ఎస్టీ జాబితాలోకి ఈ కులాలు ఎందుకు?

ABN , First Publish Date - 2023-04-01T00:30:05+05:30 IST

గిరిజనేతర కులాలు ఎస్టీ జాబితాలో చేరాలంటే 1965లో లోకూర్ కమిటీ కొన్ని ప్రామాణికాలను సూచించింది....

ఎస్టీ జాబితాలోకి ఈ కులాలు ఎందుకు?

గిరిజనేతర కులాలు ఎస్టీ జాబితాలో చేరాలంటే 1965లో లోకూర్ కమిటీ కొన్ని ప్రామాణికాలను సూచించింది. వెనుకబాటుతనం ఒక్కటే కాదు, భిన్న సంస్కృతి, ఆదిమ లక్షణాలు, భౌగోళికంగా విడిగా ఉండడం, ఇతర ప్రజలతో కలవడానికి సంకోచం వంటి లక్షణాలు ఉన్న వారిని గిరిజన తెగలలో చేర్చాల్సి ఉంటుంది. ఈ లక్షణాలు వాల్మీకి, బోయ కులాలకు లేకపోవడమే గత ప్రతిపాదనలను భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ తిరస్కరించటానికి ఒక కారణం.

అర్హతలేని గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరడం వెనుక ఆంతర్యం ఏమిటి? వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ రెండుసార్లు తిరస్కరించారు. వెనుకబడిన తరగతులకు చెందిన వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మరొకసారి తీర్మానించడంతో, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రతిపాదిస్తూ 2017లో శాసనసభ తీర్మానించింది. అందువల్ల రాయలసీమ ప్రాంత వాల్మీకి, బోయ, వాటి అనుబంధ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో ప్రస్తుత ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రధాన ప్రతిపక్షం నోరు మెదపటం లేదు. వాస్తవానికి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసించే ‘వాల్మీకి’ తెగ ఇప్పటికీ ఎస్టీ జాబితాలోనే ఉంది.

వాల్మీకి, బోయ కులాల జనాభా ఎస్టీ జాబితాలో చేరితే రాష్ట్రంలో ప్రస్తుత గిరిజన జనాభా సంఖ్య 27.39 లక్షల నుంచి 47లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర గిరిజనులు అందరూ ఒకే అభివృద్ధి స్థాయిలో లేరు. మైదాన, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల మధ్య అభివృద్ధిలో అంతరాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అధిక జనాభాగా ఉన్న వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చితే గిరిజన వర్గాల మధ్య ఆ అభివృద్ధి అంతరాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన చెంచు, కొండరెడ్డి, గదబ, కొందు, పొరజ వంటి ఆదిమ జాతి తెగలు లేదా ఇతర ఆదివాసీలను సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ రంగాలలో ముందున్న ప్రస్తుత రాయలసీమ ప్రాంత వాల్మీకి, బోయ కులాలతో పోల్చగలమా?

రాజకీయాల కారణంగానే 1976లో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ జాబితాలో లంబాడా కులాన్ని చేర్చడం వల్ల, తెలంగాణలో గిరిజన వర్గాలు రెండుగా ఏర్పడి నిరంతరం సాంఘిక ఘర్షణలకు పాల్పడుతున్నాయి. సాపేక్షికంగా అభివృద్ధికి నోచుకోని గోండు, కోయ, తోటి వంటి ఇతర ఆదివాసీ తెగల, అభివృద్ధి చెందిన గిరిజన వర్గాల మధ్య వైరం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

ఏదైనా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో పాటు సరైన వివరణ ఇవ్వాలి. భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ ఆ వివరణతో ఏకీభవించాలి. జాతీయ ఎస్టీ కమిషన్ సిఫార్సులను కూడా కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకోవాలి. ఆ మేరకు 1999లో ఉన్న మార్గదర్శకాలు సవరిస్తూ 2002లో కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.

