అభినయంలో అరుదైన పటాకా

ABN , First Publish Date - 2023-07-09T00:49:54+05:30 IST

ఈ ఢిల్లీ భామ తొలి సినిమా ‘దంగల్‌’. పేరు సాన్యా మల్హోత్రా. బబితా కుమారి పాత్రలో అదరగొట్టేసి ప్రశంస లందుకున్నాక ‘పటాకా, బదాయి హో’ లాంటి చిత్రాల్లో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది.

అభినయంలో అరుదైన  పటాకా

ఈ ఢిల్లీ భామ తొలి సినిమా ‘దంగల్‌’. పేరు సాన్యా మల్హోత్రా. బబితా కుమారి పాత్రలో అదరగొట్టేసి ప్రశంస లందుకున్నాక ‘పటాకా, బదాయి హో’ లాంటి చిత్రాల్లో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తర్వాత మరో స్టార్‌ హీరో షారుక్‌తో నటిస్తోంది. ఈ సందర్భంగా సాన్యా మల్హోత్ర గురించి కొన్ని విశేషాలు..

‘‘బబ్లీగా ఉంటుంది. ఈ అమ్మాయి ఏమి నటిస్తుందిలే’ అనుకున్నారు కొందరు. అయితే ఇపుడా పరిస్థితి లేదు. చిన్నప్పటినుంచి మహిళా ప్రాధాన్యం ఉండే చిత్రాలను చూస్తూ పెరిగా. ఇపుడు ఉమెన్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌కు నన్ను ఎంపిక చేస్తుంటే సంతోషంగా ఉంది. నటిగా బాలీవుడ్‌లో నిలదొక్కుకోవటానికి కారణమైంది మాత్రం ‘దంగల్‌’ మూవీనే!

జీవితాన్నే మారుస్తుందని...

అసలే రింగుల జుట్టు.. ఆపై మోడర్న్‌ లుక్‌.. ‘దంగల్‌’ చిత్రం ఆడిషన్‌కి వెళ్లినప్పుడు నా పరిస్థితి. మల్లయోధురాలు పాత్రకు పొట్టిజుట్టు ఉందని కష్టమన్నారు కొందరు. ఆడిషన్‌ ఇచ్చా. ఫాతిమాతో పాటు నేను కూడా మూడు నెలలు ఫలితాల కోసం ఎదురుచూశా. అసలు మేం సెలక్టవుతామో లేదో అని భయపడ్డాం. ఆపై అమీర్‌ఖాన్‌లాంటి హీరోతో కలసి నటించే అవకాశం వచ్చినందుకు ఎగిరి గంతేశాం. నటించేప్పుడు మాత్రం ఈ సినిమా నా జీవితాన్నే మార్చేస్తుందని అనిపించింది. అందుకు తగినట్లే.. ప్రివ్యూ చూశాక చిత్ర యూనిట్‌ నుంచి ఫోన్‌కాల్స్‌ మొదలయ్యాయి. ఎంతో అద్భుతంగా అనిపించింది.

సోలోగా డ్యాన్సులేసేదాన్ని..

మా అమ్మానాన్నకు నాటకాలు, సినిమాలంటే ఇష్టం. బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌కు మా నాన్న వీరాభిమాని. తన హీరో గురించి అనేక విషయాలు చెప్పేవారు. అయితే నేనెప్పుడూ థియేటర్లకు వెళ్లలేదు. ఇంట్లోనే సీరియల్స్‌, సినిమాలు చూసేదాన్ని. ‘విశ్వామిత్ర’ చిత్రం వందసార్లకు పైగా చూశా. నా స్నేహితురాలు ఒకామె ఉండేది. తను ఉదయం ఫస్ట్‌షోకు వెళ్లి మా ఇంటికి వచ్చి సాయంత్రం దాకా ఆ సినిమా కథ చెప్పేది. ఎందుకో ఆమె చెప్పే తీరు నచ్చేది. టీవీలో చూసిన సినిమా డైలాగ్స్‌ ఆమెకు చెప్పేదాన్ని. పాటలు పెట్టుకుని డ్యాన్సులేసేవాళ్లం. ఇక సంగీత్‌ ఫంక్షన్లలో, కాలేజీలో అయితే సోలోగా డ్యాన్సు వేసేదాన్ని.

