Share News

Guru Nanak Jayanti : ఆదర్శ గురువుకు ప్రతీక

ABN , First Publish Date - 2023-11-23T23:48:34+05:30 IST

సిక్కు మత స్థాపకుడైన గురునానక్‌ మానవులను ధర్మమార్గంలో స్థిరపరచడానికి, ఆదర్శవంతమైన గురువుకు ఒక ప్రతీకను లోకానికి చూపించడానికి ఈ భువిపైన ఉద్భవించారు.

Guru Nanak Jayanti : ఆదర్శ గురువుకు ప్రతీక

27న గురునానక్‌ జయంతి

సిక్కు మత స్థాపకుడైన గురునానక్‌ మానవులను ధర్మమార్గంలో స్థిరపరచడానికి, ఆదర్శవంతమైన గురువుకు ఒక ప్రతీకను లోకానికి చూపించడానికి ఈ భువిపైన ఉద్భవించారు. పదిమంది సిక్కు గురువులలో ఆయన మొదటివారు. 1469లో తల్వాండీ గ్రామంలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లోని నాన్కానా సాహెబ్‌) ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. కార్తీక పౌర్ణమిని ‘శరదిందు’ అంటారు. శరద్రుతువులో చంద్రుడు... ఆ రోజున చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు. అది గురునానక్‌ జన్మించిన రోజు. హిందూ, ఇస్లాం మత గ్రంథాలను ఆయన సంపూర్ణంగా చదివారు. ఇరు మతాలకూ భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించారు. సిక్కు ధర్మం ఏకోశ్వరోపాసక మతం. వారు దేవుడు ఒకరేనని నమ్ముతారు. నానక్‌ కుల వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించారు. సిక్కు గురువుల పరంపరలో అయిదోవాడైన గురు అర్జున్‌... మునుపటి గురువులకు దైవం అనుగ్రహించిన సూక్తులనూ, బోధనలను సంకలనం చేసి... పవిత్ర గ్రంథమైన ‘గురు గ్రంథ సాహిబ్‌’ను రూపొందించారు.

నానక్‌ను చిన్న వయసులోనే హిందూ ధర్మంలోని తాత్త్వికత ఆకర్షించింది. జీవిత రహస్యాలను అన్వేషించడానికి ఇల్లు వదిలి వెళ్ళారు. ఆ కాలంలో... దేశంలో ప్రముఖ తాత్వికులు, బోధకులు అయిన కబీర్‌దాస్‌, రవిదా్‌సలను కలుసుకున్నారు. గురునానక్‌ ఆదిగురువు దత్తాత్రేయుడి అంశతో జన్మించినవారు. మహమ్మద్‌ ప్రవక్త అసంపూర్ణంగా వదిలివెళ్ళిన కార్యాన్ని... తిరిగి కొనసాగించడానికి ప్రయత్నించారు.

ప్రవక్తలకు ఉండవలసిన ప్రత్యేక లక్షణాలలో ఒకటి... ఆధ్యాత్మిక విద్యను ప్రబోధించడం. గురునానక్‌ లాంటి ఎందరో గురువులు తమ ప్రవచనాలతో ప్రజలను ప్రభావితం చేశారు. సన్మార్గాన్ని బోధించారు. ఎవరినీ విమర్శించడం, సవాల్‌ కావడం మంచి పద్ధతి కాదని చెప్పారు. ఆనాడు హిందువులు, ముస్లింలు కలహించుకోవడం చూసి... నానక్‌ ఆవేదన చెందారు. ‘‘రామ్‌, రహీమ్‌... ఇద్దరూ ఒక్కటే. ఆ ఇద్దరి మధ్య బేధాన్ని మీరు ఎలా చూస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘భగవంతుడు ఒక్కడే. అతని పేరు సత్యం. సృజనాత్మకత అతని వ్యక్తిత్వం. అమరత్వం అతని రూపం. అతను భయం లేనివాడు. శత్రుత్వం లేనివాడు. పుట్టుక లేనివాడు, స్వయంప్రకాశుడు. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. మనందరికీ ఆయనే తండ్రి. కాబట్టి అందరితో ప్రేమపూర్వకంగా మెలగాలి. సత్యం, అహింసలతో కూడిన మార్గంలో నడవాలి. లోభ గుణాన్ని విడిచిపెట్టాలి. కష్టపడి పని చెయ్యాలి. న్యాయమైన మార్గంలోనే ధనాన్ని ఆర్జించాలి. ఎవరి హక్కునూ హరించకూడదు. నీతిగా, నిజాయితీగా సంపాదించాలి. ఆపన్నులను ఆదుకోవాలి. ధనం జేబుకే పరిమితం కావాలి, అది హృదయాన్ని ప్రభావితం చేయకూడదు. అలా జరిగితే సమస్యలు చుట్టుముడతాయి’’ అని ఆయన బోధించారు. స్త్రీలు, పురుషులు సమానులనీ, మహిళలను గౌరవించాలనీ, బాహ్యప్రపంచాన్ని గెలవడానికి ముందు మనలో అంతర్గతంగా ఉన్న దుర్గుణాలను తొలగించుకోవాలనీ సూచించారు.

