Dr. Pooja Neelam Kapoor : గురువెవ్వరు లేని సంగీత అతిశయం

ABN , First Publish Date - 2023-06-07T06:06:16+05:30 IST

ఈ అమ్మాయి పేరు డాక్టర్‌ పూజ నీలమ్‌ కపూర్‌. పదేళ్ల వయసులో సంగీత ప్రపంచంలోకి అడుగెడింది. పదిహేనేళ్ల వయసులోనే అమెరికాలోని నార్త్‌ కరొలినాలోని

Dr. Pooja Neelam Kapoor : గురువెవ్వరు లేని సంగీత అతిశయం

ఈ అమ్మాయి పేరు డాక్టర్‌ పూజ నీలమ్‌ కపూర్‌. పదేళ్ల వయసులో సంగీత ప్రపంచంలోకి అడుగెడింది. పదిహేనేళ్ల వయసులోనే అమెరికాలోని నార్త్‌ కరొలినాలోని ‘డ్యూక్‌ విశ్వవిద్యాలయం’ నుంచి సంగీతంలో డాక్టరేట్‌ అందుకుంది. మ్యూజిక్‌ కంపోజర్‌ మాత్రమే కాదు అనేక వాయిద్యాలు ప్లే చేస్తుంది. అద్భుతమైన సింగర్‌ కూడా. అనేక హిందీ రియాలిటీ షోల్లో ప్రతిభను చాటుకుంది. ఏకంగా సంగీతంలో 39 వరల్డ్‌ రికార్డులు అందుకున్న పూజ నీలమ్‌ కపూర్‌ను ‘నవ్య’ పలకరించగా.. ఆమె కెరీర్‌తో పాటు జీవిత విశేషాలను చెప్పుకొచ్చారిలా..

‘‘సంగీతమే నా ప్రపంచం. సరిగమలతోనే ఆనందం. ఆ ఆనందాన్ని చెప్పలేను. నాకు గురువెవ్వరూ లేరు. చిన్నప్పటి నుంచీ కీబోర్డుపై సొంతంగా రాగాలు పలికిస్తున్నా. ఇదంతా దేవుడి ఆశీస్సులు అనిపిస్తుంది.

అలా సంగీత ప్రపంచంలోకి..

చిన్నప్పటినుంచి డైస్లెక్సియా అనే సమస్య ఉండేది. ఇదో రకమైన అభ్యాస వైకల్యం. రాయలేకపోయేదాన్ని. చదవలేకపోయేదాన్ని. బాల్యంలో విన్‌స్టన్‌ చర్చిల్‌, బిల్‌ క్లింటన్‌, అభిషేక్‌ బచ్చన్‌ లాంటి వాళ్లు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారట. విద్యార్థిగా బడిలో రాణించలేకపోవటంతో మా అమ్మ ఒక రోజు కీ బోర్డు బహుమతిగా ఇచ్చింది. కాస్త అప్పుడైనా ఈ సమస్య తగ్గిపోతుందేమోనని.. అమ్మ ఆశ! నా వయసు అప్పుడు పదేళ్లుంటాయేమో. బాగా గుర్తుంది.. ఆ రోజు గణేష్‌ నిమజ్జనం. అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో ఉన్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ‘ఏక్‌ ప్యార్‌ కా నగ్‌మా..’ అనే బాలీవుడ్‌ క్లాసిక్‌ పాటను కీబోర్డు మీద పలికించా. టీవీలో పాట వస్తోందని అనుకుందట అమ్మ. నన్ను ఎదురుగా చూశాక.. అమ్మ ఎంతో సంతోషపడింది. ‘నువ్వు ప్రత్యేకం. అద్భుతమైన ప్రతిభ నీకు ఉంది’ అంటూ మెచ్చుకుంది. అలానే ఇంట్లో ఉండే అమ్మమ్మ, తాతయ్యల ఆనందానికి అవధుల్లేవ్‌. ఆ తర్వాతి రోజునుంచి బడిలో విన్న ఇంగ్లీషు పద్యాలన్నీ కీబోర్డుపై ప్లే చేశా. విషయమేంటంటే.. నాకే తెలీదు.. ఒక్క వేలితో ఈ కీబోర్డు వాయించటం ప్రయోగమని! ఎంతో మంది సంగీత విజ్ఞులు మెచ్చుకున్నారు.

రియాలిటీ షోల్లోనూ..

