Archer Taniparthi Chikita : విజయానికి విల్లు ఎక్కుపెట్టి..!
ABN , First Publish Date - 2023-12-07T04:15:37+05:30 IST
పేద రైతు కుటుంబం. ఆరుగాలం శ్రమించినా పూట గడవడం కష్టం. అంతటి కఠిన పరీక్షలకు తట్టుకుని... నాన్న చేయి పట్టుకొని నడిచింది తానిపర్తి చికిత. రోజూ నలభై కిలోమీటర్లు ప్రయాణించి...
పేద రైతు కుటుంబం. ఆరుగాలం
శ్రమించినా పూట గడవడం కష్టం.
అంతటి కఠిన పరీక్షలకు తట్టుకుని... నాన్న చేయి పట్టుకొని నడిచింది
తానిపర్తి చికిత.
రోజూ నలభై కిలోమీటర్లు ప్రయాణించి... సరైన శిక్షణ కోసం అకాడమీలెన్నో తిరిగి... తన కలనే కాదు... నాన్న తనపై పెట్టుకున్న నమ్మకాన్నీ నిలబెట్టింది.
మేటి ఆర్చర్‌గా ఎదిగిన పద్ధెనిమిదేళ్ల
రైతు బిడ్డ... జాతీయ చాంపియన్... చికిత విజయ గాథ ‘నవ్య’కు ప్రత్యేకం.
‘‘నన్ను జాతీయ స్థాయి క్రీడాకారిణిగా చూడాలన్నది నాన్న శ్రీనివాసరావు కల. ఆయన వాలీబాల్ ఆటగాడు. గ్రామస్థాయిలో బాగా ఆడేవారు. పెద్ద క్రీడాకారుడు కావాలని తాపత్రయపడేవారు. కానీ కుటుంబ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆటను పక్కన పెట్టి వ్యవసాయంలోకి దిగారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌లోని సాధారణ రైతు కుటుంబం మాది. అమ్మ శ్రీలత గృహిణి. తమ్ముడు యశ్వంత్ కూడా ఆర్చర్. ప్రస్తుతం నేను సోనిపట్‌లోని ‘సాయ్’ శిక్షణ కేంద్రంలో సాధన చేస్తున్నా.
సైనా స్ఫూర్తితో...
నేను ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో షట్లర్ సైనా నెహ్వాల్ ఒలింపిక్స్‌లో పతకం గెలిచింది. ఆమె స్ఫూర్తితో నన్ను కూడా మంచి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని నాన్న సంకల్పించారు. నా శారీరక సామర్థ్యం, అందుబాటులోని క్రీడా సదుపాయాలు, భారతీయ ప్రాచీన క్రీడ... తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఆర్చరీని ఎంచుకున్నాం. కరీంనగర్‌లోని ‘సీపీటీసీ’లో ఆర్చరీ రేంజ్‌తో పాటు కోచ్ కూడా ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లాం. తొలుత అక్కడ శిక్షణ తీసుకున్నా.
రోజుకు 40 కిలోమీటర్లు...
మా ఊరి నుంచి శిక్షణ కేంద్రం 20 కిలోమీటర్లు. అక్కడి నుంచి స్కూల్ మరో 20 కిలోమీటర్లు. ఉదయం ఐదున్నరకు ఇంటి నుంచి బయల్దేరి శిక్షణ కేంద్రానికి చేరుకొని, రెండు గంటల పాటు సాధన చేసేదాణ్ణి. ఆ తర్వాత మరో 20 కిలోమీటర్లు ప్రయాణించి నగ్నూర్‌లోని స్కూల్‌కు వెళ్లేదాణ్ణి. నాన్న ఆశయం, ఆటపై నాకున్న ప్రేమ... రోజూ అన్ని కిలోమీటర్ల ప్రయాణం నాకు శ్రమ అనిపించలేదు. ఎప్పుడూ నా దృష్టంతా శిక్షణపైనే. కఠోర సాధన అలవాటు చేసుకున్నాను. దానికి ప్రతిఫలంగా ఏడాది తిరిగే లోపు, 2019లో కరీంనగర్ ఎన్టీపీసీలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో స్వర్ణం పతకం సాధించా.
ఆమె చేయూత...
జాతీయ స్థాయిలో మేటి ఆర్చర్‌గా తయారవ్వాలంటే మరింత మెరుగైన కోచింగ్ అవసరమని గ్రహించా. మంచి అకాడమీ కోసం అన్వేషించాం. అలానే విల్లుతో పాటు టార్గెట్, ఇతర ఆర్చరీ పరికారాలు కొనడానికి నాన్న వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి, ఒకరి చేతిలో పెట్టి, మోసపోయారు. ఆ సంఘటన తర్వాత కూడా నాన్న వెనక్కి తగ్గలేదు. ఆర్చరీ ఎక్వి్‌పమెంట్ కోసం చాలా మందిని కలిసి, సాయం అడిగారు. ఈ క్రమంలో అప్పటి పెద్దపల్లి కలెక్టర్ దేవసేన మేడమ్ రూ.3.8 లక్షలు సాయం చేశారు. వాటితో ఢిల్లీ నుంచి ఆర్చరీ పరికారాలు తెప్పించి, ఇంటి వద్దనే నాన్న టార్గెట్ రేంజ్ ఏర్పాటు చేశారు. అలా కొద్ది కాలం ప్రఖ్యాత ఆర్చర్ల వద్ద చిట్కాలు తీసుకొని, ఏకలవ్యుడిలా ఇంటి వద్దే సాధన చేశా.
