Ananya Sharma: స్పష్టతే నా బలం

ABN , First Publish Date - 2023-07-05T00:30:43+05:30 IST

అనన్యా శర్మ... అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ... ‘30 వెడ్స్‌ 21’లో ‘మేఘన’ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది ఎవరికైనా. కోరి ఇంజనీరింగ్‌ చదివినా... పయనం ఏ సాఫ్ట్‌వేర్‌ వైపో సాగలేదు.

Ananya Sharma: స్పష్టతే నా బలం

అనన్యా శర్మ... అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ... ‘30 వెడ్స్‌ 21’లో ‘మేఘన’ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది ఎవరికైనా. కోరి ఇంజనీరింగ్‌ చదివినా... పయనం ఏ సాఫ్ట్‌వేర్‌ వైపో సాగలేదు. వినోద పరిశ్రమలో కెరీర్‌ను వెతుక్కొని... నటిగా మంచి ఆదరణ పొందుతోంది ఈ వరంగల్‌ అమ్మాయి. తాజాగా మరో వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో అలరిస్తున్న అనన్యతో ‘నవ్య’ ముచ్చట్లు.

‘‘నాకు పదిహేనేళ్లు ఉంటాయి అప్పుడు. ఎందుకో తెలియదు... నటనపై ఆసక్తి పెరిగింది. తెరపై నన్ను నేను చూసుకోవాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది. అలాగని ప్రయత్నాలు ఏమీ చేయలేదు కానీ... చెన్నై ‘విట్‌’లో ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కంప్యూటర్స్‌ ఇంజనీరింగ్‌ చదవడానికి వెళ్లినప్పుడు చక్కని అవకాశం లభించింది. అదేంటంటే... కాలేజీలో థియేటర్‌ డ్రామా క్లబ్‌ ఒకటి ఉండేది. అందులో చేరాను. మా సీనియర్సే కాకుండా ప్రముఖ రంగస్థల, సినీ నటులు, టెక్నీషియన్స్‌ వచ్చి మాలోని నటనకు మెరుగులు దిద్దేవారు. అక్కడే బలమైన పునాది పడింది. ‘నేను కూడా బానే నటించగలను’ అని అనిపించింది. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు నా ప్రదర్శన తప్పకుండా ఉండేది. అదికూడా నటనకు సంబంధించే. అప్పుడప్పుడు డ్యాన్స్‌లు కూడా చేశాననుకోండి.

అలా మొదలైంది...

ఎప్పుడైతే నాపై నాకు నమ్మకం కలిగిందో... ఇక అప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించాను. యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిలిమ్స్‌, వెబ్‌ సిరీస్‌లు చాలా వస్తున్నాయి కదా. అందుకే తొలుత నా అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకోవాలనుకున్నాను. కొన్ని ఆడిషన్స్‌కు వెళ్లాను. చివరకు 2020లో ‘బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ టేల్స్‌’ అనే స్కెచ్‌ వీడియోలో నటించాను. అంటే యూట్యూబ్‌లో చిన్న చిన్న ఫన్నీ వీడియోస్‌ వస్తుంటాయి కదా... అలాంటివి. అవి ఓ పది వరకు చేశాను. తరువాత ‘అదేంటో కానీ ఉన్నపాటుగా’ షార్ట్‌ ఫిలిమ్‌తో పాటు రెండు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌... ‘లాలీపాప్‌, మైరా’లో కూడా నటించాను.

పేరు తెచ్చిన సిరీస్‌...

