Share News

తెలియని శక్తి ఏదో నడిపిస్తోంది

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:52 AM

నేను చాలా అదృష్టవంతుడిని. ఈ 37 ఏళ్ల ప్రస్థానం నాది మాత్రమే కాదు... నన్ను ఆదరించి.. ప్రేమించి.. ఎప్పటికప్పుడు విజయాలను ఇచ్చిన ప్రేక్షకులది.

తెలియని శక్తి ఏదో నడిపిస్తోంది

ఇమేజ్‌ అనే చట్రంలో ఇమిడిపోకుండా...

‘విక్టరీ’నే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో... వెంకటేష్‌.

‘నిర్మాతల పిల్లలు ఇక్కడ హీరోలు అవ్వరు’ అన్నచోట... వైవిధ్యానికి పట్టం కట్టి...

థియేటర్లలో కలెక్షన్లు కురిపించిన ఘనత ఆయనది. ముప్ఫై ఏడేళ్ల సినీ ప్రస్థానంలో...

మరపురాని... మధురమైన మజిలీలు ఎన్నో. అన్ని రకాల పాత్రలతో మెప్పించి...

‘సైంధవ్‌’తో 75 చిత్రాలు పూర్తి చేసుకున్న వెంకటే్‌షతో ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ.

37 ఏళ్ల వృత్తిగత జీవితం... 75 చిత్రాలు...

ఈ ప్రస్థానం ఎలా సాగింది?

నేను చాలా అదృష్టవంతుడిని. ఈ 37 ఏళ్ల ప్రస్థానం నాది మాత్రమే కాదు... నన్ను ఆదరించి.. ప్రేమించి.. ఎప్పటికప్పుడు విజయాలను ఇచ్చిన ప్రేక్షకులది. నా మీద నమ్మకం ఉంచిన దర్శకనిర్మాతలది. నాతో పని చేసిన సిబ్బంది అందరిదీ. అనుకోకుండా నటుడిని అయ్యా. సాధారణంగా ఎటువంటి అనుభవం లేని వ్యక్తి నటుడు అయితే విజయాలు సాధించటానికి నాలుగైదు సినిమాల ప్రయాణం అవసరం. నా తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ను ఆదరించారు. ఆ తర్వాత నాలుగైదు సినిమాలు ఆడకపోయినా మళ్లీ అక్కున చేర్చుకున్నారు. అనేక విజయాలు ఇచ్చారు. అందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి.

అన్ని రకాల పాత్రలూ మీరు చేశారు. ఇంత వైవిధ్యమైన

సినిమాలను ఎలా ఎంచుకోగలిగారు?

రచయితలను కలవటం... కథలు వినటం ఎప్పటికప్పుడు అందరూ చేస్తూనే ఉంటారు. ప్రయత్నం మాత్రమే మనం చేయగలం. మిగిలినది మనకు తెలియని ఒక శక్తి చేస్తుంది. నా ఉద్దేశంలో 30 శాతం పని మనం చేస్తే... 70 శాతం పని ఆ శక్తి చేస్తుంది. ఆ సమయంలో మనం అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంతే. నేను ఈ మధ్యకాలంలో చేసిన రీమేక్స్‌నే తీసుకుందాం. వాటిని నేను చూశాను. వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాను. అవి హిట్‌ అయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవటం మాత్రం ఇక్కడ చాలా ముఖ్యం.

మీరు చేసిన 75 సినిమాల్లో కష్టమైన పాత్ర ఏది?

