Bilkis Mir : అమ్మ మాటే మంత్రమైంది...

ABN , First Publish Date - 2023-01-24T23:14:32+05:30 IST

అది జమ్మూ-కశ్మీర్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం. ఈ నెల 30నుంచి మధ్యప్రదేశ్‌లో జరిగే ‘ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌’లో... వాటర్‌ స్పోర్ట్స్‌ విభాగంలో జమ్మూ-కశ్మీర్‌ తరఫున పోటీ పడే ఆరుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిల శిక్షణలో నిమగ్నమై ఉన్నారు బిల్కిస్‌ మీర్‌.

Bilkis Mir : అమ్మ మాటే మంత్రమైంది...

అది జమ్మూ-కశ్మీర్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం.

ఈ నెల 30నుంచి మధ్యప్రదేశ్‌లో జరిగే ‘ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌’లో...

వాటర్‌ స్పోర్ట్స్‌ విభాగంలో జమ్మూ-కశ్మీర్‌ తరఫున పోటీ పడే ఆరుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిల శిక్షణలో నిమగ్నమై ఉన్నారు బిల్కిస్‌ మీర్‌.

ఎన్నో అవరోధాలను దాటి, అవహేళనలను తట్టుకొని క్రీడాకారిణిగా రాణించిన

ఆమె కోచ్‌గా ఎంతోమంది నైపుణ్యాలను మెరుగుపెడుతున్నారు.

ఆమె సారథ్యంలో శిక్షణ పొందినవారు జాతీయ స్థాయిలో ఇప్పటివరకూ 120కి పైగా పతకాలు సాధించారు.

రాబోయే ఆసియా క్రీడల్లో జడ్జిగా వ్యవహరించబోతున్న బిల్కిస్‌ జీవన ప్రయాణం గురించి, ఆమె మాటల్లోనే...

‘‘అది నేనెప్పుడూ మరచిపోలేని రోజు. నా జీవితాన్ని మలుపుతిప్పిన రోజు కూడా. ఇది 1998 నాటి మాట. సాయంత్రం ఇంటికి వచ్చి, ఏడుస్తూ మంచం మీద వాలిపోయాను. అమ్మ నా దగ్గరకి వచ్చి ఏమిటని అడిగింది. ‘‘ఇక ఈ వాటర్‌ స్పోర్ట్స్‌ నా వల్ల కాదమ్మా. రేపటి నుంచీ ఆ ఛాయలకు కూడా వెళ్ళను’’ అని చెప్పాను. ‘‘ఇంతకీ ఏం జరిగింది?’’ అంది అమ్మ. మణిపూర్‌లో జరిగిన నేషనల్‌ వాటర్‌ స్సోర్ట్స్‌ పోటీల్లో పాల్గొని, పతకంతో మా ఊరికి తిరిగి వచ్చాను. అది నేను పాల్గొన్న మొదటి జాతీయ పోటీ. మా ఇరుగుపొరుగువారు, స్నేహితులు, బంధువులు నా విజయాన్ని కనీసం గుర్తించలేదు... సరికదా వెటకారంగా మాట్లాడారు. ‘‘పెద్ద మగాడిలా నీకెందుకీ ఆటలు? ఆ వాలకమేమిటి? మన ఊళ్ళో ఆడపిల్లలెవరైనా ఇలా చేస్తున్నారా? నిన్ను చూసి ఇంకొందరు కూడా నీలా తయారవుతారు’’ అంటూ మాటలు పడడం నాకు మామూలే. కానీ ఆ రోజు హేళనలు శృతి మించిపోయాయి. నిజానికి అప్పటికే నేను కయాకింగ్‌, కెనోయింగ్‌లో కాస్త గుర్తింపు పొందాను. జాతీయ స్థాయిలో రాణించగలననే నమ్మకం ఉంది. కానీ సామాజికంగా ఎదురవుతున్న ఒత్తిళ్ళను భరించలేకపోయాను. అందుకే వాటర్‌ స్పోర్ట్స్‌ను వదిలేద్దామనుకున్నాను. అదే సంగతి అమ్మతో చెప్పాను. అప్పుడు అమ్మ ‘‘బిల్కిస్‌! నీకు ఆసక్తి ఉన్నదానిలోనే కొనసాగు. ఎంతో కష్టపడి ఈ దశకు వచ్చావు. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని నీకు ఇష్టమైనదాన్ని వదిలేసుకుంటే, నష్టపోయేది నువ్వు మాత్రమే కాదు. భవిష్యత్తులో మహిళా క్రీడాకారులు కావాలనుకొనే ఈ చుట్టుపక్కల ఎంతోమంది అమ్మాయిల కలలను కూడా నువ్వు చిదిమేసినట్టు అవుతుంది’’ అంది. అమ్మ మాట నామీద మంత్రంలా పని చేసింది. ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఆ మాటలు తలచుకుంటే... కొండంత బలం వచ్చినట్టు అనిపిస్తుంది.

