Personality : నిజమైన వ్యక్తిత్వం
ABN , First Publish Date - 2023-08-24T23:53:17+05:30 IST
మనకు స్వభావసిద్ధంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి మన కుటుంబ, సామాజిక నేపథ్యాలు, వ్యక్తిగత అనుభవాలు, పరిసరాలను బట్టి ఏర్పడతాయి. దైనందిన జీవితంలో వాటినే మన స్వభావంగా భావిస్తూ ఉంటాం. అయితే నిద్రలోకి
మనకు స్వభావసిద్ధంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి మన కుటుంబ, సామాజిక నేపథ్యాలు, వ్యక్తిగత అనుభవాలు, పరిసరాలను బట్టి ఏర్పడతాయి. దైనందిన జీవితంలో వాటినే మన స్వభావంగా భావిస్తూ ఉంటాం. అయితే నిద్రలోకి జారిపోగానే... మన దైనందిన కార్యాలను మరచిపోతాం. మేలుకోగానే అన్నీ మళ్ళీ జ్ఞాపకం వస్తాయి. కానీ మనకు నిద్రలోనూ చైతన్యం ఉంటుంది. అది బాహ్య ప్రపంచానికి అతీతమైన స్థితి. మనం మన వ్యక్తిత్వం గురించి అనుకుంటున్నది... మెలకువగా ఉన్నప్పుడు ఏర్పరచుకున్న అభిప్రాయం మాత్రమే. కాబట్టి అది అసమగ్రమే అవుతుంది. మరి నిజమైన, పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఎక్కడినుంచి వస్తుంది? అది భగవంతుడి నుంచి వస్తుంది. ఆ భగవంతుడే సంపూర్ణమైన చైతన్యం. ఆయన ఉనికి శాశ్వతం, ఆయన స్వభావం నిత్యనూతనమైన ఆనందం. సాధారణమైన మానవుడి మనసు... అనంతుడు, అనిర్వచనీయుడు అయిన పరమాత్మను గ్రహించలేదు. అయితే ఆత్మలోని చైతన్యం ద్వారా... దేవుని సన్నిధిలో ఆ దివ్యానందాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలం.
మనసును ఏకాగ్రం చేసి... ఆ భగవంతుడి చైతన్యంలో నిలదొక్కుకోగలిగితే... మన బాహ్య వ్యక్తిత్వం కూడా వికసిస్తుంది. అందరినీ ఆకర్షిస్తుంది. ఆ చేతనలో ఆత్మ స్థిరంగా ఉండి... దైవత్వాన్ని ప్రతిఫలింపజేసినప్పుడే అది నిజమైన వ్యక్తిత్వం అవుతుంది. ‘మానవులం’ అనే స్పృహ ఉన్నప్పుడు... మనకు పరిమితులు ఉంటాయి. కానీ మనలోని చైతన్యాన్ని ఆత్మ పరిధిలోకి తెచ్చుకొని, మనసును ఏకాగ్రం చేసి, ఆ చైతన్యంలో నిలదొక్కుకోగలిగితే... మన బాహ్య వ్యక్తిత్వం కూడా వికసించి అందరినీ ఆకర్షిస్తుంది. మానవుడు తన గురించి, తను జీవిస్తున్న ప్రపంచం గురించీ సమాచారం కోసం ఇంద్రియాల మీద ఆధారపడతాడు. కానీ తను స్థూలమైన శరీరం కాదనీ, దివ్యము, నిత్యము అయిన ప్రాణచైతన్యమనీ గుర్తించి... ఆత్మ జ్ఞానం ద్వారా పరమాత్మను అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు... పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాడు. అతనిది దివ్యమైన వ్యక్తిత్వం అవుతుంంది.
ఈ ప్రపంచానికి చెందినవి ఏవీ శాశ్వతం కాదనీ, పరమాత్మ ఒక్కడే శాశ్వతమనీ తెలుసుకోవాలి. మనలోని ఆ పరమాత్మ శక్తే మన నిజమైన వ్యక్తిత్వం. అదే మన నిజమైన స్వభావం. దాన్ని విస్మరించకూడదు. జీవితంలో మనకు పరమాత్మ పెట్టే పరీక్షలలో గెలవడానికి అవసరమైన బలం ఆయన సంతానమైన మనకు ముందుగానే లభిస్తుంది. మనం శరీరం కాదనీ, ఆత్మ అనీ ఎంత త్వరగా, ఎంత ఎక్కువగా తెలుసుకుంటే... అంత వేగంగా భౌతిక ప్రపంచంలోని పరిమితుల నుంచి విముక్తం అవుతాం. వస్తువులు, వైభవాలు ఉండడం తప్పు కాదు. వాటిలో కొన్ని మనకు అవసరం. కానీ అవి లేకుండా ఉండలేకపోవడం, వాటికి బానిసలు కావడం మనకు హాని చేస్తుంది. క్షణికమైన భౌతిక అంశాలమీద ఆధారపడే వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి బదులు... పరమాత్మ చైతన్య శక్తికి సన్నిహితంగా జీవించే వ్యక్తిత్వం కోసం ప్రయత్నించాలి. రోజూ ధ్యానం చేస్తున్నప్పుడైనా, ప్రాపంచికమైన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడైనా... పరమాత్మ మీదే దృష్టిపెట్టాలి. ‘ఏకాగ్రత’ అనే దీపాన్ని ఆరిపోనివ్వకూడదు.
బ్రహ్మకుమారీస్
7032410931