Share News

నాగులు, పాములు ఒకటేనా?

ABN , First Publish Date - 2023-11-17T05:24:42+05:30 IST

మనం ‘సర్పాలు’, ‘నాగులు’ అనే పదాలను ఒకే అర్థంలో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ సర్పాలు వేరు, నాగులు వేరు. ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు ‘సర్పణామస్మి వాసుకిః’ (సర్పాలలో నేనే వాసుకిని) అన్నాడు.

నాగులు, పాములు ఒకటేనా?

కార్తీక శుద్ధ చవితి రోజున నిర్వహించే నాగుల చవితి పూజకు మన సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ రోజున పుట్టల దగ్గరకు వెళ్ళి, పసుపు కుంకుమలతో పూజలు చేసి, పుట్టల్లో పాలు పోసే ఆచారం తెలుగునాట విస్తృతంగా కనిపిస్తుంది. కానీ ‘‘పాములు పాలు తాగుతాయా? పాములను అన్యాయంగా హింసిస్తున్నారు...’’ అనే విమర్శలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి పాములు పాలు తాగవు. అవి సరీసృపాలు కాబట్టి వాటికి జీర్ణ వ్యవస్థ ఉండదు. అలాగే పాములకు పసుపు కుంకుమలు కూడా పడవు. మరి ఇది ఆచారం ఎలా అయింది? అసలిది ఎలా మొదలయింది?

మనం ‘సర్పాలు’, ‘నాగులు’ అనే పదాలను ఒకే అర్థంలో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ సర్పాలు వేరు, నాగులు వేరు. ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు ‘సర్పణామస్మి వాసుకిః’ (సర్పాలలో నేనే వాసుకిని) అన్నాడు. ఆ తదుపరి శ్లోకంలోనే ‘అనన్తశ్చాస్మి నాగానాం’ (నాగులలో నేను అనంతుణ్ణి) అని కూడా చెప్పాడు. మరి సర్పాలు, నాగులు ఒకటే అయితే... శ్రీకృష్ణుడు వేర్వేరుగా చెప్పాల్సిన అవసరం ఏమిటి? వినతా పుత్రుడైన గరుత్మంతుడికీ, అతని సవతి తల్లి కద్రువ సంతానమైన సర్పాలకు మధ్య వైరం సుపరిచితమైన కథే. కద్రువ పెద్ద కుమారుడు అనంతుడు కాగా, రెండవ కుమారుడు వాసుకి. అనంతుడే ఆదిశేషుడు. అతను తపస్సు చేసి, మహా విష్ణువుకు పాన్పుగా ఉండే వరాన్ని పొందాడు. అలాగే ఈ భూమిని ఆదిశేషుడు తన తలపై మోస్తూ ఉంటాడనీ, మహా విష్ణువు అవతారాలు ఎత్తినప్పుడు... లక్ష్మణుడిగా, బలరామునిగా, కలియుగంలో గోవిందరాజులుగా ఆయన వెంటే ఉన్నాడనీ పురాణాలు చెబుతున్నాయి. ఇక, దేవ దానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు... మంధర పర్వతానికి వాసుకినే తాడుగా చేసుకున్నారు. మరి ఈ నాగులు, సర్పాల మధ్య తేడా ఏమిటి? దీనికి పురాణాల్లో వివరణ ఉంది. సర్పాలు నేల మీద జీవిస్తాయి. అవి పాకుతూ తిరుగుతాయి. ఎలుకలు, కప్పలు లాంటి వాటిని తింటాయి. కాగా ఈ సర్పాల్లో దేవతా సర్పాలు ఉంటాయి. అవి మానవులకు దూరంగా ఉంటాయి. అయితే పూర్వం అవి జనావాసాలకు దగ్గరగా ఉండేవనీ, మనుషులకు కనిపించేవనీ, వాటిని పూజిస్తే వరాలు ఇచ్చేవనీ అంటారు.

ఇక నాగులు వేరే లోకానికి చెందినవి. అవి కోరుకున్న ఏ రూపాన్నయినా ధరిస్తాయి. వాటికి గాలే ఆహారం. నాగులనూ, దేవతా సర్పాలనూ సంతాన, ఆరోగ్య ప్రదాతలుగా పూజించడం అనాదిగా ఉంది. పూర్వకాలంలో నాగులచవితి, నాగపంచమి తదితర ప్రత్యేకమైన దినాల్లో నాగులు మనుషులతో కలిసి తిరిగేవారనీ, నేరుగా పాలు, పండ్లు స్వీకరించి, పసుపు కుంకుమలతో పూజలు అందుకొనేవారనీ అంటారు. నాగులతో పాటు దేవతా సర్పాలు కూడా అపురూపమైన శక్తులు కలిగినవి. కాలక్రమేణా మానవుల్లో నిష్ట, నియమం, ధార్మిక చింతన, నిజాయితీ తగ్గడంతో అవి పూర్తిగా కనిపించడం మానేశాయనీ పెద్దలు చెబుతారు. ఇప్పుడు పుట్టల్లో కనిపించే పాములను దేవతా సర్పాలనో, నాగులనో చెప్పలేం. కాబట్టి నాగ ప్రతిష్ఠ చేసిన శిలలను, నాగ బంధాలను పూజించాలని ధర్మ గ్రంథాలు సూచిస్తున్నాయి. సాధారణంగా శివాలయాల్లోనూ, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లోనూ, కొన్ని చోట్ల ప్రత్యేకంగానూ నాగ బంధాలు ఉంటాయి. మామూలు పాములను పూజల పేరిట ఇబ్బంది పెట్టడం మాని, ఈ నాగ ప్రతిరూపాలను ఆరాధించడం, పూజించడం ద్వారా నాగ దోషాలను పోగొట్టుకోవచ్చు, నాగ దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు.

Updated Date - 2023-11-17T05:24:59+05:30 IST