Bollywood migration : దక్షిణాదికి బాలీవుడ్‌ వలస బాట

ABN , First Publish Date - 2023-03-26T01:27:26+05:30 IST

ఒకప్పుడు బాలీవుడ్‌ ఇండస్ట్రీనే భారతీయ చిత్రపరిశ్రమకు బిగ్‌బాస్‌. అగ్రనటీనటుల ఫోకస్‌ అంతా హిందీ చిత్రాలపైనే ఉండేది. దక్షిణాది చిత్రాల్లో ..

Bollywood migration  : దక్షిణాదికి బాలీవుడ్‌  వలస బాట

ఒకప్పుడు బాలీవుడ్‌ ఇండస్ట్రీనే భారతీయ చిత్రపరిశ్రమకు బిగ్‌బాస్‌. అగ్రనటీనటుల ఫోకస్‌ అంతా హిందీ చిత్రాలపైనే ఉండేది. దక్షిణాది చిత్రాల్లో నటించడం కాదు కదా తెలుగు, తమిళ చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించడానికి కూడా అంత ఆసక్తి చూపేవారు కాదు. బాలీవుడ్‌ హీరోయిన్లు కూడా అడపా దడపా పేరున్న అగ్ర దర్శకుల చిత్రాల్లో మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించడానికి బాలీవుడ్‌ తారలు తహతహలాడుతున్నారు. సీనియర్‌ నటీనటులు, హీరోయిన్లు ఇక్కడ తెరపై మెరుస్తున్నారు.

టాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తున్నారు బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌. కుదిరితే కీలకపాత్ర, లేదంటే అతిథి పాత్రలో అయినా ఎలాంటి భేషజం లేకుండా కనిపిస్తున్నారు. దక్షిణాది చిత్రాలకు ఆయన ఇచ్చే గౌరవం అది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందే చిత్రాల్లో పెద్దరికం ఉట్టిపడే పాత్రలకు తెలుగు దర్శకులకు అమితాబ్‌ ఫస్ట్‌ చాయిస్‌ అవుతున్నారు. 2014లో ‘మనం’, 2019లో ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రాల్లో కనిపించారు. ఇప్పుడు ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. డేట్లు సర్దుబాటు చేయలేక ఆయన కొన్ని దక్షిణాది ఆఫర్లను వదులుకొంటున్నారు.

ప్రతినాయక పాత్రల్లో...

ఈ మధ్యకాలంలో పాన్‌ ఇండియా చిత్రాల్లో విలన్‌ పాత్రలకు బాగా ఫేమస్‌ అయ్యారు సంజయ్‌దత్‌. దక్షిణాది చిత్రాల్లో వరుసపెట్టి ప్రతినాయక పాత్రలు పోషిస్తున్నారు. ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2’లో అధీరా పాత్రలో ఆయన పలికించిన క్రూరత్వం ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చేసింది. ప్రస్తుతం ఆయన తమిళ హీరో విజయ్‌ నటిస్తున్న ‘లియో’ చిత్రం అంగీకరించారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ సంజయ్‌దత్‌ విలన్‌గా నటిస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది.

కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో విలన్‌ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సైఫ్‌ అలీఖాన్‌. త్వరలోనే దక్షిణాదిన అరంగేట్రం చేయనున్నారు. ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణుడి పాత్రను సైఫ్‌ పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇందులో విలన్‌ పాత్రకు సైఫ్‌ అలీఖాన్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

విలక్షణ నటనతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న నవాజుద్దీన్‌ సిద్దిఖీ కూడా దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. తొలిసారి ఆయన తెలుగు చిత్రం చేయబోతున్నారు. వెంకటేశ్‌ హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను రూపొందిస్తున్న ‘సైంధవ్‌’లో ఆయన నటిస్తున్నారు. గతంలో ఆయన రజనీకాంత్‌ నటించిన తమిళ చిత్రం ‘పేట్ట’లో కీలక పాత్ర పోషించారు.

బాలీవుడ్‌ హీరో బాబీడియోల్‌ కూడా త్వరలో తెలుగు తెరపై కనిపించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’లో ఆయన ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ఇది. బాలీవుడ్‌కి చెందిన మరో నటుడు అర్జున్‌ రామ్‌పాల్‌ ఈ చిత్రంలో ఓ పాత్రను పోషిస్తున్నారు.