చూపుడువేలుతో కీబోర్డు మీద ప్లే చేయటం కష్టమని అందరూ అంటారు. నాకెలాంటి ఇబ్బంది లేదు. ఇక కళ్లకు గంతలు కట్టుకుని పాటను ప్లే చేసేదాన్ని. పాడేదాన్ని. దీంతో సందీప్‌ అనే సంగీత కళాకారుడితో కలసి.. మరికొంత మందితో మ్యూజిక్‌ ట్రూప్‌ రన్‌ చేశాం. ఆ సమయంలో ఫోన్‌ వచ్చింది ముంబైకి రమ్మని. ఆ షో పేరు ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’. అందులో కళ్లకు గంతలు కట్టుకుని కీబోర్డు మీద రాగాలు పలికించా. ఆ షోకి జడ్జిగా వచ్చిన ప్రముఖ దర్శకులు శేఖర్‌ కపూర్‌ ‘గ్రేట్‌ మొజార్ట్‌’ అని ప్రశంసించారు. కీబోర్డుతో పాటు తబలా, డ్రమ్స్‌ వాయిస్తా. హిందీలోనే కాదు.. తెలుగులోనూ ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లో పాడాను. ఏడాదిలో నేర్చుకోవాల్సిన హిందూస్థానీ సంగీతం కోర్సును ఐదు నెలల్లో నేర్చుకున్నా. ఉర్దూలో షాయిరీలు చెబుతాను. ఇదంతా సరస్వతీ కటాక్షమే అనుకుంటా.

మర్చిపోలేని జ్ఞాపకాలు..

బాలీవుడ్‌ దర్శకురాలు ఫరాఖాన్‌ ‘తేరే మేరే బీచ్‌మే’ షోకి ప్రత్యేక అతిథిగా నన్ను పిలిచారు. ఆ రోజు ఫరాఖాన్‌గారు నాకు కారవాన్‌ ఇవ్వటంతో పాటు ప్రత్యేకమైన టీమ్‌ ఇచ్చారు. మేకప్‌తో పాటు మంచి క్యాస్టూమ్స్‌ వేసుకున్నా. హీరోయిన్‌లా తయారు చేశారు. అది మర్చిపోలేని జ్ఞాపకం. ఆ షోకి హృతిక్‌ రోషన్‌, కంగనా రనౌత్‌ వచ్చారు. హృతిక్‌ రోషన్‌ మంచి హ్యూమన్‌ బీయింగ్‌. చాలా బాగా మాట్లాడారు. నా ప్రతిభను ఆ ఇద్దరు స్టార్స్‌ మెచ్చుకున్నారు. ‘కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌’ షోకి సోనమ్‌ కపూర్‌, ఆయుష్మాన్‌ ఖురానా వచ్చారు. ఒకరోజు ఏక్తాకపూర్‌ బాలాజీ టెలీఫిల్మ్స్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. సీరియల్‌కు సంగీతం అందివ్వమన్నారు. ‘క్యాహోగా నిమ్మో కా’ డైలీ సీరియల్‌కు.. అలా పదహారేళ్ల వయసులో సంగీతం అందించా. ‘కావ్యాంజలి’ అనే పాపులర్‌ సీరియల్‌కు పని చేశా. స్టార్‌ప్లస్‌ ఛానల్‌లో ‘లాఖోం మే ఏక్‌’ అనే పేరుతో నా గురించి ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేయటం ఓ మధుర జ్ఞాపకం.

అదే నా కల..

హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, మరాఠీ, ఉర్దూ, రాజస్థానీ, పంజాబీ భాషలు మాట్లాడతా. ఆ భాషల్లో పాడతాను. కంప్యూటర్‌ కోర్సు కూడా చేశా. లెక్కలంటే భయం అంతే. ఏదైనా విషయం చెబితే వెంటనే నేర్చేసుకుంటా. అవార్డుల విషయానికొస్తే తొలిరోజుల్లో ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు నన్ను కొనియాడారు. లిమ్కా బుక్‌ అవార్డ్స్‌, ఆసియన్‌ అవార్డ్‌, గ్లోబల్‌ అవార్డ్స్‌ వచ్చాయి. ఇలా ఇప్పటి వరకూ సంగీతంలో 39 వరల్డ్‌ రికార్డులు అందుకున్నా. తెలుగులో స్టార్‌ హీరోలైన జూనియర్‌ ఎన్టీయార్‌, విజయ్‌ దేవరకొండను కలవాలనుంది. ఒకప్పుడు ప్రతి నెల అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి గ్రాసరీస్‌ ఇచ్చేదాన్ని. ముఖ్యంగా సికింద్రాబాద్‌లోని ఓల్డేజ్‌ హోమ్‌కు వెళ్తాను ఎక్కువగా. అక్కడ సంగీతం ప్లే చేస్తా. వారితో హాయిగా గడుపుతా. భవిష్యత్‌లో వృద్ధాశ్రమం కట్టించాలనే కల మాత్రం నాకుంది. అది నెరవేరుతుందో లేదో ఆ దైవమే నిర్ణయించాలి.

రాళ్లపల్లి రాజావలి

ఫొటోలు: రాజ్‌ కుమార్‌

Updated Date - 2023-06-07T06:06:16+05:30 IST