ఇన్నేళ్ళ నిర్బంధం ఇక తొలుగుతుందా?
ABN , Publish Date - Dec 29 , 2023 | 01:36 AM
కొన్నిసార్లు మనం కోల్పోయిందేమిటో మనకు తెలియదు. ఎందుకు కోల్పోయామో తెలియదు. అలాంటప్పుడు ఏం సాధించాలో తేల్చుకోవడం కష్టం. పదేళ్ల కేసీఆర్ పాలన తర్వాత తెలంగాణ...
కొన్నిసార్లు మనం కోల్పోయిందేమిటో మనకు తెలియదు. ఎందుకు కోల్పోయామో తెలియదు. అలాంటప్పుడు ఏం సాధించాలో తేల్చుకోవడం కష్టం. పదేళ్ల కేసీఆర్ పాలన తర్వాత తెలంగాణ ఈ విషయాల్లో లోతైన ఆత్మావలోకనం చేసుకోక తప్పదు. ఆంధ్రా వలస పాలనలో తెలంగాణ ఆత్మగౌరవంతో సహా ఒక ప్రాంతంగా సమాన అవకాశాలన్నిటినీ కోల్పోయింది. అయినా సామాజిక, రాజకీయ చైతన్యాన్ని, ప్రతిఘటనా స్ఫూర్తిని పదిలంగా కాపాడుకుంది. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సాధించుకున్న వాటికంటే కోల్పోయినవే ఎక్కువ. తెలంగాణకు చాలా సహజమైన ప్రజాస్వామిక భావజాల సంఘర్షణ ఈ పదేళ్లలో ఎట్లా దెబ్బతినిపోయిందో ఈ ప్రాంతం పరిశీలించుకోవలసి ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తానే నాయకత్వం వహించానని బీఆర్‌ఎస్ చెప్పుకొనేది. అలాంటి పార్టీ పాలనలో ప్రజాస్వామ్యం అడుగంటిపోయింది. ఇది పెద్ద విషాదం! ఈ స్థితిలో కూడా తెలంగాణ ప్రజలు ఎంతో కొంత నిరసనను వ్యక్తం చేస్తూనే వచ్చారు. అయితే అందులో మునుపటి ఉత్తేజం లేదు, ధిక్కారం లేదు. కేసీఆర్ ఆర్థిక విధానాలతో సహా నిర్బంధం కూడా గతంలాగే వెంటాడింది. వీటిని వేరు చేసి ప్రజాస్వామ్యాన్ని చూడలేం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో మారుమూల పల్లె దాకా తెలంగాణ ఎంత ఉద్రిక్తంగా ఊగిపోయింది? రాష్ట్రం ఎందుకు అవసరమో ఎన్ని రకాల కొత్త వాదనలు కింది నుంచి పుట్టుకొచ్చాయి? ప్రజలు ఎంత సృజనాత్మకంగా వ్యక్తమయ్యారు? సమాజం సజీవంగా ఉందనడానికి ఇదంతా గుర్తు. అదే సమయంలో ఉద్యమంలోని ఆటుపోట్లను అర్థం చేసుకోలేకనే కావచ్చు యువత అత్మహత్యలకు పాల్పడింది. అర్ధాంతర మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు లేని తెలంగాణ కోరుకున్న జనం దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ విషాద స్థితిలోనే రాష్ట్రం వచ్చింది. దీన్నుంచి బైటపడక ముందే 2015 ఏప్రిల్ 7న వరంగల్ జైలు నుంచి తీసికెళ్తూ ఐదుగురు ముస్లిం యువకులను పోలీసులు కాల్చేశారు. దీని మీద ఎంఐఎం కూడా ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత 2015 జూన్ 15న వివేక్ అనే తెలంగాణ విద్యార్థిని పోలీసులు కాల్చి చంపారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో విద్యాసాగర్, శృతి ఎన్‌కౌంటర్ జరిగింది. 2016 మార్చిలో చత్తీస్‌ఘడ్‌లోని బెట్టెంతోగు అనే ప్రాంతంలో ఆరుగురు పక్క రాష్ట్రం వాళ్లతోపాటు తెలంగాణకు చెందిన యూసుబ్‌బీ, సృజన, దలసరి సారక్క (తెలంగాణ ఆదివాసీ) అనే ముగ్గురు యువతుల హత్యలను మర్చిపోవడానికి లేదు. ఇక ఆ తర్వాత ఈ జాబితా చాలా పెరిగిపోయింది.
