Buddhist story: ప్రకృతి కబళిస్తే...
ABN , First Publish Date - 2023-01-13T02:56:18+05:30 IST
బౌద్ధం నిరాశావాదం కాదు. దురాశావాదమూ కాదు. మనిషి ఆశాజీవి. అయితే, ఆ ఆశలకు బౌద్ధం హద్దులను నిర్ణయించింది. భిక్షువుల జీవనం వేరు, గృహస్థుల జీవనం వేరు.
ధర్మపథం
బౌద్ధం నిరాశావాదం కాదు. దురాశావాదమూ కాదు. మనిషి ఆశాజీవి. అయితే, ఆ ఆశలకు బౌద్ధం హద్దులను నిర్ణయించింది. భిక్షువుల జీవనం వేరు, గృహస్థుల జీవనం వేరు. ఈ జీవన విధానాలకు హద్దులను ఏర్పాటు చేయడం వల్ల... ప్రజల మధ్య అగాధం లాంటి వ్యత్యాసాలు లేకుండా, దాదాపు అందరూ సమానంగా జీవించగలరు. అలాంటి హెచ్చుతగ్గులు లేని సమాజాన్ని బౌద్ధం అందించింది. దురాశలు మనిషిని నైతికంగా పతనం చేస్తాయి. మనిషిలో స్వార్థాన్ని పెంచుతాయి. స్వార్థం అంతరించాలంటే మనిషి కోరికలను అదుపు చేసుకోవాలి. అలా అదుపు చేసుకోలేనివారు పచ్చి స్వార్థపరులవుతారు. తమ స్వార్థం కోసం తోటి మనుషులనే కాదు, ప్రకృతినీ పీక్కుతింటారు. భూమిని, భూగర్భాన్నీ, నదులనూ, సముద్రాలనూ, వాతావరణాన్నీ... చివరకు ఆకాశాన్ని సైతం కలుషితం చేసేస్తారు. దీనివల్ల అన్నం పెట్టే అడవులు కాలి బూడిదవుతాయి. ఆవాసమైన అవనికి ఉనికి లేకుండా పోతుంది. వీరి స్వార్థానికి సర్వ జీవులూ బలైపోతాయి. కాబట్టి ‘అలాంటి దురాశాపరుల్ని నిలువరించాల్సిందే. అవసరం అయితే అంకుశం ఉపయోగించాల్సిందే’ అని చెప్పే బౌద్ధ కథ ఇది.
పూర్వం వారణాసిలో ఒక వ్యాపార బృందం ఉంది. వారు బండ్ల మీద సరుకులు ఎత్తుకొని, దూరప్రాంతాలకు పోయి, వాటిని అధిక ధరలకు అమ్మేవారు. వారి ప్రయాణంలో అడవులు, ఎడారులు, పర్వత ప్రాంతాలు ఉండేవి. జనసంచారం లేని అలాంటి ప్రదేశాల్లో ఒక్కోసారి తీవ్ర అవాంతరాలు వచ్చిపడేవి. ఆహారం కొరత, నీటి కొరతతో పాటు... ఒక్కోసారి దారి తప్పేవారు. చేరవలసిన చోటుకు కాకుండా మరో ప్రాంతానికి చేరేవారు. అందుకే... ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్ళేవారు. ఇలాంటి వ్యాపారుల్ని ‘సార్ధవాహులు’ అంటారు. వారణాసికి చెందిన ఆ సార్థవాహుల బృందం పశ్చిమ దేశాలకు బయలుదేరింది. వారు వెళ్ళే దారిలో పెద్ద అడవి ఎదురైంది. వారు ఆ అడవిలో చాలా దూరం పోయారు. కొంతసేపటికి తాము దారి తప్పి, అడవి మధ్యకు వచ్చామని అర్థమయింది. చేరవలసిన చోటుకు ఎలా చేరాలో అర్థం కాలేదు. చేసేదిలేక అలా ముందుకు పోయారు. అక్కడ అడవి పలుచబడింది. ఇసుక ఎడారి వచ్చింది. వారు ఆ ఎడారిలో... ఇసుక తుపానులో చిక్కుకుపోయారు. ఏదో విధంగా అందరూ బతికి బయటపడ్డారు. దారి తెలియక అలా తిరుగుతూనే ఉన్నారు. తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి. నీటి బానల్లో నీరు నిండుకుంది. దాహంతో, ఆకలితో అలమటించిపోయారు. వారికి ఆ ఇసుక ఎడారి మధ్య కొద్దిపాటి పచ్చని ప్రాంతం కనిపించింది. ఆ పచ్చని ప్రదేశం మధ్యలో పెద్ద మేడి చెట్టు ఉంది. దానికి నాలుగు దిక్కులా నాలుగు శాఖలు విస్తరించి ఉన్నాయి. వారు ఆ చెట్టు దగ్గరకు చేరారు. ఆ చెట్టు తూర్పు కొమ్మ నుంచి నీరు బొట్లు బొట్లుగా కారడం కనిపించింది.
