Libya: హృదయాలను కలిచివేస్తున్న లిబియా మృత్యుఘోష

ABN , First Publish Date - 2023-09-15T04:03:19+05:30 IST

ఇళ్లు.. వీధులు.. సముద్ర తీరం.. ఎక్కడ చూసినా మృతదేహాలే..! సహాయక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వ వర్గా లు, ఇళ్లలో వెతికితే.. కుళ్లిన స్థితిలో మృతదేహాలు కనిపిస్తున్నాయి. వాటిని ఆస్పత్రి మార్చురీల్లో భద్రపరిచే తావు లేదు. వసతులు, వైద్యులు లేని ఆస్పత్రులు

Libya: హృదయాలను కలిచివేస్తున్న లిబియా మృత్యుఘోష

  • లిబియాలో 20వేలకు పైనే మరణాలు..!!

  • డెర్నా మేయర్‌ అబ్దుల్‌ మునీమ్‌ వెల్లడి

  • ఆస్పత్రుల్లో వైద్యులు, వసతులు కరువు

  • నిండిన మార్చురీలు.. సామూహిక ఖననాలు

ట్రిపోలి, సెప్టెంబరు 14: ఇళ్లు.. వీధులు.. సముద్ర తీరం.. ఎక్కడ చూసినా మృతదేహాలే..! సహాయక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వ వర్గా లు, ఇళ్లలో వెతికితే.. కుళ్లిన స్థితిలో మృతదేహాలు కనిపిస్తున్నాయి. వాటిని ఆస్పత్రి మార్చురీల్లో భద్రపరిచే తావు లేదు. వసతులు, వైద్యులు లేని ఆస్పత్రులు ప్రస్తుతం మృతదేహాలకు నిలయాలుగా మారాయి..! ఇదీ.. వరద కల్లోలిత లిబియా తూర్పు ప్రాంతం డెర్నా నగరంలో పరిస్థితి..! గల్లంతైన వారిలో చాలా మంది మరణించి ఉంటారని ప్రభు త్వ వర్గాలు అంచనా వేస్తుండగా.. మృతుల సంఖ్య 20 వేలకు పైనే ఉంటుందని డెర్నా మేయర్‌ అబ్దుల్‌ మునీమ్‌-అల్‌-ఘైతీ అంతర్జాతీయ మీడియాకు చెప్పారు. మరణాల సంఖ్య విషయంలో అధికారిక లెక్కలు పొంతనలేకుండా ఉన్నట్లు పాశ్చాత్య మీడియా పేర్కొంది. ఆరున్నర వేల మంది చనిపోయారని అధికారులు, 3,200 మరణాలు సంభవించాయని ఐక్యరాజ్య సమితి(ఐరాస) వెల్లడించగా.. డెర్నా అధికారులను ఉటంకిస్తూ 10 వేల నుంచి 20 వేల మంది చనిపోయి ఉంటారని డచ్‌ వార్తాసంస్థ డీడబ్ల్యూ డాట్‌ కామ్‌ తన అరబిక్‌ వార్తల పోర్టల్‌లో ఓ కథనాన్ని ప్రచురించింది.

కుటుంబాలకు కుటుంబాలు గల్లంతు

డెర్నా నగరంలో కుటుంబాలకు కుటుంబాలే గల్లంతయ్యాయని అరబిక్‌ వార్తా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. లిబియా రాజధాని ట్రిపోలిలో ఐటీ ఉద్యోగిగా పనిచేసే ఫదల్లా తన కుటుంబంలో అందరూ మరణించారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘ఆదివారం మధ్యాహ్నమే మా వాళ్ల కు ఫోన్‌ చేసి.. భారీ వర్షాలున్నట్లు హెచ్చరించాను. పర్వత ప్రాంతానికి వెళ్లమని చెప్పాను. కానీ, ప్రభు త్వ కర్ఫ్యూ, తిరుగుబాటుదారుల ఆంక్షలకు భయపడి, వారు ఇంట్లోనే ఉండిపోయారు. మా కుటుంబంలోని 13 మందిలో ఏ ఒక్కరూ ఇప్పుడు బతికి లేరు’’ అని ఆయన వాపోయారు. ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్లే మరణాల సంఖ్య పెరిగిందని ఐరాస వెల్లడించింది. డెర్నాలో నదీ పరీవాహక ప్రాంతంలో నివసించే ఉపాధ్యాయుడు మహమ్మద్‌ డెర్నా సోమవారం తెల్లవారుజామున తాను చూసిన భయానక దృశ్యాలను మీడియాకు కళ్లకు కట్టినట్లు చెప్పారు. ‘‘నేను, నా భార్య, పిల్లలు మూడో అంతస్తు పైకెక్కి ప్రాణాలను కాపాడుకున్నాం. వాడిడెర్నా నది ఆరేడు మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తూ కనిపించింది. చాలామంది భవనాలపై హాహాకారాలు చేస్తూ కనిపించారు. చూస్తుండగానే ఆ భవనాలు కూలిపోయి.. వారం తా నీటిలో కొట్టుకుపోయారు’’ అని ఆయన వివరించారు. 51 ఏళ్ల డ్రైవర్‌ ఒసామా-అల్‌-హసాది ఏడుస్తూ పునరావాస శిబిరాల్లో తమ వారి కోసం రెండ్రోజులుగా వెతికారు. గురువారం తన భార్య, ఐదుగురు పిల్లల మృతదేహాలు లభించాయంటూ కన్నీరుమున్నీరవుతూ చెప్పారు.

సురక్షితంగా 600 మంది

డెర్నా అంబులెన్స్‌ అండ్‌ ఎమర్జెన్సీ విభాగం బుధవారం నుంచే రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించింది. బుధవారం రాత్రి వరకు 600 మందిని కాపాడినట్లు పేర్కొంది. అయితే.. మొండిగోడలుగా మారిన ఇళ్లలో భయానక దృశ్యాలను చూడాల్సి వచ్చిందని, ఏ ఇంట్లో చూసినా.. మృతదేహాలే కనిపించాయని రెస్క్యూ బృందాలు చెప్పాయి.

Updated Date - 2023-09-15T12:06:36+05:30 IST