‘ఈ దుస్తులేమిటి? సిగ్గులేదూ?’ అన్నారు...

నేను పుట్టిందీ, పెరిగిందీ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు ఆటలు కూడా నా జీవితంలో భాగమయిపోయాయి. కొన్నాళ్ళు బాక్సర్‌ కావాలనుకున్నాను. ఎందుకంటే నా కజిన్స్‌ వాళ్ళ ఇంట్లో బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవారు. నేను కూడా ప్రయత్నించేదాన్ని. కానీ ‘‘ఆడపిల్లవి. నీకు ఆటలెందుకు?’’ అంటూ మా ఇంట్లో వాళ్ళు నన్ను వెనక్కు లాగారు. అలా బాక్సింగ్‌ నా ఆలోచనల్లోంచీ చెరిగిపోయింది. కానీ దాల్‌ సరస్సును సందర్శించినప్పుడు... కొందరు అబ్బాయిలు ఆ సరస్సులో కయాకింగ్‌ చేయడం చూశాను. వాటర్‌ స్పోర్ట్స్‌ నన్ను బాగా ఆకర్షించాయి. నా ఆసక్తిని గమనించిన స్థానిక శిక్షకుడొకరు ప్రోత్సహించారు. కొన్నాళ్ళకే పోటీల్లో పాల్గొనేదాన్ని. చాలాసార్లు గెలిచేదాన్ని కూడా. క్రమంగా మా ఇంట్లో వాళ్ళ ఆలోచనలో మార్పు చోటు చేసుకుంది. కానీ బయటివారికి మాత్రం నచ్చలేదు. ‘‘అమ్మాయివి. ఈ క్రీడా దుస్తుల్తో బయటికెళ్తావా? సిగ్గులేదూ?’’ అని మా బంధువుల్లో ఒకరు నా మొహం మీదే అన్నారు. కశ్మీర్‌ లోయ బయట జరిగే పోటీలకు వెళ్ళాల్సి వస్తే... ఏదో చేయకూడని పని చేస్తున్నట్టు స్థానికులు వ్యాఖ్యలు చేసేవారు. అన్నిటినీ తట్టుకున్నాను. రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో విజయాలు సాధించాను. అంతర్జాతీయంగానూ నా సత్తా చాటాను. ఒలింపిక్స్‌లో కశ్మీర్‌ ప్రాంతం నుంచి కయాకింగ్‌, కనోయింగ్‌లో పాల్గొన్న మొదటి మహిళను నేనే. అలా దాదాపు పధ్నాలుగేళ్ళు గడిచిపోయాయి. ఆ తరువాత... కోచ్‌గా కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాను.

అప్పుడూ, ఇప్పుడూ... నేనొక్కరినే...