అగ్రహీరోలు సైతం

బాలీవుడ్‌ అగ్రహీరోలు కొందరు టాలీవుడ్‌ బాట పడుతున్నారు. సల్మాన్‌ఖాన్‌ లాంటి ఒక బాలీవుడ్‌ టాప్‌హీరో చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 35 ఏళ్ల నటప్రస్థానంలో ఇప్పటిదాకా ఆయన తెలుగు తెరపై కనిపించింది లేదు. సల్మాన్‌ ఒక తెలుగు చిత్రంలో నటిస్తాడనే విషయం కొన్నేళ్ల క్రితం అస్సలు ఊహించలేం. మరోవైపు ఫ్లాప్‌ చిత్రాలతో సతమతమవుతున్న హీరోలు కొందరు బాలీవుడ్‌లో మళ్లీ ఫుల్‌ఫామ్‌లోకి రావాలనుకుంటున్నారు. దానికోసం తెలుగు పరిశ్రమ వైపు చూస్తున్నారు. కథలు, నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం, దర్శకులతో పనిచేయడం, హీరోయిన్లను తీసుకోవడం, తెలుగు సినిమాల రీమేక్‌లు ఇలా వీలును బట్టి ఉపయోగించుకుంటున్నారు.

రణ్‌వీర్‌సింగ్‌, రణ్‌బీర్‌కపూర్‌ లాంటి అగ్రహీరోలు కథ కుదిరితే తెలుగు సినిమాల్లో నటిస్తామంటున్నారు. పలువురు దక్షిణాది దర్శకులతో సినిమాలు కమిట్‌ అవుతున్నారు. కొన్ని రీమేక్‌ సినిమాలను డైరెక్ట్‌ చేసేందుకు దక్షిణాది దర్శకులకు అవకాశం ఇచ్చినా, స్ట్రెయిట్‌ సినిమాలతో మాత్రం సౌత్‌ డైరెక్టర్లను పెద్దగా ప్రోత్సహించలేదు. గతంలో తమిళ దర్శకులు శంకర్‌ ‘అపరిచితుడు’, ‘రోబో’ లాంటి సినిమాల కోసం ఆమిర్‌ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌ను సంప్రదించినా వారు అంగీకరించలేదు. ఇప్పుడు మాత్రం తెలుగు, తమిళ, కన్నడ దర్శకుల సాయంతో ఇటు దక్షిణాదిన, ముఖ్యంగా అటు ఉత్తరాదిన ఆశించిన విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో బాలీవుడ్‌ నటులు ఉన్నారు.

ఆ ఘనత ఇక గతమే

గతంలో దక్షిణాది హీరోలంటే ఒకట్రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ప్రాంతీయ హీరోలుగా మిగిలిపోయారు. అదే సమయంలో హిందీ హీరోలు మాత్రం యావద్దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న భావన ఉండేది. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ అంటే ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్‌ పేరు చె ప్పేవారు. హిందీ హీరోలకు దేశవ్యాప్తంగా క్రేజ్‌ ఉండేది. కానీ ఇప్పుడు ప్రభాస్‌, యష్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ లాంటి హీరోలు పాన్‌ ఇండియా చిత్రాలతో హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వారు నటించిన చిత్రాలు ఉత్తరాదిన సైతం భారీ వసూళ్లను రాబడుతున్నాయి. దక్షిణాదిన ప్రధాన నగరాల్లో తప్ప ద్వితీయ శ్రేణి, గ్రామీణ ప్రాంతాల్లో బాలీవుడ్‌ హీరోలకు అసలు మార్కెట్‌ లేదు. అయినా ఇన్నాళ్లు వాళ్లు నేషనల్‌ లెవల్లో హీరోయిజాన్ని ఎంజాయ్‌ చేశారు. బాలీవుడ్‌ హీరోల్లో మిగతావాళ్లకంటే తాము కొంచెం అధికులం అనే భావన వారి ప్రవర్తనలో కొట్టొచ్చినట్లు కనిపించేది. అయితే ‘బాహుబలి’ తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు గొప్పలకు పోకుండా బాలీవుడ్‌ అగ్రహీరోలు తెలుగు సినిమాల్లో ప్రాధాన్య పాత్రల్లో నటించడం చూస్తూనే ఉన్నాం.

janvi.jpg

హీరోయిన్ల వలస బాట

గతంలో అరుదుగా దక్షిణాది చిత్రాల్లో కనిపించేవారు బాలీవుడ్‌ హీరోయిన్లు. ఇప్పుడు మాత్రం తెలుగు, తమిళం లాంటి దక్షిణ భారత చిత్రాల్లో అవకాశం దక్కడమే గొప్పగా భావించి, వెంటనే అంగీకరిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనే కోరికతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో తక్కువ నిడివి ఉన్న పాత్రను చేశారు అలియాభట్‌. ప్రభాస్‌ సరసన ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రంలో నటిస్తున్నారు దీపికా పదుకోన్‌. మహేశ్‌-రాజమౌళి చిత్రంలో కూడా దీపికనే కథానాయికగా అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. శంకర్‌ సినిమా కోసం రామ్‌చరణ్‌తో మరోసారి జంట కట్టారు కియారా అద్వాణీ. ‘ఎన్టీఆర్‌ 30’ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానాయిక పాత్ర చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ‘హరిహరవీరమల్లు’లో నిధి అగర్వాల్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’లో సీత పాత్రను కృతిసనన్‌ పోషిస్తున్నారు.

Updated Date - 2023-03-26T01:27:26+05:30 IST