నాకేంటి.. నీకేంటి
ABN , First Publish Date - 2023-11-20T00:27:25+05:30 IST
నీకు ఎంత సమయం కావాలి నా దగ్గరున్న జీవితకాలం ఎంతో నాకూ తెలియదు అందులో నీకెంత కావాలో చెప్పు...

నీకు ఎంత సమయం కావాలి
నా దగ్గరున్న జీవితకాలం ఎంతో నాకూ తెలియదు
అందులో నీకెంత కావాలో చెప్పు
నేను తొలివేకువలో పక్షులతో మాట్లాడాలి
ఏ గట్టునో నడుస్తూ పిల్ల కాలవతో
పచ్చదనం గూర్చి వాకబు చేయాలి
లేలేత సూర్యునితో ఆడుకుంటూ
మధ్యాహ్నం ఎర్రని ఎండ గూర్చి చర్చించాలి
కళ్ళాపి చల్లి ముగ్గులు వేసి దీపం పెట్టి
ఇంటిల్లిపాదిని మేల్కొలిపి
అంట్లు కడిగి.. వండి వార్చి
క్యారేజ్‌లు కట్టి ఇల్లు సర్దే పనిలో
చాలా ఉదయాలు ఖర్చయిపోయాయి
నేనేమైనా చేసుకుంటాను
నువ్వు ప్రశ్నించకుండా
నీ అజమాయిషీ గుచ్చుకోకుండా
శోధించే నీ కళ్ళనుంచీ
స్వాతంత్య్రం పొందిన నాదైన కాలం
నా జీవితంలో నాకోసం కొంత మిగుల్చుకుంటా
మధ్యాహ్నం మనసైన కవినోమారు పలకరించాలి
నాతో పచ్చీసు ఆడిన
ఆ పసిస్నేహాలతో ముచ్చటించాలి
అన్నం పప్పు కూర చారు వండి వార్చడాలతో
ఎన్నెన్నో మధ్యాహ్నాలు..
మట్టిగొట్టుకుని పోయాయి
ఈ అన్నం ముద్దగైంది కూరలో కారమెక్కువ
చారులో ఉప్పు తక్కువ
ఇవేవీ కాకుండా కొన్ని మద్యాహ్నాలు
నాకోసమే అట్టిపెట్టుకోవాలి
అబ్బా.. సాయంత్రం..!
టీ వగరు నీకు కాఫీ కలపడం రాదు.. కాదు
వెళ్లిపోతున్న సూర్యునికి ఒక విషయం విన్నవించాలి
ఇంటి ముఖం పట్టిన శ్రమ చేతుల్ని ముద్దాడాలి
కొన్ని ఇష్టమైన అక్షరాల వెంట పరిగెత్తాలి
కొన్ని సాయంసంధ్యలను స్వంతం చేసుకోవాలి
రాత్రి.. అంత చెడ్డదేమీ కాదు
ఒకటి మించి మరోటి అద్భుతమైనవి
ఎన్ని జాములుంటే ఏం చేయను?
ఏ ఒక్కటీ నాది కానప్పుడు
కొన్నింటి నైనా నా స్వాధీనం చేసుకుంటాను
వెన్నెలను సృష్టించుకోవడం తెలిసిన దాన్ని
వేగు చుక్కతో మాట్లాడగలదాన్ని
చీకటి పొడ సోకని రాత్రులను చేసుకోగలను
నా సమయం నాక్కావాలి.. నాకే కావాలి
దారల విజయ కుమారి
91771 92275