భారత జట్టులో అతి పిన్నవయస్సురాలైన, శ్రీనగర్‌ నుంచి వచ్చిన మొదటి మహిళా వాటర్‌ స్పోర్ట్స్‌ కోచ్‌ని నేను. దాన్ని గర్వకారణంగా కాకుండా బాధ్యతగా భావించాను. జాతీయ జట్టుకు తొమ్మిదేళ్ళపాటు కోచ్‌గా ఉన్నాను. 2010లో ఆసియా క్రీడలకు కూడా కోచ్‌గా వ్యవహరించాను. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే శిక్షణ శిబిరాల్లోనే నాకు ఏడాదంతా గడిచిపోయేది. చివరకు... నేను పుట్టిన ప్రాంతంలో యువతను... ప్రధానంగా అమ్మాయిలను.. వాటర్‌ స్సోర్ట్స్‌లో నిష్ణాతులుగా తీర్చిదిద్దుదామనే ఆలోచనతో... 2014లో కశ్మీర్‌ లోయకు వచ్చాను. నేను శిక్షణ ఇస్తానని తెలిసాక... వచ్చిన సానుకూల స్పందనను నేను ఏమాత్రం ఊహించలేదు. నా చిన్నప్పటికీ ఇప్పటికీ... కుటుంబాల్లోనూ, సామాజికంగా ఎంతో మార్పు స్పష్టంగా కనిపించింది. అమ్మాయిలను వారి తల్లితండ్రులు స్వయంగా నా కోచింగ్‌ సెంటర్‌కు తీసుకురావడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఇప్పటివరకూ ఎంతోమందికి శిక్షణ ఇచ్చాను. వారిలో ఎక్కువమంది అమ్మాయిలే. నా దగ్గర శిక్షణ పొందినవారు జాతీయ స్థాయిలో ఇప్పటి వరకూ నూట ఇరవైకి పైగా పతకాలు సాధించారు. జర్మనీలో, హంగేరీలో వాటర్‌ స్పోర్ట్స్‌లో నేను చేసిన డిప్లమాలు క్రీడాకారిణిగా, కోచ్‌గా నాకు బాగా ఉపకరించాయి. ప్రస్తుతం మా రాష్ట్రం తరఫున అధికారిక కోచ్‌గా, శ్రీనగర్‌లోని ‘వాటర్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌’కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాను.

మధ్యప్రదేశ్‌లో కిందటి నెలలో నిర్వహించిన ‘జాతీయ కెనోయ్‌ స్ర్పింట్‌ ఛాంపియన్‌ షిప్‌’లో మా వాళ్ళు రెండు పతకాలను సాధించారు. ఇంకో విషయం... ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నుంచి చైనాలో జరిగే ఆసియా క్రీడలకు జడ్జిగా నియమితురాలినయ్యాను. 2018లో ఇండోనేసియాలో నిర్వహించిన ఆసియా క్రీడలకూ జడ్జిగా ఉన్నాను. ఈ అవకాశం దక్కించుకున్న తొలి కశ్మీర్‌ మహిళనే నేను. అంతేకాదు, అప్పుడూ, ఈసారి భారతదేశం నుంచి ఎంపికైనది ఏకైక మహిళను కూడా. ‘‘ముప్ఫై నాలుగేళ్ళ వయసుకే ఈ స్థాయికి చేరడం మన ప్రాంతానికి గర్వకారణం’’ అని స్థానికులు, ‘‘మీరే నాకు స్ఫూర్తి’’ అని యువత అంటున్నప్పుడు... సామాజికంగా నేను ఎదుర్కొన్న ఆంక్షలు, అవహేళనలు గుర్తుకొస్తాయి. అందుకే నా దగ్గర శిక్షణ పొందుతున్నవారందరికీ చెబుతూ ఉంటాను... మీకు ఎదురయ్యే సవాళ్ళన్నిటికీ మీ కృషి, మీ విజయం సమాధానం కావాలని!’’

భారత జట్టులో అతి పిన్నవయస్సులో శ్రీనగర్‌ నుంచి వచ్చిన మొదటి మహిళా వాటర్‌ స్పోర్ట్స్‌ కోచ్‌ని. వాటర్‌ స్సోర్ట్స్‌లో నిష్ణాతులుగా తీర్చిదిద్దుదామనే ఆలోచనతో... 2014లో కశ్మీర్‌ లోయకు వచ్చాను.

Updated Date - 2023-01-24T23:14:33+05:30 IST