వివేక్ హత్యకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని అప్పట్లో పాలక ఆశ్రిత మేధావులు అన్నారు. కానీ అప్పటికే కేసీఆర్ ప్రభుత్వం విప్లవోద్యమం మీదికి పోలీసు బలగాలను మోహరించింది. చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో, గోదావరి తీరమంతా పోలీసు క్యాంపులు పెట్టింది. వెంటాడి హత్యలు చేయడానికి పురికొల్పింది. పైన చెప్పిన ఘటనలే కాదు, 2016 జూన్‌లో ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు ఆదివాసీ, దళిత యువకులు శోభన్ తదితరులను ఎన్‌కౌంటర్ పేర కాల్చేశారు. ఆ సమయంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి ఆ ప్రాంతంలోనే ఉన్నాడని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ అణచివేత మావోయిస్టుల దగ్గరే ఆగలేదు. 2019 జులై 19న సీపీఐ న్యూ డెమోక్రసీకి చెందిన లింగన్న అనే ఆదివాసీ నాయకుడ్ని కాల్చేశారు. జనశక్తి పార్టీకి చెందిన 9 మందిని టేకులగూడెం ప్రాంతంలో కాల్చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులే ఈ ఘటనలకు పాల్పడ్డారు. పక్క రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ జరిగిన సందర్భాల్లో అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులను వేధించారు. సంస్మరణ సభలు కాదు కదా, పదో రోజు పది మంది కలిసి కన్నీరు కార్చకుండా అడ్డుకున్నారు. కరోనాతో అడవిలోనే చనిపోయిన మావోయిస్టు నాయకుడు హరిభూషణ్ కుటుంబ సభ్యులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పదో రోజు జరుపుకోవాలని ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ పోలీసులు దాన్ని జరగనివ్వలేదు. ఆ రోజు పోలీసులు ఎంత దుర్మార్గానికి పాల్పడిందీ ప్రస్తుత గిరిజన సంక్షేమ మంత్రి సీతక్కకు అందరికన్నా బాగా తెలుసు. కరోనా కాలంలో కూడా ఆరుగురు తెలంగాణ కార్యకర్తలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాల్చేసింది.
మావోయిస్టుల మీది నిర్బంధమే తెలంగాణలో ప్రజాస్వామ్య పతనానికి ఏకైక సూచిక కాకపోవచ్చు. ప్రజాస్వామ్యం అనే అత్యద్భుత భావనను గత పదేళ్లలో అనేక వైపుల నుంచి దెబ్బతీస్తూ వచ్చారు. రైతులకు సంకెళ్లు వేసి వేధించారు. ఆర్టీసీ కార్మికుల మీద ప్రభుత్వం ఒక యుద్ధమే చేసింది. లెక్కకు మిక్కిలి జరిగిన పౌరహక్కుల ఉల్లంఘనలకు గరిష్టంగా విప్లవ రాజకీయాలనే సాకు చేసుకున్నారు. మావోయిస్టు పార్టీ మీద నిషేధం ప్రజాస్వామ్య విధ్వంసానికి కేంద్రంగా పని చేసింది. అందువల్ల ప్రజలు తమకు ఇష్టమైన రాజకీయాలను ప్రకటించుకొనే వీలు లేకుండా చేశారు. ఇష్టమైన సంఘాల్లో, పార్టీల్లో ఉండటం నేరమని వెంటాడి హత్యలు చేశారు. అరెస్టులు చేసి జైళ్లలో తోశారు. మావోయిస్టు పార్టీ పదేళ్ల వార్షికోత్సవ సభను జరగనివ్వకుండా ముందు రోజే వందలాది మందిని అరెస్టు చేశారు. సాగర్, శృతి ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా 200 సంస్థలతో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంపై ఉక్కుపాదం మోపారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయానికి పోలీసులు తాళం వేసుకొని వెళ్లిపోయారు. చివరికి కోదండరాం ఒక సభను తలపెడితే దాన్ని జరగనివ్వకుండా ఆయన ఇంటి మీద దాడి చేసి తలుపులు బద్దలు కొట్టారు, అరెస్టు చేశారు. గత ప్రభుత్వాలకంటే నాలుగు ఆకులు ఎక్కువ చట్ట వ్యతిరేకంగా ఈ పదేళ్ల పాలన సాగింది.
