Ashok: ఆ బడి... వాళ్ల ఆశయానికి గుడి

ABN , First Publish Date - 2023-02-24T23:13:40+05:30 IST

గ్రామస్తులను భాగస్వాములను చేయడం... ఎవరు ఏ పని చేయగలరో వారికి ఆ పని అప్పగించడం... ఇదే నా దినచర్యగా మారిపోయింది.

Ashok: ఆ బడి...   వాళ్ల ఆశయానికి గుడి

గ్రామస్తులను భాగస్వాములను చేయడం... ఎవరు ఏ పని చేయగలరో వారికి ఆ పని అప్పగించడం... ఇదే నా దినచర్యగా మారిపోయింది. కొత్త ప్రదేశం... కొత్త మనుషులు... కానీ నాకు ఏ రోజూ అలా అనిపించలేదు. అందరూ ఎంతో ఆప్యాయంగా... తమ ఇంటి మనిషిలా ఆదరించారు.

‘‘నాలుగేళ్ల కిందటి సంగతి ఇది. వృత్తిలో భాగంగా మావారు అశోక్‌ తూర్పు ఆఫ్రికాలోని మలావీ వెళ్లారు... ఒక కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ సూపర్‌వైజర్‌గా! అక్కడి చిసాసిలా గ్రామంలో కొత్తగా డ్యామ్‌ ఒకటి కడుతున్నారు. ఆ ప్రాజెక్ట్‌ పనుల కోసం ఆయన ఆ గ్రామంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రోజూ పనికి వెళ్లి వచ్చే దారిలో ఆయనకు ఒక ప్రాథమిక పాఠశాల కనిపించింది. పేరుకే అది స్కూలు. కానీ అక్కడ కనీస వసతులు లేవు. గడ్డితో కప్పిన చిన్న షెడ్డు... వానొస్తే తడుస్తూనే పిల్లలు పాఠాలు వింటున్నారు. అది కూడా అందరికీ సరిపోక చెట్టు కింద కొంతమందికి బోధిస్తున్నారు. ఎండలు మండుతున్నా సరైన నీడ లేని దుస్థితి. పిల్లలకు మెరుగైన వసతుల కల్పనకు ఏదైనా చేయాలనుకున్నారు అశోక్‌. తరువాత వాకబు చేస్తే తెలిసిందేమంటే... ఆ ప్రాంత ప్రజలంతా కలిసి ఏర్పాటు చేసుకున్న బడి అది అని! వాళ్లంతా పేదలు. కానీ తమలా తమ పిల్లల భవిష్యత్తు కూడా పేదరికంలో మగ్గకూడదనే సంకల్పంతో చదువు చెప్పించాలనుకున్నారు. సమీపంలో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేదు. అందుకే ఉన్నంతలో వసతులు సమకూర్చుకుని, స్కూలు నడిపిస్తున్నారు. చదువుకోవాలన్న వాళ్ల ధ్యేయం ఆయన్ను బాగా ఆకట్టుకుంది. అయితే భవనం కట్టాలన్న ఆలోచన అశోక్‌ మదిలో అప్పుడు లేదు. షెడ్డు కారకుండా రేకులు వేయించాలని తొలుత అనుకున్నారు. కానీ దానివల్ల తాత్కాలిక ప్రయోజనమే కలుగుతుందని భావించారు. కొంత్త భవనం ఒక్కటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని తలచి... ఆ దిశగా అడుగులు వేశారు.

Sumi-4.jpg

పెళ్లి తరువాత...

ఈ ఆలోచనను దుబాయిలో ఉండే తన స్నేహితుడు ఆషిక్‌ ముందు పెట్టారు అశోక్‌. ఆర్థిక సాయం అందిస్తానని ఆషిక్‌ హామీ ఇచ్చారు. దాంతో మావారు గ్రామస్తులతో మాట్లాడారు. భవనం కట్టాలంటే శ్రమదానం అవసరమన్నారు. అందుకు వారు సంతోషంగా ముందుకు వచ్చారు. ఏడాదిన్నర కిందట పని మొదలైంది. ఈ మధ్యలో ఆయన పెళ్లి కోసం స్వరాష్ట్రం కేరళ వచ్చారు. మా పెళ్లి తరువాత నేను కూడా ఆఫ్రికా వెళ్లాను. నా భర్త తలపెట్టిన మహత్తర కార్యంలో నేనూ భాగస్వామిని అయ్యాను. ఇది ఒక సామాజిక సేవలా కాకుండా... మా ఇంటి పనిలా భావించాం. అందుకే స్నేహితులు, సన్నిహితులను మినహా ఎవరినీ సాయం అడగలేదు. ఇస్తామన్నా తీసుకోలేదు. ఆయన సంపాదించిన దాంట్లో కొంత మొత్తం భవనం కోసం కేటాయించారు. ఉన్న కొద్ది నిధులతోనే భవనం పూర్తి చేయాలన్నది మా సంకల్పం. స్థానికులే ఇటుకలు తయారు చేశారు. కొన్నాళ్లకు ఆయన స్నేహితుడు, సివిల్‌ ఇంజనీర్‌ కెనీత్‌ ఫ్రాన్సిస్‌ జత కలిశారు.

కల నెరవేరిన రోజు...

గ్రామస్తులను భాగస్వాములను చేయడం... ఎవరు ఏ పని చేయగలరో వారికి ఆ పని అప్పగించడం... ఇదే నా దినచర్యగా మారిపోయింది. కొత్త ప్రదేశం... కొత్త మనుషులు... కానీ నాకు ఏ రోజూ అలా అనిపించలేదు. అందరూ ఎంతో ఆప్యాయంగా... తమ ఇంటి మనిషిలా ఆదరించారు. స్కూలు భవన నిర్మాణాన్ని తమ ఇంటి పనిలా భావించారు. మొత్తానికి అందరి సహకారంతో విశాలమైన నాలుగు తరగతి గదులతో పాఠశాల భవనం పూర్తయింది. పద్ధెనిమిది నెలల కష్టం. నా భర్త కల నిజమైన సందర్భం. భావోద్వేగంతో నా కళ్లు చెమర్చాయి. మా ఇద్దరి కృషికి గుర్తుగా ఆ భవనానికి ‘కేరళ బ్లాక్‌’ అని పేరు పెట్టారు. ఈ నెల 17న దాని ప్రారంభోత్సవం జరిగింది. ఈ పనులు జరుగుతుండగానే, ‘ఐక్యరాజ్య సమితి’ (యూఎన్‌) కొవిడ్‌ నివారణ బృందం ఒకటి చిసాసిలా గ్రామానికి వచ్చింది. వారు కూడా పాఠశాల ఆవరణలో మరో గది నిర్మించారు. ఇంకో విశేషమేమంటే... భవనం పూర్తవగానే పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు కూడా లభించింది. అంతేకాదు... స్కూల్‌ను ఎనిమిదో తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేసింది ప్రభుత్వం. అంతకముందు విద్యార్థులు పరీక్షలు రాయాలంటే ఎక్కడో దూరంలో ఉన్న వేరొక పాఠశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై వారికి ఆ శ్రమ లేదు. మావారి సహచర్యంలో, ఆయన ఆశయ సాధనలో భాగం పంచుకున్నాక నేనొక పాఠం నేర్చుకున్నా... మార్పు రావాలంటే తొలి అడుగు మనదే అయుండాలని!’’

Updated Date - 2023-02-24T23:13:41+05:30 IST