Bhardwajiyam: ముందు మనల్ని మనం నమ్మాలి
ABN , First Publish Date - 2023-07-30T02:07:19+05:30 IST
ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫొటోను మొన్న నాకు ఎవరో పంపించారు. నేను కూడా దీన్ని మొదటిసారి చూస్తున్నా.
భరద్వాజీయం
ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫొటోను మొన్న నాకు ఎవరో పంపించారు. నేను కూడా దీన్ని మొదటిసారి చూస్తున్నా. కృష్ణ గారితో తీసిన ‘పచ్చని సంసారం’ సెట్‌లోనిది ఇది. దాదాపు అందులో నటించిన వారందరూ ఉన్నారు. ఫొటో చూడగానే ఒక్కసారి పాత జ్ఞాపకాలన్నీ కళ్ల ముందుకదలాడాయి. నేను సినిమా తీసి బాగా దెబ్బతిని, ఖాళీగా ఉన్న రోజులవి.
ఆ సమయంలో ‘పద్మాలయ’ హనుమంతరావు గారు చిన్న చిత్రాలు చేస్తున్నారు. ‘ఏవయ్యా... నువ్వు కూడా అటువంటి లో-బడ్జెట్ సినిమాలు తీయొచ్చు కదా’ అన్నారు. అప్పుడు ‘పద్మాలయ స్టూడియో’లోనే కూర్చొని నేను, ఆకెళ్ల గారు స్ర్కిప్ట్ రాసుకొంటున్నాం. ఒక రోజు కృష్ణ గారు అటు వెళుతూ ‘ఏమయ్యా... నీ కథేదో బానే ఉందంటున్నారు. ఒకసారి చెబుతావా’ అన్నారు. ‘ఏదో సార్. చిన్న సినిమా తీద్దామనుకొంటున్నాం’ అంటే...
‘ఒకసారి వచ్చి కథ చెప్పు’ అన్నారు. చెప్పాం. ‘బాగుంది కదా... నేను చేస్తా’ అన్నారు ఆయన. ‘మా దగ్గర అంత డబ్బు లేదు. ఏదో చిన్న నటులతో చేద్దామనుకొంటున్నాం సార్’ అన్నాను. ‘లేదయ్యా... బాగుంది. నేనే చేస్తాను. డబ్బులు నేనేమీ అడగలేదు కదా. మీరు ప్లాన్ చేసుకోండి’ అన్నారు. అప్పటికి నేను నిర్మించే పరిస్థితిలో కూడా లేను. అయితే అప్పుడే మా స్నేహితులు కొంతమంది కలిసి ఒక బ్యానర్ పెట్టి, సినిమా తీద్దాం అన్నారు. దాంతో ఈ కథ వాళ్లకు చెప్పి, షూటింగ్ మొదలుపెట్టాం. సినిమా సంక్రాంతి పండగకు విడుదల చేయాలి. డిసెంబర్ 25న ఒక పాటలో బిట్స్ తీస్తున్నాం... జూబ్లీహిల్స్ పద్మాలయ సమీపంలో ఒక ఇంట్లో. గిరిబాబు, కోట శ్రీనివాస్, బాబూమోహన్ డబ్బింగ్‌తో పాటు కొంత పార్టు ఎడిటింగ్ బ్యాలెన్స్ ఉంది. నెగెటివ్ కటింగ్, రీరికార్డింగ్, మిక్సింగ్ చేయాలి. కాపీ తీసుకురావాలి. అప్పుడు ఏదో సమస్య వల్ల విమానాలు నడవడంలేదు. దాంతో డిసెంబర్ 26న క్యాన్‌లన్నీ తీసుకుని రైలులో మద్రాసు బయలుదేరా. 31కి కాపీ సిద్ధమవ్వాలి. ఎందుకంటే ‘న్యూ ఇయర్ రోజు మీకు కాపీ చూపిస్తా’నని కృష్ణ గారికి చెప్పాను. ‘ఇంకా నాలుగు రోజులే ఉంది. నువ్వు ఎలా చూపిస్తావు’ అని అడిగారు ఆయన. ‘మీకెందుకు సార్. నేను చూపిస్తా’ అన్నాను.