అలా చెప్పటం కష్టం. అయితే ‘చంటి’లో మాత్రం పూర్తిగా భిన్నమైన పాత్ర. అప్పటిదాకా నేను కేవలం మాస్‌, స్టైలిష్‌ పాత్రలు చేశాను. అప్పట్లో హీరో అంటే గ్లామర్‌... లుక్‌... డ్యాన్స్‌... ఫైట్స్‌... ఇవన్నీ కలగలపిన మిశ్రమం. అలా కాకుండా ఒక గ్రామీణ అమాయకపు పాత్ర చేయటం ఒక సాహసమే. చాలా మంది వద్దన్నారు. కొందరు సినిమా ఫ్లాప్‌ అవుతుందని జోస్యం చెప్పారు. నేనైతే ఆ పాత్రను ఒక సవాలుగా తీసుకున్నా. అద్దం ముందు నిలబడి ఎమోషన్స్‌ ప్రాక్టీసు చేసేవాడిని. ఆ సినిమాలో కొన్ని సీన్లు చేయటం చాలా కష్టం. అయితే అన్నీ బాగా కుదిరాయి. ఎమోషన్స్‌ పలికాయి. యూనివర్సల్‌ ఎనర్జీ కూడా సాయం చేసింది. ఇక ఈ మధ్యకాలంలో నాకు ‘నారప్ప’ పాత్ర చాలా సంతృప్తి ఇచ్చింది. 40 రోజులు హైదరాబాద్‌కు దూరంగా ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశాం.

చిన్నప్పుడు మీరో హీరో కావాలని అనుకున్నారా?

ఎప్పుడూ అనుకోలేదు. అమెరికాలో ఎంబీఏ చదివిన తర్వాత కొద్ది కాలం ఇంపోర్ట్‌, ఎక్స్‌పోర్ట్‌ బిజినెస్‌ చేశా. కానీ అది బాగా సాగలేదు. ఆ సమయంలోనే నాన్నగారు ‘కలియుగ పాండవులు’ సినిమా తీయాలనుకున్నారు. ఒక పెద్ద హీరోను అడిగితే డేట్స్‌ లేవన్నారు. దాంతో నాన్నగారు, అన్నయ్య... ‘నువ్వే చేయొచ్చు కదా’ అన్నారు. అలా నేను హీరో అయ్యా. మొదటి సినిమా పెద్ద హిట్‌. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఆడలేదు. దాంతో ‘ఇక్కడ ప్రొడ్యూసర్ల పిల్లలు హీరోలు అవ్వరు. అనవసరంగా ఈ కుర్రాడిని ఇరికించారు’ అనుకోవటం మొదలుపెట్టారు. కానీ నాకు మాత్రం నటన బావుందనిపించింది. దానిని నేను ఎప్పుడూ కెరీర్‌గా అనుకోలేదు. అయితే ఒక గ్రాండ్‌ డిజైన్‌లో అలా కుదిరింది. ఆ తర్వాత నటనను ఒక వృత్తిలా తీసుకున్నా.

గత 37 ఏళ్లలో మీలో వచ్చిన మార్పేదైనా ఉందా?

సినిమాలలోకి వచ్చిన కొత్తల్లో నాకు మెడ మీద ఒక గాయం అయింది. ఆ నొప్పి నన్ను బాగా వేధిస్తూ ఉండేది. దాని ప్రభావం షూటింగ్‌లపై పడేది. ఆ సమయాల్లో డూపులు కూడా ఎక్కువగా ఉండేవారు కాదు. ఫైట్స్‌ చేయాల్సి వచ్చేది. చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకుపడేవాడిని. చర్రున కోపం వచ్చేది. ఒక దశలో నా చెయ్యి నా మెడ మీదకు వెళ్తే చాలు... ‘బాబు చెయ్యి పైకి వెళ్లిందిరా..’ అనుకుంటూ అందరూ పరార్‌ అయిపోయేవారు. బ్లాస్ట్‌లు జరిగిపోయేవి. గత పదిహేనేళ్లలో నాలో చాలా మార్పు వచ్చింది. ప్రశాంతత వచ్చింది.

మీరు బాగా ప్రైవేట్‌ పర్సన్‌ కదా..!