‘‘ఈ చెట్టు ఇక్కడ మనకోసమే పుట్టినట్టుంది. ఈ కొమ్మలో నీరు ఉంటుంది. ఈ కొమ్మను నరకండి’’ అన్నాడు వాళ్ళ నాయకుడు.
కొందరు తూర్పు కొమ్మను నరికారు. దానిలోంచీ నీరు ధారలా వచ్చిపడింది. వారంతా తృప్తిగా తాగారు. అందరూ ఆ నీటిలో జలకాలాడారు. ప్రయాణ బడలిక తీరింది. ‘ఇక ఆకలి తీరాలి’ అనుకున్నారు.
‘‘అదిగో... ఆ దక్షిణపు కొమ్మను చూడండి. దాని
లోంచీ పొగలు కక్కుతూ కమ్మని వాసనలు వస్తున్నాయి. దానిలో ఆహార పదార్థాలు ఉండొచ్చు’’ అన్నాడు నాయకుడు.
అంతే... ఆ కొమ్మను నరికేశారు. దానిలోంచి వేడివేడి ఆహార పదార్థాలు వచ్చాయి. ఆవురావురుమంటూ పీకలదాకా తిన్నారు. ‘ఇక, తాంబూలాలూ, మెత్తని పడకలు, పరిచారికలు ఉంటే ఎంత హాయి’ అనుకున్నారు.
నాయకుడి చూపు పశ్చిమ కొమ్మ మీద పడింది. ఆ కొమ్మలోంచీ అగరు, అత్తరుల సువాసనలు వస్తున్నాయి. వారు ఆ కొమ్మనూ నరికారు. తాంబూలాలు, మెత్తటి పరుపులు, అగరు గంధాలూ వచ్చాయి. వింజామరలు వీస్తూ పరిచారికలూ వచ్చారు. సార్ధవాహులు పడకల మీదికి చేరారు. సుఖంగా నిద్రపోయారు. తెలతెలవారుతూ ఉండగా లేచారు.
‘‘మనం బతికి బయటపడ్డాం. జీవించడానికి కావలసిన నీరు, ఆహారం, నివాస సౌకర్యాలూ లభించాయి. ఈ చెట్టు మనకు కల్పతరువు. దీని నాలుగో కొమ్మలో ఏముందో చూద్దాం’’ అంటూ ఆ కొమ్మను కూడా నరికారు. దానిలోంచి మణులు, రత్నాలు, బంగారు ఆభరణాలు కొల్లలుగా వచ్చిపడ్డాయి. వారు బండ్ల మీద తీసుకువచ్చిన సరుకులను అవతల పారేసి, ఆ సంచుల్లో ఆ విలువైన సంపదను నింపారు. వాటిని బండ్ల మీదకు ఎక్కించారు. అంతలో ఆ నరికిన కొమ్మలకు చిన్నచిన్న చివుర్లు వచ్చాయి.
‘‘ఇది మహత్తరమైన వృక్షం. దీని కొమ్మలతో మన అవసరాలు తీరాయి. దీని వేర్లలో కూడా ఏవో అద్భుత వస్తువులు ఉండొచ్చు’’ అన్నాడొకడు.
‘‘మిత్రులారా! ఈ చెట్టు మన ఆకలి తీర్చింది. మన ఆశలూ తీర్చింది. మనకిక దురాశ వద్దు. మన బండ్లు ఇప్పటికే బరువుతో ఉన్నాయి. ఇక చాలు. పదండి’’ అన్నాడు నాయకుడు.
‘‘నీవు మారు మాట్లాడకు’’ అంటూ మిగిలినవారందరూ పలుగులు పట్టి... ఆ చెట్టు వేర్లను తవ్వారు. వాటిని నరికి, చెట్టు మొదలును పక్కకు నెట్టారు. తల్లి వేరు తెగింది. అంతే... ఆ వేరులోంచి విషసర్పాలు ధారలా వచ్చిపడ్డాయి. బుసలు కక్కుతూ వారి మీద పడి కాట్లు వేశాయి. అందరూ నురగలు కక్కుకుంటూ అక్కడికక్కడే మరణించారు. దురాశకు పోని నాయకుడు ఒక్కడే మిగిలాడు. వాడూ తన బండిని అక్కడే వదిలిపెట్టి, కాలినడకన బతుకుజీవుడా అనుకుంటూ బయలుదేరాడు. అడవి నుంచి బయటపడ్డాడు.
‘ప్రకృతి అందించే వనరులను మనం అందుకోవాలే తప్ప... దురాశతో ఆ ప్రకృతినే కబళించకూడదు. అలా చేస్తే అదే నిర్దాక్షిణ్యంగా మనని కబళిస్తుంది’ అని బుద్ధుడు చెప్పిన మహాద్భుతమైన కథ ఇది.
- బొర్రా గోవర్ధన్