అహంకారం మనుషులకు అతి పెద్ద శత్రువనీ, అహంకారానికి లోనుకాకూడదనీ, వినయంతో, సేవాభావంతో మెలగాలనీ, ప్రేమ, ఐకమత్యం, సమానత్వం, సోదరభావం, ఆధ్యాత్మిక చింతనతో జీవించాలనీ హితవు చెప్పారు. ఒక రోజు నానక్‌ తన శిష్యులతో మాట్లాడుతూ... తన చేతిని ఒక ఒక బండరాయి మీద ఉంచారు. ఆ రాతి నుంచి నీరు రావడం మొదలైంది. అక్కడి గురుద్వారాను ‘పంజా సాహెబ్‌’ అంటారు. ‘పంజా’ అంటే చేతి అయిదు వేళ్ళు. ‘పంజాబ్‌’ అంటే అయిదు జలాలు, అయిదు నదులు. ‘పంజాబ్‌’ రాష్ర్టానికి ఆ పేరు వాటివల్లే వచ్చింది.‘‘భగవంతుణ్ణి ఎలా సందర్శించగలం? అడవికి వెళ్ళి తపస్సు చేయవలసిందేనా? అసలు దేవుడి రూపం ఎలా ఉంటుంది?’’ అని ఒకసారి గురు నానక్‌ను ఆయన శిష్యులు ప్రశ్నించారు.

అప్పుడు ‘‘నానక్‌ అమాయకులారా! భగవంతుణ్ణి కనుక్కోడానికి మీరు అడవికి వెళ్ళి ఎందుకు వెతుకుతారు? ఆయన సర్వాంతర్యామి. అన్ని చోట్లా ఉన్నాడు. అణువణువులో ఉన్నాడు. అందరిలో ఎల్లప్పుడూ ఉంటాడు. అతను మీతో, మీ శరీరం లోపలే ఉన్నాడు. పువ్వుకు సువాసన ఎలా ఉంటుందో, అద్దానికి ప్రతిబింబం ఎలా ఉంటుందో... అదే విధంగా భగవంతుడు సూక్ష్మ రూపంలో అన్ని చోట్లా... ఒకేలా ఉంటాడు. కాబట్టి మీ శరీరం లోపల... ఆత్మలో ఆ దేవుణ్ణి వెతకండి. ఆయన మన శరీరం లోపలా, బయటా ఉన్నాడని తెలుసుకోండి. మనలోని ఆత్మను గుర్తించకుండా, ఆ పరమాత్మను ఎన్నటికీ తెలుసుకోలేం’’ అని సమాధానం ఇచ్చారు.

గురునానక్‌ జయంతిని శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగులతో కలిసి ఘనంగా నిర్వహించేవారు. ఆత్మసాక్షాత్కారం పొందిన సహజయోగ సాధకులు... గురునానక్‌ గుణగణాలను, లక్షణాలనూ తమలో ప్రతిబింబించేలా చూసుకోవాలని ఆమె బోధించేవారు.

డాక్టర్‌ పి. రాకేష్‌ 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

Updated Date - 2023-11-23T23:48:35+05:30 IST