నేను అందరితోనూ ఆరోగ్యకరమైన దూరంలో ఉంటా. అందరితోనూ స్నేహంగానే ఉంటా. అయితే బయట ఎక్కువ కనిపించకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నా కెరీర్‌ కొత్తల్లో నేను కూడా సినిమా పార్టీలకు వెళ్లేవాడిని. ఆ తర్వాత కాలంలో పిల్లలు పుట్టారు. వారితో ఎక్కువ సేపు గడిపేవాడిని. అంతే కాకుండా మొదటి నుంచి నాకు వృత్తికి సంబంధించిన విషయాలు ఇంట్లో మాట్లాడటం ఇష్టం ఉండేది కాదు. మా ఇంటికి సినిమా పత్రికలు కూడా వచ్చేవి కాదు. వీటన్నింటితో పాటు నా ఆధ్యాత్మిక సాధనకు కూడా సమయం కేటాయించేవాడిని. అందువల్ల నేను బయట ఎక్కువగా కనిపించను.

మీకు ఇష్టమైన నటులు, దర్శకులు ఎవరు?

శివాజీగణేశన్‌ అంకుల్‌ నటన అంటే చాలా ఇష్టం. నగేష్‌ గారి నటన కూడా. అలాగే హాలీవుడ్‌లో రాబర్డ్‌ డినోరో. ఆ తర్వాత కమల్‌హాసన్‌ గారు చాలా ఇష్టం. ఇక దర్శకుల విషయానికి వస్తే విశ్వనాథ్‌ గారు నాలో సహజమైన నటనను ప్రొత్సహించేవారు. ‘ఇది బావుంది కదా... ఇలా చేసేయ్‌’ అని స్వేచ్ఛ ఇచ్చేవారు. షూటింగ్‌ స్పాట్‌లో రాఘవేంద్రరావుగారు ఆహ్లాదంగా ఉంచేవారు. ఇక దాసరిగారు, కోడి రామకృష్ణగారు కూడా మంచి దర్శకులు.

మీ నాన్న రామానాయుడు గారి ప్రభావం మీపై ఉందా?

ఆయన కొడుకుగా పుట్టడం నా అదృష్టం. ఒక కుటుంబానికి ఏంకావాలో అన్నీ ఆయన ఇచ్చారు. అందరినీ పైకి తీసుకువచ్చారు. ఆయన నుంచి క్రమశిక్షణ... ఒక రొటీన్‌ను అలవాటు చేసుకోవటం నేర్చుకున్నా. ఆయనకు ఇంటి సమయం... బయట ఆఫీసులో సమయం వేర్వేరుగా ఉండేవి. ఎలాంటి పరిస్థితుల్లో ఈ రెండింటినీ కలిపేవారు కాదు. ఆయనకు సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి, అనురక్తి. ఆయన మరణించే రెండేళ్ల ముందు సినిమాలేవీ బాగా ఆడలేదు. అయినా ఆయన ఎప్పుడూ ఆగలేదు. స్ర్కిప్ట్‌లు చదువుతూ ఉండేవారు. నా దగ్గరకు పంపేవారు. ‘బాలేవు నాన్నా... ఇవి ఆడవు’ అన్నా వినేవారు కాదు. ‘ఏదో ఒకటి చేద్దాం. సినిమా తీద్దాం’ అనేవారు. నాకు అంత అనురక్తి లేదు.

మీ అమ్మగారి ప్రభావం మీపై ఎంత ఉంది?

నేను మా అమ్మ పోలికే. పుట్టినప్పటి నుంచి చూస్తున్నా... అమ్మలో మార్పు లేదు. నాలోనూ మార్పు లేదు. అమ్మ తన పని తాను చేసుకుంటుంది. ఇతరులను గౌరవిస్తుంది. కారంచేడులాంటి చిన్న పల్లెటూరు నుంచి మద్రాసు వచ్చి అక్కడ అన్ని కష్టాలు పడి... మళ్లీ హైదరాబాద్‌ వచ్చి... కుటుంబాన్ని ఈ స్థితికి చేర్చిందంటే చాలా గొప్ప విషయం. తనను చూసి నేను చాలా నేర్చుకున్నా. తనకు కుటుంబం తప్ప వేరే ప్రపంచం ఉండదు. ఒక దశలో నాన్నగారి ఆర్థిక పరిస్థితి బావుండక కారంచేడు తిరిగి వెళ్లిపోవాలనుకున్నారట. అప్పుడు అమ్మ అడ్డం చెప్పింది. ‘పిల్లలకు బాగా బతకటం అలవాటు అయింది. వాళ్ల ఆహారపు అలవాట్లు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు మద్రాసు వదిలి వెళ్తే వాళ్లు ఇబ్బంది పడతారు. మీరు మళ్లీ సక్సెస్‌ అవుతారు’ అని అమ్మ ధైర్యం ఇచ్చింది.