ఈ లోపల మద్రాసులో ‘ముఠామేస్త్రి’ షూటింగ్ కోసం ట్యాక్సీలన్నీ బుక్ అయిపోయాయి. నాకు ట్యాక్సీ దొరకలేదు. నేను, చంద్రకాంత్ చిట్టి, రామరాజు... తలా ఒక మోటర్‌సైకిల్ వేసుకుని స్టూడియోలకు వెళ్లాం. అక్కడ ఏవీఎంలో డబ్బింగ్, మరోచోట విజయ గార్డెన్‌లో రీరికార్డింగ్, మిక్సింగ్
జరుగుతున్నాయి. నేను అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాను. నిర్మాతను కూడా కాబట్టి ప్రొడక్షన్‌కు డబ్బులు కూడా వెతుక్కోవాల్సి వచ్చింది. నాలుగు రోజుల్లో ఇవన్నీ చేసి 31 రాత్రి 11 గంటలకు ప్రసాద్ ల్యాబ్‌లో ఫస్ట్ కాపీ చూశాం. మరుసటి రోజు ఉదయం కృష్ణ గారికి ఫోన్ చేసి ‘సార్... సినిమా చూద్దాం’ అన్నాను. ‘దేవి శ్రీదేవి’లో పొద్దున్నే షో వేశాం. కృష్ణ గారి కుటుంబ సభ్యులు వచ్చారు. ఇంటర్వెల్‌లో సినిమా ఆపేశారు. ఎందుకో నాకు అర్థంకాలేదు. నేను బయట కూర్చొని ఉన్నాను. ఒకవేళ సినిమా బాలేదా... అనే సందేహం. ఏంటని అడిగితే... మహేశ్ కోసం సినిమా ఆపాం అన్నారు. చివరకు ఆయన వచ్చాక సెకండాఫ్ చూశారు. పిల్లలకు నచ్చిందంటే సినిమా బానే ఉందన్న ధైర్యం వచ్చింది నాకు. తరువాత సెన్సార్‌కు పంపిస్తే పాట ఆరంభంలో నిరోష ఎక్స్‌పోజింగ్ ఉందని కట్ చేశారు. దాంతో ఆ పాటలో పల్లవి లేకుండా జనవరి 9న విడుదల చేశాం. సినిమా విజయవంతమైంది. రీరికార్డింగ్‌కు విద్యాసాగర్ అందుబాటులో లేడు. ముందుగా అనుకోలేదని అతను ఏదో హిందీ సినిమా రీరికార్డింగ్ ఒప్పుకున్నాడు. రాత్రి కూర్చొని,తన అసిస్టెంట్‌ను పెట్టుకుని రీరికార్డింగ్ కానిచ్చాం.

ఇలా రకరకాల సమస్యలు, సవాళ్లు ఎదురైనా మేం అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయగలిగాం. ఇవాళ పోస్ట్ ప్రొడక్షన్‌కు మూడు నాలుగు నెలలు సరిపోవడంలేదు. డిసెంబరు 25న పాట తీశామని చెప్పాను కదా... అందులో కొడితే రాయి పగిలి నీళ్లు వస్తాయి. స్పాట్‌లోనే నేను ఏదో ఆలోచించి షూట్ చేశాను. ఈరోజుల్లో అయితే దాని కోసం గ్రాఫిక్స్ వాడేవారు. ఇలాంటివన్నీ అప్పటికప్పుడు అనుకుని తీసుకొంటూ వెళ్లిపోవాలి. నేనేదో గొప్పని కాదు... నాడు ఎవరైనా అలానే చేసేవారు. విఠలాచార్య గారు ట్రిక్స్ అన్నీ స్పాట్‌లో అనుకుని తీసినవే. అలాగే బాపూ గారు ‘సీతా కల్యాణం’లో. ఇవన్నీ టెక్నాలజీ లేని రోజుల్లో చేసిన చిత్రాలు. బడ్జెట్ లేదనుకోండి... ఉన్నదాంట్లోనే తీయడానికి ప్రయత్నించాలి. అంతేకానీ...
వాళ్లెవరో చేశారు కాబట్టి మనం కూడా అలానే చేయాలనుకోవడం, చివరకు డబ్బులు లేవు కాబట్టి మధ్యలో ఆగిపోయిందనే కారణాలు వెతుక్కోవడం సరైంది కాదు.
మనం ఏంచేయాలి... ఏం చేయగలం... ఎలా చేయాలనేది స్పష్టత ఉండాలి. సినిమా అంటేనే సృజన. మనం ఒక కల కంటాం. దాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తాం. అది ప్రేక్షకుల కలలను కూడా ప్రతిబింబించాలి. టెక్నాలజీ లేకపోయినా, బడ్జెట్ లేకపోయినా మన ఆలోచనతో, సృజనతో, కష్టంతో మనం అనుకున్నది అనుకున్నట్టు తీసి చూపించగలమా? ఆ పరిస్థితి వచ్చిన రోజు పరిశ్రమ బాగుంటుంది. ఇక్కడ కావల్సిందేమిటంటే మన మీద మనకు నమ్మకం. మనల్ని మనం నమ్ముకోకపోతే సినిమా... సినిమా అవ్వదు. ఇది నా అనుభవం నుంచి గ్రహించిన వాస్తవం. అదే మీతో పంచుకున్నాను.
-తమ్మారెడ్డి భరద్వాజ (దర్శకనిర్మాత)