Share News

వక్ఫ్‌ ఆస్తి: ఆక్రమణలే, ఆదుకున్నది లేదు!

ABN , First Publish Date - 2023-11-30T01:18:16+05:30 IST

వక్ఫ్ అనేది సమాజశ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా ఆస్తిని విరాళంగా ఇచ్చేయడం. అలా ఇచ్చేశాక దాతకు ఆ ఆస్తిలో ఎలాంటి హక్కు గాని, వారసత్వ పరంపరాధికారాలు గాని వుండవు...

వక్ఫ్‌ ఆస్తి: ఆక్రమణలే, ఆదుకున్నది లేదు!

వక్ఫ్ అనేది సమాజశ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా ఆస్తిని విరాళంగా ఇచ్చేయడం. అలా ఇచ్చేశాక దాతకు ఆ ఆస్తిలో ఎలాంటి హక్కు గాని, వారసత్వ పరంపరాధికారాలు గాని వుండవు. ఆ ఆస్తిపైన యాజమాన్యహక్కు సర్వోన్నతుడైన అల్లాకు చెందుతుంది. ఆ ఆస్తిని అజమాయిషీ చేసేవాడు కేవలం ట్రస్టీ. ఆధ్యాత్మిక కార్యం అయిన వక్ఫ్ ద్వారా సాధించాల్సిన సామాజిక ప్రయోజనాలకోసం, వక్ఫ్ అజమాయిషీ సజావుగా సాగడానికి భారతదేశ పార్లమెంటు వక్ఫ్ చట్టాన్ని 1954లో ఆమోదించింది. 1985లో సమగ్రచట్టాన్ని ఆమోదించారు, తదుపరి కొన్ని సవరణలూ చేశారు.

కేంద్ర మైనారిటీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 2, 2023వ తేదీన లోక్‌సభకు తెలియచేసిన సమాధానం ప్రకారం 2022 డిసెంబరు వరకు వక్ఫ్‌కు చెందిన 8,66,646 స్థిరాస్తులూ, వాటి గ్రాఫిక్ నమూనాలు (GIF) 3,53,850 భారత వక్ఫ్ ఆస్తుల పాలనా విధానం (Wakf Assets Management System of India –WAMSI) పోర్టల్లో వుంచారు. వక్ఫ్ ఆస్తుల దురాక్రమణను నిరోధించడానికి వీలుగా ఆయా రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు ఈ పోర్టల్‌కు వివరాలు సమకూర్చుతాయి. ఇందులో, టోలీ మసీదులాంటి ముఖ్యమైన సాంస్కృతిక కట్టడం ఆస్తి సున్నా ఎకరాలుగా నమోదై వుంది. టోలీ మసీదు వక్ఫ్ ఐ.డి. TSHY1096 కాగా ఆ మసీదు ఆస్తికి WAMSI ఐ.డి. MQ001 (అనగా టోలీ మసీదు ఆవరణలోని రెండు సమాధులు, పాత మసీదు కట్టడం ఇవి మాత్రమే). 2014–15 ఆర్థిక సంవత్సరానికి గాను బకాయిలు రూ.29,025/–గా, 2015–16 బకాయిలు రూ.84,021/–గా నమోదై వున్నాయి. 2016 తర్వాత మరింకే అదనపు వివరాలు లేవు. టోలీ మసీదు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఏడు కేసులు దాఖలై వున్నాయి. మహబూబ్ ప్రయిడ్ ప్యాలెస్, క్రౌన్ ప్యాలెస్ ఆక్రమణ కేసులు హైకోర్టు వెబ్‌సైట్ సూచిస్తున్నదాని ప్రకారం 2015 నుంచి పెండింగులో వున్నాయి. అదేవిధంగా వక్ఫ్ ఐ.డి. TSHY2888 (స్మశాన వాటిక మరియు దర్గా –జేమ్స్ స్ట్రీట్‌లోని మల్గీ నెం.2–2–150 పక్కన) సూచిక గమనిస్తే, 24 షాపులుండగా వైశాల్యం మాత్రం సున్నా చదరపు గజాలుగా మొత్తం షాపులకు చూపుతోంది. ఆర్థిక వివరాలు లేవు.