ప్రజలకు రాజకీయ జీవితం లేకుండా చేయాలని అనుకోవడంలోనే ప్రజాస్వామ్య పతనం ఉంది. మావోయిస్టు రాజకీయాలకు అవకాశం లేకుండా చేయడంతో కేసీఆర్ ఈ పని మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్‌గా మారిపోయింది. ఆ తర్వాత అదే చట్టం కింద పదహారు ప్రజాసంఘాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిషేధించింది. దానికి కూడా మావోయిస్టులతో సంబంధం అనే ఆరోపణ తప్ప ఆధారాలేవీ లేవు.
అనేక రాజకీయ విశ్వాసాల, ఆచరణ రూపాల కూడలిగా వర్ధిల్లిన తెలంగాణను కేసీఆర్ ఏం చేశాడో, తెలంగాణ ఏం కోల్పోయిందో గుర్తిస్తే తప్ప ప్రజాస్వామ్య పునరుద్ధరణ సాధ్యం కాదు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధర్నా చౌక్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ మావోయిస్టు రాజకీయ వ్యక్తీకరణకు చోటు ఉంటుందా? రాడికల్ విద్యార్థి సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య వంటి సంఘాలకు అవకాశం ఉంటుందా? ప్రతిపక్ష పార్టీ నుంచి ఇలాంటి సంస్థలన్నిటికీ చోటు ఉంటేనే కదా భావవ్యక్తీకరణ నిండైన అర్థాన్ని సంతరించుకొనేది. భావ ప్రకటన సాహిత్య కళా మేధో రంగాలకు సంబంధించిందే కాదు. మౌలికంగా అది రాజకీయ ఆచరణ. ఏ రాజకీయ ఆచరణకైనా చోటు ఉండాలి. మావోయిస్టుల దగ్గర తుపాకులు ఉన్నాయనే సాకుతో రేషన్ పద్ధతిలోకి ప్రజాస్వామ్యాన్ని కుదించడానికి లేదు. హింసను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తయారు చేసుకున్నాయి. అయినా రాజకీయాల మీద, సంస్థల మీద నిషేధం పెట్టి పోలీసులు హింసకు పాల్పడటం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. తన పాలనలో రాజకీయాల మీద నిషేధం ఉండటం ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచించాలి. ఒక అక్రమ చట్టం ద్వారా నిషేధాన్ని కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని అనడం ఎంత అసంబద్ధమో ఆయన గ్రహించాలి. బీజేపీతో కేసీఆర్ సఖ్యంగా మసలుకోవడంతో పెరిగిపోతున్న మతతత్వ శక్తుల మధ్య కొద్ది మెజారిటీ మాత్రమే ఉన్న తన ప్రభుత్వం కొనసాగాలన్నా సమాజం రాజకీయ చైతన్యంతో సజీవంగా ఉండాలి. అనేక భావాల వ్యక్తీకరణకు చోటు ఉండాలి. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ శక్తులను నిలువరించడానికి ఇప్పటి నుంచే జరగవలసిన ప్రజాస్వామిక ఆందోళనలో మావోయిస్టుపార్టీ మీద, దాని అనుబంధ సంఘాల మీద నిషేధం ఎత్తివేత ఒక ముఖ్యమైన అంశం కావాలి. మిగతా అన్ని రకాల ఆంక్షలు, నిర్బంధాలు, అప్రజాస్వామిక చట్టాలు తొలగిపోవాలని కోరుకోవాలి. అప్పుడే తెలంగాణ తనను తాను ఆవిష్కరించుకుంటుంది.
పాణి