ఇంజనీరింగ్‌ చదువుతూనే యాక్టింగ్‌ కూడా చేస్తూ వచ్చాను. అయితే లాక్‌డౌన్‌లో నాకు తీరిక దొరికింది. అదే సమయంలో ఓ వెబ్‌సిరీస్‌ అవకాశం వచ్చింది. ఓకే చెప్పాను. అదే ‘30 వెడ్స్‌ 21’. యూట్యూబ్‌లో 2021లో వచ్చిన ఆ వెబ్‌సిరీస్‌ మేమెవరూ ఊహించనంత హిట్‌ అయింది. అందులో ‘మేఘన’గా నటించిన నాకు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌. తొలి సీజన్‌ బంపర్‌ హిట్‌ అవ్వడంతో 2022 రెండో సీజన్‌ కూడా వదిలాం. ఒక్కో ఎపిసోడ్‌ కనీసం పది మిలియన్ల మంది వీక్షించారంటేనే అర్థమవుతుంది... అది ఎంతపెద్ద విజయమో. ‘బాగా చేశావ్‌’ అంటూ చాలామంది నన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఆ వెబ్‌ సిరీస్‌తోనే అనన్య అంటే అందరికీ తెలిసింది. బయట ఎక్కడికి వెళ్లినా గుర్తుపడుతున్నారు. ఆ విజయం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

ఓటీటీలో మొదటిసారి...

గత ఏడాది నా ఇంజనీరింగ్‌ పూర్తయింది. బయటకు వస్తూనే ఒక మంచి అవకాశం నా తలుపు తట్టింది. ‘ఆహా’ ఓటీటీ వారి ‘అర్థమయ్యిందా అరుణ్‌కుమార్‌’ వెబ్‌సిరీస్‌లో నాది కథానాయిక పాత్ర. గత నెల 30న విడుదల అయింది. ఓటీటీలో నాకు ఇదే తొలి ప్రాజెక్ట్‌. ఇందులో నటిస్తున్నప్పుడు, స్ర్కిప్ట్‌ చూసినప్పుడు ఓటీటీకి... గతంలో నేను చేసిన డిజిటల్‌ స్పేస్‌కు పెద్దగా తేడా కనిపించలేదు. కానీ ఒక్కసారి ట్రైలర్‌ లాంచ్‌ అయ్యాక తెలిసింది... నాకు లభించింది చాలా పెద్ద వేదిక అని. ప్రేక్షకులు ఈ కంటెంట్‌ను చూసే కోణం వేరు. అంటే యూట్యూబ్‌లాంటి వాటిల్లో చాలావరకు చూసి వదిలేస్తుంటారు. కానీ ఇక్కడ అలా కాదు... ప్రతిదీ పరిశీలించి, నచ్చితేనే మనకు మార్కులు వేస్తారు. ‘ఆహా’వారి ప్రమోషన్‌ కూడా గొప్ప స్థాయిలో ఉండడం నాకు కలిసి వచ్చింది.

ఎంతో ఆస్వాదించా...

ఈ వెబ్‌సిరీస్‌ కోసం అమలాపురంలో ఇరవై రోజులకు పైగా ఒక షెడ్యూల్‌ నడిచింది. సెట్స్‌లో ఉన్నంతసేపూ మేం ఎంతో ఆస్వాదించాం. మంచి అవుట్‌పుట్‌ రావాలని యూనిట్‌ అంతా బాగా కష్టపడ్డాం. కామెడీకి అవకాశం ఉన్న మంచి సబ్జెక్ట్‌. దాంతో మాకు నచ్చిన కామెడీ టైమింగ్స్‌లో ఏది వర్కవుట్‌ అవుతుందనేది మాట్లాడుకొంటూ చేశాం. మొత్తం ఐదు ఎపిసోడ్స్‌. అమలాపురం నుంచి కార్పొరేట్‌ ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చిన అరుణ్‌కుమార్‌ అనే అబ్బాయి కథ ఇది. అతనికి అన్నీ కొత్తగా అనిపిస్తాయి ఇక్కడ. వాటన్నిటినీ ఎదుర్కొంటూ, నగరంలో ఎలా ఉండాలి? కార్పొరేట్‌ సంస్థలో ఎలా పని చేయాలి? అని చెప్పే కథ ‘అర్థమయ్యిందా అరుణ్‌కుమార్‌’. ఇందులో నాది అరుణ్‌తో కలిసి పని చేసే ‘పల్లవి’ పాత్ర. కష్టపడి ఎదగాలని కలలు కనే ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి తను. అరుణ్‌కుమార్‌ వల్ల పల్లవి... తనవల్ల అతను ఎలా ప్రభావితమయ్యారనేది ఆసక్తిగా సాగుతుంది.

ఒక్కో మెట్టు ఎక్కుతున్నా...