అందుకే ముంబయికి మార్చాం..

ఎందుకో తెలీదు కానీ నటిని అవుతానని గట్టిగా నమ్మేదాన్ని. ఒక ఢిల్లీ అమ్మాయిగా సినిమా కలలు కనటంవల్ల ఉపయోగం ఉండదని తెలిసి బాలీవుడ్‌ వైపు చూసేదాన్ని. డిగ్రీ చదివాక డ్యాన్సులో శిక్షణ తీసుకున్నా. టీవీ రియాలిటీ షోకి మెయిల్‌ చేశా. ముంబయికి వెళ్లాను. అక్కడ డ్యాన్సు పోటీలకు సరిపోవన్నారు. బాధపడ్డా. కచ్చితంగా సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నా. అమ్మేమో ‘డిగ్రీనే అయింది. కోర్సులు నేర్చుకో. ఉద్యోగం చెయ్యి’ అన్నది. నాన్న మాత్రం సపోర్టు ఇచ్చారు. కొన్ని నెలల్లోనే సినిమా కోసం ముంబయికి వెళ్లా. కొన్నాళ్లు ఖాళీగా ఉన్నా. అసలు ఆడిషన్స్‌కి వెళ్లాలంటేనే టెన్షన్‌ పడేదాన్ని. నేను సిగ్గరిని. రూమ్‌మేట్స్‌ నాలో ఆత్మవిశ్వాసం నింపారు. ముంబయి జీవితం మరింత దృఢంగా, ఇండిపెండెంట్‌గా చేసింది.

కష్టాలకు భయపడలేదు..

నా ఫేవరేట్‌ దర్శకులంతా ఫోన్‌ చేసి ‘దంగల్‌’ తర్వాత మాట్లాడారు. ‘పటాకా’లో నటించేప్పుడు బైక్‌ యాక్సిడెంట్‌ అయింది. పదిహేను కేజీలు బరువు పెరగటంతో.. ఆ బరువుకు పలుచోట్ల గాయాలయ్యాయి. కోలుకోలేకపోయా. ఆ సినిమాకి మంచి పేరు రావటంతో కాస్త ఆనందపడ్డా. ఆ తర్వాత ‘బదాయి హో’ ప్రమోషన్‌లో డ్యాన్సు వేస్తుంటే కాలుకి తీవ్ర గాయం అయింది. అలా నాలుగైదు సినిమాలు చేసే వరకూ గాయాలు బాధపెట్టాయి. కానీ ఏనాడూ షూటింగ్‌కు గైర్హాజరు కాలేదు. నటిస్తోంటే ఆ పాత్రలో లీనమైపోయేదాన్ని. ఆ తర్వాత థెరపీ తీసుకున్నా. పాత్రల పరిధిని అర్థం చేసుకున్నా. జీవితమే అన్నీ నేర్పుతుంది. దేన్నైనా ఎదుర్కునే స్వభావం నాది. విద్యాబాలన్‌, తాప్సీ తదితర సీనియర్లు మంచి సినిమాలు చేస్తున్నారు. వారి బాటలోనే నడుస్తున్నా. హీరోలతో రొమాంటిక్‌ సాంగ్స్‌ చేయాలనుకుంటాను. అయితే నటనకు స్కోప్‌ ఉండే పాత్రలు వస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ కోసం నన్ను సంప్రతిస్తున్నారు. ఇదెంతో ఆనందకరమైన విషయం. అభిమాన నటుడు షారుక్‌ఖాన్‌తో ‘జవాన్‌’లో నటిస్తుండటం గొప్పగా ఉంది. మంచి మహిళా చిత్రాలు చేయాలన్నదే నా లక్ష్యం.’’

Updated Date - 2023-07-09T06:10:59+05:30 IST