వలయం

ABN , First Publish Date - 2023-10-09T03:25:07+05:30 IST

ఈ సగపుటెడారిలో శకలాలై విడిపోతున్న రహస్యధ్వనిలో లాలిత్యపు లాలిపాటలు లేవు తమకాల తుళ్ళింతలు లేవు పెదవుల తోటలలో చిరునవ్వుల విరులు లేవు నీడల్లా వెంటాడే పూలజ్ఞాపకాల ఆనవాళ్ళు...

వలయం

ఈ సగపుటెడారిలో

శకలాలై విడిపోతున్న రహస్యధ్వనిలో

లాలిత్యపు లాలిపాటలు లేవు

తమకాల తుళ్ళింతలు లేవు

పెదవుల తోటలలో

చిరునవ్వుల విరులు లేవు

నీడల్లా వెంటాడే

పూలజ్ఞాపకాల ఆనవాళ్ళు

రాలిపోతున్న ఆకుల చప్పుళ్ళు

విరియకుండానే రాలిపోయే కసురుమొగ్గలు

అంతటా విస్తృతంగా పరచుకున్న

క్షణికానందాల వింత సవ్వడులు

ఏ సంతోష సమయమూ

లిప్తకాలమైనా నిలవదు

ఘడియైునా నిలబడదు

కుదురుగా ఉండనివ్వని

లోపల ఊరుతున్న జల

మనసును మెలిపెట్టే తెలియని అలసట

అంతటా వ్యాపిస్తున్న

పగలురాత్రుల నడుమ ఊగిసలాడుతూ

బ్రతుకాట వలయాలు వలయాలుగా

తిరుగుతూనే ఉంటుంది

ఈ గందరగోళ సంకట స్థితిలోనూ

ఈ అలజడుల సంకెళ్ళ గతిలోనూ

ఒక ఊరట

ఉదయిస్తున్న సూర్యుడో

నిశిరాజు చంద్రుడో

కనులలో ఆర్తిగా స్ఫూర్తిని నింపుతారు

దుఃఖాశ్రువు అగ్నికణమై కాల్చేసినపుడో

ఆకాశం తునాతునకలై బద్దలైనపుడో

వాక్యం పురిటికందై బయటపడుతుంది

అప్పుడు

నా అరచేతుల నిండా

అక్షరనదీ ప్రవాహాల తడి

పదాల పుప్పొడుల జడి

ఈ తీరమే

నాకొక సేదదీరే అమ్మఒడి

పద్మావతి రాంభక్త

99663 07777

Updated Date - 2023-10-09T03:25:07+05:30 IST