నటనపైనే మక్కువ ఉన్నప్పుడు అంత మంచి కాలేజీకి వెళ్లి ఇంజనీరింగ్‌ ఎందుకు చదివావని కొందరు అడుగుతుంటారు. నటన నా అభిరుచి... కల. దానికే నా మొదటి ప్రాధాన్యం. కానీ ఇది విభిన్నమైన రంగం. ఒడుదొడుకులు ఉంటాయి. అందులో నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. ఆ కారణంతోనే ఒకవేళ రాణించలేకపోతే జీవితానికి భరోసా ఉండాలన్న ఉద్దేశంతో ఇంజనీరింగ్‌ చేయాలనుకున్నాను. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని కనుకనే ఇంత ఆలోచన. మాది వరంగల్‌. పెరిగిందంతా హైదరాబాద్‌లో. మా అమ్మా నాన్నలు ప్రైవేటు కళాశాలలో అధ్యాపకులు. ఇప్పుడు నాకు నా జీవితం గురించి ఎలాంటి ఆందోళనా లేదు. ఎందుకంటే చేతిలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉంది కదా... అదే నా ధైర్యం.

స్పష్టత ఉంది...

కెరీర్‌లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ వెళుతున్నా. ఇన్‌స్టాలాంటి సామాజిక మాధ్యమం, యూట్యూబ్‌, ఓటీటీ... తరువాత సినిమాలకు వెళుతున్నవారు చాలామందే ఉన్నారు. అలా చూసుకొంటే నేను మెట్టు ఎక్కాను. అమాంతం ఎదిగిపోవాలనే ఆశ నాకు లేదు. అందుకే సినిమా అవకాశాలు వస్తున్నా తొందరపడి ఒప్పుకోవడంలేదు. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నా. జీవితంలో నేను ఏంచేస్తున్నా... అది ఎందుకు చేస్తున్నాననే స్పష్టత నాకు ఉంటుంది. అదే నా బలం. ఇక నటన విషయానికి వస్తే... దర్శకుడికి ఎలా కావాలో అలా నటించడం అలవర్చుకున్నా. అదే నాకు చాలా ప్లస్‌ అవుతోందిప్పుడు.

తెలుగు వంటలు... టూర్స్‌...

నాకు మన తెలుగు వంటకాలు... అన్నం, పప్పు, పచ్చడి లాంటివి చాలా ఇష్టం. నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. అలాగే కొత్త కొత్త ప్రదేశాలు చుట్టిరావడం కూడా చాలా ఇష్టం. నేను వెళ్లిన ప్రాంతాల్లో నాకు బాగా నచ్చింది ముంబయి మహానగరం. ఆ నగరంలో పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది. మరాఠీ సంస్కృతి మనకు దగ్గరగా అనిపించింది. మరాఠీల వెజిటేరియన్‌ ఫుడ్‌ కూడా నాకు బాగా నచ్చింది. అందుకే ముంబయి వెళితే నాకు ఇంటికి దూరంగా ఉన్న అనుభూతి కలగదు. అందరితో స్నేహంగా ఉండాలి. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకోవాలి. కెరీర్‌లో అయినా, జీవితంలో అయినా ఒక్కచోట ఆగిపోకుండా ముందుకు వెళుతూనే ఉండాలి. ఇవే నా కోరికలు.’’

అమ్మను చూసే...

నా జీవితంలో నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తి మా అమ్మ. దేనికీ ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం రాకూడదన్నది అమ్మ అభిమతం. తనలా నా కాళ్లపై నేను నిలబడాలని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. అమ్మే నాకు అతిపెద్ద స్ఫూర్తి. మా ఇంట్లో నేనొక్కతినే సంతానం. కానీ నేను నటన వైపు వెళతానంటే అమ్మ నాన్నలు వద్దనలేదు. ‘ఏ రంగంలోనైనా ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించడం నేర్చుకోవాలి’ అంటూ ప్రోత్సహించారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు నాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురుకాలేదు. నేను కలిసి పని చేసే వారందరూ నాతో స్నేహంగా ఉంటారు.

-హనుమా

Updated Date - 2023-07-05T00:39:23+05:30 IST