Biopic trend : బాలీవుడ్ తెరపై బయోపిక్ ట్రెండ్
ABN , First Publish Date - 2023-12-03T01:53:12+05:30 IST
రెగ్యులర్ చిత్రాలకు సమాంతరంగా బాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాల నిర్మాణం కొనసాగుతోంది. కొత్త సంవత్సరంలో కొన్ని బయోపిక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దక్షిణాదిన బయోపిక్ ట్రెండ్
రెగ్యులర్ చిత్రాలకు సమాంతరంగా బాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాల నిర్మాణం కొనసాగుతోంది. కొత్త సంవత్సరంలో కొన్ని బయోపిక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దక్షిణాదిన బయోపిక్ ట్రెండ్ తగ్గుముఖం పట్టినా హిందీలో మాత్రం ప్రముఖుల జీవిత చరిత్రతో తెరకెక్కే చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. క్రీడా విజేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు, సైన్యాధికారులు, సామాజిక కార్యకర్తల జీవితగాథల ఆధారంగా హిందీలో ప్రస్తుతం పలు బ యోపిక్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి.
తెలుగులో ‘మహానటి’ లాంటి చిత్రాలు తప్ప ఆ స్థాయి విజయం అందుకున్న బయోపిక్ చిత్రాలు లేవు. ఇటీవలే వచ్చిన రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం ఘోరంగా నిరాశపరిచింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం రవితేజకు మరో డిజాస్టర్‌ను మిగిల్చింది. కొన్నాళ్ల క్రితం దక్షిణాదినా ఉధృతంగా కొనసాగిన బయోపిక్ ట్రెండ్ ఇప్పుడు తగ్గిపోయింది. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈ జానర్‌లో వచ్చే చిత్రాల సంఖ్య పెరుగుతుండడం విశేషం. నటన కు ప్రాధాన్యం ఉన్న పాత్రలు, రియల్‌లైఫ్ డ్రామా ఉండడంతో బయోపిక్ చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ యువ హీరోలు ముందుకు వస్తున్నారు.
జనవరిలో వాజ్‌పేయి బయోపిక్
పంకజ్ త్రిపాఠి టైటిల్ పాత్రలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘మై అటల్ హూ’ అనే టైటిల్ ఖరారైంది. జాతీయ అవార్డు గ్రహీత రవిజాదవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘గొప్ప వ్యక్తి, రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడు అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రను పోషించే అవకాశం నాకు దక్కిన అదృష్టం’ అని పంకజ్ త్రిపాఠి చెప్పారు. ఈ చిత్రం జనవరి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఆకాశమే నీ హద్దు’ రీమేక్
విలక్షణ నటుడు సూర్య ప్రధాన పాత్రలో న టించిన ‘ఆకాశమే నీ హద్దు’ చిత్రం పలు భాషల్లో చక్కటి ప్రేక్షకాధరణ సొంతం చేసుకుంది. అవార్డులనూ కైవసం చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, ఎయిర్‌డెక్కన్ వ్యవస్థాపకులు జీ ఆర్ గోపీనాథ్ జీవితచరిత్ర ‘సింప్లి ఫ్లై’ ఆధారంగా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో ‘సూరారై పొట్రు’ పేరుతో విడుదలైంది. దక్షిణాది ప్రేక్షకులను ఈ సినిమా అమితంగా అలరించింది. దాంతో బాలీవుడ్ జనాలు అప్పుడే ఈ సినిమా రీమేక్ హక్కులపై కన్నేశారు. చాలామంది ప్రయత్నించినా చివరికి ఆ అవకాశం అక్షయ్‌కుమార్‌కు దక్కింది. రాధికా మధన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రీమేక్ చిత్రానికీ కూడా సుధాకొంగర దర్శకత్వం వహిస్తున్నారు.