అభిషేక్.. జ్యోతి సహకారంతో..
ప్రపంచ ప్రఖ్యాత ఆర్చర్లు అభిషేక్‌వర్మ అన్న, జ్యోతి సురేఖ అక్క నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఇప్పటికీ వారు నాకు అండగా ఉంటూ, ప్రతి విషయంలో దిశానిర్దేశం చేస్తారు. సామాజిక మాధ్యమాల ద్వారా అభిషేక్ వర్మ సతీమణి సోనాలీని సంప్రదించి, అన్నను కలవగలిగాం. కోచింగ్‌లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పడంతో అన్న పెద్ద మనసు చేసుకొని, తనకు పోటీలు లేని సమయంలో నాకు శిక్షణ ఇచ్చేవాడు. అన్న ఖాళీగా ఉన్నాడని తెలిసినప్పుడు నాన్నతో కలిసి ఢిల్లీకి వెళ్లేవాళ్లం. అక్కడే వారం పదిరోజులు... ఒక్కోసారి 15 రోజులు కూడా ఉండేవాళ్లం. ‘యమునా ఆర్చరీ రేంజ్’లో అన్న ప్రత్యేకంగా నాకు శిక్షణ ఇచ్చేవాడు. ఢిల్లీకి వెళ్లడానికి, అక్కడ బస చేయడానికి అయ్యే ఖర్చలు భరించడానికి నాన్న చాలా ఇబ్బందిపడేవారు. కానీ ఆ విషయాలేవీ నాకు తెలియనిచ్చేవారు కాదు. ‘నీ లక్ష్యం ఆటపైనే తప్ప.. ఇతరత్రా ఏ విషయాల మీదకూ వెళ్లకూడదు’ అని మాత్రమే నాకు చెప్పేవారు. జ్యోతి అక్కతో కలిసి సోనిపట్ ‘సాయ్’లో శిక్షణ తీసుకుంటూ చాలా మెళకువలు నేర్చుకుంటున్నా.
విఫలమైనా..
అనుభవజ్ఞుల శిక్షణలో ఎంతో మెరుగయ్యాను. రాష్ట్రంలో నిర్వహించిన కాంపౌండ్ ఆర్చరీ సెలెక్షన్స్ ట్రయల్స్‌లో సబ్ జూనియర్, సీనియర్ వ్యక్తిగత కేటగిరీల్లో స్వర్ణాలు సాధించా. 2021లో మహారాష్ట్రలో జరిగిన జాతీయ పోటీలకు అర్హత సాధించా. అక్కడ వ్యక్తిగత విభాగంలో రజతం, మిక్స్‌డ్‌లో కాంస్య పతకాలు గెలిచా.
అనంతరం గత మేలో తాష్కెంట్‌లో జరిగిన ఆసియాక్‌పనకు అర్హత సాధించా. ఇదే నా తొలి అంతర్జాతీయ ఈవెంట్. అయితే అక్కడ పతకం గెలవలేకపోయాను. అయితే మెరుగుపర్చుకోవాల్సిన అంశాలను గ్రహించి, నన్ను నేను సరిదిద్దుకోవడానికి ఆ పోటీలు బాగా ఉపయోగపడ్డాయి. ఈ ఏడాది అక్టోబరులో గోవా వేదికగా జరిగిన జాతీయ క్రీడల్లో మహిళల కాంపౌండ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సాధించా. ఇటీవల అయోధ్యలో జరిగిన జాతీయ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ కేటగిరీలో, టీమ్ ఈవెంట్‌లో రజతాలు నెగ్గాను. ఇవి నాకు ఎనలేని ప్రోత్సాహం ఇచ్చాయి. ప్రభుత్వ సహకారముంటే మరిన్ని పతకాలు సాధిస్తా.
టార్గెట్... ప్రపంచ కప్
ఈ నెల 11వ తేదీ నుంచి కోల్‌కతా జాతీయ ర్యాంకింగ్ టోర్నమెంట్ జరగనుంది. అందులో సత్తా చాటాలనే ధ్యేయంతో బరిలోకి దిగుతున్నాను. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న జాతీయ ఓపెన్ ట్రయల్ ్సలో టాప్-4లో నిలిచి, ఏప్రిల్‌లో జరిగే ఆర్చరీ ప్రపంచకప్‌నకు అర్హత సాధించాలనేది నా ప్రస్తుత లక్ష్యం. ఈ వరల్డ్ కప్‌లో వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లలో అభిషేక్ అన్న, జ్యోతి అక్కతో కలిసి దేశం తరఫున పతకాలు సాధించాలనేది నా కల. అందుకోసం కఠోరంగా సాధన చేస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ మెరుగు పర్చుకునేందుకు విదేశాలు వెళ్లి, వివిధ టోర్నీల్లో ఆడాల్సి ఉంది. ఇది ఖర్చుతో కూడుకున్నది. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు సాయం అందిస్తే... మరిన్ని అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని... రాష్ట్రానికీ, దేశానికీ కీర్తి తీసుకువస్తా.
సంజయ్ ఎస్‌ఎస్‌బి