Share News

Cargo Ship: టైటానిక్ సీన్ రిపీట్.. ఆ దెబ్బకు మునిగిన కార్గో షిప్.. 14 మంది గల్లంతు

ABN , First Publish Date - 2023-11-27T15:07:57+05:30 IST

‘టైటానిక్’ సినిమాలో ఆ భారీ నౌక ఎలా మునిగిందో అందరూ చూసే ఉంటారు. ఒక మంచుకొండని ఢీకొని, అది సముద్రంలో మునిగింది. సరిగ్గా అలాంటి సీన్ మరోసారి రిపీట్ అయ్యింది. కాకపోతే.. ఇక్కడ మునిగింది కార్గో షిప్.

Cargo Ship: టైటానిక్ సీన్ రిపీట్.. ఆ దెబ్బకు మునిగిన కార్గో షిప్.. 14 మంది గల్లంతు

Cargo Ship Sunk: ‘టైటానిక్’ సినిమాలో ఆ భారీ నౌక ఎలా మునిగిందో అందరూ చూసే ఉంటారు. ఒక మంచుకొండని ఢీకొని, అది సముద్రంలో మునిగింది. సరిగ్గా అలాంటి సీన్ మరోసారి రిపీట్ అయ్యింది. కాకపోతే.. ఇక్కడ మునిగింది కార్గో షిప్. అప్పటివరకూ తన ప్రయాణాన్ని సజావుగా కొనసాగించిన ఆ నౌక.. ఒక్కసారిగా బోల్తా పడి మునిగిపోయింది. బలమైన ఈదురుగాలుల కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు తేలింది. లెస్బోస్ ద్వీపం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


ఉప్పుతో లోడ్ చేయబడిన ఈ కార్గొ షిప్ ఈజిప్టులోని దేఖీలా నుండి ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. ఇది ప్రభుత్వానికి చెందిన ఓడ. ఇందులో మొత్తం 14 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఇద్దరు సిరియన్ పౌరులు, నలుగురు భారతీయులు, ఎనిమిది మంది ఈజిప్షియన్లు ఉన్నారు. ఈ నౌక ఎక్కడైతే మునిగిందో.. అక్కడ ఈదురుగాలుల వేగం ‘బ్యూఫోర్ట్ స్కేల్‌లో’ 9-10కి చేరుకోవడంతో శనివారమే గ్రీస్‌లోని అనేక ప్రాంతాల్లో నౌకలు పోర్టులకే పరిమితమయ్యాయి. కానీ.. ఈ కార్గో షిప్ మాత్రం వాతావరణ పరిస్థితుల్ని లెక్క చేయకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే.. ఆదివారం తెల్లవారుజామున లెస్‌బోస్‌కు నైరుతి దిశలో 4.5 నాటికల్ మైళ్లు (8.3 కిలోమీటర్లు) దిగువకు ఈ కార్గో షిప్ పడిపోయింది. దీంతో.. అందులోని 14 మంది సిబ్బంది గల్లంతయ్యారు.

ఈ కార్గో షిప్ మునిగిన విషయం తెలిసి.. ఐదు కార్గో షిప్‌లు, మూడు కోస్ట్ గార్డ్ నౌకలు, వైమానిక దళం, నేవీ హెలికాప్టర్‌లతో పాటు నేవీ ఫ్రిగేట్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇదిలావుండగా.. ఆలివర్ తుఫాను అడ్రియాటిక్ సముద్రం నుండి గ్రీస్ వైపు కదులుతున్నందున వాతావరణ శాఖ ‘పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని’ శనివారమే హెచ్చరికలు జారీ చేసింది. బహుశా ఈ హెచ్చరికల్ని సీరియస్‌గా తీసుకొని ఉంటే.. ఆ కార్గో షిప్ మునిగిపోకుండా సురక్షితంగా ఉండేది.

Updated Date - 2023-11-27T15:07:59+05:30 IST