ఈ రాత్రి..
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:12 AM
కొంచెం నిశబ్దాన్ని వెలిగించు కాదంటే కొన్ని పూలరేకులనైనా నా మునివేళ్ళ చివరన అతికించి వెళ్ళు...
కొంచెం నిశబ్దాన్ని వెలిగించు
కాదంటే కొన్ని పూలరేకులనైనా
నా మునివేళ్ళ చివరన అతికించి వెళ్ళు
బీడులను తడుపుతున్న వెన్నెల కోసం
కొన్ని కొత్త పదాల వరుసలను అల్లవలసి ఉన్నది
ఏ పలకరింపూలేని ఊరవతలి చిల్లుల గుడిసెలో
ఒంటరి వృద్ధురాలి వాడిపోయిన కళ్ళలో
ఒక చిన్న మెరుపు అయినా నాటి రావలసి ఉన్నది
సాయంత్రాలు...
వెక్కిరించే నీడల దృశ్యాల
దాడి మొదలైనప్పటి నుండి
హృదయంలో కన్ను తెరిచిన
చమురు దీపాన్ని
వెలిగించే ఉంచాను.
చెట్లకొమ్మలపై నిద్రిస్తున్న ఊసరవెల్లులను
ఆకులమాటున దాగిన పచ్చతేళ్ళను పట్టుకోవాల్సి ఉన్నది
మనం జీవించినప్పటి అద్భుత నక్షత్రరాశులను
కాలం మనకు కానుకిచ్చిన
కాంతి రెక్కల సీతాకోక చిలుకలను
దోసిళ్ళతో మనుషుల సమూహాలపై చల్లవలసి ఉన్నది
ఈ ఒంటరి ద్వీపకల్పం మధ్యలో
ఆకాశంతో నేను చేసిన సంభాషణ
నువ్వు వినే ఉంటావు
ఈ రాత్రిని ఇంకొంచెం
నా కనురెప్పలపై దొర్లించి వెళ్ళు
ఇంకొన్ని స్వప్నాలను
కొన్ని నిండైన
వాక్యాలను పోగు చేసుకోవలసి ఉన్నది
అక్కడ ఎవడో
నాలోని నదులను బంధించాలని
రాత్రులు రాత్రులు అడవి అంతా దండోరా వేస్తున్నాడు
గూట్లో కన్ను తెరుస్తున్న లేత రెక్కల
పక్షిపిల్ల ఒకటి
ముళ్ళ పొదల్లో చిక్కి తడి అరుతున్న
మొక్కలోని వాడిపోతున్న పూల పరిమళం ఒకటి
నా చేతులను ప్రేమతో తాకి వెళుతున్నాయి
నా భుజాల మీదుగా జారుతున్న చెమట బిందువొకటి
ఈ గరిక పూలపై
యుద్ధ గీతాలను ఆలపిస్తున్నది
ఈ చీకటి రాత్రి ముగిసేలోగా
అక్షరాల్లో ముంచి తీసిన కరస్పర్శని
నా అరచేతులకు అద్దిపో
సూర్యోదయానికి ముందటి వేకువలు
పరిచిన పిల్లదారుల వెంటో
గూట్లో గొంతు సవరించుకుంటున్న
కొత్త కోకిల పాటల రాగాల గుండానో
పల్లె నుండి అడవికి
అడవి నుండి పల్లెకు
చెరిగిపోని వీరుడి పాదముద్రల గుండానో
నువు నన్ను చేరుకుంటావు
నన్ను వెతకడం నీకేమీ కష్టం కాదు
నువ్వు నాకోసం వెతికే చోట
కొత్త పూలవనాల కాలిబాటలుంటాయి
తలుపులు లేని నిర్మాణ భవనాల
ప్రవేశద్వారాలు ఉంటాయి
చెమన్
94403 85563