చాంపియన్ కథతో
కార్తిక్ ఆర్యన్ హీరోగా కబీర్‌ఖాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ డ్రామా ‘చందు చాంపియన్’. ఆర్మీలో అనుభవ జ్ఞుడు, క్రీడల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న మురళీకాంత్ పేట్కర్ లాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1970లో జరిగిన కామన్వెల్త్, 1972లో జరిగిన పారా ఒలంపిక్ క్రీడల్లో ఆయన బంగారు పతకాలు సాధించి భారతీయులకు గర్వకారణమయ్యారు. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. తొలిసారి కార్తిక్ ఆర్యన్‌తో శ్రద్ధాకపూర్ జోడీ కడుతున్నారు. వచ్చే ఏడాది జూన్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సెట్స్‌పైకి వెళ్లనున్న ‘సహార శ్రీ’
సహారా పరివార్ గ్రూప్ వ్యవస్థాపకుడు దివంగత సుబ్రతారాయ్ జీవిత కథ ఆధారంగా ‘సహార శ్రీ’ చిత్రం తెరకెక్కుతోంది. సుబ్రతారాయ్ వ్యాపారరంగంలో అంచెలంచెలుగా ఎదిగి, పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా ఎదిగిన క్రమాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తోసేన్ తెరకెక్కిస్తున్నారు. డాక్టర్ జయంతిలాల్, సందీప్ సింగ్ నిర్మిస్తున్నారు. ఏ. ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘సహార శ్రీ’ వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సుబ్రతారాయ్ పాత్రను ఎవరు పోషిస్తున్నారో వెల్లడించాల్సి ఉంది.
అభినవ్‌బింద్రా బయోగ్రఫీ
ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత షూటర్ అభినవ్ బింద్రా జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. అభినవ్ ఆత్మకథ ‘ఎ షాట్ ఎట్ హిస్టరీ: మై అబ్సెసివ్ జర్నీ టు ఒలింపిక్ గోల్డ్’ ఆధారంగా ఈ బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. అనిల్‌కపూర్ తనయుడు హర్షవర్ధన్‌కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో అభినవ్ తండ్రి పాత్రను అనిల్‌కపూర్ పోషిస్తున్నారని సమాచారం. 2017లోనే ఈ బయోపిక్‌ను నిర్మిస్తామని అనిల్‌కపూర్ ప్రకటించారు. ఎందుకో ఆలస్యమయింది.
ఠాగూర్ జీవితకథతో..
అనుపమ్ ఖేర్ గతంలో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రను పోషించారు. కంగనారనౌత్ నటిస్తున్న ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో ఆయన లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన మరో బయోపిక్‌లో భాగమయ్యారు. నోబెల్ పురస్కార గ్రహీత, కవి రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రంలో అనుపమ్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తెల్లటి జుట్టు, పొడవాటి గడ్డంతో ఠాగూర్ అవతారంలో అనుపమ్ ఆకట్టుకున్నారు. నటుడిగా ఆయనకు ఇది 538వ చిత్రం. గురుదేవుని పాత్ర పోషించే భాగ్యం దక్కడంతో నా జీవితం ధన్యమైందని అనుపమ్ సోషల్ మీడియాలో స్పందించారు.
కంగన ఎమర్జెన్సీ
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితంలోని కీలక ఘట్టాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనారనౌత్ టైటిల్ పాత్ర పోషించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందిరాగాంధీ పాత్రలో కంగన ఒదిగిపోయారు. నవంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాల్సి ఉండగా విడుదల వాయిదా పడింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
ట్రాజెడీక్వీన్ జీవితం ఆధారంగా
ఒకప్పటి బాలీవుడ్ ప్రముఖనటి మీనాకుమారి బయోపిక్ తెరకెక్కుతోంది. విషాదభరితమైన పాత్రల్లో మెప్పించిన మీనాకుమారి ట్రాజెడీ క్వీన్‌గా అభిమానుల్లో గుర్తింపు పొందారు. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో ఆమె చనిపోయారు. ఈ బయోపిక్‌కు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మీనాకుమారి పాత్రను కృతీసనన్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.