Allu Arjun : తండ్రి అల్లు అరవింద్, మేనమామ చిరంజీవి బాగా ఫీలైన సందర్భాన్ని చెప్పిన అల్లు అర్జున్..
ABN , First Publish Date - 2023-08-27T04:16:47+05:30 IST
అర్జునుడై గురిపెట్టెను అల్లు తన విల్లు శతాబ్దాల తెలుగువాళ్ల బాకీ ఇక చెల్లు- అంటారు ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి. విల్లు ఎక్కుపెట్టడం అర్జునుడికి సులభమైందేమో కానీ.. నటనపై విల్లు ఎక్కుపెట్టం మన అల్లు అర్జునుడికి మాత్రం అంత సులభం కాలేదు. కష్టనష్టాలన్నింటినీ
స్టడీ కన్నా మూవీలే బెస్టు అని ఎప్పుడు తెలిసింది?
ఉత్తమ నటుడి అభిమాన హీరోయిన్ ఎవరు?
‘పుష్ప’కు అవార్డు వస్తుందని అనుకున్నారా?
ఈ సినిమాతో నటుడిగా వచ్చిన పరిణతి ఏంటి?
ఎలాంటి ఫాదర్.. పిల్లలతో ఎలా ఉంటారు?
అర్జునుడై గురిపెట్టెను అల్లు తన విల్లు శతాబ్దాల తెలుగువాళ్ల బాకీ ఇక చెల్లు- అంటారు ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి. విల్లు ఎక్కుపెట్టడం అర్జునుడికి సులభమైందేమో కానీ.. నటనపై విల్లు ఎక్కుపెట్టం మన అల్లు అర్జునుడికి మాత్రం అంత సులభం కాలేదు. కష్టనష్టాలన్నింటినీ దాటుకొని జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపికైన తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
69 ఏళ్ల తర్వాత తెలుగు సినీ హీరోకి దక్కిన గౌరవం.. ఎలా అనిపిస్తోంది...
ఇప్పటిదాకా నా కెరీర్‌లో కొన్ని మైలురాళ్లు ఉన్నాయి. కానీ అవి నా వ్యక్తిగతమైనవి. కానీ ఈ అవార్డు మన పరిశ్రమకు ఒక మైలురాయి. గత ఐదేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ జాతీయ స్థాయిలో అనేక విజయాలు సాధిస్తోంది. ఇది అలాంటిదే! మన పరిశ్రమకు ఉపయోగపడేది. నేను ఒక వ్యక్తి అభివృద్ధిని రెండు రకాలుగా చూస్తా. పరిశ్రమ మనకు బలం కావటం. రెండోది మనమే పరిశ్రమకు బలం కావటం. ఈ రెండో స్థాయికి చేరినందుకు ఆనందంగా అనిపిస్తోంది.
‘పుష్ప’ సినిమాలో మీ నటనకు అవార్డు వస్తుందని మీరు భావించారా?
అనేక రకాల ఫీలింగ్స్ మధ్య కొట్టిమిట్టాడా! ఎందుకంటే అవార్డు కోసం అనేక మంది నటులు పోటీపడుతున్నారు. అంతే కాకుండా ‘పుష్ప’ ఒక భిన్నమైన సినిమా. ఈ కోవకు చెందిన సినిమాకు అవార్డు ఇస్తారా? లేదా అనే సందేహం ఉంది. అయితే సాధారణంగా ఒక నటుడికి అవార్డు ఇచ్చే సమయంలో- అతను ఎంత బాగా చేశాడనే విషయాన్ని చూస్తారు తప్ప.. అతను వేసిన క్యారెక్టర్ నెగిటీవా? పాజిటీవా అని చూడరు. అందువల్ల వస్తుందనే నమ్మకం ఉంది. అయితే అంతా ప్రొబబులిటీనే! మీడియాలో చెప్పేదాకా మన తెలుగు నటులకు గత 69 ఏళ్లలో ఈ అవార్డు రాలేదనే విషయం నాకు తెలియదు. ఎందుకో తెలియదు. మీడియాలో రాక ముందు ‘అన్నమయ్య’ సినిమాకు నాగార్జున గారికి అవార్డు వచ్చిందనుకున్నా. ఆ తర్వాత అది స్పెషల్ జ్యూరీ అవార్డు అని తెలిసింది.
మీలో విపరీతమైన ఎనర్జీ ఉంటుంది.. చిన్నప్పుడు ఎలా ఉండేవారు?