మీ అన్నయ్య సురే్‌షబాబు మీకు ఎలాంటి మద్దతు ఇస్తారు?

ఈరోజు మా కుటుంబం ఇలా ఉందంటే అన్నయ్యే కారణం. తను సరైన సమయానికి వచ్చి మొత్తం కుటుంబాన్ని నిలబెట్టాడు. తనకు... నాకు చిన్నప్పటి నుంచి ఒక అవినాభావ సంబంధం ఉంది. మా ఆలోచనలు ఒకరికొకరికి తెలిసిపోతాయి. మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నా జీవితంలో నేను ఇంత సుఖంగా జీవించగలుగుతున్నానంటే అన్నయ్యే కారణం. నాకు డబ్బుల వ్యవహారాలు, వ్యాపారం తెలియవు. అన్నీ తనే చూసుకుంటాడు. నాకిష్టమైన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించగలుగుతున్నానంటే అందుకు తనే కారణం. ఇక నటన విషయానికి వస్తే... తను చాలా చిన్నచిన్న విషయాలు కూడా నిశితంగా గమనిస్తాడు. వాటిని పట్టుకుంటాడు. 99శాతం బాగా చేసి... ఒక శాతం ఎక్కడో తప్పు జరిగిందనుకుందాం. తనకు ఆ ఒక్కశాతం తెలిసిపోతుంది.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌’

అందరికీ..

నాతోపాటు ఇంత కాలం పరిశ్రమలో ఉన్న సహనటులందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. చిరంజీవిగారి కుటుంబంతో ఎన్నో అందమైన అనుభూతులు ఉన్నాయి. మహేష్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, చరణ్‌, ప్రభాస్‌, నానీ... ఇలా నా తరువాతి తరం వారితో కూడా నేను స్నేహంగా ఉంటా.

కెమెరా ముందుకొచ్చి..

ఎమోషనల్‌ సీన్స్‌లో నటించటం చాలా కష్టం. ఒక సారి అవుట్‌డోర్‌ షూటింగ్‌ చేస్తుంటే- ‘‘ఇది కాదు. కెమేరా ముందుకొచ్చి.. ఏడ్చి.. మమల్ని ఏడిపించండి.. చేయి పైకి పెడితే హీరో అయిపోరు..’’ అని జనాల నుంచి ఎవరో గట్టిగా అరిచారు. ఆ కామెంట్‌ ఎందుకో నాలో ఆలోచనలు రేకెత్తించింది నాకు ఇలాంటి ఇమేజ్‌ ఉందా అనిపించింది. ఆ తర్వాత ధర్మచక్రం సినిమా చేశా. ఆ సినిమా దర్శకుడు సురేష్‌ కృష్ణతో- ‘కెమెరా నా మొహం మీద పెట్టు.. ఎమోషనల్‌ సీన్స్‌ చేస్తా’’ అన్నా. తను ముందు వద్దన్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ సినిమా పెద్ద హిట్‌ అయింది.

వెంకీస్‌ కీమా

దగ్గుబాటి ఫ్యామిలీ బాగా ఫుడీస్‌. మేము ఆహారాన్ని ఆస్వాదిస్తాం. నేను ప్రపంచంలో ఉన్న రకరకాల వంటలు తింటాను. నేను వంట కూడా బాగా చేస్తా. చదువుకుంటున్న రోజుల్లో ‘వెంకీస్‌ కీమా’ అంటే బాగా ఫేమస్‌. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు... వాళ్లకు వండి పెట్టేవాడిని. ఇప్పుడు కూడా ఎక్కడికైనా వెకేషన్‌కు వెళ్లినప్పుడు వండుతా.

