‘విమోచన’పై సినిమా చేయాలని ఉంది!

ABN , First Publish Date - 2023-09-17T05:30:39+05:30 IST

సెప్టెంబర్‌ 17... ఇది తెలంగాణకు విలీన దినమా? విమోచన దినమా? దీనిపై రాజకీయ పార్టీలన్నీ కొట్టుకొంటున్నాయి. ఈ మధ్యలో కమ్యూనిస్టులు మేం చేసిన సాయుధ పోరాట

‘విమోచన’పై సినిమా చేయాలని ఉంది!

సెప్టెంబర్‌ 17... ఇది తెలంగాణకు విలీన దినమా? విమోచన దినమా? దీనిపై రాజకీయ పార్టీలన్నీ కొట్టుకొంటున్నాయి. ఈ మధ్యలో కమ్యూనిస్టులు మేం చేసిన సాయుధ పోరాట ఫలితమే ఇదంటారు. ఒకళ్లు విలీనం అంటే... మరొకరు విమోచనం అంటున్నారు. 1946 నుంచి 52 వరకు జరిగిన ఆ ఉద్యమం గురించిన అసలు వాస్తవం ఏంటి, చరిత్ర ఏంటన్నది చాలామంది మరచిపోయారు. నేను పుట్టినప్పుడు ఇక్కడ ఉద్యమం జరుగుతోంది. మా పెదనాన్న తమ్మారెడ్డి సత్యనారాయణ గారు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మా నాన్న గారు ఆంధ్రాలో అండర్‌గ్రౌండ్‌లో ఉండేవారు. ఇవన్నీ నేను విన్నవే అనుకోండి. నేను 1955లో హైదరాబాద్‌ వచ్చాను. అప్పుడప్పుడే నాకు ఊహ తెలుస్తున్న సమయం. చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కడియాల గోపాలరావు, వీరమాచినేని ప్రసాద్‌, మా తాత గారు, నాన్న గారు... ఇలా కమ్యూనిస్టు నాయకులంతా కలిసి ఒక కాలనీ తీసుకున్నారు. ఆ కాలనీలో ఉంటూ... ఆ కథలు వింటూ నేను పెరిగాను. నాకు అప్పటి నుంచి అదొక స్ఫూర్తి.

ప్రపంచంలో జరిగిన పోరాటాలన్నిటిలోకీ తెలంగాణ సాయుధ పోరాటం విభిన్నమైనదనేది నా ఉద్దేశం. ఇప్పటికీ అదే నమ్ముతాను. ఎందుకు భిన్నమైనదంటే... ఆ రోజున ఇక్కడ చదువు పెద్దగా లేదు. వెట్టి చాకిరీ, ‘నీ బాన్చన్‌ దొరా..’ అనే రోజుల్లో ఆడ, మగ, ముసలి, ముతక, చిన్న, పెద్ద... అందరూ తుపాకీ పట్టుకుని చేసిన ఉద్యమం అది. చాలా ఊళ్లను దొరల కబంధ హస్తాల నుంచి విడిపించారు. భూములు పంచారు. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన పోరాటం. దాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా ఇప్పుడు కొంతమంది చిత్రీకరిస్తున్నారు. కానీ రజాకర్లపై సాగిన ఈ పోరాటం బందగీతో మొదలైంది. బందగీ ముస్లిమే. తరువాత షోయబుల్లా ఖాన్‌ను హైదరాబాద్‌లో చంపారు. ఆయనా ముస్లిమే. రావి నారాయణరెడ్డి గారు, మగ్దుం మొయినుద్దీన్‌, బద్దం ఎల్లారెడ్డి గారు... వీళ్ల ముగ్గురూ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. అంటే పిలుపునిచ్చిన వారిలో కూడా ముస్లింలు ఉన్నారు. రజాకార్లతో కలిసి దొరలు, పెత్తందార్లు చేసిన అరాచకాలు అవన్నీ. ఈ అరాచకాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. ఇందులో ఐదు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇరవై వేల కుటుంబాలు తెలంగాణ నుంచి వలస వెళ్లిపోయాయి. బైరాన్‌పల్లిలో 108 మందిని రజాకార్లు కాల్చి చంపారు. జలియన్‌వాలాబాగ్‌ తరువాత దేశంలో జరిగిన అతిపెద్ద మూకుమ్మడి హత్యల్లో ఇదొకటి. అలాగే సాయుధ పోరాట యోధులు కూడా గెరిల్లా యుద్ధం చేసి చాలా ఊళ్లను రజాకార్ల చెర నుంచి విడిపించారు. పది లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచారు. దొరల అరాచకాలు ఏ స్థాయిలో జరిగాయంటే... ఒక్కో కథ వింటుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఆవేశం పొంగుతుంది. చిన్నప్పటి నుంచి విన్నాను కాబట్టి... తెలంగాణ సాయుధ పోరాటం మీద ఒక సినిమా తీయాలనేది నా కోరిక. అప్పట్లో ‘మా భూమి’ వచ్చింది. బి.నర్సింగరావు గారు, మా రవి తీశారు. తెలంగాణ ఉద్యమం మీద వచ్చిన మొదటి చిత్రం అది. అద్భుతమైన సినిమా. అయితే ఉద్యమం జరిగి ఇప్పుడు 75 ఏళ్లు గడిచిపోయాయి. చాలామందికి ఆ ఉద్యమం గురించి తెలియదు. నాకు తెలిసి నాడు దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోరాటంలో పాల్గొన్నవారు ఉండే ఉంటారు. ఈ ఉద్యమంతో తెలంగాణలో వెట్టి చాకిరీ పోయింది.

అంతటి మహోన్నత ఉద్యమం గురించి మాట్లాడుకోకుండా... విలీనమా? విమోచనమా? అంటూ వివాదాలు సృష్టిస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద జరిగిన గొప్ప పోరాటం గురించి ఎవరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అందుకే అందరికీ అర్థమయ్యేలా అసలైన చరిత్ర చెప్పాలనేది నా కోరిక. ఆ ప్రయత్నం చేస్తున్నాను. ఓపిక ఉండి, నేను తీయగలిగితే మాత్రం అది నా సినిమా అవుతుంది.

తమ్మారెడ్డి భరద్వాజ (దర్శకనిర్మాత)

Updated Date - 2023-09-17T05:30:39+05:30 IST