తెలంగాణ వక్ఫ్ పోర్టల్ ప్రకారం 33,929 వక్ఫ్ ఆస్తులుండగా వాటి వైశాల్యం మొత్తం 77,483.07 ఎకరాలు. వాటిలో 57,423.91 ఎకరాలు అంటే, యావత్తు తెలంగాణా వక్ఫ్ భూముల విస్తీర్ణంలో 74 శాతం దురాక్రమణలకు గురైంది. ఆ దురాక్రమణదారులు ఎవరనేదిగాని, వారిపైన ఏ చర్యలు తీసుకున్నారనేదిగాని, వక్ఫ్ ట్రిబ్యునల్లోనూ, న్యాయస్థానాల్లోనూ, పోలీసు ఠాణాల్లోనూ ఎన్ని కేసులు నమోదై వున్నాయనేదిగాని వివరాలు లేవు. ఇప్పటికీ పది జిల్లాలవారిగానే వివరాలు సూచిస్తోంది. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు కాపీరైటు హక్కున్న ఈ వెబ్‌సైటు ఒక డిస్‌క్లైమర్‌ (షరా) కూడా విధిస్తున్నది. వక్ఫ్ బోర్డు వెబ్‌సైటు ఇస్తున్న వివరాలు సమాచారం నిమిత్తం తప్ప, సరైనవనే భరోసా లేదట. వక్ఫ్ బోర్డ్ కార్యకలాపాల గురించిన సమాచారం 2015–16 సంవత్సరాలకు సంబంధించినది మాత్రమే వుంది. వెబ్‌సైటు అప్‌డేటుకు నోచుకోలేదు. తెలంగాణ వక్ఫ్ ఆస్తుల దయనీయతకు హజ్ హౌస్ పక్కనే అసంపూర్తిగా వుండిపోయిన అనేక అంతస్తుల భవంతి బలమైన ఉదాహరణ. నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలగాని, కళాశాలగాని కావలసింది పోయి ఆ భవంతిని శిథిలాల దిబ్బగా మారిపోయేలా చేస్తున్నారు. అసెంబ్లీకి ఎదురుగానే వున్న ఈ వక్ఫ్ ఆస్తి ఆశయాలుగా విద్యాబోధనగానీ, నిరుపేదల అభ్యున్నతిగానీ జరగకపోవడం శోచనీయం. వక్ఫ్ భూమిని కమర్షియల్ ఆస్తిగా మార్చి వచ్చే ఆదాయాన్ని వక్ఫ్ బోర్డ్ మనుగడకు వివియోగిస్తారని సాగుతున్న ప్రచారానికి ధార్మికతగానీ, చట్టబద్ధతగానీ లేవు. స్థలాన్ని ‘అభివృద్ధి’ చేయడం అనేది మైనారిటీల సాంఘిక ప్రయోజనం కానేరదు. ఈ ‘అభివృద్ధి’ అనే మాటకు అర్థం వ్యాపారభవనాల నిర్మాణం. వాటి ప్రయోజనాలు నేరుగా రియల్ ఎస్టేట్ రంగానికీ, కమర్షియల్ అద్దెదారులకూ పోతాయి. నిజమైన హక్కుదారులు నిరుపేదలు. వారి ప్రాథమిక అవసరాలు తీర్చాలి.

సమాచార హక్కు చట్టం, 2005 కింద స్వీయ ప్రకటనగా వెబ్‌సైటులో వుంచాల్సిన వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్, సభ్యులు, వారి వివరాలు, జీతాలు, వ్యయాలు, బోర్డ్ తీర్మానాలు, సమావేశాల అజెండాలు అందులో కనబడవు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులకుగాను వెదజల్లుతున్న నిధులు మైనారిటీ సంక్షేమనిధినుంచే వస్తున్నా వాటి వివరాలు వక్ఫ్ వెబ్‌సైటులోగానీ, మైనారిటీ సంక్షేమశాఖ వెబ్‌సైటులో గానీ కనిపించవు. అజ్మీర్ దర్గాకు ముఖ్యమంత్రి సమర్పించుకునే చాదర్ తీసుకెళ్ళే వక్ఫ్ బోర్డ్ సభ్యుల రాకపోకల ఖర్చులు, వాటి బడ్జెట్ వివరాలు వక్ఫ్ వెబ్‌సైటులో చూపించవు. హజ్‌హౌస్ లోని వక్ఫ్ కార్యాలయంలో వక్ఫ్ రికార్డుల్ని భద్రపరిచే గది 2017 నుంచి ఏ చట్టం కింద తాళం వేసివున్నదో తెలీదు. వక్ఫ్ చట్టం ప్రకారం ప్రస్తుత తెలంగాణ వక్ఫ్ బోర్డు చెల్లదు.

దర్గాల్లో రుసుములు తదితర ఛార్జీల వసూలు హక్కుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించే పద్ధతికి చట్టబద్ధత లేదు. వక్ఫ్ ఆస్తుల కేసులు వక్ఫ్ చట్టం కింద వక్ఫ్ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. అప్పీలులో మాత్రమే హైకోర్టు ఈ కేసుల్ని పరిశీలిస్తుంది. హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు కేసుల్ని అనుదినం కోర్టువారీగా, కేసువారీగా కోర్టు వెబ్‌సైటులో చూపిస్తుండగా, వక్ఫ్ ట్రిబ్యునల్ కేసులు మాత్రం వెబ్‌సైటు చూపదు. రిజిస్ట్రారువారు ఈ విషయం గమనించి వెంటనే వక్ఫ్ ట్రిబ్యునల్ కేసుల కాజ్ లిస్టుని, కేసు ప్రస్తుత స్థితిని వెబ్‌సైటులో చూపడం ప్రారంభించాలి. వక్ఫ్ ట్రిబ్యునల్ న్యాయమూర్తుల, సభ్యుల వివరాలను కూడా అదేవిధంగా ప్రదర్శించాలి.

విద్యావ్యాప్తికీ, ఆరోగ్య సంరక్షణకూ, గృహనిర్మాణానికీ ఉపయోగించవలసిన వక్ఫ్ ఆస్తులు దురాక్రమణకు గురి కావడమో, నిరుపయోగంగా పడుండి దురాక్రమణదారుల కళ్ళబడడమో జరుగుతోంది. సంఘంలో సామాజికంగానూ, ఆర్థికంగానూ వెనుకబడి, ఎవరి జీవితాలైతే ప్రభావితం కావలసి వున్నాయో, అలాంటివారి జీవితాలపై ఎన్ని వేల ఎకరాల వక్ఫ్ ఆస్తులున్నా ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం అన్యాయం.

l డా. లుబ్నా సర్వత్

వ్యవస్థాపక డైరెక్టర్, సెంటర్ ఫర్ వెల్–బీయింగ్ ఎకనామిక్స్

Updated Date - 2023-11-30T01:18:20+05:30 IST