అన్ని రకాలు...

నా 75 సినిమాలను వెనక్కి తిరిగి చూసుకుంటే భిన్నమైనవి అనేకం కనిపిస్తాయి. ‘ప్రేమ, స్వర్ణకమలం, బొబ్బిలి రాజా, శత్రువు, బ్రహ్మపుత్రుడు, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం రా, తులసి, లక్ష్మీ, నువ్వునాకు నచ్చావ్‌, మల్లీశ్వరీ’... ఇలా ఎన్నో సినిమాలు. ఈ విధంగా నేను అదృష్టవంతుడిననే చెప్పాలి. సాధారణంగా ఒక ప్రాజెక్ట్‌ పూర్తయిన వెంటనే దాని నుంచి ఎమోషనల్‌గా బయటకు వచ్చేస్తా. దీనివల్ల జయాపజయాల ప్రభావం మనపై ఎక్కువగా ఉండదు.

శోభన్‌బాబు ప్రభావం...

పరిశ్రమలో నాపై ప్రభావం చూపించినవారిలో శోభన్‌బాబు గారు ముఖ్యులు. మొదట ఆయన నాకు ఎక్కువగా తెలియదు. ఆయన సినిమాలు మానేసే ముందు ఆయనతో పరిచయం అయింది. ఆయనది కూడా నాలాంటి వ్యక్తిత్వమే. ఆయన ఆలోచనలలో వృత్తి జీవితానికి... వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన విభజన ఉండేది. ఆయనతో అనేక ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడేవాడిని. ఒక దశలో నేను సినిమాలు మానేసి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లిపోవాలనుకున్నా. అప్పుడు ఆయన... ‘అంత త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు. నీకు ఇంకా చాలా సమయం ఉంది’ అన్నారు. ‘మీరు చాలా తెలివిగా సినిమాలు ఆపేశారు’ అన్నాను. ఆయన నవ్వారు.

థాంక్యూ క్రికెట్‌

చిన్నప్పటి నుంచి నాకు, అన్నయ్యకు క్రికెట్‌ అంటే క్రేజ్‌. ఆరేళ్ల వయస్సు నుంచి మేము స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లు చూసేవాళ్లం. రంజీ, దులీప్‌ ట్రోఫీలకు కూడా వెళ్లేవాళ్లం. టెస్ట్‌ మ్యాచ్‌లకు వెళ్లేవాళ్లం. ఆ తర్వాత వరల్డ్‌ కప్‌లకు వెళ్లటం ప్రారంభమయింది. క్రికెట్‌ విషయంలో నాకు చాలా సెంటిమెంట్స్‌ ఉన్నాయి. ఇప్పుడు కాస్త పర్లేదు కానీ, ఒకప్పుడైతే వికెట్‌ పడితే చాలు... ఎక్కడ ఉన్నానో ఇక అక్కడి నుంచి కదిలేవాడిని కాదు. టీవీ చూడటం మానేసి కామెంటరీ వినేవాడిని. మొన్నటి వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో ఒక బాక్స్‌ నుంచి మరొక బాక్స్‌కు వెళ్లా. ఆ సమయంలో వికెట్‌ పడింది. అంతే నన్ను మళ్లీ మొదటి బాక్స్‌కు వెళ్లనివ్వలేదు. స్టేడియంలో ఉన్నవారు... ‘నో వెంకీ’ అని అరవటం మొదలుపెట్టారు. సెంటిమెంట్స్‌ అలా ఉంటాయి. నా ఉద్దేశంలో క్రికెట్‌ మనలో ఉన్న చిన్నపిల్లలను బయటకు తీసుకువస్తుంది. గొప్ప రిలీఫ్‌ ఇస్తుంది. అందుకే థాంక్యూ క్రికెట్‌.

Updated Date - Dec 31 , 2023 | 04:52 AM