రాయలసీమను ఆనుకున్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ‘బోయ’ కులం వెనుకబడిన తరగతుల జాబితాలోనే ఉంది. వాల్మీకి తెగ కూడా 1991లోనే కర్ణాటక ఎస్టీ జాబితాలో చేరింది. ఆ జాబితా ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతి జాబితాలో ఉన్న వాల్మీకి కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే అర్హతను సాధించలేదు. గిరిజనేతర కులాలు ఎస్టీ జాబితాలో చేరాలంటే 1965లో లోకూర్ కమిటీ కొన్ని ప్రామాణికాలను సూచించింది. వెనుకబాటుతనం ఒక్కటే కాదు, భిన్న సంస్కృతి, ఆదిమ లక్షణాలు, భౌగోళికంగా విడిగా ఉండడం, ఇతర ప్రజలతో కలవడానికి సంకోచం వంటి లక్షణాలు ఉన్న వారిని గిరిజన తెగలలో చేర్చాల్సి ఉంటుంది. ఈ లక్షణాలు వాల్మీకి, బోయ కులాలకు లేకపోవడమే గత ప్రభుత్వ ప్రతిపాదనను భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ తిరస్కరించటానికి ఒక కారణం.

వాల్మీకి, బోయ కులాలను గిరిజన జాబితాలో చేర్చే అర్హత లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను 2018లోను, 2019లోను భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గత ప్రతిపాదన వ్యతిరేకిస్తూ అనేక మౌలిక ప్రశ్నలను కూడా రిజిస్ట్రార్ జనరల్ లేవనెత్తారు. ప్రభుత్వ వివరణతో రిజిస్ట్రార్ జనరల్ ఏకీభవించలేకపోతున్నారు. 1901 మద్రాసు ప్రభుత్వ జనాభా నివేదిక ప్రకారం ఆచారాలలో బోయ కులస్థులు బెస్త వారిని పోలి ఉంటారు. 1921 జనాభా నివేదిక ప్రకారం ‘బోయలు’ వస్త్రాలు, హోటల్స్, వంట చెరకు వంటి వివిధ వ్యాపారాలు చేసేవారు. దక్కన్ పీఠభూమిలో వారు చాలా గొప్ప కులంగా చెలామణీలో ఉన్నట్లు 1931 జనాభా నివేదిక తెలియజేస్తుందని రిజిస్ట్రార్ జనరల్ అభిప్రాయపడ్డారు.

బోయలలో గుంట బోయ, పెద్ద బోయ వంటి రెండు వర్గాలు ఉండి వారు విష్ణు ఆలయాలలో అర్చక సేవ చేసేవారని ఆంధ్రప్రదేశ్ గెజెట్‌లో పేర్కొనగా, వివాహ కార్యక్రమాలలో బ్రాహ్మణ పురోహితుల సహాయాన్ని బోయలు పొందేవారని దక్షిణ భారతదేశంలో ‘కులాలు, తెగల’పై అధ్యయనం జేసిన సర్ ఎడ్గార్ తరస్థన్ 1901 నివేదిక తెలియజేస్తుంది. భారత ప్రజలపై అధ్యయనం (1996) చేసిన కె.ఎస్. సింగ్ సామాజిక ర్యాంకులో బోయలను పోలుస్తూ బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, బలిజ కులాల కంటే తక్కువగాను, రజక, ఎస్సీ కులాల కంటే పై స్థాయిలోను ఉన్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంత వాల్మీకి తెగకు, రాయలసీమ వాల్మీకి లేదా బోయ తెగకు ఎటువంటి పోలిక లేదు. ఇలాంటి పలు కారణాలను చూపి వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అర్హత లేదని భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో రాయలసీమ వాల్మీకి, బోయ, వాటి అనుబంధ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు జేసిన ప్రభుత్వ ప్రతిపాదనపై పునః సమీక్ష అవసరం. సమస్య జటిలం కాకముందే వాల్మీకి, బోయ కులాల వెనుకబాటును సరిదిద్దేందుకు ఒక ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర గిరిజన నాయకుల అసంతృప్తి, వ్యతిరేకతలను అవగాహన చేసుకొని వారితో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

డా. పల్లా త్రినాధరావు

Updated Date - 2023-04-01T00:30:05+05:30 IST