Appasani Seshagiri Rao: ఈ వందేళ్లలో.. ఒక్కసారీ గుడ్డు తినలేదు!
ABN , First Publish Date - 2023-02-28T03:00:32+05:30 IST
‘‘శతమానం భవతి’’ అని పెద్దలు ఆశీర్వదీస్తూ ఉంటారు. సుఖసంతోషాలతో నూరేళ్లు జీవించమనేది ఈ దీవెన అర్థం. అప్పసాని శేషగిరిరావును చూస్తే - ఆయనను ఎవరో బలంగా దీవించారా? అనిపిస్తుంది.
ఆరోగ్య భాగ్యం
‘‘శతమానం భవతి’’ అని పెద్దలు ఆశీర్వదీస్తూ ఉంటారు. సుఖసంతోషాలతో నూరేళ్లు జీవించమనేది ఈ దీవెన అర్థం. అప్పసాని శేషగిరిరావును చూస్తే - ఆయనను ఎవరో బలంగా దీవించారా? అనిపిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీకి వందేళ్లు పూర్తి చేసుకోబోతూ... పరిపూర్ణంగా జీవిస్తున్న ఆయన నవ్యకు తన ఆరోగ్య రహస్యాలను వెల్లడించారు.
‘‘చిన్నప్పటి నుంచి నేను ఆరోగ్యవంతుణ్ణే! ఎప్పుడూ జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చిన జ్ఞాపకం కూడా లేదు. ఇప్పటికీ బీపీ, సుగర్‌లు లేవు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి నాకు వందేళ్లు పూర్తవుతాయి. 101లోకి అడుగుపెడతాను. ఇప్పటికీ నేను వాకింగ్‌కు వెళ్తాను. మా వ్యవసాయ పనులు చేయిస్తూ ఉంటాను. అందరూ ‘మీ ఆరోగ్య రహస్యం ఏమిట’ని అడుగుతూ ఉంటారు. నా ఉద్దేశంలో ప్రతి మనిషి- ఇటు శారీరకంగా, అటు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. చెడు అలవాట్లు లేని జీవన శైలిని అనుసరించాయి. అప్పుడే పూర్ణాయుర్ధాయం లభిస్తుంది. ఇక నా విషయానికి వద్దాం. మాది తాడేపల్లిగూడెం దగ్గర నారాయణపురం అనే పల్లెటూరు. నేను పుట్టింది, పెరిగింది, పస్తుతం నేను ఉంటున్నది అక్కడే! పల్లెటూరి వాతావరణం వల్ల కాలుష్యం ఉండదు. ఇక ఆహారం విషయానికి వస్తే- నేను సంపూర్ణ శాకాహారిని. నా వందేళ్ల జీవితంలో ఒక్కసారి కూడా మాంసాహారం తినలేదు. మాంసాహారం దాకా ఎందుకు... కోడిగుడ్డు కూడా తినలేదు. అయితే మా కుటుంబ సభ్యులు మాంసాహారం తింటారు. అది వారిష్టం. నన్ను అడిగితే- నేను ఇంత కాలం జీవించటానికి శాకాహారమే కారణమని నమ్ముతాను.
చాలామంది శాకాహారం తింటే ప్రొటీన్ రాదని భావిస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. పూర్తి శాకాహారంలో కూడా ప్రొటీన్ ఉంటుంది. ఏఏ పదార్థాలు తినాలి, ఏవి తినకూడదనే విషయం మీద స్పష్టత ఉండాలి. నా ఉద్దేశంలో చక్కెర విషంతో సమానం. మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ శాతం చక్కెరను ఎక్కువగా తినటం వల్లే వస్తాయి. ఇదే విధంగా నూనె వాడకం తగ్గించుకోవాలి. ఇవి మినహాయించి మిగిలినవన్నీ తినవచ్చు. ఆరోగ్యంగా ఉండటం కోసం నేను ప్రత్యేకమైన ఆహారలేవీ తీసుకోను. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నాకు ఆల్కహాల్, సిగరెట్లు వంటి చెడు అలవాట్లు లేవు. నేను బ్రహ్మచారి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సేల్స్ ఆర్గనైజర్‌గా పనిచేసినప్పుడు... దక్షిణ భారత దేశం అంతా తిరుగుతూ ఉండేవాడిని. ఆ సమయంలో హోటల్స్‌లో... నా పక్కన ఉన్న రూమ్స్‌లో వారు మద్యం సేవించేవారు, సిగరెట్లు తాగేవారు. కానీ నాకు ఎందుకో ఆ వైపు మనసు పోలేదు.
ఇక శారీరక వ్యాయామం విషయానికి వస్తే- చిన్నప్పటి నుంచి నాకు ఎక్సర్‌సైజ్‌లు చేయటం అలవాటు లేదు. ఆటలు కూడా ఆడేవాణ్ణి కాదు. కానీ రోజూ నడక మాత్రం తప్పనిసరి. ఇప్పటికీ ఈ అలవాటే కొనసాగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసికంగా కూడా మనం దృఢంగా ఉండాలి. అత్యాశకు పోకూడదనేది ఆ ప్రధాన సూత్రం. ఏదో సంపాదించాలని, ఏదో చేయాలని ఆశ ఉండవచ్చు. కానీ అది అత్యాశ మాత్రం కాకూడదు. అత్యాశే మనిషికి శత్రువు. అదే మనిషిని రకరకాల సమస్యల్లోకి దింపుతుంది. నా ఉద్దేశంలో మానసిక ప్రశాంతత ఏర్పడాలంటే అత్యాశ ఉండకూడదు. దీనిని నమ్మితే నిండు నూరేళ్లు సుఖంగా జీవించవచ్చు.’