Escalators: ఎస్కలేటర్లపై నడవడం ఇకపై నిషేధం.. ప్రజలకు జపాన్ ఆదేశం.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2023-10-09T19:46:21+05:30 IST

సాధారణంగా మనం ఎస్కలేటర్లపై నిల్చుంటే.. అవే మనల్ని పైకి/కిందకు తీసుకెళ్తాయి. కానీ.. తొందరలో ఉన్న కొందరు వ్యక్తులు మాత్రం ఆ ఎస్కలేటర్లపై త్వరగా నడుచుకుంటూ పోవడమో, పరిగెత్తడమో...

Escalators: ఎస్కలేటర్లపై నడవడం ఇకపై నిషేధం.. ప్రజలకు జపాన్ ఆదేశం.. ఎందుకో తెలుసా?

సాధారణంగా మనం ఎస్కలేటర్లపై నిల్చుంటే.. అవే మనల్ని పైకి/కిందకు తీసుకెళ్తాయి. కానీ.. తొందరలో ఉన్న కొందరు వ్యక్తులు మాత్రం ఆ ఎస్కలేటర్లపై త్వరగా నడుచుకుంటూ పోవడమో, పరిగెత్తడమో చేస్తుంటారు. ఎమర్జెన్సీ సమయాల్లో ప్రతిఒక్కరూ ఇదే పని చేస్తుంటారు. కానీ.. ఇకపై అలా చేయడాన్ని (నడవడం, పరిగెత్తడం) జపాన్ నిషేధించింది. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే.. ఎస్కలేటర్లపై కేవలం నిల్చోనే వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. జపాన్‌లోని నగోయా ఈ కొత్త ఆర్టినెన్స్‌ని అక్టోబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ప్రమాదాలను నివారించడం కోసమే నగోయా నగరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

నిజానికి.. జపాన్‌లోని ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నియమాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఎస్కలేటర్‌పై నిల్చొనే వాళ్లు ఎడమవైపు కదలకుండా ఉంటారు. నడిచే వాళ్లు కుడివైపు నుంచి వెళ్లిపోతారు. కానీ.. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ప్రజలు ఇరువైపులా నిలబడి ఉండాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నడవడానికి వీలు లేదు. రైల్లే స్టేషన్లు, కార్యాలయ భవనాలు, షాపింగ్ మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఎస్కలేటర్లపై ప్రజలు నిశ్చలంగా నిలబడాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నియమం ఉల్లంఘించినందుకు ఎలాంటి జరినామాలు లేవు. కేవలం నడవకూడదని నగోయా నగరం ఆర్డినెన్స్ తెచ్చిందే తప్ప.. దాని ఉల్లంఘనకు జరినామాల్ని మాత్రం విధించలేదు.


జపాన్ టైమ్స్ ప్రకారం.. 2018, 2019 మధ్యకాలంలో ఏకంగా 805 ఎస్కలేటర్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సక్రమంగా వినియోగించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు నివేదికలు తెలిపాయి. ఎస్కలేటర్లపై నడవడం లేదా పరిగెత్తడం వల్లనో ప్రజలు తమ బ్యాలెన్స్ కోల్పోతున్నారని.. తద్వారా అనుకోని సంఘటనలు జరిగాయని గుర్తించారు. కొందరు అనవసరంగా ఎస్కలేటర్లపై పైకి, క్రిందికి పరిగెత్తుతుండటాన్ని కూడా గమనించారు. వీరి వల్ల ఇతరులు ఇబ్బందులకు గురవుతున్నారని, అంగవైకల్యం లేదా ఊతకర్ర సహాయంతో నడిచే వాళ్లు ప్రమాదాలకు గురయ్యారని రిపోర్టులు తేల్చాయి. అందుకే.. కేవలం నిల్చొని ఉండాలన్న ఈ కొత్త ఆర్డినెన్స్ వచ్చింది.

ఇదే సమయంలో నగోయా నగర ప్రభుత్వం ప్రధాన రైల్వే స్టేషన్లలో కొత్త ఆర్డినెన్స్ పోస్టర్లను అతికించింది. ‘‘ఇకపై మనం రెండువైపులా నిలబడి ఎస్కలేటర్లపై వెళ్దాం’’, ‘‘ఎస్కలేటర్స్‌పై ఉన్నప్పుడు పరిగెత్తకుండా ఇరువైపులా నిల్చొని వెళ్లడం మన బాధ్యత’’ అని సూచించేలా ఈ పోస్టర్లలో కార్టూన్స్‌ని డిజైన్ చేశారు. కాగా.. జపాన్‌లో ఇటువంటి ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 2021లోనూ సైతామా ప్రిఫెక్చర్ కూడా ఎస్కలేటర్లపై కదిలికల్ని నిషేధించింది. వినియోగదారులు ఎస్కలేటర్లపై నడవడం గానీ, పరిగెత్తడం గానీ చేయకూడదని ఆర్డినెన్స్ కోరింది.

Updated Date - 2023-10-09T19:46:21+05:30 IST