అరటి పండు మంచిదా? కాదా?

ABN , First Publish Date - 2023-03-02T00:44:05+05:30 IST

చాలా మందికి బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక అరటిపండు తినే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు మధుమేహం ఉన్నవారికి మంచిది కాదని కొందరు సలహా ఇస్తూ ఉంటారు...

అరటి పండు మంచిదా? కాదా?

చాలా మందికి బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక అరటిపండు తినే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు మధుమేహం ఉన్నవారికి మంచిది కాదని కొందరు సలహా ఇస్తూ ఉంటారు. మరి కొందరు రోజుకు ఒక అరటి పండు తినటం వల్ల ప్రమాదం రాదని భరోసా ఇస్తుంటారు. ఈ రెండింటిలో ఉన్న నిజానిజాలేమిటో చూద్దాం..

అరటి పళ్లలో పొటాషియం, ఫైబర్‌, విటమిన్లు, కార్బోహైడేట్లు ఉంటాయి. దీనిని తినటం వల్ల తక్షణశక్తి ఉత్పత్తవుతుంది. అయితే దీనిలో ఉండే సహజసిద్ధమైన చక్కెర వల్ల బ్లడ్‌ గ్లూకోజ్‌ పెరుగుతుంది. అయితే ఒక అరటి పండుతో పాటుగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినటం వల్ల బ్లడ్‌ గ్లూకోజ్‌ ఎక్కువగా పెరగదు. అందువల్ల రోజుకు ఒక అరటి పండు తింటే మధుమేహ రోగులకు సమస్య ఉండదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో అరటిపండును తినకూడదు. దీనిలో అనేక రకాల పోషక పదార్థాలు ఉన్నా- ఆమ్లతత్వం కూడా ఉంటుంది. కడుపు ఖాళీగా ఉండటం వల్ల ఎసిడిటీ పెరుగుతుంది. అందువల్ల అరటిపండుతో పాటుగా ఉడకపెట్టిన గుడ్లు లేదా బాదం, పిస్తా వంటి డ్రైప్రూట్స్‌ను కూడా తినాలి. అప్పుడు ఎసిడిటీ ఏర్పడదు. అంతే కాదు. ప్రతి అరటిపండులోను మూడు గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. దీనితో పాటుగా ఫైబర్‌ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినటం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.

అరటిపండులో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. అరటి పళ్లను ఎక్కువగా తినటం వల్ల రక్తంలో మెగ్నిషియం బాగా పెరిగిపోయే అవకాశముంటుంది. రక్తంలో మెగ్నిషియం, కాల్షియం విలువల మధ్య తేడా వచ్చినప్పుడు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశముంది.

Updated Date - 2023-03-02T00:44:05+05:30 IST