వండుకోవడమే ఉత్తమం. ఇలా వండుకున్నప్పుడే అవి చక్కగా ఉడకడంతో పాటు, తేలికగా జీర్ణమవుతాయి. వాటిలో పోషక నష్టం కూడా జరగదు.
కొవిడ్ ఫుడ్
పెద్దలు, పిల్లలు, గర్భిణుల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి కొవిడ్ పొంచి ఉన్న కాలంలో కొన్ని ఆహార నియమాలు పాటించాలి. మరీ ముఖ్యంగా పెద్దలకు డ్రైఫ్రూట్స్‌తో పాటు, రాగులు, సజ్జలు, జొన్నలు కలిపి జావలా తయారుచేసి, రాత్రి డిన్నర్ లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు తాగించాలి. గర్భిణులకు, పిల్లలకు కూడా రాగి జావ మేలు చేస్తుంది. పిల్లలు ఇష్టంగా తాగడం కోసం జావలో డ్రైఫ్రూట్స్ కలుపుకోవచ్చు.

సుజాత స్టీఫెన్
చీఫ్ న్యూట్రిషనిస్ట్,
యశోద హాస్పిటల్స్,
మలక్ పేట, హైదరాబాద్.