స్కూల్లో అన్నింటిలోను వెనకబడి ఉండేవాడిని. క్లాసులో 65 మంది ఉంటే- చివరి ర్యాంకు నాదే! నా చిన్నప్పుడు పిల్లల ప్రతిభను రెండు రకాలుగా కొలిచేవారు. మొదటిది చదువు. రెండోది స్పోర్ట్స్. చదువుకు మొదటి స్థానం ఇచ్చేవారు. స్పోర్ట్స్‌కు రెండో స్థానం ఉండేది. ఈ రెండింటిలోనూ నేను చాలా పూర్. మా అమ్మనాన్నలకు కూడా... ‘‘వీడు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడో?’ అనే బెంగ ఉండేది. ‘‘వీడికి ఏదీ రావటం లేదు- కొంత ఆస్తి ఇస్తే దాని మీద వచ్చే ఆదాయంతో బతికేస్తాడు’’ అనుకొనేవారు. సానుభూతిగా చూసేవారు. నేను కూడా ‘‘లైఫ్‌లో దేనికీ పనికిరాను. చిన్నో.. చితకో పనిచేసుకొని బతికేస్తా’’ అని ఫిక్స్ అయిపోయా! చదువు, స్పోర్ట్స్‌లో వెనకబడ్డా కానీ కల్చరల్ పోగ్రామ్స్‌లో ముందు ఉండేవాడిని. అందరూ నన్ను ప్రశంసించేవారు. నేను కల్చరల్ పోగ్రామ్స్‌లో ముందుంటానని చిరంజీవి గారికి తెలుసు. దాంతో ఆయన నన్ను సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేయించేవారు. ‘డాడీ’ సినిమాలో ఒక బిట్ చేశా. దానికి ప్రశంసలు లభించాయి. అంటే నాకు చదువు రాదు కానీ నటన వచ్చనే విషయం అర్థమయిపోయింది.
మీది సినిమా కుటుంబం.. నాన్న ప్రొడ్యూసర్.. సినీ అరంగేట్రం సులభంగానే అయిపోయిందా?
లేదు. అంత సులభంగా కాలేదు. నా చదువు పూర్తయిన తర్వాత పెద్ద బ్యానర్‌లో నాకు ఒక ఆఫర్ వచ్చింది. కానీ నేను బాలేనని నన్ను రిజక్ట్ చేశారు. నాన్న, చిరంజీవిగారు బాగా ఫీలయ్యారు. ‘మనమే తీద్దాం’ అనుకున్నారు. ఆ సమయంలో రాఘవేంద్రరావుగారి 100వ సినిమా ప్రపోజల్ వచ్చింది. నాన్న, అశ్వనీదత్‌గారు, చిన్ని కృష్ణగారు.. ఇలా అందరూ కలసి ప్రాజెక్ట్ సెట్ చేశారు. ఆ ప్రాజెక్టే ‘గంగోత్రి’. సినిమా పెద్ద హిట్. నటుడిగా నేను ఫెయిల్. అప్పటికి ఒక నటుడిగా సిద్ధంగా లేను. ‘‘చిన్నప్పటి నుంచి ఫెయి ల్యూరే. మళ్లీ ఫెయిల్యూరా’’ అనుకున్నా. ఆ తర్వాత నాకు సినిమాలు రాలేదు. నాన్న కూడా నన్ను పెట్టి సినిమా తీయలేని పరిస్థితి. కారణం.. ఆ సమయంలో సినిమా తీయటం మాకు అంత సులభం కాదు.
అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ముందుకు నడిపించిందేమిటి?
నేను 99 విషయాల్లో ఫెయిల్ కావచ్చు. కానీ నటన నాకు వచ్చు. అదే నా బలం. దానిమీదే ఫోకస్ చేయాలనుకున్నా. ప్రతి వ్యక్తికి ఒక బలం ఉంటుంది. ఒకరికి చదవటంలో ఉండచ్చు.. మరొకరికి మాట్లాడటంలో ఉండచ్చు.. ఇంకొకరికి వీడియో గేమ్స్‌లో ఉండచ్చు. ఆ విషయాన్ని పట్టుకుంటే విజయం వరిస్తుంది. ఆ సమయంలో ఏడాది ఖాళీగా ఉన్నా. తినటానికి తిండి.. ఉండటానికి ఇల్లు.. తిరగటానికి కారు- అన్నీ ఉండేవి. ఇంట్లో డబ్బులూ ఉండేవి. నాన్న... ‘ నీకెంత కావాలంటే అంత తీసుకో’ అనేవారు. కానీ అడగడానికి మొహమాటం. దీనికి కూడా ఒక కారణముంది. తాతగారు, నాన్న- దిగుమ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కారు. కానీ ఇంట్లో మేము మధ్యతరగతి విలువలనే పాటించేవాళ్లం. సాధారణంగా అందరూ... ‘‘వీళ్లకేం.. పెద్దవాళ్ల పిల్లలు.. ఎన్ని డబ్బులైనా ఉంటాయి’’ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆ సమయంలో దిల్ రాజుగారు వచ్చి- ‘‘కొత్తవాళ్లతో ఆర్య తీస్తున్నాం’’ అని చెప్పారు. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు.
‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ దాకా వెనక్కి తిరిగి చూస్తే- మీ నట జీవితం ఎలా అనిపిస్తుంది?
‘ఆర్య’ ముందు జర్నీ ప్రారంభమే కాలేదు. ఆ తర్వాతే జర్నీ ప్రారంభమయింది. అప్పుడే ముళ్లబాట నుంచి వచ్చి ఒక రోడ్డు ఎక్కా. ఆ తర్వాత ఆ రోడ్డు మీద ఎంత వేగంగా వెళ్తామనేది మన వ్యక్తిగత బలాబలాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ ప్రయాణంలో నేను కూడా అందరిలాగానే చాలా కష్టపడ్డా. ‘నేనింత కష్టపడ్డా’ అని చెప్పటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే కష్టపడితేనే పైకి వస్తారు. నా దృష్టిలో ఆ కష్టాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
‘పుష్ప’ పాత్ర చేయటం వెనకున్న కష్టమేమిటి? మీరు ఎదుర్కొన్న సవాళ్లేమిటి?
‘పుష్ప’ ముందుదాకా నేను చేసిన సినిమాలన్నీ నా కంఫర్ట్ జోన్‌లోవి. కానీ పుష్ప అలా కాదు. ఆ పాత్రలో రకరకాల కోణాలున్నాయి. అంతే కాదు... ఆ పాత్రకు- నా నిజ జీవితానికి ఎటువంటి సారూప్యతా లేదు. దాంతో విపరీతమైన హోంవర్క్ చేయాల్సి వచ్చింది. సుకుమార్‌గారి సినిమాల్లో పాత్రల చిత్రీకరణ చాలా సున్నితంగా, పొరపొరలుగా ఉంటుంది. స్ర్కీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. కథ కన్నా వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆయన, నేను- ఈ పాత్ర గురించి ఎంతో కష్టపడ్డాం. అంతే కాదు... పుష్ప చేయటానికి నాకు ఇంకో కారణం కూడా ఉంది. మన భారతీయ సినీ పరిశ్రమలో కమర్షియ్ సినిమాను వేరుగా.. పెర్‌ఫార్మెన్స్ ఉన్న సినిమాలను వేరుగా చూస్తారు. తీస్తారు. పెర్‌ఫార్మెన్స్ ఉన్న సినిమాలు కమర్షియల్‌గా పనికిరావని కొందరు భావిస్తూ ఉంటారు. ఉదాహరణకు చిరంజీవి గారి సినిమాలే తీసుకుందాం. ఫెర్‌ఫార్మెన్స్ ఉన్న సినిమాలంటే ‘రుద్రవీణ’లాంటివని. కమర్షియల్ అంటే ‘ఘరానా మొగుడు’లాంటివని చెబుతూ ఉంటారు. ఆయన సినిమాలు చూసి పెరిగాను కాబట్టి చెబుతున్నా.. ఇలాంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఇలాంటి మైండ్‌సెట్‌ను బ్లాక్ చేయాలనుకున్నా. కమర్షియల్ సినిమాలో పెర్‌ఫార్మెన్స్ ఎందుకు ఉండకూడదు? ఈ ఆలోచనే ‘పుష్ప’ కోసం హార్డ్‌వర్క్ చేసేలా ప్రేరేపించింది. మనం ఈ లెవెల్‌లో ఆగిపోకూడదు. వేరే స్థాయికి చేరుకోవాలనుకున్నా.
కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావటానికి భయం వేయలేదా?
లేదండి. స్వతహాగా నేను భయం లేని మనిషి. నేను ఒక విషయాన్ని నమ్మితే దాని మీద వంద శాతం పని చేస్తా. అది ఫెయిల్ అయినా పర్వాలేదు. నా ఉద్దేశంలో ఎలాంటి రిస్క్ చేయకపోవటమే పెద్ద రిస్క్. పుష్పను నేను నమ్మా! బయట కొందరు రిస్క్ అనుకోవచ్చు. కానీ అదే నా యూఎ్‌సపీ.
జాతీయ అవార్డు రావడాన్ని ఒక అవకాశంగా భావిస్తున్నారా?
జాతీయ అవార్డు రావటమనేది చాలా మంది బాధ్యతగా భావించవచ్చు. నా దృష్టిలో అది నాకు అందివచ్చిన ఒక అవకాశం. దీనిని ఉపయోగించుకొని ఇంకా ఎదగాలి. ఒకప్పుడు నేను- నా డైరక్టర్, ప్రొడ్యూసర్ వరకు మాత్రమే ఆలోచించేవాడిని. ఇప్పుడు కమర్షియల్ సినిమాను మరింత మెరుగుపరచటమే నా లక్ష్యం. ‘బాహుబలి’ లాంటి సినిమాలవల్ల నాలుగేళ్లుగా మన పరిశ్రమకు ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే మనం ఇక్కడే ఆగిపోకూడదు. ప్రపంచస్థాయికి చేరుకోవాలి. ప్రపంచస్థాయి అంటే యూరప్, అమెరికాలు మాత్రమే కాదు. మన ఇరుగు పొరుగు దేశాలు.. చైనా.. ఆఫ్రికా.. ఇలా అనేక మార్కెట్లను మనం చేరుకోవాలి. నా ఉద్దేశంలో మరో ఐదేళ్లలో తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలుతుంది. ఇక మనం తగ్గేదేలే!
ఒత్తిడి లేదు..
నిజాయితీగా ఒక మంచి సినిమా తీయాలనుకున్నాం. ‘పుష్ప’ తీశాం. ‘పుష్ప-2’ను కూడా అదే విధంగా తీస్తున్నాం. మార్కెట్, రీచ్- ఇలాంటి విషయాలను దగ్గరకు రానివ్వటంలేదు. ఒత్తిడి వల్ల అదనంగా వచ్చే ప్రయోజనం ఉండదని మాకు తెలుసు. అందుకే ఎలాంటి ఒత్తిడికీ లోనుకావటం లేదు.
కఠినంగా ఉండలేను..
నేను స్ట్రిక్ట్ పేరెంట్ కాదు. కానీ ఆర్గనైజ్డ్ పేరెంట్‌ని. రాత్రి 8.30 తర్వాత టీవీ చూడకూడదు. స్ర్కీన్ టైమ్ తక్కువ ఉండాలి... లాంటివి కచ్చితంగా పాటించాలని చెబుతా. అయితే పిల్లల విషయంలో నా భార్య స్నేహ స్ట్రిక్ట్‌గా ఉంటుంది. నేను పిల్లలతో కఠినంగా ఉండలేను. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు.
అంత కన్నా ఏంకావాలి?
నన్ను ప్రేమించే కుటుంబం, స్నేహితులు, స్టాఫ్, అభిమానులు- నా చుట్టూ ఉన్నారు. అంత కన్నా నాకు సపోర్ట్ ఏమి కావాలి? నేను ఒక్కొక్కరితో ఒకో విషయం పంచుకుంటా. ఉదాహరణకు- కెరీర్, సినిమాలు వంటివి సుకుమార్‌తో మాట్లాడతా. ఇల్లు, ఇంటీరియర్స్ వంటివి నా భార్య స్నేహతో షేర్ చేసుకుంటా. ఫైనాన్స్, నా కెరీర్ ఎలా సాగుతోందనే విషయాలను నాన్నతో పంచుకుంటా.
ఆ పరిణితి నాకు వచ్చింది.
ప్రతి సినిమాకు ఒక పర్పస్ ఉంటుంది. ఉదాహరణకు ‘అలవైకుంఠపురములో’ సినిమాలో నాది ఈజీ గోయింగ్ పాత్ర. దానికి తగట్టుగా నేను నటించాలి. ‘పుష్ప’ను డ్యాన్స్‌ల కోసమో, ఫైట్‌ల కోసమో తీయలేదు. ఒక కమర్షియల్ ఫార్మాట్‌లో పెర్‌ఫార్మెన్స్ కోసం తీశారు. దానికి తగినట్లుగా నేను నటించాలి. నాకు ఏం చేయాలని ఉందనే విషయం కన్నా.. సినిమాకు ఏమి అవసరమనే విషయాన్నే ఆలోచించాలి.
సోషల్ మీడియా ఓ కత్తి...
సోషల్ మీడియా ఒక కత్తిలాంటిది. దానిని ముట్టుకోకపోతే మనకు వచ్చే ప్రమాదం ఉండదు. దానిని జాగ్రత్తగా వాడినా ప్రమాదం ఉండదు. వాడకపోతేనే సమస్య వస్తుంది. నేను విమర్శలను స్వీకరిస్తా. చెప్పే విధానం బావుంటే వెంటనే తీసుకుంటా.
ముందు.. తర్వాత ఆమే
నా ఫేవరెట్ యాక్టర్స్ చిరంజీవి గారు, రజనీకాంత్‌గారు. ఇక హీరోయిన్స్‌లో ఐశ్వర్యారాయ్ అంటే ఇష్టం. ఆమె ఆల్‌టైమ్ ఫేవరెట్. ఆమె ముందు ఎవరూ లేరు. తర్వాతా ఎవరూ లేరు.
సీవీఎల్ఎన్ ప్రసాద్.